Share News

వర్గీకరణం.. రణం.. సార్వకాలీన సత్యం!!

ABN , Publish Date - Aug 30 , 2024 | 05:32 AM

రాజకీయాల్లో రణ నినాదాలు, ఆర్భాట ప్రకటనలు, శుష్క వాగ్దానాలు మాత్రమే కాదు.. అర్థవంతమైన మౌనాలు ఉంటాయి. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా ఒక దానిపై అర్థవంతమైన మౌనం ప్రస్తుతం రాజ్యమేలుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాలు చేపట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పుని

వర్గీకరణం.. రణం.. సార్వకాలీన సత్యం!!

ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములను నిర్ణయించేది సంఖ్యాబలమే కాబట్టి అది అధికంగా ఉండి రాజకీయ ప్రభావాన్ని చూపించే కులాలను దూరం చేసుకోటానికి పార్టీలు సిద్ధంగా లేవు. రకరకాల కారణాలతో అధిక పదవులనూ సంపదలనూ ఆదాయాలనూ అనుభవిస్తున్న వర్గాలు ఏ ఒత్తిళ్లు లేకుండా వాటిని వదులుకున్న సందర్భాలు చరిత్రలో లేవనే చెప్పాలి.

రాజకీయాల్లో రణ నినాదాలు, ఆర్భాట ప్రకటనలు, శుష్క వాగ్దానాలు మాత్రమే కాదు.. అర్థవంతమైన మౌనాలు ఉంటాయి. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా ఒక దానిపై అర్థవంతమైన మౌనం ప్రస్తుతం రాజ్యమేలుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాలు చేపట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చిన తర్వాత ప్రధాన జాతీయ పార్టీలు దాన్ని ఘనంగా పాటిస్తున్నాయి! ఎస్సీల్లో సంపన్నశ్రేణికి చెందిన వారికి రిజర్వేషన్లను మినహాయించటం మంచిదనే అభిప్రాయాన్ని నలుగురు న్యాయమూర్తులు వ్యక్తంచేయటంపై మాత్రం పార్టీలు స్పందించాయి. దళిత వర్గానికి చెందిన న్యాయమూర్తి జస్టిస్‌ బీ.ఆర్‌.గవాయ్‌ సంపన్న శ్రేణి మినహాయింపుపై విపులంగా వ్యాఖ్యలు చేశారు. నిజానికి సంపన్నశ్రేణిపై న్యాయమూర్తులది కేవలం సూచన మాత్రమే. అది ప్రధాన తీర్పులో భాగం కాదు. అయినా దానికి రెండు జాతీయ పార్టీలూ ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. బీజేపీ సూటిగా స్పందించకుండా కేంద్ర క్యాబినెట్‌ అభిప్రాయం పేరుతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఒక ప్రకటనను చేయించింది. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారమే కేంద్రం నడుచుకుంటుందనీ అందులో సంపన్నశ్రేణి ప్రస్తావన లేదు కాబట్టి దాన్ని అమలుపరచబోమని మంత్రి చెప్పారు. ఎంత తరచి చూసినా అదొక విధాన ప్రకటనలా అనిపించదు. వర్గీకరణ తీర్పుపై అసంతృప్తితో ఉన్న కొన్ని ఎస్సీ వర్గాలను సమాధానపరచటానికి దాన్ని చేసినట్లుగా కనపడుతుంది. రాజ్యాంగంలో వర్గీకరణ విషయమూ లేదు. సంపన్నశ్రేణి ప్రస్తావనా లేదు. మండల్‌ కమిషన్‌ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు సంపన్నశ్రేణి విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సంపన్నశ్రేణి గురించి వివరణ ఇప్పించిన తర్వాత వర్గీకరణ అమలుపై మాత్రం బీజేపీ నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం సంపన్నశ్రేణిపై తమ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టంగానే వెల్లడించారు. దాన్ని ఎస్సీలకు వర్తింపచేయకుండా చట్టం చేయాలని డిమాండు చేశారు. కానీ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ పార్లమెంటు ఒక చట్టాన్ని చేయాలని మాత్రం డిమాండు చేయలేదు. మొత్తం సమస్యను అధ్యయనం చేయటానికి ఒక కమిటీని కాంగ్రెస్‌ నియమించింది. ఆ కమిటీ ఇచ్చే నివేదికపై నిర్ణయం తీసుకునే వరకూ వర్గీకరణపై ఎవరూ మాట్లాడకూడదనీ ఆదేశించింది. పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా వర్గీకరణపై నిర్ణయాలు తీసుకోకూడదని తేల్చిచెప్పింది. ఇక బీజేపీ వైపు నుంచి అట్లాంటి కమిటీ కూడా ఏర్పాటైనట్లు లేదు.


