Share News

ఎండలు–ఎన్నికలు

ABN , Publish Date - Apr 09 , 2024 | 01:47 AM

ఎండలు మండిపోతాయి జాగ్రత్త అంటూ భారతవాతావరణశాఖ గట్టిగా హెచ్చరించడం ఇటీవలి సంవత్సరాల్లో మరీ ఎక్కువైంది. పదేళ్ళుగా దేశంలో ఎండల తీవ్రత పెరిగిందట. ఐఎండీ హెచ్చరికలకంటే ముందుగానే సూర్యుడు...

ఎండలు–ఎన్నికలు

ఎండలు మండిపోతాయి జాగ్రత్త అంటూ భారతవాతావరణశాఖ గట్టిగా హెచ్చరించడం ఇటీవలి సంవత్సరాల్లో మరీ ఎక్కువైంది. పదేళ్ళుగా దేశంలో ఎండల తీవ్రత పెరిగిందట. ఐఎండీ హెచ్చరికలకంటే ముందుగానే సూర్యుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించడం మొదలెట్టేస్తున్నాడు. ఫిబ్రవరి చివర్లోనే వేడి తగలడం మొదలైపోతోంది. ఈ ఏడాది ఇప్పటికే నమోదవుతున్న ఉష్ణోగ్రతలను బట్టి రాబోయే రోజులు ఎలా ఉంటాయన్న భయం కలుగుతోంది. నీటి కొరతసహా వేసవి అనుభవం అప్పుడే పలు రీతుల్లో కనిపిస్తోంది.

గత ఏడాదికంటే ఈ వేసవి మరింత తీవ్రంగా ఉంటుందని, మరిన్ని వడగాడ్పులు పడాల్సివస్తుందని ఐఎండీ అంటోంది. భూగర్భజలాలు వేగంగా అడుగంటుతున్నాయి, జలాశయాలు ఎండిపోతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల మీదే కాక, వర్షపాతాన్ని ప్రమాదకరమైన స్థాయిలోకి తగ్గించే శక్తి ఎల్‌నినోకు ఉన్నది. గత ఏడాది రుతుపవనాల ప్రవేశంలో జాప్యం, ఓ మూడునెలలు వర్షాలు మెరుగ్గానే పడినా ఆ తరువాత వాటిజాడలేకుండా పోవడంతో నీటిసమస్యకు అప్పట్లోనే బీజాలుపడ్డాయి. రాబోయే కాలంలో వడగాడ్పులు సంఖ్యరీత్యా, విస్తృతి రీత్యా రెట్టింపవుతాయని ఐఎండీ అంటోంది. చెప్పినట్టుగానే తెలుగురాష్ట్రాలతో సహా దేశంలోని చాలా రాష్ట్రాలు గరిష్ఠ ఉష్ణోగ్రతలతో గడగడలాడిపోతున్నాయి. ఎండలు, వడగాడ్పులకు తోడుగా నీరు కూడా కరువైతే ప్రజలు అల్లాడిపోతారు, పశుపక్ష్యాదులు ప్రాణంవదిలేస్తాయి. ముంచుకొస్తున్న గడ్డుకాలాన్ని దాటడానికి ప్రభుత్వాలు ప్రతీ అడుగూ అతిజాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. నీటి వనరులను సమర్థంగా నిర్వహించడంతోపాటు, ఉద్యోగ, ఉపాధి రీత్యా ఎండల్లో విధిగా పనిచేయాల్సి వచ్చే ఆయా రంగాల ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. కార్మికుల శ్రేయస్సును ఖాతరుచేయని సంస్థలు, పరిశ్రమలు మనదగ్గర చాలా ఉన్నాయి. అందువల్ల, తగినంత మంచి నీరు, నీడపట్టున ఎక్కువ సమయం విశ్రాంతి, తక్షణచికిత్స, ఆస్పత్రులకు తరలింపు తదితర విషయాల్లో అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించమంటూ ప్రభుత్వం నుంచి విస్పష్టమైన ఆదేశాలు జారీకావాలి. నిర్మాణరంగంలో పనిచేసేవారిపైనా, ఉపాధిహామీ కూలీలపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో తీవ్ర అనారోగ్యాలకు గురికావడం జరుగుతుంది కనుక మందులకు, వైద్యసహాయానికి లోటులేకుండా చూసుకోవాలి.

వడగాడ్పులను ప్రకృతివైపరీత్యాలుగా పరిగణించకపోవడం, వడదెబ్బ మరణాలకు నష్టపరిహారాలు అందకపోవడం సరికాదు. ఈ అమానవీయమైన ధోరణిని మనం సరిదిద్దుకోవాల్సి ఉంది. ఈ ఏడాది తీవ్ర ఎండలకు సార్వత్రక ఎన్నికలు కూడా తోడవుతున్నాయి. ఎన్నికల ప్రచారం యావత్తూ భయంకరమైన వేడిమిలో సాగాల్సి వస్తున్నది. వేడితో పాటే ప్రచార ఉధృతీ పెరుగుతుంది. లక్షలాదిమంది సామాన్యులు సభలూ సమావేశాల్లో పాల్గొంటారు, అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఎండలు భగభగలాడుతూ, వడగాడ్పులు వీచేకాలంలో వరుసబెట్టి జరిగే ఈ రాజకీయ సదస్సులు, ర్యాలీలు అనేకమంది ఆరోగ్యాన్ని దెబ్బతీసి, వారి ప్రాణాలను ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో గత ఏడాది సరిగ్గా ఇదే కాలంలో జరిగిన ఓ రాజకీయ సదస్సు పదమూడుమంది ప్రాణాలు తీసింది, వందలాదిమందిని ఆస్పత్రిపాల్జేసింది. నావీముంబైలో ఒక సామాజిక కార్యకర్తకు ఏదో పురస్కారాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ సభను మండుటెండలో నిర్వహించడమే కాక, వచ్చినవారంతా ఎండకు ఎదురొడ్డి నిలిచిన ధీరులు, శూరులని మరీ నాయకులు పొగిడారు. అమిత్‌ షా సహా కొందరు కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్య, ఉపముఖ్యమంత్రులు నీడపట్టున, చల్లగాలిలో గద్దెమీద ఉంటే, పదిలక్షలమంది ప్రజలు మండుటెండలో మాడిపోయారు. అందుబాటులో ఉన్న మంచినీరంతా ఎండవేడికి మరిగిపోయింది. జనం అల్లాడిపోతూ, కుప్పకూలిపోతున్న స్థితిలో చల్లని నీళ్ళకోసం పోలీసులు అటూఇటూ పరుగులుతీయాల్సి వచ్చింది. ఏర్పాట్లు ఎంత నాసిగా ఉన్నాయంటే, సొమ్మసిల్లినవారిని ఆస్పత్రులకు తరలించడానికి పోలీసులు మోటార్‌సైకిళ్ళను వినియోగించాల్సి వచ్చింది. ఇది పాలకులు చేజేతులా సృష్టించిన విపత్తు. పేదల ప్రాణాలమీద పాలకులకు ఎంతశ్రద్ధ ఉంటుందో ఈ ఘటన తెలియచెబుతోంది. సార్వత్రక ఎన్నికలు, మండుటెండలు ఒకదానితో ఒకటి పెనవేసుకున్న ఈ కాలాన్ని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా దాటించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలమీదా ఉంది.

Updated Date - Apr 09 , 2024 | 01:47 AM