ఇది కూల్చివేతల ప్రభుత్వం!
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:46 AM
పేదల సంక్షేమమే ధ్యేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పేదల మీదే ప్రతాపాన్ని చూపుతోంది. హైడ్రా పేరిట, మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను కూల్చివేసే తతంగం చేపట్టి వారిని భయాందోళలకు గురిచేస్తోంది. తమది ప్రజాప్రభుత్వం అని ఘనంగా చాటుకుంటున్న కాంగ్రెస్ ఆచరణ మాత్రం
పేదల సంక్షేమమే ధ్యేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పేదల మీదే ప్రతాపాన్ని చూపుతోంది. హైడ్రా పేరిట, మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను కూల్చివేసే తతంగం చేపట్టి వారిని భయాందోళలకు గురిచేస్తోంది. తమది ప్రజాప్రభుత్వం అని ఘనంగా చాటుకుంటున్న కాంగ్రెస్ ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని, కార్యక్రమాన్ని, ప్రాజెక్టును చేపట్టినప్పుడు దాని మంచి చెడుల గురించి పూర్తిగా ఆలోచించాలి. సమగ్ర అధ్యయనంతో పాటు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి. రాజకీయ సమస్యలు లేకుండా అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి తమ ఉద్దేశాలను వెల్లడించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి అందుకు భిన్నంగా ఉంది.
చెరువుల పరిరక్షణ కోసం అంటూ హైడ్రాను ప్రారంభించింది. దానికి చట్టబద్ధత కల్పించకముందే, విధివిధానాలను నిర్దేశించకముందే నేరుగా రంగంలోకి దిగి కూల్చివేతలను ప్రారంభించింది. తొలుత భవన సముదాయాలు అంటూ ఆ తర్వాత చెరువుల పూర్తిస్థాయి మట్టం (ఫుల్‌ట్యాంక్ లెవెల్- – ఎఫ్‌టీఎల్), దానిని ఆనుకొని ఉన్న ప్రవాహ ప్రాంతం (బఫర్ జోన్)లో ఉన్న నిర్మాణాలు అక్రమంగా ఉన్నాయంటూ బుల్డోజర్లను పంపించింది. ముందుగా ఒక ఎమ్మెల్యే, మరో సినీ నటునికి సంబంధించిన భవనాలు కూల్చివేత జరగడంతో ప్రభుత్వం పెద్దవారిపైనే దృష్టి సారించిందనే భావన ఏర్పడింది. అయితే అది నివాస అపార్ట్‌మెంట్లపైనా దృష్టి పెట్టి కూల్చివేతలను చేపట్టడంతో అందులో నివసిస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడింది. ఊళ్లలో పొలాలు అమ్మి, బ్యాంకుల్లో అప్పులు చేసి కొనుగోలు చేసిన నివాస ఫ్లాట్లను హైడ్రా కూల్చివేసింది. మరోవైపు పేదల ఇళ్ల కూల్చివేతలను చేపట్టింది. తాము దీర్ఘకాలికంగా నివసిస్తున్న ఇళ్లను, షెడ్లను కూల్చివేస్తున్నారని పేదలు కన్నీళ్ల పర్యంతమైనా వినలేదు. వాస్తవానికి ఆయా ఫ్లాట్లలో, ఇళ్లలో నివసిస్తున్నవారు అన్ని అనుమతులు, ధ్రువీకరణలతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, నెలనెలా కిస్తీలు చెల్లిస్తున్నారు. ఆస్తిపన్ను, నీరు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. వీటికి అన్నింటికీ ప్రభుత్వ శాఖలే అనుమతులు ఇస్తున్నాయి. తద్వారా ఛార్జీలను పొందుతున్నాయి. కూల్చివేతల ద్వారా ప్రభుత్వానికి ఏ మేరకు లబ్ధి చేకూరిందోగానీ పేదలకు మాత్రం తీరని వేదన కలిగింది. కూల్చిన ఇళ్లకు బీమా రాదు. బ్యాంకులకు కిస్తీలు చెల్లించాల్సిందే. వారికి రుణభారం తీరదు. ఈ కోణంలో ప్రభుత్వం ఆలోచించలేదు. భవనసముదాయాలు కట్టి విక్రయించిన బిల్డర్లకు, అనుమతులు ఇచ్చిన అధికారులకు ఎలాంటి నష్టం కలగలేదు. బాధితుల గోస అరణ్య రోదనగానే మిగిలింది.
