ప్రజానాడి తెలిసిన పాలనాదక్షుడు
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:43 AM
తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణభూతుడు, పది సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రిగా అధికారంలో వున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, డాక్టర్ మర్రి
తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణభూతుడు, పది సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రిగా అధికారంలో వున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని ‘తెలంగాణ మహానాయకుడు’గా కొనియాడేవారు. 1969 ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చిన చెన్నారెడ్డి, మలిదశ ఉద్యమానికి మార్గం సుగమం చేసి, రాష్ట్ర సాధనకు కారకుడయ్యాడని కేసీఆర్ అనేవారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) అఖండ విజయం సాధించినప్పటికీ, సీపీఐ నేత ఎస్‌ఏ డాంగే సలహాతో ఇందిరాగాంధీ రాష్ట్ర ఏర్పాటుకు నిరాకరించారని కేసీఆర్ అనేవారు. కొన్ని రక్షణలను హామీగా పొందడంతో సరిపెట్టుకొని, చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తెలంగాణలోని ఆయన ప్రత్యర్థులు ఆంధ్ర కాంగ్రెస్ నేతలతో కుమ్ముక్కై ఆయనను విమర్శించేవారు.
చెన్నారెడ్డి, ‘తెలంగాణ అభిమాని, నిర్ద్వంద్వంగా తెలంగాణవాది.’ 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందుగానే, అమృతసర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశానికి, తెలంగాణ అంశంపై అభిప్రాయం వెల్లడించడానికి ఆయనను ఆహ్వానించారు. ఆ సమావేశంలో, దూరదృష్టితో, సాక్ష్యాధారాలతో ఆయన అభిప్రాయం తెలిపిన వెంటనే, వాటితో తాను ఏకీభవిస్తూనే, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు తాను అనుకూలమని జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టం చేశారు. అప్పుడు అక్కడే వున్న మౌలానా అజాద్, నెహ్రూతో, ‘మీ జమీర్ (మనస్సు) ఫిల్ఫిలా (నీరసంగా) అయిందని’ చమత్కరించారు.
పాత్రికేయ మిత్రుడు వెంకట్ పార్సా ద్వారా, డాక్టర్ చెన్నారెడ్డితో 1988లో పరిచయం, తరచూ కలిసే అవకాశం కలిగింది. మేమిద్దరం తరచు చెన్నారెడ్డి తార్నాకా నివాసానికి వెళ్లేవాళ్లం. ఆయన తన అనుభవాలను, అరుదైన రాజకీయ జ్ఞాపకాలను పంచుకునేవారు. అవి ఎంతో ప్రేరణాత్మకంగా, ఆసక్తికరంగా, ఉల్లాసంగా ఉండేవి. రాజకీయాలలో ఎదుగుతున్న, ఎదగాలనుకున్న యువ నాయకులు, వీటిని తెలుసుకోవడం ఎంతో అవసరం.
చెన్నారెడ్డి రెండవసారి (1989–90) ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన పీఆర్వోగా పనిచేసే అవకాశం నాకు కలిగింది. అప్పుడూ, అంతకుముందు ఆయన్ను ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమించబడటానికి ముందు, తరువాత, నేను ఆయనను దగ్గరగా పరిశీలించే వీలు కలిగింది. ఒక సీనియర్ నాయకుడిగా, సమస్యలను నిజాయితీగా, నిబద్ధతతో ఎదుర్కొని, ప్రజలతో మమేకమై వ్యవహరించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉన్నదన్న అభిప్రాయం నా మొదటి పరిచయంలోనే ఏర్పడింది. ఆయనతో అనుభవాలు జీవితంలో చెరగని అక్షరాలుగా, స్ఫూర్తిని అందించే పాఠాలుగా నిలిచాయి. డాక్టర్ చెన్నారెడ్డికి వున్న రాజకీయ పరిజ్ఞానం, నేతృత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణలో నైపుణ్యత, క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే తీరు ఇతరులలో అరుదుగా కనిపిస్తుంది.
1950లో ప్రొవిజనల్ పార్లమెంట్‌కు నామినేట్ కావడం, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ విప్‌గా నియమితులవడం కాక ముందు, చెన్నారెడ్డి మూడు సంవత్సరాలు వైద్యవృత్తిలో వున్నారు. 1952లో, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికై, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అప్పటి ఆయన ‘అధిక దిగుబడి’ నినాదం, భవిష్యత్తులో ‘హరిత విప్లవం’గా రూపుదిద్దుకుని, దేశం ఆహారధాన్యాల విషయంలో స్వయంసమృద్ధిని సాధించడానికి దోహదపడింది. 1967 సాధారణ ఎన్నికల తరువాత, ఇందిరాగాంధీ కేంద్ర కేబినెట్‌లో చేరమని సూచించినప్పటికీ, ముఖ్యమంత్రిగా కొనసాగడానికే మోగ్గుచూపిన బ్రహ్మానందరెడ్డి తనకు బదులుగా చెన్నారెడ్డి పేరును ప్రతిపాదించారు.
