Share News

రేవంత్‌రెడ్డి మరో కేసీఆర్!

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:14 AM

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో వందలసార్లు ‘సన్నాసి’ అనే పదప్రయోగం తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వంద రూపాయలైనా విలువ చేసే నిర్మాణాత్మక కార్యక్రమం ఒక్కటీ చేసిన పాపాన పోలేదు.

రేవంత్‌రెడ్డి మరో కేసీఆర్!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో వందలసార్లు ‘సన్నాసి’ అనే పదప్రయోగం తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వంద రూపాయలైనా విలువ చేసే నిర్మాణాత్మక కార్యక్రమం ఒక్కటీ చేసిన పాపాన పోలేదు. అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు, బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన తప్పులను యథాతథంగా కాపీ పేస్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. సోనియా గాంధీ కుటుంబం మెప్పు పొందడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండ్ కో ఆరాటపడుతున్న తీరు చూస్తూంటే గత బీఆర్ఎస్ పాలనకూ రేవంత్‌రెడ్డి పాలనకూ తేడా ఏమీ కనిపించడం లేదు.

బీఆర్ఎస్ పాలనలో ఏ శాసన సభ్యుడూ తను సొంతంగా పని చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. అన్నీ కేసీఆరే చూస్తాడన్న భ్రమను కల్పించారు. ఇప్పుడు అదే స్థానం రేవంత్‌రెడ్డి దక్కించుకున్నాడు. ఎవరు చూసినా రేవంత్‌రెడ్డి ‘ఆహా ఓహెూ’ అంటూ చిందులేస్తున్నారు. మధ్య మధ్యలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ముందుకు వస్తోందో అని భయపడి లేని అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. గత ఏడాది నుంచి కాంగ్రెస్ పార్టీ ఊదరగొడుతున్న ఫోన్ టాపింగ్ కేసులు, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలు, రోడ్డు లీజ్ విషయం, అక్రమంగా అనుమతులు ఇచ్చిన కారు రేస్ కేసు, హైదరాబాదులో జరిగిన భూ దందా, ధరణి అక్రమాలు, జన్వాడ ఫామ్ హౌస్ కేసులలో ఒక్కటి కూడా నిరూపించి శిక్షించలేకపోయారు. పైగా కేసీఆర్ కుటుంబంపై ఈగ వాలనివ్వడం లేదు. కేటీఆర్ బరితెగించి ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మిన్నకుండిపోయింది? కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్లు అమ్ముకున్నట్టే కేసీఆర్ కుటుంబానికి అమ్ముడుపోయిందని ఢిల్లీ వర్గాల భోగట్టా.

గత కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతి రోజూ నెత్తీ నోరు కొట్టుకొని మొత్తుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు సాధ్యమో కాదో ఆలోచించకుండా ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచింది. ఆ గ్యారంటీలకు ఇప్పటికీ దిక్కులేదు. మరి మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు లక్షా నలభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెచ్చి పెడతారు? దాని పూర్తి ప్రయోజనం ఏమిటన్న దానిపై ప్రభుత్వానికి ఇంతవరకు క్లారిటీ లేదు. హైదరాబాద్‌ను కబ్జా చేసిన సోకాల్డ్ రియల్టర్ల భరతం పట్టకుండా పేదవాళ్ల గుడిసెల పైకి హైడ్రాను పంపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు హైడ్రా షో పుటప్ కార్యక్రమంగా మారిపోయింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమించుకున్న ప్రో–బీఆర్ఎస్ రియల్టర్ల నుండి ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలియదు గాని ఇప్పుడు హైడ్రా గొడవ హైదరాబాద్‌లో లేదు. మరోవైపు ఫోర్త్ సిటీ అంటూ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఉన్న సిటీలో సౌకర్యాల కొరత ఉంటే, కొత్త సిటీ అభివృద్ధి అంటూ ప్రణాళిక లేకుండా ఆర్థిక వనరులు లేకుండా ముందుకు వెళ్లడం విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం హైప్‌ సృష్టించిన ఆలూరు ఎలక్ట్రాన్ సిటీ లాగా ఇది కూడా వాళ్ళ అస్మదీయులకు డబ్బు చేకూర్చే పథకంగా మారబోతుందా?

ఇక లగచర్ల ఘటనలో అక్కడ ఫార్మా కంపెనీల సంగతి ఏమిటో గాని, అధికారులపై దాడి రాజకీయ కోణంగా మారిపోయి రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీపడి అక్కడ సంఘటనలపై రాజకీయాలు చేశారు. తమ్ముడు ఒక పార్టీ నుంచి కుట్ర చేశాడని జైలుకు వెళ్తే, ఆయన అన్న అధికార పార్టీలో ప్రభుత్వ విప్‌గా నియమింపబడతాడు. ఇది ఎంత విచిత్రమైన రాజకీయ విన్యాసమో ఊహకు కూడా అందదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది కోసమే ఆ ఫార్మాసిటీ అని ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లి హడావిడి చేసిన కేటీఆర్ ఇక్కడ కోర్టులో గాని, పోలీస్ స్టేషన్లో గాని ప్రభుత్వం మీద ఎలాంటి ఫిర్యాదూ ఇవ్వలేదు. అంటే ఇది మనఃపూర్వకంగా చేసింది కాదన్నమాట. ప్రతి రోజూ ఏదో ఒక రాజకీయ అంశాన్ని తెరపైకి తెచ్చి అసలు విషయాలను మరుగుపరిచి ఒక సంవత్సరం పాటు కాలక్షేపం చేశారు.