నిజానికి వర్గీకరణ సమస్య కొత్తది కాదు. ఎస్సీ వర్గాల మధ్యనే గాక సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు ఉండాలని వాదించే మేధావులు, రాజకీయవేత్తల మధ్య ఎప్పటి నుంచో దానిపై చర్చలు సాగుతున్నాయి. ఆర్థికంగా, విద్యాపరంగా ఎదిగిన కులాల్లోని వారే రిజర్వేషన్లను అత్యధికంగా ఉపయోగించుకున్నారని చెప్పటానికి సమాచారం చాలా ఉంది. మిగతా కులాలకు చాలా వరకూ అవి చేరలేదన్న సంగతీ అనేక పరిశీలనల్లో తేలింది. అయినా పార్టీలు వర్గీకరణను అమల్లో పెట్టటానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నాయని ప్రశ్నించుకుంటే కులాల సంఖ్యాబలాలనే అందుకు కారణంగా చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములను నిర్ణయించేది సంఖ్యాబలమే కాబట్టి అది అధికంగా ఉండి రాజకీయ ప్రభావాన్ని చూపించే కులాలను దూరం చేసుకోటానికి పార్టీలు సిద్ధంగా లేవు. రకరకాల కారణాలతో అధిక పదవులనూ సంపదలనూ ఆదాయాలనూ అనుభవిస్తున్న వర్గాలు ఏ ఒత్తిళ్లు లేకుండా వాటిని వదులుకున్న సందర్భాలు చరిత్రలో లేవనే చెప్పాలి. అన్ని వర్గాలకూ కులాలకూ వర్తించే సార్వకాలీన సత్యం ఇది!

ఎస్సీల్లోనే కాదు బీసీల్లోనూ పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల ఫలాలను కొన్ని కులాలే అత్యధికంగా అందుకున్నాయి. బిహార్‌లో చేపట్టిన సామాజిక ఆర్థిక కులగణనలో వెల్లడైన నిజమదే. ఓబీసీల్లోని మూడు నాలుగు కులాలే సింహభాగం రిజర్వుడు ఉద్యోగాలను, పదవులను చేజిక్కించుకున్నాయి. భూములు, భవనాలు, వస్తు, వాహనాలూ వారి దగ్గరే అధికంగా ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా వెల్లడించిన సమాచారంలో చాలా పరిమితులు ఉంటాయి. ఆస్తులు, సంపద గురించి ఉన్నదున్నట్లుగా ప్రజలు ఒకపట్టాన చెప్పరు. అయినా ఆ పరిమిత సమాచారమే కులాల ఆర్థిక స్థితిగతులను కాస్త విపులంగా తెలుసుకోటానికి ఉపయోగపడుతుంది.

