Share News

ఆ నలుగురైనా మిగులుతారా!?

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:26 AM

జగన్మోహన్‌రెడ్డి జమానాలో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటీ బయటపడుతుంటే దిగ్ర్భాంతి కలుగుతోంది. ఎన్నికల్లో జగన్‌ అలవిగాని హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చడానికి ఎక్కడెక్కడి నిధులూ మళ్లించి, అభివృద్ధిని గాలికి వదిలేశారనే ఇంతదాకా

ఆ నలుగురైనా మిగులుతారా!?

జగన్మోహన్‌రెడ్డి జమానాలో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటీ బయటపడుతుంటే దిగ్ర్భాంతి కలుగుతోంది. ఎన్నికల్లో జగన్‌ అలవిగాని హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చడానికి ఎక్కడెక్కడి నిధులూ మళ్లించి, అభివృద్ధిని గాలికి వదిలేశారనే ఇంతదాకా చాలా మంది నమ్ముతూ వచ్చారు. అయితే ఐదేళ్లూ జరిగింది నిధుల మళ్లింపు కాదు, నిధుల దోపిడీ అని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

ఎన్నికల్లో గెలవడం కోసం ఖజానా శక్తికి మించి, ప్రజల వాస్తవ అవసరాలకు మించి వాగ్దానాలు ఇచ్చేయడం రాజకీయాల్లో దశాబ్దాల కిందటే మొదలైంది. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు కూడా పోటీపడుతున్నాయి. అలివిగాని హామీలు ఇచ్చినవారు, గెలిచాక వాటి అమలుకు తంటాలు పడుతుంటారు. ప్రభుత్వ పాలనకు ఇవి కొరకరాని కొయ్యలుగా మారిన వైనాన్ని జగన్‌ పాలనలో స్పష్టంగా చూశాం. నిజానికి వీటి ముసుగులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వనరుల దోపిడీ విపరీతంగా జరిగింది. సన్నబియ్యం ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి, ముతకబియ్యమే ఇచ్చినా జనం ఆగ్రహించలేదు కానీ, ఆ ముతకబియ్యాన్ని కూడా పాలిష్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసేసిన తీరు చూసి మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు.

జగన్‌కి అత్యంత సన్నిహితుడి సారథ్యంలోనే కాకినాడ పోర్టు నుంచి ఈ తంతు జరిగిందని వెల్లడి కావడంతో రాష్ట్రం పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. పోర్టులను లాగేసుకోవడం, తన వాళ్లకు అప్పగించేయడం, అడ్డంగా కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం, బలవంతపు భూ ఆక్రమణలు, రాజధాని పేరుతో విశాఖలో సాగించిన దందాలు, మద్యం మోసం, ఇసుక మాఫియా.. ఇవన్నీ చూస్తుంటే– ఇట్లా కూడా పాలన చేయవచ్చా అనే ఆశ్చర్యం కలుగుతుంది. అబద్ధాన్ని దబాయించి నిజమని చెప్పే తీరు చూస్తుంటే, రాష్ట్ర భవిష్యత్తు పట్ల భయమేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏదో అద్భుతం జరుగుతుందనే ఆశతోనే అన్ని సామాజికవర్గాలూ కలిసి 2019లో జగన్మోహన్‌రెడ్డిని గెలిపించాయి. ఆయన మాత్రం ఒక్కటే సామాజికవర్గాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అదే సామాజికవర్గానికి చెందిన నలుగురి మీదే నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్రం నాలుగు దిక్కులా ఆ నలుగురికీ పగ్గాలిచ్చి దోపిడీకి ద్వారాలు తెరిచేశారు. విశాఖ కేంద్రంగా ఒకరూ, గోదావరి జిల్లాల మీదకు ఒకరూ, దక్షిణాంధ్రలో ఒకరూ, రాయలసీమలో మరొకరూ దోపిడీ ప్రతినిధులుగా వ్యవహరించారు. వారి అధికార దర్పానికీ, నోటికీ, చర్యలకూ అడ్డూ అదుపూ లేకుండాపోయింది. విచిత్రం ఏమిటంటే.. జగన్‌ ఇచ్చిన అపరిమిత అధికార పగ్గాలతో ఎడాపెడా చెలరేగిపోయిన ఈ నలుగురూ– రాష్ట్రంలో పాత కుంభకోణాల పుట్ట పగులుతూ ఉన్న ఈ సమయంలో మొహం చాటేస్తున్నారు. మీడియా ముందుకు కూడా పెద్దగా రావడం లేదు. పార్టీకీ, జగన్‌కీ రక్షాకవచంగా నిలబడడం లేదు. ‘కాటికి పోయేప్పుడైనా నలుగురు ఉండాలి’ అని తెలుగునాట ఒక సామెత ఉంది. కనీసం నలుగురినైనా నమ్మకంగా నిలుపుకోవాలని దాని ఉద్దేశ్యం. పాపం.. జగన్‌ పాపాల భారాన్ని మోయడానికి ఆ నలుగురూ కూడా మిగిలేట్టుగా కనిపించడం లేదు.

