విస్తరిస్తున్న యుద్ధం!
ABN , Publish Date - Oct 08 , 2024 | 01:55 AM
ఇజ్రాయెల్ మీద హమాస్ అమానుషకృత్యానికి అక్టోబర్ 7న ఏడాది పూర్తయిన సందర్భంలో, అటు ఇజ్రాయెల్, ఇటు హమాస్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. పన్నెండువందలమంది ఇజ్రాయెలీలను హమాస్ ఊచకోతకోసిన...
ఇజ్రాయెల్ మీద హమాస్ అమానుషకృత్యానికి అక్టోబర్ 7న ఏడాది పూర్తయిన సందర్భంలో, అటు ఇజ్రాయెల్, ఇటు హమాస్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. పన్నెండువందలమంది ఇజ్రాయెలీలను హమాస్ ఊచకోతకోసిన దారుణాన్ని సంస్మరించుకుంటూ, వారికి నివాళులర్పిస్తూ ఇజ్రాయెల్ అంతటా కార్యక్రమాలు జరిగాయి. హమాస్ ఘాతుకానికి ప్రతీకారంగా మరో ఇరవైరోజుల్లో ఇజ్రాయెల్ ఆరంభించిన గాజా యుద్ధంలో అధికారికంగానే యాభైవేలమంది మరణించి, లక్షలాదిమంది నిరాశ్రయులైన అంశాన్ని ప్రపంచం అంతగా స్మరించుకున్నట్టు లేదు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఏకగొంతుతో హమాస్ దుర్మార్గాన్ని చీల్చిచెండాడుతూ, ఇజ్రాయెలీ మృతులకు ఘననివాళులు అర్పిస్తూ, గాజా బాధితులను ఓ మాటగా తలుచుకున్నందుకు సంతోషించాలి. అదేచేత్తో ఇజ్రాయెల్‌కు ఎటువంటి ఆంక్షలూ నియమాలూ నిబంధనలూ లేని ఆర్థిక, ఆయుధ మద్దతును కూడా నెతన్యాహూకు బైడెన్ పునరుద్ఘాటించారు.
గాజా యుద్ధానికి ఏడాది దగ్గరపడుతున్న తరుణంలో, నెతన్యాహూ ఎంతో తెలివిగా యుద్ధక్షేత్రాన్ని మరింత విస్తరించాడు. గాజాను నేలమట్టం చేసి, సామాన్యులను ఆకలితోనూ, అనారోగ్యంతోనూ చంపివేసినా కూడా ఆయన మనసు శాంతించలేదు. మరోపక్క, ఇజ్రాయెల్ పైకి చెబుతున్నంతగా హమాస్ దెబ్బతినలేదన్నది ఆయనకూ, అమెరికాకు తెలుసు. హమాస్ వద్ద బందీలుగా మిగిలిపోయిన తమవారిని విడిపించలేదన్న కోపం ఆ కుటుంబీకులకూ, మిగతా ఇజ్రాయెలీలకు ఎంతో ఉంది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు మిన్నంటిన దృశ్యాలు అనేకం చూశాం. ఈ నేపథ్యంలో, కాలు వెనక్కుతీసుకోవడం కంటే యుద్ధాన్ని విస్తరించడం రాజకీయంగా తనకు క్షేమమని నెతన్యాహూ భావించినట్టు ఉంది. హిజ్బొల్లావైపు ఇజ్రాయెల్ అడుగులు పడగానే ఆయన ఇరాన్‌మీదకు గురిపెడుతున్నాడని అందరికీ అర్థమైంది. తన అద్భుతమైన సాంకేతిక సామర్థ్యంతో పేజర్లు, వాకీటాకీల పేల్చివేతవంటి అనైతిక విధానాల్లో హిజ్బొల్లా బలాన్నీ బలగాన్నీ తీవ్రంగా దెబ్బతీసిన తరువాత, ఆ సంస్థ అధినాయకుడు హసన్ నస్రల్లాను అంతం చేయడంలో ఇజ్రాయెల్ విజయం సాధించింది. వైమానికదాడులతో లెబనాన్‌ను నాశనం చేయడమే కాక, లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ యుద్ధట్యాంకర్లు చొరబడుతున్న తరుణంలో, పాతకక్షలన్నీ కట్టకట్టి ఆర్నెల్ల తరువాత మరోమారు ఇరాన్ ఇజ్రాయెల్ మీదకు క్షిపణులను ప్రయోగించింది. హమాస్, హిజ్బొల్లాల తరువాత, ఇరాన్ పాలకుల పనిపట్టడమే తన లక్ష్యమని నెతన్యాహూ అంతర్జాతీయ వేదికల మీద వీరంగం వేస్తుంటే ఇరాన్ సహనంగా ఉండటం అసాధ్యం.
