Share News

చల్లని కబురు!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:02 AM

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువ వర్షాన్ని తెస్తాయని భారత వాతావరణశాఖ చల్లనిమాట చెప్పింది. ప్రకటన వెలువడిననాటికీ, వాటి ఆగమనానికి మధ్య దాదాపు రెండునెలల ఎడం...

చల్లని కబురు!

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువ వర్షాన్ని తెస్తాయని భారత వాతావరణశాఖ చల్లనిమాట చెప్పింది. ప్రకటన వెలువడిననాటికీ, వాటి ఆగమనానికి మధ్య దాదాపు రెండునెలల ఎడం ఉన్నప్పటికీ, మండుటెండల్లో మలమలామాడిపోతున్న జనానికి ఈ వార్త వినగానే వానజల్లుల్లో తడిసినంత ఆనందం కలిగింది. రుతుపవనాల ఆగమనానికి సంబంధించిన తొలి అంచనాల్లోనే అధికవర్షపాతం గురించి ఐఎండీ మాట్లాడటం దశాబ్దకాలంలో ఇదే మొదటిసారి. ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడుతున్నాయని, నైరుతి ప్రారంభం నాటికి దాని ప్రభావం మరింత క్షీణిస్తుందని ఐఎండీ అంచనా. ఆగస్టు సెప్టెంబర్‌ మధ్యలో లానినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని అంటూ, మొత్తంగా ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే, అధికవర్షపాతానికే అత్యధిక అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ చెబుతోంది.

ఎల్‌నినో కొనసాగుతుందనీ, వర్షాభావం తప్పదని అనుమానపడుతున్న దశలో ఐఎండీ ఈ శుభవార్త వినిపించింది. ఇది తొలి అంచనా కనుక కచ్చితంగా కొన్ని మినహాయింపులు ఇవ్వకతప్పదు. అయినప్పటికీ సాధారణవర్షపాతం ఉండవచ్చు తప్ప, వర్షాభావం భయాలైతే అక్కరలేదు. వాతావరణ పరిస్థితులను అంచనాకట్టే విషయంలో మనం గతంలో కంటే ఎంతో మెరుగుదలసాధించినప్పటికీ, కచ్చితత్వానికి ఇంకా కాస్తంతదూరంగానే మిగిలిపోయాం. ఇక, ఇప్పుడు ఐఎండీ తన అంచనాలో మొత్తం సీజన్‌లో వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉంటుందని అంటూనే, ఆరంభం మాత్రం కాస్తంత బలహీనంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. గత ఏడాదిలాగా ఎల్‌నినో ఈ మారు కూడా నైరుతి పవనాలను బలహీనం చేయవచ్చునన్న అనుమానాలు ఉన్నప్పటికీ, లానినో విషయంలో మాత్రం ఐఎండీ నమ్మకంగా ఉంది. పసిఫిక్‌ మహాసముద్రం ఉపరితలం వేడి చల్లారి ఆగస్టులో రుతుపవనాలు బలం పుంజుకొని ఎక్కువమోతాదులో వర్షాలు తెచ్చిపెడతాయని అది అంచనాకడుతోంది. మొత్తం వ్యవసాయంలో అరవైశాతం బోరుబావుల ఆధారంగానే సాగుతున్నందున, ఏయేటికాయేడు నేరుగా వర్షాలమీద ఆధారపడే అవసరం ప్రస్తుతం వ్యవసాయరంగానికి లేకపోవచ్చు. వర్షాలు కాస్తంత అటూఇటూ అయితే వ్యవసాయ ఉత్పత్తి దారుణంగా పడిపోయి, ఆహారధాన్యాలకు వెతుక్కొనే పరిస్థితి ప్రస్తుతం లేదు. వర్షాభావం తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఉత్పత్తి తగ్గి, సరఫరాలూ ధరలమీద ఆ ప్రభావం ఉంటున్నది. వర్షపాతంలో ఆటుపోట్లనుంచి వ్యవసాయరంగాన్ని బోర్లు రక్షిస్తున్నప్పటికీ, వాటి వినియోగానికి వీలుకల్పిస్తున్న భూగర్భజలాల భర్తీకి అతిముఖ్యమైనవి ఈ రుతుపవనాలే. నైరుతిపవనాలతోనే ఏటా డెబ్బయ్‌ ఐదుశాతం భూగర్భజలాలు రీచార్జి అవుతాయని ఓ అంచనా. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల కూడా భూగర్భజలాలు అత్యధికంగా అడుగంటిపోయాయని అంటున్న నేపథ్యంలో, ఈ మారు మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి.

ఈ దేశంలో ఎక్కువ ఉపాధినిస్తున్నది ఇప్పటికీ వ్యవసాయరంగమే. ఈ వర్షాలతో ఇరిగేషన్‌ సౌకర్యం లేని మిగతా సగం వ్యవసాయభూమి తడుస్తుంది, మొత్తంగా ఉత్పత్తి పెరుగుతుంది. ఇప్పటికే పెరిగినధరలకు తాళలేకపోతున్న సామాన్యుడికి కాస్తంత ఉపశమనం దక్కడంతో పాటు, ప్రజలకు ఆహారభద్రత కూడా ఏర్పడుతుంది. దేశవ్యవసాయ రంగానికి ముఖ్యమైన ఎనభైకి పైగా ప్రాజెక్టులు నీటితో నిండి కళకళలాడేది ఈ సీజన్‌లోనే. ఒక్క వ్యవసాయరంగమే కాక, దాని అనుబంధరంగాల మనుగడనూ ఈ వర్షాలు ప్రభావితం చేస్తాయి. ఎల్‌నినో ఏర్పడి, అది ముగిసిన అనంతరం లానినా ప్రభావంతో వర్షాలు పడినప్పుడు అవి సాధారణం కంటే హెచ్చుగా ఉండటం ఇప్పటివరకూ పది సందర్భాల్లో జరిగిందట. అందువల్ల, ఈ మారు వాతావరణశాఖ అంచనాలు నిజం కావచ్చును కూడా. వచ్చేనెలలో ఐఎండీ మరింత కచ్చితమైన అంచనాలతో ఎలాగూ ముందుకురాబోతున్నది. రాబోయే వర్షాలు అన్ని ప్రాంతాలకూ విస్తరించి, సుదీర్ఘకాలం పుడమి నిత్యం జల్లులతో తడవాలనీ, నీరంతా నేలలోకి ఇంకి భూగర్భజలమట్టం పెరగాలనీ కోరుకుందాం. ఎంత వర్షం కురిసినా అది కుంభవృష్టిగా నింగినీనేలనూ ఏకం చేసి, ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిపోతే ఏ ప్రయోజనమూ ఉండదు. భయంకరమైన ఎండలనూ, నీటికష్టాలను చవిచూస్తున్న ప్రజలకు ఈ నైరుతిపవనాలు ఉపశమనాన్ని చేకూర్చి, ఒడ్డునపడేస్తాయని ఆశిద్దాం.

Updated Date - Apr 18 , 2024 | 03:02 AM