జనాభా విశేషాలు
ABN , Publish Date - May 10 , 2024 | 12:42 AM
బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే భాగ్యవతన్నారానాడూ, సౌభాగ్యవతన్నారానాడూ/ బిడ్డలు లేని గొడ్రాలికే గౌరవమన్నారీనాడు– యాభై ఏండ్ల కిందట ఎన్ టి రామారావు తన సొంత సినిమాలో ఈ పాటను అందించారు...
బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే భాగ్యవతన్నారానాడూ, సౌభాగ్యవతన్నారానాడూ/ బిడ్డలు లేని గొడ్రాలికే గౌరవమన్నారీనాడు– యాభై ఏండ్ల కిందట ఎన్ టి రామారావు తన సొంత సినిమాలో ఈ పాటను అందించారు. ఇక్కడ పలుకు కొసరాజుది అయినా, భావం ఎన్టీయార్‌దే. ఆయనకు కుటుంబ నియంత్రణ మీద భిన్నమయిన అభిప్రాయం ఉండేదని ఆయన పిల్లల సంఖ్యను బట్టే అర్థం చేసుకోవచ్చు. పరిమిత సంతానం అన్న భావన ఆనాటికి ఇంకా సార్వజనీనం కాలేదు. దాన్ని పిదపకాలపు పోకడగా భావించినవారూ ఉండేవారు. కుబేరులకు ఎందరు సంతానమున్నా భాగ్యమే అనుకోవచ్చును కానీ, కుచేలురకు అధిక సంతానం దౌర్భాగ్యమే అవుతుందని మన సమాజం క్రమంగా అర్థం చేసుకుంటూ వస్తోంది. ధనమున్నా లేకపోయినా మిత సంతానమే ఆధునిక కాలంలో, పిల్లల పోషణకు, వికాసానికి ఉత్తమమని అనుభవపూర్వకంగా తెలిసివస్తోంది. ఈ అవగాహన సర్వవ్యాప్తం కావడం ఇంకా పూర్తి కాలేదు.
ఫలానా మతం వారు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని, ఇక దేశమంతా వారి చేతిలోకి వెళ్లిపోతుందని అనవసరపు భయాలు కల్పిస్తున్న శక్తులు కొన్ని ఉన్నాయి. అంకెలను పైపైన మాత్రమే చూసి, వాస్తవాన్ని విస్మరించే దుర్గణం ఆ శక్తులకు ఉన్నది. అధికసంతానం ఏ మతవర్గానికి ఉన్నా, కులంలో ఉన్నా, అది ఆ సామాజిక శ్రేణిలో ఉన్న వెనుకబాటుతనాన్ని మాత్రమే సూచిస్తుంది. అంతేకాదు, ఆ సామాజిక వర్గంలో ఆడవారి స్థితిగతులను, ప్రతిపత్తిని కూడా అధిక జనాభారేటు సూచిస్తుంది. అంతమాత్రమే కాదు, ఈ వెనుకబాటు తనం, విద్యారాహిత్యం, అవగాహనారాహిత్యం, దారిద్ర్యం కులమతాలకు పరిమితమైనవే కావు, ప్రాంతాలను బట్టి కూడా ఆ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అదే మతంవారిలో, అదే కులంవారిలో ఇతర ప్రాంతాల్లో భిన్నమయిన ఎంపికలు కనిపిస్తాయి.
