ఈవీఎం శంకలు
ABN , Publish Date - Dec 11 , 2024 | 12:47 AM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మహావికాస్ అగాఢీ నేతలంతా ఈవీఎంలను తప్పుబడుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఈవీఎంలలో...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మహావికాస్ అగాఢీ నేతలంతా ఈవీఎంలను తప్పుబడుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఈవీఎంలలో పోలైన ఓట్లకూ, వీవీప్యాట్ స్లిప్పులకూ మధ్య వీసమెత్తు వ్యత్యాసం కనబడలేదని, దేశస్థాయిలో ఏ విధానమైతే అమలు జరుగుతున్నదో, మహారాష్ట్రలోనూ అదేరీతిలో ఎన్నికలు జరిగాయని ఈసీ వివరణ ఇచ్చింది. 288మంది సభ్యులున్న అసెంబ్లీలో 235సీట్లను మహాయుతి ఎగరేసుకుపోయి, అగాఢీ కూటమికి 46మాత్రమే దక్కినందువల్ల, ఈ ఘోరపరాజయం ప్రజల నిరాదరణవల్ల కాక, ఓట్లమిషన్‌లో సాంకేతిక మతలబు వల్ల జరిగిందని గట్టిగా నమ్ముతున్న అగాఢీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈసీ వివరణతో సంతృప్తిచెందని వీరంతా ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోవాలని నిర్ణయించుకున్నారు. సుప్రీంకోర్టు ఇటీవలే వ్యాఖ్యానించినట్టుగా ఓడినవారికి ఈవీఎం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఓ ఆత్మరక్షణ కవచం.
ఓటింగ్ మెషీన్లనూ, వాటిద్వారా జరిగిన ఎన్నికలను తిరస్కరిస్తూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష ఎమ్మెల్యేలు ఒకటి రెండురోజుల పాటు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండిపోయారు కూడా. బ్యాలెట్‌పేపర్లతో తిరిగి ఎన్నికలు జరగాలంటూ మర్కద్‌వాడి గ్రామ ప్రజలు డిమాండ్ చేయడం, ఈవీఎం వ్యతిరేక విపక్ష ఉద్యమానికి అది కేంద్రం కావడం తెలిసిందే. ఈ గ్రామం ఉన్న అసెంబ్లీస్థానం శరద్‌పవార్ వర్గానికే దక్కినప్పటికీ, గెలిచిన అభ్యర్థికి కంచుకోటలాంటి ఈ గ్రామంలో మాత్రం అతడికి ప్రత్యర్థికంటే అతితక్కువ ఓట్లు పడ్డాయట. గ్రామస్తులంతా ప్రమాణంచేయడంతో, పవార్ వర్గం ఓ పాతికలక్షలు ఖర్చుపెట్టి మళ్లీ అక్కడ బ్యాలెట్ ఓటింగ్ జరపడం, అధికారులు అడ్డుకోవడం, పోలీసుల దాడి, కర్ఫ్యూ ఇత్యాది పరిణామాలతో ఈ గ్రామానికి బాగా పేరొచ్చింది. శరద్‌పవార్ అక్కడకు వెళ్ళి మర్కద్‌వాడీని చూసి రాష్ట్రమంతా, ఇంకా చెప్పాలంటే దేశమంతా నేర్చుకోవాలనీ, ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమించాలనీ ఉపన్యసించి వచ్చారు. ఆ చిన్నగ్రామం దేశస్థాయిలో ఈవీఎం వ్యతిరేక ఉద్యమాన్ని రగల్చాలన్నది పెద్దాయన ఆశ.
ఒకపక్క ఓట్లమెషీన్ ఎన్నికలను నమ్మబోమని అంటూనే, మరోపక్క తమకు విపక్షస్థానం ఇవ్వాలంటూ అగాఢీ నేతలంతా అధికారపక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు. విపక్షంగా గుర్తించాలంటే మీలో ఏ ఒక్కపార్టీకీ కనీసంగా ఉండాల్సిన పదిశాతం స్థానాలు రాలేదు కదా అని అధికారపక్షం అంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు అసలు ఓనర్లనూ, వారసులనూ పక్కకు నెట్టేసి, పార్టీలను చీల్చిన వారిని ఘనంగా ఆదరించిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే సరేసరి, ఒకప్పుడు మహారాష్ట్రలో చక్రం తిప్పిన శరద్‌పవార్, కాంగ్రెస్‌లకు సైతం ప్రజలు ఈ ఎన్నికల్లో విపక్షహోదాకు సరిపడా 29స్థానాలు కూడా ఇవ్వలేదు. అత్యంత బల ప్రజాస్వామ్యం నిలవాలంటే విపక్షం ఉండాల్సిందే, సభలో మంచీచెడూ చర్చ జరగాల్సిందే అని ఓపక్కన అంటూనే అధికారపక్షం గేమ్ ఆడుతోంది. అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ మరో రాకడ ఇటువంటి అనేకానేక అంశాల్లో బీజేపీ చక్కని ఎత్తులు వేయడానికి ఉపకరిస్తుంది. ఆ హోదా ఇచ్చేదీ లేనిదీ, ఇస్తే ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఆ కిరీటం దక్కాలన్నది నర్వేకర్ తొలిగా తేల్చబోయే సమస్య. ఆయన ఘనమైన గతం తెలిసిందే కనుక, భవిష్యత్తులో వచ్చిపడే చిక్కు సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కరించగలడని బీజేపీ నమ్మకం. రెండేళ్ళక్రితం తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతూనే స్పీకర్‌స్థానంలో కూచున్న ఆయన అత్యంత సంక్షుభిత ఘట్టాల్లో బీజేపీని ఒడ్డునపడేశారు. అసలు శివసేన, అసలు ఎన్సీపీ ఎవరో సునాయాసంగా తేల్చేశారు. రెండుపార్టీలనుంచి పెద్ద ఎత్తున సాగిన బహిష్కరణలు, అనర్హతల లెక్కలను బీజేపీ సున్నితపు త్రాసులో తూచి, ఎవరూ అనర్హులు కారంటూ తేల్చి శిందే, అజిత్‌పవార్ కష్టానికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చేశారు.
ఫడ్నవీస్ చల్లగా నాలుగుకాలాలపాటు రాజ్యం చేసుకోవడానికి నర్వేకర్ వంటి విశ్వాసపాత్రుడు అవసరం. స్పీకర్ పోస్టు ఇవ్వమని ఏక్‌నాథ్ శిందే, అజిత్‌పవార్ అడిగినా బీజేపీ ఒప్పుకోలేదని, మరో నాలుగురోజుల్లో జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరికి దక్కే శాఖలను బట్టి పైచేయి ఎవరన్నది పూర్తిగా తేలిపోతుందనీ అంటున్నారు. హోం కావాలన్న శిందే ఇప్పటికే చల్లారినప్పటికీ, ఆర్థికం కోసం అజిత్‌పవార్ పట్టుబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర బీజేపీలో ఫడ్నవీస్‌కు ఎదురులేదు. కానీ, కష్టపడి చీల్చితెచ్చుకున్న బలం భవిష్యత్తులో తనకు గానీ, పార్టీకి గానీ ప్రమాదం తెచ్చిపెట్టకుండా అతిజాగ్రత్తగా అడుగులువేయాల్సిన బాధ్యత ఆయనమీద ఉంది.