తొలి చర్చ
ABN , Publish Date - Jun 29 , 2024 | 03:16 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న జోబైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో బైడెన్ వెనుకంజవేశారని, ట్రంప్ పైచేయి సాధించారని విశ్లేషణలు సాగుతున్నాయి. మంచి మాటకారితనంతోపాటు, తోచింది అనేయడం...
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న జోబైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో బైడెన్ వెనుకంజవేశారని, ట్రంప్ పైచేయి సాధించారని విశ్లేషణలు సాగుతున్నాయి. మంచి మాటకారితనంతోపాటు, తోచింది అనేయడం, అబద్ధాన్ని అతికినట్టు చెప్పడం ఇత్యాది నైపుణ్యాలు ట్రంప్‌కు ఉన్నాయి కనుక, ఆయన దాడిమాటలు సహజంగానే వినడానికి బాగుంటాయి. తనకు దక్కిన సమయాన్ని ట్రంప్ తెలివిగా వాడుకొని బైడెన్‌మీద ఎదురుదాడిచేశారని, ఈయనేమో ఆత్మరక్షణలో పడిపోయి, తడబాటుకు గురైనారని, కొన్ని అంశాల్లో పొంతనలేకుండా మాట్లాడారని అమెరికన్ మీడియా అంటోంది. మాట్లాడుతున్న విషయాన్ని మధ్యలో వదిలేసి పూర్తిభిన్నమైన అంశాన్ని ప్రస్తావించడం వంటివి సైతం జరిగాయట. బైడెన్ జలుబుతో బాధపడుతున్నారని, గొంతులో జీరకు కారణమదేనని చర్చ మధ్యలో ఆయన పక్షాన మీడియాకు ఇచ్చిన వివరణను కూడా ఎక్కువమంది మెచ్చలేదు. దీనికితోడు బైడెన్ ఏదో అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నట్టుగా మధ్యమధ్యలో ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సరేసరి. ట్రంప్ పచ్చి అబద్ధాలాడుతున్నా, అసత్య ఆరోపణలు చేసినా బైడెన్ సరిగ్గా తిప్పికొట్టలేకపోయారని ఆయన పార్టీవారు మధనపడిపోతున్నారు. అమెరికా చరిత్రలో బాగా ముందుకు జరిగిన ఈ చర్చనుంచి ఎంతో లబ్ధిపొందవచ్చునని ఆశించిన బైడెన్ బృందం ఈ తొలిదశలో తీవ్రంగ ఆశాభంగం చెందిందని వార్తలు వస్తున్నాయి. దీనిని అదునుగా చేసుకొని, ఇప్పటికైనా బైడెన్‌ను తప్పించాలనీ, ఆయనబదులు ఫలానావారిని నిలబెడితే మంచిదనీ డెమోక్రాట్లకు చాలామంది ఉచిత సలహాలు ఇస్తున్నారు.
నూరుశాతం నిజాలతో, నిజాయితీగా ఈ అధ్యక్ష చర్చ జరగదు కానీ, అత్యున్నత స్థానానికి పోటీపడుతున్న ఇద్దరిమధ్య విభిన్నమైన అంశాలపై విస్తృత చర్చ జరగడమనే సంప్రదాయం ప్రశంసనీయమైనది. మొన్నటి మన సార్వత్రక ఎన్నికల సందర్భంలో నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ మధ్య ఇటువంటి చర్చనే కొందరు ప్రముఖులు ప్రతిపాదించారు. భావోద్వేగాలు రాజేసే వ్యాఖ్యలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎన్నికల ప్రచారం జరగడం కంటే, దేశాన్ని కుదిపేస్తున్న, జనజీవితాలను ప్రభావితం చేస్తున్న కీలకమైన అంశాలపై అధినాయకుల మధ్య చర్చ జరగడం వల్ల అధికప్రయోజనం ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రభావం కాదనలేనిది. ఈ చర్చలో బైడెన్, ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు, వ్యక్తిగత విమర్శలకూ దిగారు. కానీ, దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం, వలసలు, అబార్షన్, గాజాయుద్ధం, కరోనా కష్టకాలం, సామాజిక భద్రత ఇత్యాది అంశాలమీద వారి అభిప్రాయాలను వారినోటినుంచే ప్రజలు విన్నారు.
బైడెన్, ట్రంప్ మధ్య వయసులో తేడా మూడేళ్ళు మాత్రమే. కానీ, బైడెన్ అడపాదడపా తన హావభావాలతో, చర్యలూ చేష్టలతో తన వయసును తెలియబరుస్తూంటారు. ఈ చర్చలో కూడా ఆయన ఆరంభంలో పేలవమైన ప్రదర్శనతో వెనుకబడినా, ఆ తరువాత పుంజుకున్నారు. కానీ, వయసు కారణంగా బైడెన్‌ను మెచ్చనివారి సంఖ్య ట్రంప్‌తో పోల్చితే రెట్టింపు ఉందట. ఈ దశలో తనకు తానుగా తప్పుకోవడం తప్ప, బైడెన్‌ను తప్పించడం ఆయన పార్టీకి కూడా సాంకేతికంగా సాధ్యం కాదు. ఆగస్టులో చికాగోలో జరిగే డెమోక్రాటిక్ పార్టీ కన్వెన్షన్‌లో ఒకవేళ ఆయన ఈ పనికి సిద్ధపడినా, పార్టీ డెలిగేట్లనుంచి మరొకరు ఆ స్థాయిలో మద్దతు కూడగట్టుకోవడం అంత సులభం కాదు. ఉపాధ్యక్షపదవికి పోటీపడుతున్న కమలాహారిస్ పేరు గట్టిగా వినిపిస్తున్నది కానీ, చాలా కారణాలవల్ల పార్టీ డెలిగేట్లు ఆమెను ఆ స్థానానికి ఆమోదించరు. పార్టీలో బైడెన్‌కు గట్టిపోటీ ఇవ్వగలిగేవారు లేకనే ఆయన సులభంగా ఇంతవరకూ రాగలిగారు. ఇప్పుడు కూడా పార్టీ లోలోపల భయపడుతున్నదే తప్ప, బైడెన్ తప్పుకోవాలన్న మాట బయటకైతే లేదు. ఈ తొలిదశ చర్చలో ఒకవేళ భంగపడినా, ఎన్నికలకు సరిగ్గా రెండునెలలముందు సెప్టెంబరులో జరిగే మలిదశ చర్చలో బైడెన్ పైచేయి సాధించి అమెరికన్ల మనసులో నిలిచిపోవచ్చున్న ఆలోచనతోనే అధికారపక్షం ఈ చర్చను ముందుకు జరిపిందని అంటారు. సెప్టెంబర్ చర్చలో బైడెన్ దే పైచేయి కావచ్చును కానీ, ఇంతలోగా ఆయనను మరింత అప్రదిష్టపాల్జేసే ప్రయత్నాలైతే విపక్షం నుంచి తప్పవు. ట్రంప్, బైడెన్‌లో ఎవరు గెలిచినా అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిని ఎన్నుకున్న కీర్తి ఈ మారు అమెరికన్లకు దక్కడం ఖాయం.