నిజమే, 1951 నుంచి 2011 దాకా అరవై ఏండ్ల కాలంలో, ముస్లిముల జనాభా 4 శాతం పెరిగింది. ఆ మేరకు హిందువుల జనాభా శాతం తగ్గింది. ఇంత మాత్రమే చెబితే, అవి గణాంక వివరాలే కావు. ఈ నాలుగు శాతం పెరుగుదల అరవయ్యేండ్ల కిందట కనిపించిన వేగం ప్రకారం జరిగిందా? ఆ వేగంలో హెచ్చుతగ్గులు ఉన్నాయా? మరో 30, 40 ఏండ్లకు, లేదా మరో అరవయ్యేళ్లకు ఆ పెరుగుదల ఎనిమిది శాతమో, అంతకంటె ఎక్కువో కానున్నదా? ఈ ప్రశ్నలు వేసుకోకపోతే, కేవలం 4 శాతం పెరుగుదల అన్న సమాచారం అర్థం కాదు. ముస్లిమ్ స్త్రీ జీవిత కాలంలో జన్మనిస్తున్న సంతానం 1992లో 4.4 (అంటే 100 మంది ముస్లిమ్ స్త్రీలు తమ గర్భధారణ యోగ్య వయస్సులో 440 మంది సంతానాన్ని కంటారు), అదే , 2015 వచ్చే సరికి ఆ రేటు 2.6కు (అంటే 100 మంది ముస్లిమ్ మహిళలు 260 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు) తగ్గిపోయింది. హిందూ స్త్రీల సంతాన శీలత 1992లో 3.3 కాగా, అది 2015లో 2.1కు తగ్గిపోయింది. ఇప్పటికీ ముస్లిమ్ స్త్రీల సంతానశీలత ఎక్కువే, కానీ, అది పతనోన్ముఖంగా ఉన్నది. హిందువులలో కంటె వేగంగా తగ్గిపోతూ వస్తున్నది. అంటే త్వరలో, హిందూ ముస్లిమ్ మతస్థుల మధ్య ఉన్న సంతానశీలత అంతరం సరిసమానం కావడం జరుగుతుంది. ఇది ఎట్లా జరిగింది? పరిమిత కుటుంబం ఆవశ్యకతను గుర్తించడం వల్ల. ఆ గుర్తింపు ఎట్లా వస్తుంది? విద్య వల్ల, అవగాహన వల్ల. ఎంతమంది పిల్లలను కనాలన్న నిర్ణయంలో వారి వారి మతం కానీ, కులం కానీ వేసే ప్రభావం అతి తక్కువ. సాంస్కృతికంగా, ఆర్థికంగా ఆ శ్రేణుల స్థితిగతులే ఆ నిర్ణయం వెనుక కారణాలుగా ఉంటాయి. సంతానం పరిమితం చేయాలన్న ఆలోచన వెనుక ఆయా సామాజిక శ్రేణుల స్త్రీలు, ముఖ్యంగా నిరుపేద స్త్రీలు తీసుకున్న చొరవ అధికం.
దేవుడు ఇస్తుంటే, మనం కాదనడం ఎందుకు-అనే ధోరణి అన్ని మతాలలోను ఉంటుంది. కుటుంబ నియంత్రణ కూడా దైవేచ్ఛే అని నమ్మకం కుదిరిన తరువాత, ఆడ, మగ వ్యత్యాసాలు నియంత్రణ తీరును ప్రభావితం చేశాయి. ఆడపిల్లయినా, మగపిల్లవాడయినా ఒకటే, మగపిల్లల కోసం పిల్లల్ని కంటూ పోనక్కరలేదు అన్న అవగాహన పెంపొందడానికి సమానత్వ భావాలు వ్యాపించవలసి వచ్చింది. ఇప్పటికీ దేశంలో అనేక ప్రాంతాలు తక్కిన ప్రాంతాల కంటె వెనుకబడి, అధిక జనాభాతో ఉన్నాయి. జననమరణాలు సరిసమానం అయ్యే రీతిలో జనాభా నియంత్రణ (2.1)ను కేరళ 1998లో, తమిళనాడు 2000లోనే సాధించాయి. 2005లోపు దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఆ మజిలీ చేరుకున్నాయి. ఈ స్థాయి చేరుకోవాలంటే బిహార్ 2039 దాకా నిరీక్షించాలి. బిహార్ తో పాటు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఇంకా జననమరణాల సరిసమాన రేటును అందుకోవలసి ఉన్నాయి. గత యాభై ఏండ్ల కాలంలో దక్షిణాది రాష్ట్రాల తలసరి ఆదాయం బాగా పెరిగింది. జనాభా బాగా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి ఇందుకు పూర్తి తలకిందులు. నిధుల కేటాయింపులో జనాభాకు పెద్దపీట వేస్తారు. అందుకే నిధుల విషయంలో 15వ ఆర్థికసంఘం ఎదుట దక్షిణాది రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేశాయి. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు తక్కువ నిధులివ్వడం ఏమి న్యాయం అని ప్రశ్నించాయి.
జనగణన అన్నది తలకాయల లెక్కింపు కాదు. దేశంలోని మానవవనరుల సర్వస్వం అది. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వాస్తవికతలకు ముడిసరుకు. అదే సమయంలో, వనరులకు, వసతులకు, జనసంఖ్యకు మధ్య ఆరోగ్యకరమైన నిష్పత్తిని నిర్వహించేందుకు పనికివచ్చే ప్రాతిపదిక. ప్రపంచపు లెక్కలతో పోల్చుకుంటే కొద్దిగా వెనుకబడిన మాట నిజమే కానీ, జనాభాను తగినంత స్థాయిలో తగ్గించే ప్రయాణంలో భారత్ చురుకుగానే కదులుతున్నది. జనాభా పెరుగుదలకు ప్రజలలోని కొందరిని పనిగట్టుకుని దోషులను చేసే ధోరణి పోవాలి. అణగారిన, వెనుకబడిన శ్రేణులలో, మారుమూల గ్రామసీమలలోనే ఇంకా కుటుంబ సంక్షేమ సందేశం చేరలేదు. అందుకు కారణాలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలి.