Share News

దౌత్య పరీక్ష

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:44 AM

‘ఆమెను తిరిగిపంపకూడదన్న రాజకీయ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది’ అంటూ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం సలహాదారు ఆదివారం మీడియా సమక్షంలో ఓ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఆశ్రయం...

దౌత్య పరీక్ష

‘ఆమెను తిరిగిపంపకూడదన్న రాజకీయ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది’ అంటూ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం సలహాదారు ఆదివారం మీడియా సమక్షంలో ఓ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా అప్పగింత విషయంలో అధికారికంగా భారత్‌ ప్రతిస్పందించకముందే పొరుగుదేశం పాలకులు ఇలా హడావుడి నిర్థారణలు చేయడం సరికాదు. హసీనాను తమకు అప్పగించాలని ఢాకా ఇటీవల దౌత్య ప్రక్రియ ద్వారా భారత ప్రభుత్వానికి సందేశం పంపింది. ఆ విషయాన్ని మన విదేశాంగ శాఖ ధ్రువీకరించింది తప్ప, దానిపై మరెలాంటి వ్యాఖ్య చేయలేదు. కానీ, అభ్యర్థించిన స్వల్పకాలంలోనే సమాధానాన్ని కూడా ఎదుటిపక్షం వారే ఇలా సిద్ధం చేసుకుంటున్నారు. హసీనా అప్పగింతకు భారత్‌ అంగీకరించకపోయే అవకాశాలే అధికంగా ఉన్నప్పటికీ, అభ్యర్థన ప్రక్రియ అన్నిదశలూ పూర్తయ్యేవరకూ ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు.


దేశం విడిచి వెళ్ళిపోయేందుకు హసీనాను మిలటరీ అనుమతించినప్పటికి ఆమె మీద కేసులేమీ లేవు. అప్పుడు అందరికీ కావాల్సింది ఆమె ఉన్న పళంగా నిష్క్రమించడమే. ఆ తరువాత తాత్కాలిక ప్రభుత్వం ఆమెమీద కేసులు పెట్టింది, న్యాయస్థానం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. నేరస్థుల అప్పగింతపై భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి పంపించాలని ఢాకా కోరుతున్నది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే లక్ష్యంతో చేసుకున్న ఒప్పందమది. అయితే రాజకీయ సంబంధిత అభియోగాలు ఎదుర్కొంటున్నవారికి ఈ ఒప్పందం వర్తించదని అందులోని నిబంధన 6 స్పష్టం చేసింది. ఈ నిబంధన అంతర్జాతీయ న్యాయసూత్రాలకు అనుగుణమైనది. ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన ఆ నిబంధనకు ప్రాతిపదిక. ‘రాజకీయ అభిప్రాయాలు, చర్యల కారణంగా శిక్షను తప్పించుకునేందుకై ఇతర దేశాలలో ఆశ్రయాన్ని కోరేందుకు, పొందేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని’ విశ్వ మానవ హక్కుల ప్రకటన పేర్కొంది. నేరస్థుల అప్పగింతపై ఐక్యరాజ్యసమితి నమూనా చట్టం ప్రకారం అప్పగించిన వ్యక్తిపై న్యాయవిచారణ నిష్పాక్షికంగా జరిగి తీరాలి. అందుకు ఆస్కారం లేదని భావించిన పక్షంలో అభ్యర్థనను తిరస్కరించే హక్కు సంబంధిత దేశానికి ఉంటుంది. బంగ్లాదేశ్‌ న్యాయవ్యవస్థ ఇటీవల తీసుకున్న వివిధ నిర్ణయాలు హసీనాపై నిష్పాక్షిక విచారణ జరగగలదనే భరోసానివ్వడం లేదు. గతంలో అసోంలో తీవ్ర హింసాకాండకు పాల్పడి, ఆ తరవాత బంగ్లాదేశ్‌ లో ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ వేర్పాటు వాద సంస్థ ఉల్ఫా నేత పరేష్‌ బారువాకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా కుదించడం జరిగింది. అలాగే హసీనాపై హత్యాయత్నం కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ కి చెందిన మాజీ మంత్రి లఫోజ్జమన్‌ బాబర్‌ ను ఇటీవలే పూర్తిగా విడిచిపెట్టారు. ఇక, మైనారిటీ హిందువుల పక్షాన రంగంలోకి దిగిన చిన్మోయ్‌ కృష్ణదాస్‌కు బెయిల్‌ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆయన తరపున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రావడం లేదన్నది సాకు. ఈ పరిస్థితులలో హసీనాను అప్పగించినా ఆమెపై విచారణ నిష్పాక్షికంగా జరిగేందుకు ఆస్కారం లేదన్నది స్పష్టం.


షేక్‌ హసీనాను ఎలాగైనా స్వదేశానికి రప్పించి ఆమెను ప్రాసిక్యూట్‌ చేసేందుకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదు. అయితే ఆమెను అప్పగించాలన్న ఢాకా అభ్యర్థన భారత్‌కు దౌత్య పరీక్షగా పరిణమించనున్నది. ఏ కారణం చేతనైనా హసీనాను అప్పగించాలన్న బంగ్లా ప్రభుత్వ డిమాండ్‌ను అంగీకరించిన పక్షంలో భారత్‌ విశ్వసనీయతను కోల్పోతుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే బంగ్లాలో ఇప్పటికే తీవ్రస్థాయిలో ఉన్న భారత్‌ వ్యతిరేకత మరింత ఉధృతమవుతుంది. హసీనాకు బాసటగా నిలుస్తూనే బంగ్లాదేశ్‌తో సుస్థిర సత్సంబంధాలను పునరుద్ధరించుకోవడం ఇప్పుడు భారత్‌ ముందున్న విషమ సమస్య. ఈ దౌత్య సంకటాన్ని అధిగమించడంలో ఎటువంటి పొరపాటు చేసినా దక్షిణాసియాలోనే కాకుండా విశాలప్రపంచంలో కూడా సంక్లిష్ట పర్యవసానాలను ఎదుర్కోవలసిన అగత్యం భారత్‌కు ఏర్పడుతుంది. భారత్‌లో ఉంటూ, బంగ్లాదేశ్‌ వ్యవహారాలమీదా, మహ్మద్‌ యూనుస్‌కు వ్యతిరేకంగానూ ఆమె వరుసగా చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామానికి ఒక కారణం. భారత్‌లో ఉండదల్చుకుంటే, ఆమె మౌనంగా, తన ప్రపంచంలో తానుండటం మంచిది. ఆమె నోరువిప్పనంతకాలం బంగ్లాపాలకులు కూడా ఆమె జోలికి రాకపోవచ్చు. ఆమెకు, రెండుదేశాలకు కూడా ఇది క్షేమకరమైన మార్గం.

Updated Date - Dec 31 , 2024 | 12:44 AM