ముల్కీ ఉద్యమాన్ని నడిపేందుకు ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్)ను స్థాపించిన ఏ.మదన్‌మోహన్, తన అధ్యక్ష స్థానాన్ని చెన్నారెడ్డికి అప్పగించారు. ఇది చెన్నారెడ్డి నేతృత్వ సామర్థ్యాలను, నాయకత్వ పటిమను ప్రజలు తెలుసుకోవడానికి, తరువాత జరిగిన 1971 లోక్‌సభ, 1978 అసెంబ్లీ, 1980 లోక్‌సభ, 1989 లోక్‌సభ–అసెంబ్లీ ఎన్నికలలో ‘భారీ విజయాలు’ సాధించడానికి మార్గం సుగమం చేసింది. ఈ విజయాల వల్ల చెన్నారెడ్డి ‘అద్భుతమైన నాయకత్వ నైపుణ్యం’ ఉన్న వ్యక్తిగా నిరూపితమయ్యారు. 1989 మే 1న, చెన్నారెడ్డిని ఏపీసీసీ(ఐ) అధ్యక్షుడిగా నియమించారు.
ఒక నెల తర్వాత, జూన్ 3, 1989న, ‘జవహర్ రోజ్గార్–పంచాయత్ రాజ్: గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం’ అనే అంశంపై ‘నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్’ ఆధ్వర్యంలో, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో చెన్నారెడ్డి అధ్యక్షత నేను ఏర్పాటు చేసిన సమావేశంలో, సివి నరసింహన్ (ఐసీఎస్), మోహిత్ సేన్ (సీపీఐ నాయకుడు), మదన్‌మోహన్, ఉమా గజపతి రాజు తదితరులు ఘాటుగా ప్రసంగించారు. ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, జైలు భరో కార్యక్రమం ఆద్భుతంగా ఆయన నిర్వహించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ను ఉత్తేజపరిచాయి. 1989 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 294 సీట్లలో 181 సీట్లు గెలుచుకుంది.
కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఎన్నికల ముందు ఒక సందర్భంలో మాటవరసకు అన్న ప్రకారం, చెన్నారెడ్డి నన్ను తన నివాసానికి పిలిచి, పీఆర్వోగా నియమించారు.
మర్రి చెన్నారెడ్డి వంటి మహానేతలు రాజకీయాల్లోకి రావడం అనేది అరుదైన భాగ్యం. తెలంగాణ ఉద్యమానికి ఆయన దిశానిర్దేశం, నాయకత్వ నైపుణ్యం, ప్రజలతో సన్నిహితంగా మమేకం కావడం వంటి ప్రత్యేకతలు ఆయనను అసాధారణ నేతగా నిలిపాయి. రాజకీయ చతురతతోనూ, ప్రగతిశీల ఆలోచనలతోనూ, అత్యున్నత ప్రజాసేవా దృక్పథంతోనూ ఆయన తన సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర అపూర్వం, అపురూపం. దీనిని తర్కించలేము. వర్తమాన తెలంగాణ విజయగాథలో చెన్నారెడ్డి స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నది. ఆయన విలువలు, ఆలోచనల నుంచి మనం ఎన్నో, ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవాలి. మర్రి చెన్నారెడ్డి లేకుండా తెలంగాణ ఉండేది కాదు.
తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం, నాయకత్వ నైపుణ్యం, ప్రజలతో సన్నిహితంగా మమేకం కావడం వంటి ప్రత్యేకతలు డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని అసాధారణ నేతగా నిలిపాయి. రాజకీయ చతురతతోనూ, ప్రగతిశీల ఆలోచనలతోనూ, అత్యున్నత ప్రజాసేవా దృక్పథంతోనూ ఆయన తన సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర అపురూపం. వర్తమాన తెలంగాణ విజయగాథలో చెన్నారెడ్డి స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నది. మర్రి చెన్నారెడ్డి లేకుండా తెలంగాణ ఉండేది కాదు.
వనం జ్వాలా నరసింహారావు
(డిసెంబర్ 2: మర్రి చెన్నారెడ్డి వర్ధంతి)