Share News

పేదల పెన్నిధి

ABN , Publish Date - Aug 30 , 2024 | 05:24 AM

యూపీఏ హయాంలో ఆరంభమైన ఓ బృహత్తర కార్యక్రమానికి జన్‌ధన్‌ యోజనగా నరేంద్రమోదీ పేరుమార్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం గురువారం వ్యాఖ్యానించారు.

పేదల పెన్నిధి

యూపీఏ హయాంలో ఆరంభమైన ఓ బృహత్తర కార్యక్రమానికి జన్‌ధన్‌ యోజనగా నరేంద్రమోదీ పేరుమార్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం గురువారం వ్యాఖ్యానించారు. తమ పాలనలో అమలుజరిగిన ఆ పథకంలో భాగంగా 2005–2014మధ్యకాలంలో పేదలకోసం లక్షలాది బ్యాంకు ఎకౌంట్లు తెరుచుకున్నాయని ఆయన అన్నారు. ఇది రిజర్వ్‌బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ సి. రంగరాజన్‌ మెదడులో మెరిసిన ఆలోచననీ, 2005లో ‘జీరోబాలెన్స్‌ ఎకౌంట్‌’ పథకాన్ని ఆరంభించినప్పుడు వై.వి.రెడ్డి ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నారనీ, ఆ తరువాత దువ్వూరి సుబ్బారావు ఆ కర్తవ్యాన్ని కొనసాగించారని చిదంబరం గుర్తుచేశారు. 2012లో ఈ పథకానికి ‘బేసిక్‌సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ ఎకౌంట్‌ (బిఎస్‌బిడిఎ)’గా పేరుమార్చామని, ఆ తరువాత నరేంద్రమోదీ వచ్చి దీనిని జన్‌ధన్‌ యోజనగా పిలిచారని చిదంబరం చెప్పుకొచ్చారు. ఆర్బీఐ మాజీ గవర్నర్లందరికీ ఈ సందర్భంగా ప్రశంసలు దక్కాల్సిందేనని అన్నారాయన. జన్‌ధన్‌ యోజన మొదలై బుధవారంనాటికి పదేళ్ళయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ సహా బీజేపీ పెద్దలంతా ఆ పథకాన్ని ఆకాశానికెత్తేసిన నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఆలోచనలను, పథకాలను ఎదుటిపక్షం ఎగరేసుకుపోయిందన్న విమర్శ రాజకీయాల్లో ఉన్నదే. ఆయన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు కానీ, వాటి వెనుక ఉన్న రాజకీయోద్దేశాలను పక్కనబెడితే, జన్‌ధన్‌ విజయవంతమైందని మాజీ ఆర్థికమంత్రి కూడా భావిస్తున్నట్టు ఉంది.


ఆర్థికవ్యవస్థకు వెలుపల ఉండిపోయిన కోట్లాదిమందిని ఆర్థికవ్యవస్థ పరిధిలోకి తెచ్చిన ఈ బృహత్‌ పథకం అద్భుత విజయాలు సాధించిందని ప్రభుత్వం ప్రకటించింది. పదేళ్ళ అనంతరం 53.౧3 జన్‌ధన్‌ యోజన లబ్ధిదారులు ఉండగా, అందులో ముప్పైకోట్లమంది మహిళలు. ఖాతాల్లో జమచేసిన మొత్తం ౨.31లక్షలకోట్లు. 2015 మార్చిలో 15.67కోట్ల ఖాతాలున్నాయని అంటున్నందున పెరుగుదల మూడురెట్లకుపైగానే ఉన్నట్టు. 66శాతం ఖాతాదారులు గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్నారట. రూపే కార్డులు ఇచ్చినందున ఖాతాదారులకు తమ ఖాతాల్లో ఉన్న సొమ్ముతో లావాదేవీలు నిర్వహించుకోగలరు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండిపోయినవారికి పూర్తి ఉచితంగా ఖాతాలు తెరవడం, పొదుపు, రుణం, బీమా ఇత్యాది అవకాశాలను వాటిద్వారా కల్పించడం పేదలకు కచ్చితంగా మేలుచేస్తుంది. ఆధార్‌ వ్యవస్థ మరింత పదునుదేలడం, మొబైల్‌ సేవలు విస్తరించడం, మారుమూల గ్రామాల్లో సైతం ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం వంటివి ఈ లక్ష్యసాధనకు ఉపకరించాయి. జన్‌ధన్‌–ఆధార్‌–మొబైల్‌ (జామ్‌) అనుసంధానం ద్వారా ఏర్పడిన ఈ వ్యవస్థ, అప్పటికే వేగం పుంజుకున్న డైరక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ)ను మరింత సునాయాసం చేసింది. వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజలకు అందించాల్సిన వస్తువులు, సేవలకు బదులు వారి ఖాతాల్లో కొంతసొమ్ము వేస్తే వదిలిపోతుందన్న భావన ఈ జీరోఖాతాలకు పునాది. సబ్సిడీలు దారిమళ్ళకుండా, దళారులూ మధ్యవర్తులు మధ్యలో దోచేయకుండా ఈ ఖాతాల్లోకి ప్రత్యక్షబదిలీ నిరంతరాయంగా జరిగిపోతోందని ప్రభుత్వం సంతోషిస్తోంది. 2020–22మధ్య కేవలం మూడేళ్ళలోనే 8లక్షలకోట్లు నేరుగా ఈ బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. సంపాదించిన సొమ్ము దొంగలబారిన పడకుండా, పొదుపును బట్టి మరింత అప్పు పుట్టే అవకాశం పెరిగినందునా పేదలు వడ్డీవ్యాపారుల బారినపడకుండా ఈ వ్యవస్థ ఉపకరిస్తోంది. మహిళలకు సొంతఖాతాలు, వాటిలో డబ్బులు ఉండటం, పొదుపు, రుణాలకు అవకాశాలు పెరగడం వారి సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు వీలుకల్పిస్తుంది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి ఈ పథకం ప్రబల నిదర్శనమని, సామాజికంగా ఇది అద్భుతాలు చేసిందని, నేరాలు, మద్యం వినియోగం బాగా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. జన్‌ధన్‌ పథకంలో ఇప్పటివరకూ సాధించిన ప్రగతికి సంతోషిస్తూనే, దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఈ ఖాతాలు కీలకంగా మారిన తరుణంలో ఈ విధానానికి ఆవల మిగిలిపోయినవారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఖాతాలు లేనికారణంగా వారు సంక్షేమపథకాలకు దూరంకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పదేళ్ళ ప్రయాణంలో ఈ పథకం సాధించిన ఫలితాలు, ప్రభావాలతో పాటు, ఇంకా మిగిలివున్నదెంతో అధ్యయనం చేయగలిగితే విజయాన్ని మరింత కచ్చితంగా అంచనావేయవచ్చు.

Updated Date - Aug 30 , 2024 | 05:24 AM