శుష్క వాదోపవాదాలు!
ABN , Publish Date - Dec 17 , 2024 | 01:41 AM
రాజ్యాంగానికి డెబ్బయ్‌ఐదేళ్ళయిన సందర్భంలో లోక్‌సభలో జరిగిన చర్చ ఆశించినస్థాయిలో లేకపోయింది. ఎప్పటిలాగానే ఈ దేశపౌరులకు చట్టసభలో ఏదో రచ్చసాగుతోందని అనిపించింది తప్ప, తాము...
రాజ్యాంగానికి డెబ్బయ్‌ఐదేళ్ళయిన సందర్భంలో లోక్‌సభలో జరిగిన చర్చ ఆశించినస్థాయిలో లేకపోయింది. ఎప్పటిలాగానే ఈ దేశపౌరులకు చట్టసభలో ఏదో రచ్చసాగుతోందని అనిపించింది తప్ప, తాము ఎన్నుకున్న ప్రతినిధులు దేశభవిష్యత్తుకు అత్యవశ్యకమైన అంశం మీద మాట్లాడుతున్నారని వారికి అనిపించలేదు. అధికారపక్షం, విపక్షం ఏకమాటగా అత్యంతకీలకమైన ఈ ఘట్టాన్ని ఆరంభించినందున లోతైనచర్చతో, విలువైన వ్యాఖ్యలతో, చూడచక్కని దృశ్యాలతో ఇది సాగాలని మేధావులంతా కోరుకున్నారు. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా పయనం సాగుతున్నదీ లేనిదీ తేల్చుకోవాలన్నా, భవిష్యత్తులో అడుగులు ఎలా పడాలో నిర్ణయించుకోవాలన్నా ఉభయపక్షాల మధ్యా సయోధ్య, సుహృద్భావం ఉండాలి. ఇంతటి ఉన్నతమైన సందర్భంలో కూడా అవే ఊకదంపుడు వ్యాఖ్యలు, నాటు విమర్శలు, మోటుమాటలు వినవలసి రావడం దురదృష్టకరం. తాము ఉన్న స్థితికీ, అనుభవిస్తున్న హోదాలూ అధికారాలకూ ఆ మహాగ్రంథమే కారణమనీ, కనీసం ఈ సందర్భంలోనైనా దానిపట్ల గౌరవంతో ఆచితూచి మాట్లాడాలనీ, ఉన్నతంగా నడవాలనీ మన నాయకులకు అనిపించలేదు.
సమీక్ష, ఆత్మవిమర్శ అవసరమైన ఈ సందర్భంలో అది సంఘటితంగా జరిగినప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆశయాలు అద్భుతంగా ఉన్నా, ఆచరణలో లోపాలు ఉంటాయి కనుక, రాజ్యాంగం అమలులో ఎదురవుతున్న సవాళ్ళను, విస్మరణలను కోపతాపాలు లేకుండా చర్చించుకోవడం అవసరం. అధికార, ప్రతిపక్షాలు ఈ సందర్భాన్ని కూడా ఎదుటిపక్షాన్ని తప్పుబట్టడానికీ, అవమానించడానికి వాడుకోవడం ద్వారా పైచేయి సాధించాలని తెగ తాపత్రయపడ్డాయి. ఒక విధంగా, ఈ పరస్పర దూషణలో ప్రజలకు ఈ పార్టీలేవీ తమ పక్షాన లేవని మరోమారు అర్థమైంది. ఇందిర కాలంలో విధించిన అత్యయిక స్థితిని కాంగ్రెస్ మీద బ్రహ్మాస్త్రంలాగా అధికారపక్షం ప్రయోగించడం కొత్తేమీ కాదు. అది అధికారికంగా జరిగితే, ఇప్పుడు అనధికారికంగా అంతకంటే భయానకమైన అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో అమలవుతోందని విపక్షం ఆరోపించడమూ పదేళ్లుగా చూస్తున్నదే. ఎమర్జెన్సీని ప్రకటించి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని చీలికలు పీలికలు చేశారంటూ నరేంద్రమోదీ తన అద్భుతమైన వాగ్ధాటితో అప్పటి పరిస్థితులను అభివర్ణించారు. జైళ్ళు, మీడియా, ప్రజలు, స్వేచ్ఛ, ఉక్కుపాదాలు, అణచివేత వంటి మాటలు దట్టించిన ఈ దాడిలో అతి ఉండవచ్చునేమో కానీ, అసత్యమేమీలేదు. అయితే, దానిని ఆయన ఒక ప్రస్తావనగా కాక ఓ ఘాటైన రాజకీయవిమర్శగానే చేశారు. సుదీర్ఘకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్ హయాంలో అనేక రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలు, వ్యవస్థలు ఏర్పడి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకున్న విషయాన్ని కూడా ఆయన ఓ మాటగా ప్రస్తావించివుంటే బాగుండేది. వేరుపడిన పాకిస్థాన్ ప్రబల నిదర్శనంగా పొరుగునే ఉన్నది కనుక, మనం కోల్పోని రాజ్యాంగ ఆశయాలను, కాపాడుకున్న విలువలనూ కొన్నింటిని స్మరించి, వాటి పునాదిగా ఎదిగిన క్రమాన్ని ఈ సందర్భంలో ప్రస్తావించి ఉంటే సరిపోయేది. తన హయాంలోనే దేశం ఎదిగిందనీ, వెలుగులు చూసిందనీ, దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో అంతా చీకటేనని ఆరోపిస్తున్నందున ఈ సందర్భంలో కూడా ఆయన నోట ఓ మంచిమాట రాకపోయింది. అప్పటి తప్పిదాన్ని ఒప్పుకోవడానికీ, అత్యయిక స్థితిని ఓ మాటగా ఖండించడానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంతకుమించిన తరుణం లేదు. కానీ, ఎప్పటిలాగానే, సంస్థలు, వ్యవస్థల విచ్ఛిన్నంమీద అది ఆరోపణలు ఎక్కుపెట్టింది. రాజ్యాంగం మీద చేయాల్సిన చర్చను నెహ్రూ కుటుంబం చుట్టూ తిప్పడానికి అధికారపక్షానికి ఎందుకంత ఉత్సాహమో అర్థంకాదు. ఉభయపక్షాలు ప్రస్తావించిన విషయాలేమీ ఇప్పుడు కొత్తగా విన్నవేమీ కాదు కనుకనే, చాలామందికి ఇది రాజ్యాంగంపై చర్చలాగా కాక, అవిశ్వాస తీర్మానం రచ్చలాగా అనిపించింది.
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, న్యాయవ్యవస్థ సహా పలు స్వతంత్ర వ్యవస్థల మనుగడ, పౌరహక్కులు, అణచివేతలు, అక్రమ నిర్బంధాలు ఇత్యాది అంశాలపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించి, ఈ దేశ ప్రజలకు ఓ మాట ఇచ్చేందుకు మన నాయకులెవ్వరూ సిద్ధంగా లేరన్న విషయం మరోమారు స్పష్టమైంది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా, ఆ వెలుగుబాటలో నడవాలన్న సదాశయం ఉన్నా ఈ చర్చ మరింత ఉన్నతంగా జరిగేది. రాజ్యాంగ ఆశయాలకు పూర్తిభిన్నంగా వ్యవహరిస్తూ, సకల అరిష్టాలకు మీరే కారకులని పరస్పరం విమర్శించుకుంటూ, త్వంశుంఠ నాటకాన్ని ఎంతకాలమైనా కొనసాగించగల తెలివితేటలు మన నాయకులకు కావల్సినన్ని ఉన్నాయి.