ఇదే ఇజ్రాయెల్ ఆఖరుయుద్ధం, శత్రుశేషం మిగలనివ్వను అంటూ నెతన్యాహూ సరిహద్దులన్నీ అతిక్రమిస్తుంటే, అమెరికా ఆయుధసాయంతో వంతపాడుతోంది, ఇరాన్ మీద ప్రతీకారానికి సైతం ఎగదోస్తోంది. చమురు క్షేత్రాలు తగలబెట్టుకోకానీ, అణుస్థావరాల జోలికిపోవద్దు అని హితవుచెబుతోందట. ఇరాన్ అణుస్థావరాలను నాశనం చేయగల సమర్థత ఇజ్రాయెల్‌కు ఉన్నదా లేదా అన్నది అటుంచితే, వాటిజోలికిపోతే ఏమవుతుందన్న విషయం అమెరికాకు తెలుసు. ఇజ్రాయెల్ సైనికస్థావరాలమీదా, మొసాద్ కార్యాలయంమీదా క్షిపణులు ప్రయోగించిన తరువాత ఇక చాలు అన్న అర్థంలో ఇరాన్ ఓ ప్రకటన చేసింది. కానీ, హిజ్బొల్లా అండదండలు దూరమైన ప్రస్తుతస్థితిలో ఇరాన్‌ను దెబ్బతీయడం లక్ష్యంగా నెతన్యాహూ అడుగులు పడుతున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమై, కొనసాగుతున్న కొత్తల్లో అమెరికా, దాని మిత్రదేశాలు చేసిన వ్యాఖ్యలు, చెప్పిన హితవులు చాలామందికి గుర్తు కొస్తున్నాయి. దేశాలు, సార్వభౌమత్వం, సరిహద్దులు, చొరబాట్లు వంటి మాటలు అనేకం బైడెన్ నోట విన్నాం. ఒక ఆస్పత్రిమీద రష్యాదాడి జరిగి, కొందరు పిల్లలు చనిపోయినందుకు ఉక్రెయిన్ అధినేత యావత్ ప్రపంచాన్ని తిట్టిపోశాడు. కానీ, కేవలం సామాన్యులు, అధికంగా మహిళలు, మూడోవంతుమంది పిల్లలు నిర్దాక్షిణ్యంగా ఊచకోతకు గురైన గాజాయుద్ధం మాత్రం అమెరికాకు అమానవీయంగా కనిపించలేదు. గాజాను స్వాధీనం చేసుకొని, లెబనాన్‌ను కూడా గాజాలాగా మార్చడానికి ఉత్సాహపడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా వెన్నంటి నిలిచింది. ఇరాన్‌మీద క్షిపణులు కురిపించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆత్మరక్షణహక్కు పేరిట ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ ఊచకోత ఇప్పట్లో ఆగేది కాదు. చిచ్చు వేగంగా విస్తరిస్తూ ప్రాంతీయ యుద్ధం పరిధిని దాటిపోయే ప్రమాదం సమీపంలోనే కనిపిస్తోంది.