సామాజికంగా అణచివేతకు గురైన ఏ కులమూ ఇప్పుడు గతంలో లాగా లేదు. సంఖ్యాబలం బాగా ఉన్న ప్రతికులంలోనూ ఆర్థికపరమైన అంతరాలతో కూడిన వర్గాలు ఏర్పడ్డాయి. ఆర్థిక సంస్కరణలు అమలు తర్వాత ఈ అంతరాలు ఇంకా పెరగటం వల్ల ఓబీసీ కులాల్లో రాజకీయ సంఘీభావం కనపడటం లేదనీ ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త క్రిస్ట్టొఫ్‌ జఫలాట్‌ వ్యాఖ్యానించటమే ఇందుకు నిదర్శనం. హిందీ రాష్ట్రాల్లో ఓబీసీ రాజకీయ పార్టీలు బలహీనపడటానికి వర్గపరమైన ఆర్థిక అంతరాలే కారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రెంచ్‌ దేశస్థుడైనా జఫలాట్‌ లాగా దేశంలో ఓబీసీ రాజకీయాలను లోతుగా అధ్యయనం చేసినవారు చాలా అరుదునే చెప్పాలి. ఇక ఓబీసీల్లోని ఆధిపత్య కులాల పట్ల అసంతృప్తితో ఉన్న ఇతర కులాలను చేరదీసి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వటం వల్లే హిందీ రాష్ట్రాల్లో బీజేపీ స్థిరంగా బలపడింది. ఒక్క హిందూత్వ రాజకీయాలపైన మాత్రమే ఆధారపడితే బీజేపీ ఎన్నికల్లో చాలా ఒడిదుడుకులకు లోనయ్యేది.


ఎస్సీ కేటగిరిలోని కులాలను సంఖ్యాబలం దృష్టితో పరిశీలిస్తేనే రిజర్వేషన్ల వర్గీకరణపై ఎందుకంత వ్యతిరేకత వస్తుందో కొంత మేరకైనా అర్థం చేసుకోగలం. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలు 1,38,78,078 ఉన్నారు. మొత్తం 60 కులాలను ఎస్సీ జాబితాలో చేర్చారు. ఈ 60 కులాల్లోనూ లక్ష పైచిలుకు జనాభా ఉన్న కులాలు ఏడు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడు కులాల జనాభాని లెక్కగడితే 1,31,26,029 మంది తేలారు. అంటే అక్షరాల 94.58 శాతం జనాభా ఈ ఏడు కులాల్లోనే ఉంది. మిగతా 53 కులాల మొత్తం జనాభా 7,52,049 (5.42 శాతం) మాత్రమే.

ఏడు కులాల మధ్య కూడా జనాభా పంపిణీలో వ్యత్యాసాలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఏడు కులాల్లోని మాదిగ (67,02,609), మాల–మాలసాలె (57,03,491) లను కలిపి లెక్కిస్తే జనాభాలో 94.5 శాతం వాళ్లే కనపడతారు. మిగిలిన అయిదు కులాల... ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, బేడజంగం, రెల్లి.... జనాభా 5.5 శాతం మాత్రమే. ఈ అంకెలు చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మాదిగలకు గణనీయ సంఖ్యాబలం లేకపోతే వర్గీకరణ పోరాటంలో వాళ్లు గెలిచి ఉండేవారు కాదు. అక్షరాస్యతలో ఆది ఆంధ్ర (62.4శాతం), ఆది ద్రవిడ (62.6శాతం), మాల (60.13శాతం), రెల్లి (56.2శాతం) పోల్చితే మాదిగలు (51.3శాతం) దిగువున ఉన్నప్పటికీ సంఖ్యా బలానికి రాజకీయ చైతన్యం తోడై వర్గీకరణ కోసం ఏళ్లపాటు ఆందోళన కొనసాగించటానికి దోహదం చేసింది. రిజర్వేషన్ల ఫలాలను అధికంగా అనుభవిస్తున్న కులాలకు దీటుగా ఆ ఫలితాలను అనుభవించలేని కులాలకు తగిన సంఖ్యాబలం లేకపోతే, వారి పోరాటాల ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేం! జనాభాలో దళితులు అయిదో వంతు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కూడా కులాల సంఖ్యాబలంలో ఇలాంటి అసమానతలే కనిపిస్తాయి. అక్కడ జాతవ్‌లు (అనుబంధ కులాలతో కలిపి) 2,24,96,047 మంది ఉన్నారు. రాజకీయంగా వారిదే ఆధిపత్యం. మొత్తం ఎస్సీ జనాభాలో (4,13,57,608) జాతవ్‌ల వాటా 54.39 శాతం ఉంది. పాసి–తార్‌మలి కులం (65,22,166) రెండో స్థానంలో ఉంది. మొత్తం 66 ఎస్సీ కులాల్లో 10వేల లోపు జనాభా ఉన్న కులాలు 36 ఉన్నాయి. లక్షపైన ఉన్న కులాలు 15 ఉన్నాయి. ఆర్థిక, విద్యాపరమైన తేడాలు అక్కడ కులాల మధ్య కూడా చాలా ఎక్కువ. జాతవ్‌ల్లో అక్షరాస్యులు 53 శాతం ఉంటే ముసాహర్‌ల్లో 19.16 శాతం మందికి మాత్రమే అక్షర జ్ఞానం ఉంది.


