Share News

Chandrayaan-3 : ఆకాశ వీథుల్లో ఇస్రో జైత్రయాత్ర

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:45 AM

భూమి, చంద్రుల సామీప్యతను గణించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూలై నెలను చంద్రయాన్‌–3కు అనుకూలం అని ఎంచుకున్నది. 2023 జూలై 14న శ్రీహరికోట సతీష్‌ధావన్‌ అంతరిక్ష

Chandrayaan-3 : ఆకాశ వీథుల్లో ఇస్రో జైత్రయాత్ర

భూమి, చంద్రుల సామీప్యతను గణించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూలై నెలను చంద్రయాన్‌–3కు అనుకూలం అని ఎంచుకున్నది. 2023 జూలై 14న శ్రీహరికోట సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్‌విఎంఎం–4 వాహకనౌక ద్వారా చంద్రయాన్‌–3ని ప్రయోగించారు. చంద్రయాన్‌–3లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌ రోవర్‌ అనే ముఖ్యమైన మూడు భాగాలున్నాయి. ఇందులో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌... ల్యాండర్‌, రోవర్‌లను 100 కి.మీ చంద్ర కక్ష్య వరకు తీసుకువెళ్లింది. చంద్రయాన్‌–3లోని ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో 2023 ఆగస్టు 23న సురక్షితంగా, మృదువుగా దిగింది. ఇది దిగిన ప్రదేశానికి ‘శివశక్తి అని నామకరణం చేశారు. ఇంతటి ఘనవిజయం సాధించిన ఆగస్టు 23ను ప్రతి సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ విజయం అంతరిక్ష పరిశోధనలలో ఒక పెద్ద ముందడుగు. సైన్స్‌ టెక్నాలజీ రంగంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతికి నిదర్శనం. ఇది ఒక చరిత్రాత్మక విజయం.

1957 అక్టోబరు 4న స్పుత్నిక్‌–1 అనే తొలి మానవ నిర్మిత ఉపగ్రహ ప్రయోగంతో అంతరిక్ష యాత్రలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మానవులు అంతరిక్షాన్ని అన్వేషిస్తూనే ఉన్నారు. ఇది సామాజిక ప్రయోజనాల నిరంతర ప్రవాహాన్ని సృష్టించింది. అంతరిక్ష యాత్రలు, పరిశోధనలు భూమిలోని అనేక రంగాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. 1969లో ఇస్రో స్థాపనతో భారత అంతరిక్ష యాత్రలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉపగ్రహాల ప్రయోగంలో ఇస్రో గణనీయమైన పురోగతి సాధించింది. చంద్రుడు, అంగారక గ్రహాన్వేషణ కార్యక్రమాలలో కూడా ప్రయోగాలు నిర్వహిస్తోంది. 2008 అక్టోబర్‌ 22న భారత్‌ చంద్రయాన్‌–1 ప్రయోగించింది. దీని ఫలితంగా ప్రపంచానికి తొలిసారిగా చంద్రునిపై నీటి జాడలు గుర్తించినట్లు భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రకటించారు. ‘మంగళ్‌యాన్‌’ను 2019 నవంబర్‌ 5న పిఎస్‌ఎల్‌విసి–25 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పిఎస్‌ఎల్‌విసి–37 ద్వారా నింగిలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంతో భారత్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది.

చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలోని ఉపరితలంలో సల్ఫర్‌ ఉనికి గురించి ముందే తెలిసినా, అది అక్కడ ఉన్నదని చంద్రయాన్‌–3లో జరిపిన పరిశోధనలలో వెల్లడయింది. సల్ఫర్‌తో పాటు అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్‌, ఆక్సిజన్‌ వంటి మూలకాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. 2023 సెప్టెంబర్‌ 3న చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ విక్రమ్‌ ఒక గంతు వేసింది. దాని ఇంజన్లను మండించి 30 సెంటీమీటర్లు ఎత్తుకు ఎగిరించి అంతే దూరం దూకించారు. భవిష్యత్‌లో జరిపే వెనక్కి తిరిగివచ్చే యాత్రల్లో ఉపయోగించాల్సిన సామర్థ్యాలను ఈ పరీక్ష ప్రదర్శించింది. చంద్రయాన్‌–3 విజయంతో చంద్రునిపై ల్యాండింగ్‌ సాధించిన నాల్గవ దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. అంతేకాక దక్షిణ ధ్రువం సమీపంలో చంద్ర ఉపరితలంపై దిగిన మొదటి దేశంగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది.

