ఎరుపు, ఒడుపు, ఏచూరి
ABN , Publish Date - Sep 13 , 2024 | 05:08 AM
తాను చేయగలిగినది చాలా ఎక్కువ ఉన్న చారిత్రక సందర్భంలో సీతారాం ఏచూరి నిష్క్రమించారు. రానున్న రోజులలో ఆయన లోటు పదే పదే తెలిసివస్తుంది. ‘‘ఈ దేశం గురించి బాగా అవగాహన...
తాను చేయగలిగినది చాలా ఎక్కువ ఉన్న చారిత్రక సందర్భంలో సీతారాం ఏచూరి నిష్క్రమించారు. రానున్న రోజులలో ఆయన లోటు పదే పదే తెలిసివస్తుంది. ‘‘ఈ దేశం గురించి బాగా అవగాహన ఉన్నవాడు, ఇండియా భావనకు రక్షకుడు’’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ అర్పించిన నివాళిలో సీతారాం వ్యక్తిత్వంలోని వర్తమాన ప్రాసంగికతే ప్రతిబింబిస్తుంది. పదేళ్ల మితవాద, మతవాద ఉధృతిలో క్షీణతను, శిథిలతను ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో, ఆమోదనీయత, వ్యవహారదక్షత కలిగిన సీతారాం వంటి నాయకుడు లేకపోవడం కమ్యూనిస్టు పార్టీలకు గట్టి దెబ్బ. మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో మార్క్సిస్టు పార్టీ నాలుగే స్థానాలు గెలుచుకోగలిగినా, ఏచూరి పలుకుబడి అంతకు అనేక రెట్లు మించినది. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమయినది. పాక్షికంగా అయినా, వామపక్షాలు కాంగ్రెస్‌తో ముందస్తు పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం 2024లోనే మొదలు, అందులో ఏచూరి తిప్పిన చక్రం పెద్దది.
సీపీఎం ఆంతరంగిక రాజకీయాల చర్చకు ఇది సందర్భం కాదు కానీ, ప్రకాశ్ కారత్ సైద్ధాంతికతలో ఖచ్చితంగా ఉంటారని, సీతారాం ఏచూరి పట్టువిడుపులతో వ్యవహరిస్తారని పేరు. కానీ, విధానపరమైన పట్టింపులు ఆయనకూ ఉండేవి. జ్యోతిబసును ప్రధాని కాకుండా అడ్డుకోవడం వంటి సందర్భాలలో కారత్ దీ, ఏచూరిదీ ఒకే పట్టు. 1996 నుంచి కాంగ్రెస్‌తో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో సీపీఎం అగ్రనేతలు ముఖ్యపాత్ర వహించారు కానీ, నేరుగా పొత్తులు ఉండేవి కావు. కాంగ్రెస్‌తో కలసి పనిచేసే విషయంలో కారత్ గట్టి వ్యతిరేకత చూపేవారు, 2019 సాధారణ ఎన్నికలకు ముందు పొత్తు అవకాశాలను అడ్డుకున్నారు కూడా. అమెరికాతో అణు ఒప్పందం సందర్భంగా వామపక్షాలు మన్మోహన్ ప్రభుత్వం నుంచి వైదొలగిన సందర్భంలో, ఏచూరి వైఖరి వేరుగా ఉన్నదని, కేరళ యూనిట్ అండతో కారత్ ఆ నిర్ణయానికి కారకుడని భావించేవారు. ఏచూరి తీరులోని సౌమ్యత, సడలింపు ధోరణి ఆయనకు అన్ని పార్టీలలో మిత్రులను సంపాదించి పెట్టింది. ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీకి ఆయన స్నేహం పెరిగింది. వారిద్దరూ అనేక విషయాల మీద సుదీర్ఘంగా చర్చించుకునేవారు.
సీపీఎంలో పుట్టి పెరిగి ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయినవారు ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన తరువాత, పధ్నాలుగేళ్ల పాటు పుచ్చలపల్లి సుందరయ్య మార్క్సిస్టు పార్టీకి ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. ఆ పదవిలోకి వచ్చిన రెండో తెలుగు వ్యక్తి సీతారాం. 1977లో జెఎన్‌యు విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎస్ఎఫ్ఐ తరఫున ఎన్నికైన ఏచూరి, ఓడిపోయి కూడా యూనివర్సిటీ చాన్సలర్ పదవికి రాజీనామా చేయని ఇందిరాగాంధీని నిలదీయడంతో జాతీయస్థాయి ప్రసిద్ధి పొందారు. సోషలిస్టు శిబిరం విచ్ఛిన్నమై, నూతనార్థిక విధానాలు, మతతత్వ రాజకీయాల జమిలి ప్రవేశం జరిగిన 1990 దశకారంభంలో ఆయన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలలో సైద్ధాంతిక పోరాటం వెనుకపట్టుపట్టి, మనుగడ కోసం తడుముకోవలసిన దశలో నాయకత్వంలోకి వచ్చిన యువకుడు ఏచూరి. మారుతున్న ప్రపంచంతో మెలగడానికి కొత్త పద్ధతులు వెదుక్కుని తన స్థానాన్ని స్థిరపరుచుకున్న రాజకీయవాది ఆయన. 2005 నుంచి పన్నెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో చేసిన ప్రసంగాలు సీతారాం అధ్యయనానికి, అవగాహనకు అద్దం పట్టేవి.
నూతన ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శించి, తామే పేదల ప్రయోజనాలను కాపాడగలిగేది అని చెప్పగలిగిన కమ్యూనిస్టులు, మతవాదుల ముందు మాత్రం క్రమంగా బలహీనపడుతూ వచ్చారు. మతతత్వ రాజకీయాలు కమ్యూనిస్టు పార్టీలను పునాదుల నుంచి పెకిలించే ప్రయత్నం చేస్తూ వచ్చాయి. కార్మికులు, కష్టజీవులు, రైతులు, రైతుకూలీలు అంటూ మాట్లాడిన కమ్యూనిస్టులకు, హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వంటి శ్రేణీకరణతో వ్యవహరించడం కష్టమైంది. ఆకర్షణ తగ్గి, అంకితభావం కలిగిన కార్యకర్తలు లేక, భావోద్వేగాలతో కలగలసిన మతవాదాన్ని ఎదుర్కొనలేక బలహీనపడుతున్న వామపక్షాలకు, పాలకపక్షాలలోనే మెరుగైనవారిని ఎన్నుకుని అండాదండా పొందవలసిన అగత్యం ఏర్పడింది. కమ్యూనిస్టుల మద్దతు పొందేవారికి కాసింత గౌరవం, మద్దతు ఇచ్చేవారికి నాలుగు సీట్లు, పరస్పర ఆవశ్యకతలుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో సమాజాన్ని తీవ్ర విభజనల పాలుచేసి, మతభావాల మాటున విపరీతమైన అధికారాన్ని సాధించి, నియంతృత్వాన్ని, వీలయితే ఫాసిజాన్ని స్థాపించాలనుకునే శక్తులను ఎదుర్కొనడానికి, ఈ దేశచరిత్ర గురించిన అవగాహన, భవిష్యత్ కార్యక్రమం గురించి ఆచరణాత్మకత కలగలసిన, సంకీర్ణ ప్రత్యామ్నాయాలు నిర్మించగలిగిన సీతారాం ఏచూరి వంటి నాయకులు ఎంతో అవసరం.