Share News

రైతుకు ఆసరా ఇవ్వని కొనుగోలు కేంద్రాలు

ABN , Publish Date - Nov 02 , 2024 | 06:21 AM

‘ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పత్తి వేశా. రూ.50వేల చొప్పున రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. వరద వానలతో తెగుళ్లు విజృంభించి పంట ఎండిపోయింది.

రైతుకు ఆసరా ఇవ్వని కొనుగోలు కేంద్రాలు

‘ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పత్తి వేశా. రూ.50వేల చొప్పున రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. వరద వానలతో తెగుళ్లు విజృంభించి పంట ఎండిపోయింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది. కష్టానికి కూడా ప్రతిఫలం దక్కేలా లేదు. ప్రభుత్వం పత్తి రైతులకు బోనస్‌తో పాటు నష్టపరిహారం కూడా ఇచ్చి ఆదుకోవాలి’ అని భూపాలపల్లికి చెందిన చిట్యాల రైతు ర్యాకం రవీందర్‌ అంటున్నాడు. ఇలా పత్తి రైతులతో పాటు వరి, ఇతర పంటలు పండించిన రైతులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. రైతుల వేడుకోలు న్యాయమైనదే.

తెగుళ్ళు, చీడ పీడలు, వర్షాలను ఎదుర్కొని ఎలాగోలా రైతులు పత్తి తీసి విక్రయించటానికి నెలపాటు ఎదురు చూశారు. అదిగో ఇదిగో అంటూ అక్టోబరు మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా 269 కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఆనందించారు. పత్తి మార్కెట్‌లో అమ్మి అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడ్డారు. కానీ, కొనుగోలు కేంద్రాల్లో అధికారుల తీరు చూసి ఆవేదన చెందుతున్నారు. తేమ అధికంగా ఉందంటూ అన్నదాతలను వెనక్కి పంపుతున్నారు. దీన్ని వ్యాపారులు అవకాశంగా తీసుకొని అతితక్కువ ధరలకు కొనుగోలు చేసి దోచుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వ తప్పుడు విధానమే కారణం. పత్తి రైతులకు తేమ నిబంధనలు శాపంగా మారరాదు. సీసీఐ నిబంధన ప్రకారం పత్తిలో 8శాతం నుండి 12శాతం మధ్య తేమ ఉంటేనే మద్దతు ధర ఇవ్వాలి. అయితే ఈ సంవత్సరం వాతావరణం మబ్బుగా ఉండటం, తుఫానుల పేరుతో రాష్ట్రంలో వర్షాలు పడుతుండటం వల్ల తేమ శాతం అధికం కావటం సహజం. కనుక గతంలో వలే తేమ 15శాతం వరకు ఉన్నా కొనుగోళ్లు చేస్తూ, ప్రత్యేక పరిస్థితుల్లో 16శాతం నుంచి 25శాతం వరకు సడలించాలి. లేదంటే వ్యాపారులు తేమ శాతం ఎక్కువ చూపి రూ.1000–-1500 తగ్గించి చెల్లిస్తే రైతు భారీగా నష్టపోతున్నాడు. అసలు ఎంఎస్‌పీ నిర్ణయమే తక్కువ. అది కూడా రైతుకు దక్కనందునే రాష్ట్రంలో పలుచోట్ల రోడ్లెక్కవలసివస్తున్నది.