భారతదేశపు రాజకీయాల్లోనే జగన్‌ మాట, ప్రవర్తన, వ్యవహారశైలి, పాలన.. సామాజిక, రాజకీయ, మనస్తత్వ శాస్త్రాల్లో ఒక కేస్‌ స్టడీ అవుతుంది. తొలినాళ్లలో తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జపం చేసిన ఆయన, ఆ తర్వాత దానిని వదిలేశారు. తండ్రికి నమ్మకస్తులైన నేతలు ఎవరినీ జగన్‌ చేరదీయలేదు. అవసర కాలంలో అమ్మనీ, చెల్లినీ రాజకీయ పావులుగా ఉపయోగించుకుని, అవసరం తీరాక దూరం పెట్టేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను తొలుత ‘అన్నా’ అని సంబోధించి, ఆ తర్వాత వారితో జగన్‌ వ్యవహరించిన తీరు అందరూ గమనించారు. వైసీపీ అంటే జగన్‌ మాత్రమే అన్నట్టుగా అధికారంలో ఉన్నపుడు ప్రవర్తించిన ఆయన తీరు, ఇప్పుడూ మారలేదు. అభివృద్ధిని అటకెక్కించి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఇటువంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే పాఠాన్ని రాష్ట్ర ప్రజలు నేర్చుకున్నారు.

కేవలం కొల్లగొట్టుకోవడం అనే ఒకే ఒక్క కార్యాచరణతో ఐదేళ్లూ జగన్‌ పాలన సాగింది. ఇక జగన్‌ను తిట్టుకుంటూ కాలం గడపలేం. ధ్వంసమైన వ్యవస్థలకు మళ్లీ భరోసా ఇచ్చి నిలబెట్టాలి. విభజనతో బలహీనపడిన ఒక చిన్న రాష్ట్రం, తిరిగి కోలుకోవడానికి కావలసింది ఆర్థిక శక్తి. సహజ వనరులను సక్రమంగా వినియోగంలోకి తెచ్చుకుని, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చి సంపద సృష్టి జరగాలి. ఈ సవాలు సులువైనదేమీ కాదు. అయినా కూటమి పాలనలో రాష్ట్ర ప్రజల్లో ఒక ఆశ, నమ్మకం కలుగుతున్నాయి. చంద్రబాబు విజన్‌, కార్యదక్షత, అనుభవం, కసితో కూడుకున్న పట్టుదల.. ఇందుకు కారణం. కూటమి నాయకుల సమష్టి కృషి వల్ల మాత్రమే రాష్ట్రం నిలదొక్కుకుని నెగ్గుకు రాగలదు. జాతీయ రాజకీయాల్లో సంఖ్యాపరంగా శాసించే స్థానంలో ఉన్నా, రాష్ట్ర అభివృద్ధికి కావలసిన వనరులు సాధించుకోవడం మీదే చంద్రబాబు దృష్టి పెట్టారని అర్థమవుతోంది. సంయమనంతో, లౌక్యంతో చంద్రబాబు సాధించగలరు. కనీసం ప్రతిపక్ష నేతగా అయినా జగన్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తాను సీఎంగా ఉంటే ఇంతకన్నా మెరుగ్గా ఏమి చేయగలనో ప్రజలకు వివరించి, వారి మనసులు జగన్‌ గెలుచుకోవాలి గానీ, చంద్రబాబు పాలనలో ప్రతిదీ తప్పేనంటూ తన సొంత మీడియాలో అచ్చేసి వదలడమే పనిగా పెట్టుకుంటే జనం మొదట నవ్వుకుంటారు. ఆ తర్వాత చిరాకుపడతారు. చివరికి ఆయన మాటల్నీ, ఆయననూ కూడా మరిచిపోతారు.

n ఓ.వి. రమణ

టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు, తెలుగుదేశం నాయకుడు

Updated Date - Dec 12 , 2024 | 05:26 AM