ఉపగ్రహాలను భారతదేశం స్వయంగా ప్రయోగించే లక్ష్యంతో ఇస్రో మొదట ఎస్‌ఎల్‌వి (ఉపగ్రహ ప్రయోగ వాహనం) తరువాత పిఎస్‌ఎల్‌వి, ఆ తరువాత జిఎస్‌ఎల్‌విలను నిర్మించి అభివృద్ధిపరిచారు. ఇందులో ఎస్‌ఎల్‌వి తరగతికి చెందిన వాహకనౌక భూ నిమ్నకక్ష్యలో 40 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలదు. పిఎస్‌ఎల్‌వి రెండు వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను భూనిమ్న కక్ష్యలో ప్రవేశపెట్టగలదు.

పిఎస్‌ఎల్‌వి వాహకనౌక ద్వారా పలు దేశీయ, విదేశీయ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతకుముందు ఇన్సాట్‌ వంటి దేశీయ ఉపగ్రహాలను భూస్థిర, భూఅనువర్తిత కక్ష్యకు పంపేందుకు ఇస్రో విదేశాలపై ఆధారపడేది. ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడాన్ని సొంతగడ్డ మీద నుంచే సాధించాలనే లక్ష్యంతో జిఎస్‌ఎల్‌వి శ్రేణి వాహకనౌకలను రూపకల్పన చేసి, అభివృద్ధిపరచి నిర్మించారు. వీటి నిర్మాణానికి ఇస్రో 1990లో శ్రీకారం చుట్టింది. 2001 నుంచి 2015 ఆగస్టు 27 వరకు ఇస్రో తొమ్మిది జిఎస్‌ఎల్‌వి వాహకనౌకలను ప్రయోగించగా, క్రయోజనిక్‌ స్థాయిలో లోపం వల్ల మూడు ప్రయోగాలు విఫలమయ్యాయి. 1991లో రష్యా–భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలలో రష్యన్‌ కంపెనీ గ్లావ్‌ కాస్మోస్‌ 5 క్రయోజనిక్‌ ఇంజన్లు, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వాల్సి ఉంది. కాని 1992లో ఇండియాపై అమెరికా విధించిన ఆంక్షల వల్ల రష్యా ఆ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గి, కేవలం క్రయోజనిక్‌ ఇంజన్లు మాత్రమే సరఫరా చేసింది. 1994లో భారత్‌ సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజన్‌ని అభివృద్ధిపరచడం ఆరంభించింది. 2014 నుంచి వైఫల్యాల తరువాత ప్రయోగాలు సఫలమైనాయి.


ఆగస్టు 23న జరుపుకునే జాతీయ అంతరిక్ష దినోత్సవం అంతరిక్ష పరిశోధనలనలో భారతదేశం సాధించిన విజయాల వేడుకగా దర్శనం ఇస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తల, ఇంజనీర్ల కృషి, అంకితభావాన్ని గుర్తుచేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ రోజున అంతరిక్ష కార్యక్రమాలకు మన దేశం సాధించిన విజయాల పరంపరలను ప్రదర్శించి, వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహిస్తారు. అంతరిక్ష అన్వేషణ ఫలితంగా పొందిన జ్ఞానంతో సుస్థిర అభివృద్ధి కోసం ఎలాంటి విధానాలు అమలు చేయవచ్చుననే విషయంపై చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల్లో కెరీర్‌లు కొనసాగించడానికి యువతరానికి స్ఫూర్తిని కలిగించే ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయాలి.

సమీప భవిష్యత్‌లో ఇస్రో కొన్ని అద్భుతమైన మిషన్లు ప్లాన్‌ చేస్తోంది. అవి– భారతీయ వ్యోమగాములను పరిశోధన కోసం అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా గగన్‌యాన్‌ ప్రాజెక్టు. సౌర కరోనాను అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్‌–1 మిషన్‌. చంద్రయాన్‌–3కి కొనసాగింపుగా చంద్రుడి ఉపరితలాన్ని మరింత అన్వేషించడానికి చంద్రయాన్‌–4 ప్రాజెక్టును లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి శుక్రయాన్‌–1 ప్లాన్‌ చేస్తున్నారు. అంగారక గ్రహాన్ని మరింత లోతుగా అన్వేషించే లక్ష్యంతో మంగళయాన్‌–2ని రూపొందిస్తున్నారు. నాసా–ఇస్రో సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ (నిసార్‌) సంయుక్తంగా భూమి, భూమిపై మంచు ఉపరితలాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నది. అంతరిక్ష పరిశోధనలు, శాస్త్రీయ పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లాలన్న ఇస్రో నిబద్ధతను ఈ మిషన్లు ప్రతిబింబిస్తున్నాయి.

సివి సర్వేశ్వర శర్మ

ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌

(నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం)

Updated Date - Aug 23 , 2024 | 05:45 AM