Judiciary : పేదోళ్ళ ప్లీడర్ శంకరన్న
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:16 AM
శ్రీకాకుళం నుండి సిరిసిల్ల దాకా తెలుగునేలపై వెల్లువెత్తిన విప్లవోద్యమాల్లోని ప్రజాస్వామికాంశాలను గుర్తించి సమర్ధించిన వాళ్లలో జస్టిస్ కృష్ణయ్యర్ నుండి డిసెంబర్ 1, 2024న అసువులు బాసిన చల్లా శంకర్ వరకు ఎందరో న్యాయ కోవిదులు ఉన్నారు. రాజ్యాంగ హక్కుల
శ్రీకాకుళం నుండి సిరిసిల్ల దాకా తెలుగునేలపై వెల్లువెత్తిన విప్లవోద్యమాల్లోని ప్రజాస్వామికాంశాలను గుర్తించి సమర్ధించిన వాళ్లలో జస్టిస్ కృష్ణయ్యర్ నుండి డిసెంబర్ 1, 2024న అసువులు బాసిన చల్లా శంకర్ వరకు ఎందరో న్యాయ కోవిదులు ఉన్నారు. రాజ్యాంగ హక్కుల అమలుపైన ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడుతూ పేరెన్నికగన్న ఎంతోమంది న్యాయవాదుల కన్నా, ఆ రాజ్యాంగ హక్కుల అమలు తీరును ప్రశ్నిస్తూ, అనునిత్యం రాజ్యం బెదిరింపులను తట్టుకుంటూ విచారణ కోర్టుల్లో పనిచేయడం కత్తి పైన సాము లాంటిదే. ఈ కృషిలో ఉద్యమ ప్రత్యక్ష కేంద్రమైన ఖమ్మం పట్టణంలో ఉంటూ ఒక పాత లూనాపై తిరుగుతూ ప్రజలపైన మోపిన అక్రమ కేసులను న్యాయపరంగా సవాల్ చేస్తూ, చివరకు తానే అక్రమ కేసులను ఎదుర్కొంటూ నిలబడాల్సి రావడం మామూలు విషయం కాదు. 1974లోనే తొలితరం పీడీఎస్‌యూ విద్యార్థిగా ప్రారంభమై, అత్యవసర పరిస్థితి నిర్బంధంలోనూ, తదనంతరం ప్రజాస్వామిక విప్లవ విజృంభణలోనూ, గోదావరిలోయ విప్లవోద్యమంతో పెనవేసుకుని జనశక్తి విప్లవ రాజకీయాల వకల్తాదారుగా, కోర్టుల్లో ప్రజాకార్యకర్తల న్యాయ సహాయకుడిగా పనిచేసిన కొద్దిమంది వ్యక్తుల్లో చల్లా శంకర్ ఒకరు. ప్రజా న్యాయవాదులుగా, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలుగా పేరుగాంచిన బొజ్జతారకం, బాలగోపాల్, పొల్సాని విఠల్‌రావు, కన్నాబిరన్, పత్తిపాటి వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌రెడ్డి లాంటి ఎందరో అమర న్యాయవాదులకు చల్లా శంకర్ ఏ మాత్రం తక్కువ కాదు.