గతంలో కేసీఆర్ పట్ల పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు విధేయత చూపినట్లుగానే ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది. రోజూ తిరుగుతున్నా ఏమి గ్రహించలేకపోతున్నాడు. అర్బన్ నక్సలైట్లను విద్యావేత్తలుగా, సలహాదారులుగా, విద్యా కమిషన్ సభ్యులుగా నియమించాడు. మాటిమాటికీ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ అధిష్ఠానానికి డబ్బు మూటలు మోస్తున్నాడన్న అపప్రథ మూటగట్టుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ అధిష్ఠానికి ఏటీఎంలుగా మారాయని ఢిల్లీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ అధికారంలో ఉండాలంటే సామంత రాజు లాగా కప్పంగట్టే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రతి చిన్న నిర్ణయానికి రేవంత్ ఢిల్లీ బాట పట్టాల్సి వస్తున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులతో నడిచేవి. ఇప్పుడు డబ్బు మూటలతో నడుస్తున్నాయని ఢిల్లీ వీధులలో చెవులు కొరుక్కొంటున్నారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి అందుకు ఉపయోగపడకపోతే ఆ పదవి ఉంటుందో ఊడుతుందో తెలియదు.

అలాగే గతంలో కేసీఆర్ రక్షక వాహనాలను ఇచ్చి కమాండ్ కంట్రోల్ సృష్టించి పోలీసు వ్యవస్థను తన కనుసన్నల్లో పెట్టుకొని ఫోన్ టాపింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందులో అన్ని పార్టీల బాధితులూ ఉన్నారని ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతిపక్షం మాటల్ని వింటుందన్నది ప్రధాన ఆరోపణ. ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన వివరణ లేదు. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏ ప్రత్యేక చర్యా తీసుకోవడం లేదు. డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పాడు. దాన్ని అరికట్టేందుకు ఆ వ్యాపారంలో ఉన్నట్లయితే రాజకీయవేత్తలను శిక్షిస్తామని మాత్రం చెప్పలేదు.

యథేచ్ఛగా, అక్రమంగా ఇసుక, మట్టి దోపిడీ జరుగుతూనే ఉంది. గత బీఆర్ఎస్ నాయకులంతా వాటినమ్ముకొని అక్రమ రాజకీయానికి అలవాటు పడ్డారన్న సంగతి ముఖ్యమంత్రికి తెలియంది కాదు. వాళ్లను శిక్షించడం పక్కన పెట్టి, తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించదగినది. ఇతర రాష్ట్రాల నుంచి మతోన్మాద ప్రచారం చేసేవాళ్లు తెలంగాణలో అక్రమంగా చొరబడి తీవ్రవాద భావాలు వ్యాప్తి చేస్తున్నా ప్రభుత్వం అదుపు చేయలేకపోతున్నది. ఓవైసీతో లోలోపల జరిగిన ఒప్పందమే దీనికి ప్రధాన కారణం.

రైతు భరోసా అంటూ దాటవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి కొనుగోళ్ల విషయంలో చేసిన తాత్సారం వల్ల రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు అస్మదీయులకే ఒరిగేలా మారింది. అది బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు స్కీం లాగా మారిపోయింది. అసైన్మెంట్ భూములకు ప్రత్యేక చట్టం తెచ్చి హక్కు కల్పిస్తామని, కౌలుదారులకు సహాయకారిగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ వాగ్దానాలు ఈ రోజుకూ నెరవేరలేదు. ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కొన్ని ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి మురిసిపోతుంటే చూసిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లయిన తర్వాత ఇప్పుడు విగ్రహాల పంచాయతీ కొత్తగా సృష్టించి లేని భావోద్వేగాలను ప్రజల్లో కల్పించాలని ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేసీఆర్ పాపాలు కాంగ్రెస్‌కు వరంగామారితే, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేకపోవడం రేవంత్‌రెడ్డికి వరంగా మారిపోయింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఏడాది పరిపాలన ప్రోగ్రెస్ కార్డును ఒక్కసారి పరిశీలించుకుని ముందుకు వెళితే మంచిది.

బీఆర్ఎస్ పాలనలో ఏ శాసన సభ్యుడూ తను సొంతంగా పని చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. అన్నీ కేసీఆరే చూస్తాడన్న భ్రమను కల్పించారు. ఇప్పుడు అదే స్థానం రేవంత్‌రెడ్డి దక్కించుకున్నాడు. ఎవరు చూసినా రేవంత్‌రెడ్డి ‘ఆహా ఓహెూ’ అంటూ చిందులేస్తున్నారు. మధ్య మధ్యలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ముందుకు వస్తోందో అని భయపడి లేని అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు.

ఎం. రఘునందన్‌రావు

మెదక్‌ పార్లమెంటు సభ్యులు

Updated Date - Dec 12 , 2024 | 05:14 AM