జనాభా లెక్కల్లో నమోదైన సమాచారం కొంతమేరకే వాస్తవ చిత్రాన్ని అందిస్తుంది. దాన్ని నిశితంగా పరిశీలించినా ఎస్సీ, ఎస్టీ కులాల్లో అసమానతలు కొట్టొచ్చినట్లు కనపడతాయి. ఇక వివిధ కేటగిరీ ఉద్యోగాల్లో, పదవుల్లో లెక్కలను నిర్దిష్టంగా ప్రభుత్వాలు సేకరిస్తే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎవరు ఎక్కడ ఉన్నారో తేలుతుంది. రిజర్వేషన్ల వర్గీకరణ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు ప్రకటించినా రాజకీయ దృష్టితో అసంబద్ధంగా దాన్ని చేపడితే ఉపేక్షించబోమని స్పష్టంచేసింది. విద్య, ఉద్యోగాలకు సంబంధించి వివిధ స్థాయిల్లో తగినంత ప్రాతినిధ్యం లేదని పక్కాగా సమాచారాన్ని సేకరించిన తర్వాతే సంబంధిత కులాలకు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాలని నిర్దేశించింది. అట్లా జరగని పక్షంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు న్యాయసమీక్షకు నిలబడాల్సి వస్తుందనీ హెచ్చరించింది. జనాభా సంఖ్యకు దామాషాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉండాలనీ కాకుండా, సముచిత ప్రాతినిధ్య కోణం నుంచి మాత్రమే తగిన వాటాలు కల్పించాలని తీర్పు సారాంశంగా అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు షరతులు, వ్యాఖ్యల నేపథ్యంలో వర్గీకరణను చేపట్టి రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించటం ప్రభుత్వాలకు కత్తిమీద సామే అవుతుంది.

వర్గీకరణ డిమాండ్లను దీర్ఘకాలిక ఆర్థిక మార్పుల నేపథ్యంలో పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. కులానికి కులం మొత్తంగా కొన్నిచోట్ల సామాజికంగా, ఆర్థికంగా ఒకే స్థాయిలో వెనుకబడి ఉండొచ్చు. ముఖ్యంగా ఆధునిక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చొచ్చుకెళ్లని మారుమూల గ్రామాల్లో కొన్నిచోట్ల అంతర్గత తారతమ్యాలు కింది కులాల్లో కొట్టొచ్చినట్లు కనపడకపోవచ్చు. కానీ వాటి సంఖ్య గణనీయమని ఇప్పుడు చెప్పుకోలేం. కులాల మధ్యా, అంతర్గతంగా విడివిడి కులాల్లోనూ అర్థిక, విద్యా అసమానతలే క్రమేపీ పైచేయిని సాధిస్తున్నాయి. వర్గీకరణ డిమాండ్లకు అవే కారణమవుతున్నాయి. అధికారార్జనకు రాజకీయ పాచికగా మారకపోతే... ఆర్థిక, సామాజిక, కులగణనతో కొంత నిఖార్సైన చిత్రం కనపడే అవకాశమూ ఉంటుంది. అప్పుడు చేపట్టే చర్యల ద్వారా కులగణన కోసం అలుపెరగకుండా వాదనలు చేస్తున్న కాంగ్రెస్‌ తదితర పార్టీల అసలు రంగులు బయటపడతాయి. కచ్చితమైన లెక్కలు వచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీల్లో సంపన్నశ్రేణి విభజన అవసరమో కాదో కూడా స్పష్టమవుతుంది.

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - Aug 30 , 2024 | 05:32 AM