చల్లా శంకర్ తండ్రి చల్లా వెంకటయ్య బట్టలు కుట్టి బతికే వృత్తి చేస్తూనే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు. తల్లి రాజమ్మ ఇల్లాలుగా ఐదుగురు పిల్లల్ని పెంచి, ఇంటికి వచ్చిన ఉద్యమకారులకు విసుగులేకుండా భోజనాలు పెట్టే ప్రేమాస్పదురాలు. 1969 ఏప్రిల్ 16న చండ్ర పుల్లారెడ్డి నాయకత్వాన సాగిన పగిడేరు ప్రతిఘటనతో ఖమ్మం జిల్లాలో పురుడుబోసుకున్న విప్లవోద్యమం శంకరన్నను పీడీఎస్‌యూ కార్యకర్తగా, హేతువాదిగా, ప్రజాన్యాయవాదిగా, హక్కుల కార్యకర్తగా తీర్చిదిద్దాయి. వారసత్వంగా వచ్చిన 70 గజాల ఇల్లును అటు న్యాయవాద వృత్తికి, ఇటు ప్రజాసంఘాల విప్లవ కార్యక్రమాలకు కేంద్రంగా మార్చినాడు. తను హక్కుల కార్యకర్తగా అడవి, ఊరు, పట్టణం అనే తేడా లేకుండా కలియతిరిగినాడు. న్యాయవాద విద్యనభ్యసించి తొలి అమరుడిగా ప్రసిద్ధిగాంచిన బత్తుల వెంకటేశ్వరరావును ఆదర్శంగా తీసుకున్నాడు. అమరుడు కొండన్న నుండి పగిడేరు లక్ష్మక్క దాకా ఎందరినో కలిశాడు. కొండపల్లి సీతారామయ్య, కూర రాజన్నల నుండి చిన్న రాజన్న దాకా ఎందరికో న్యాయ సేవలందించినాడు. ఈ కార్యకలాపాల్లో రూపుదిద్దుకున్న ఆయన వ్యక్తిత్వానికి కుటుంబం ద్వారా అందిన మానవతా పరిణామాలు అదనపు సొగసుగా ఉన్నాయి. కామ్రేడ్స్ రంగవల్లి, భరత్‌ల అమరత్వం తర్వాత పలు జాగ్రత్తలు తీసుకుని నేను ఒకసారి స్వయంగా ఆయన ఇంటికి పోవాల్సి వచ్చినా ఏ మాత్రం తొణికిసలాడ లేదు. ఈ ధైర్యం కూడా ఆయనను నిత్యం వెన్నంటి నడిపించి అతన్ని గోదావరిలోయ విప్లవోద్యమానికి దృఢమైన వకాల్తాదారుగా నిలబెట్టింది.
1978 అక్టోబర్ 20న సిరిసిల్ల, -జగిత్యాల తాలూకాలు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత, రైతాంగ ఉద్యమాలకు సంఫీుభావం కూడగట్టే క్రమంలోనే 1983 వరకు, అంటే ఐదేళ్ల కాలంలో డజనుల సార్లు అరెస్టు కావడం, అనేక కేసులు, వారాల తరబడి చిత్రహింసలెదుర్కోవడం సర్వసాధారణాంశంగా ఉండేది. ఈ క్రమంలో 1977లో కన్నాభిరాన్ నాయకత్వాన నిమ్మపల్లికి నిజనిర్ధారణ బృందం తీసుకెళ్లడం, 1978 తర్వాత బాలగోపాల్, కోదండరాంలను ఆర్థిక-సామాజిక పరిశీలన కోసం సిరిసిల్ల గ్రామాల్లో జరిపిన, పరిశోధనలకు సహకరించడం, గున్నాల్ మిర్డాల్ పర్యటన, 1982లో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ హత్యల నిర్ధారణలో జార్జి ఫెర్నాండెజ్ బృందం వెంట సాగడం లాంటివి నా అనుభవంలో ఉన్నాయి. గోదావరి లోయకు గుండెకాయ లాంటి ఖమ్మంలో అతని నిత్య కార్యాచరణ, అనుభవాలు ఏమిటో రికార్డు చేయవల్సి ఉండెను. అవి భవిష్యత్తు తరాలకు అందడం అవసరం. ఒక తరం అంతరిస్తున్న కాలంలో కామ్రేడ్ చల్లా శంకర్ స్మృతిలో ఒక పుస్తకం తీసుకురావాలని చొరవ చూపిన వారందరూ అభినందనీయులు. డిసెంబర్ 22న తలపెట్టిన ‘‘పేదోళ్ళ ప్లీడర్ శంకరన్న’’ స్మృతులు అజరామరం కావాలి, ఆయన సంస్మరణ సభ విజయవంతం కావాలి.
అమర్ (జనశక్తి)
(డిసెంబర్ 22న ఖమ్మం పట్టణంలోని వేదిక
ఫంక్షన్‌హాల్‌లో చల్లా శంకర్ సంస్మరణ సభ)