ఈ సంవత్సరం రాష్ట్రంలో 1.60కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, అందులో వరి 65లక్షల ఎకరాలు, పత్తి 63.53 లక్షల ఎకరాలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. కానీ పత్తి రాష్ట్రంలో 43,76,043 ఎకరాల్లో సాగయింది. దిగుబడి 25.33 లక్షల టన్నులు వస్తుందని అంచనా. పత్తి, వరి, ఇతర అన్ని పంటలూ అంచనాలకు తక్కువగానే సాగయినాయి. కాలం రైతుకు సహకరిస్తుందని నిపుణులు ప్రకటించినప్పటికీ, గతి తప్పిన వాతావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి వరదలతో, చీడలతో, పంటలు బాగా దెబ్బతిన్నాయి. రైతులు పత్తికి ఎకరానికి రూ.40–-60 వేల వరకు, వరికి ఎకరానికి రూ.30 వేలు వరకు, మిర్చికి రూ. లక్ష వరకు పెట్టుబడులు పెట్టి ఉన్నారు. ఇంత పెట్టుబడి పెట్టినా దిగుబడి సగమే వచ్చే పరిస్థితి ఉంది. 33శాతం పంట నష్టం జరిగితేనే పరిహారం ఇస్తానన్న ప్రభుత్వాలు 50శాతం నష్టపడ్డా సరిగా పట్టించుకున్న పరిస్థితి లేదు. పత్తి ఎకరానికి 10–-12 క్వింటాళ్లు రావాలి. కానీ 3–-5 క్వింటాళ్లకు మించదు. ఇలాంటి పరిస్థితుల్లో పండిన పంటలనైనా ప్రభుత్వం తన సంస్థల ద్వారా సకాలంలో కొనడానికి అన్ని జిల్లాలలో కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. దీనితో ప్రైవేటు వ్యాపారులు ఎమ్‌ఎస్‌పీ కంటే తక్కువ ధరలకు కాజేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఎమ్‌ఎస్‌పీ కూడా తక్కువగా ఉంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పత్తికి రూ.18,500, వరికి రూ. 5 వేలు కనీస మద్దతు ధర నిర్ణయించాలి. అలా నిర్ణయించనందునే రైతు నష్టపడి అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతున్నాడు.

గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రైతులకు అనేక వాగ్దానాలు చేసి, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌, మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ సంవత్సరం కావొస్తున్నా చేసిన హామీలు అమలు కావటం లేదు. ఒక్క రుణమాఫీకి సంబంధించి అనేక నిబంధనలు పేరిట రూ.2లక్షల రుణమాఫీ సగం మంది రైతులకు కూడా అమలు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. రేపు మాపు అంటూ కాలం వెళ్ళదీస్తున్నది. తక్షణమే వ్యవసాయ మార్కెట్‌లలో పత్తి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని జిల్లాల్లో విస్తృతంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలతో కొనుగోలు చేయాలి. వ్యాపారుల అక్రమ దోపిడీని అరికట్టాలి. పత్తి తేమ శాతం 16శాతం నుంచి 25శాతం వరకు పెంచాలి. వర్షాల వల్ల రంగు మారిన పంటలను కూడా ప్రభుత్వం ఎమ్‌ఎస్‌పీ ప్రకారమే కొనుగోలు చేయాలి. ఎమ్‌ఎస్‌పీని స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సు ప్రకారం సి2+50కి ధర నిర్ణయించాలి. మార్కెట్లలో, బయట ఉత్పత్తులు తడవకుండా కప్పటానికి టార్పాలిన్‌లు సరఫరా చేయాలి. షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ పథకం అర్హులందరికీ వెంటనే పూర్తి చేయాలి. రైతు భరోసా ఖరీఫ్‌–రబీ సీజన్లకు చెందిన రూ.15వేలు రైతుల ఖాతాలో వెంటనే వేయాలి. దోడ్డు, సన్న ధాన్యంతో పాటు అన్ని పంటలకు బోనస్‌ చెల్లించాలి. పసుపు, మిర్చి, చెరుకు పంటలకు ఎమ్‌ఎస్‌పీ నిర్ణయించాలి. 58 సంవత్సరాలు నిండిన రైతులందరికీ పెన్షన్‌ నెలకు రూ.10వేలు ఇవ్వాలి. రైతు బీమా, పంటల బీమాకు ప్రీమియం ప్రభుత్వమే భరించి అమలు చేయాలి. ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పంట ఉత్పాదకాలకు సబ్సిడీలు ఇవ్వాలని రాష్ట్ర రైతాంగం సమైక్యంగా, చైతన్యంతో పోరాడాలి. పాలకులు ఎన్నికల్లో రైతులకు చేసిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయమని ఒత్తిడి చేయాలి. అప్పుడే రైతాంగ సమస్యలు కొన్నైనా పరిష్కారం అవుతాయని గుర్తించాలి.

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల్లో అధికారుల తీరు చూసి పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారు. తేమ అధికంగా ఉందంటూ అన్నదాతలను వెనక్కి పంపుతున్నారు. దీన్ని వ్యాపారులు అవకాశంగా తీసుకొని అతితక్కువ ధరలకు కొనుగోలు చేసి దోచుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వ తప్పుడు విధానమే కారణం. పత్తి రైతులకు తేమ నిబంధనలు శాపంగా మారరాదు.

కెచ్చెల రంగారెడ్డి

అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - Nov 02 , 2024 | 06:21 AM