ఒకవైపు హైడ్రా బీభత్సం కొనసాగుతుండగానే ప్రభుత్వం రూ. లక్షన్నర కోట్ల అంచనాతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం ఆక్రమణలు తొలగించి మూసి నదిని ప్రక్షాళన చేస్తామని, నగరానికి ముంపును నివారిస్తామని ప్రకటించింది. తీరా అది హైడ్రా దారిలోనే కూల్చివేతల దారిపట్టింది. మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లకు మార్కింగ్ నంబర్లు వేసి కూల్చివేతలు ప్రారంభించింది. దీనిపై ప్రజల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తంకావడంతో అక్కడ ఉన్న వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిచినట్లు ప్రకటించి, వారిని హడావిడిగా తరలించే ప్రక్రియను చేపట్టింది. మూసీ ప్రాజెక్టు ప్రక్షాళనకు ఆది నుంచి ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. 2021లో మూసీపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమావేశాలు నిర్వహించి మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్‌ను నిర్ణయించింది. అప్పట్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. బీఆర్‌ఎస్ హయాంలోనే మూసీ సరిహద్దులను ఫిక్స్ చేశారు. కొత్తగా ఆక్రమణలకు అవకాశం ఇవ్వకుండా ఎలాంటి కూల్చివేతలు లేకుండా నాగోలు తదితర ప్రాంతాల్లో సుందరీకరణను అది చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు కొత్త రూపుతెచ్చింది. నేరుగా ఇళ్లను కూల్చివేయడమనే భావన కలిగించడంతో అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. ఎన్నో ఏళ్లుగా తమకు నీడనిచ్చిన గూడును కూల్చేస్తుంటే నిర్వాసితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
హైడ్రా, మూసీ ప్రాజెక్టుల తీరు రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఇదే మాదిరిగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు కొత్తగా అనుమతులకు వెనుకాడుతున్నాయి. కూల్చివేతలకు ముందుకొస్తున్నాయి. హైడ్రా కింద నిజంగా ఆక్రమణల తొలగింపే లక్ష్యమయితే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల చుట్టూ ఉన్న ఫాంహౌస్‌లను తొలగించాలి. వీటిలో ఎక్కువ అధికార పార్టీకి సంబంధించినవి ఉండగా ఒక్కదాని మీద సర్వే జరగలేదు. రాజకీయంగా వైరి పక్షానికి చెందిన ఫాంహౌస్‌ల వద్ద హడావిడి చేశారు. మరోవైపు విద్యాసంస్థల భవన సముదాయాలపైనా ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విపక్షాలను లక్ష్యంగా చేసుకొని ఆదాయపన్ను, ఈడీ, సీబీఐ దాడులు చేయడం ఆనవాయితీ కాగా హైడ్రా, మూసీల ప్రాజెక్టుల లక్ష్యం కూడా ఇదేనని విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీల మీదే గాకుండా కాంగ్రెస్ పార్టీ నేతల ఫాంహౌస్‌లు, విద్యాసంస్థల అక్రమ భవన సముదాయాల కూల్చివేతలను చేపడితే ప్రభుత్వం నిష్పాక్షికంగా ఉందని నిరూపితం అవుతుంది.
హైడ్రాగానీ, మూసీ ప్రాజెక్టు గానీ కూల్చివేతలే లక్ష్యమయితే ముందు బాధితుల గురించి ఆలోచించాలి. అన్యాయంగా వారు నష్టపోకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మూసీ బాధితులకు రెండు పడకగదుల ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బాధితుల సంఖ్యతో పోలిస్తే రెండు పడకగదుల ఇళ్లు చాలా తక్కువే. దీంతో బాధితులకు భరోసా లేనట్లే.
రాష్ట్రంలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరగడం లేదు కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా ఆసరా పెన్షన్లు పెరగలేదు. ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఇవ్వడం లేదు. బడిపిల్లలకు అల్పాహారం ఇవ్వడం లేదు. మురికివాడలను అభివృద్ధి చేయడం లేదు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మురికివాడల్లోని ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇప్పుడు గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ వంటివి మురికివాడల్లో అమలు కావడం లేదు. మరోవైపు నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. గత ప్రభుత్వ నోటిఫికేషన్లకు పరీక్షలు జరిగాయి తప్ప కొత్తగా ఉద్యోగ నియామకాలను చేపట్టలేదు. మూసీ ప్రక్షాళన వాంఛనీయమే. అయితే దానికి రూ. లక్షన్నర కోట్లను వెచ్చించాల్సిన అవసరం లేదు. మురుగునీటి పారుదల వ్యవస్థను చక్కదిద్దితే మూసీ సమస్య పరిష్కారమవుతుంది. ప్రభుత్వానికి కూల్చివేతలే లక్ష్యమయితే ఏ ఒక్కరు నష్టపోకుండా వారికి పరిహారం, పునరావాసం, శాశ్వత ఉపాధి కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
హైడ్రా కింద నిజంగా ఆక్రమణల తొలగింపే లక్ష్యమయితే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల చుట్టూ ఉన్న ఫాంహౌస్‌లను తొలగించాలి. వీటిలో ఎక్కువ అధికార పార్టీకి సంబంధించినవి ఉండగా ఒక్కదాని మీదా సర్వే జరగలేదు. రాజకీయంగా వైరి పక్షానికి చెందిన ఫాంహౌస్‌ల వద్ద హడావిడి చేశారు. కేంద్ర ప్రభుత్వం విపక్షాలను లక్ష్యంగా చేసుకొని ఆదాయపన్ను, ఈడీ, సీబీఐ దాడులు చేయడం ఆనవాయితీ కాగా హైడ్రా, మూసీల ప్రాజెక్టుల లక్ష్యం కూడా ఇదేనని విమర్శలు వస్తున్నాయి.
l డాక్టర్ బీఎన్‌రావు
బీఎన్‌రావు ఫౌండేషన్