Share News

మార్పు కోసం...

ABN , Publish Date - Nov 20 , 2024 | 01:50 AM

శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే సోమవారం కొత్తమంత్రివర్గాన్ని నియమించారు. ప్రధానిగా హరిణి అమరసూర్యను కొనసాగించి, రక్షణ, ఆర్థికం వంటి కొన్ని కీలకమైన శాఖలు...

మార్పు కోసం...

శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే సోమవారం కొత్తమంత్రివర్గాన్ని నియమించారు. ప్రధానిగా హరిణి అమరసూర్యను కొనసాగించి, రక్షణ, ఆర్థికం వంటి కొన్ని కీలకమైన శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. ఇరవైఒక్కమందితో కూడిన చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడమంటే, ఖర్చులు తగ్గిస్తానని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమేనని, ముప్పైమంది మంత్రులతో దేశాన్ని ఏలగలిగే అవకాశం ఉండికూడా, ఆయన ఈ సంఖ్యకే పరిమితం కావడం లంక ఆర్థికస్థితిపట్ల ఆయనకున్న భయాన్ని తెలియచేస్తోందని ఆయన పార్టీ జేవీపీ చెప్పుకుంటోంది. మంత్రివర్గంలో కొత్తమొఖాలు అనేకం. ముఖ్యంగా ఐదుగురు ప్రొఫెసర్లకు పదవులు దక్కడం విశేషం. మత్స్యశాఖమంత్రి రామలింగం తమిళంలో ప్రమాణస్వీకారం చేసి, అధ్యక్షులవారు మైనారిటీలకూ సముచిత ప్రాతినిథ్యం కల్పించారని గుర్తుచేశారు. మహిళాశిశు సంక్షేమశాఖ కూడా తమిళమూలాలున్న ఓ మహిళకు దక్కింది. అనురకుమారను తమ అధ్యక్షుడుగా ‌ఇటీవలే ఎన్నుకున్న శ్రీలంక ప్రజలు రెండునెలల్లోనే జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో సైతం తిరుగులేని మెజారిటీని కట్టబెట్టిన విషయం తెలిసిందే.


పతనావస్థలో ఉన్న దేశాన్ని దిస్సనాయకే తిరిగి నిలబెట్టగలడన్న నమ్మకం ప్రజల్లో ఉంది. నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ) అలయెన్స్‌కు జనం తిరుగులేని బలాన్ని ఇచ్చారు. కేవలం ముగ్గురు ఎంపీలున్న ఆయన ఇప్పుడు మూడువంతులు దాటిన మెజారిటీతో దేశాన్ని ఏలబోతున్నారు. 220 స్థానాలున్న సభలో ఆయన కూటమికి 160 కట్టబెట్టి, ప్రజలు అవధులు లేని అధికారాలు ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల విధానాన్ని రూపొందించుకున్న 1978 తరువాత, ఒక సంకీర్ణం ఇంతటి ఘనంగా నెగ్గుకురావడం ఎన్నడూ లేదు. మతాలు, జాతుల పరంగా చీలిపోయి, ముస్లింలు, తమిళులు, సింహళీయుల మధ్య అవిశ్వాసం అధికంగా ఉండే లంక సమాజం ఈ ఎన్నికల్లో అద్భుతమైన ఐక్యతను ప్రదర్శించింది. అటు తమిళులు, ఇటు ముస్లింలు కూడా దిస్సనాయకే నాయకత్వం వహిస్తున్న ఒక సింహళపార్టీని, దాని కూటమిని ఇంతగా నమ్మడం ఆశ్చర్యం. అన్ని రకాల వివక్షలనూ, విభేదాలను పక్కనబెట్టి దేశప్రజలంతా ఒక్కటై తనకు బ్రహ్మరథం పడతారని దిస్సనాయకే కూడా ఊహించివుండరు. తమిళుల కంచుకోటలను సైతం ఆయన బద్దలు కొట్టి, సంప్రదాయ తమిళపార్టీలను మట్టికరిపించిన తొలి సింహళపార్టీగా చరిత్ర సృష్టించారు.

లంక తమిళులు దిస్సనాయకేను ఇంతగా విశ్వసిస్తుంటే, వైగో మాత్రం ఈ పరిణామం వారికి తీవ్రమైన నష్టంచేస్తుందని, భారతప్రభుత్వం వెంటనే దిస్సనాయకే మీద ఒత్తిడితెచ్చి తమిళుల ప్రయోజనాలను పరిరక్షించాలని అంటున్నారు. దశాబ్దాల నాటి జనతావిముక్తి పెరుమన ప్రవర్తనను గమనించినప్పుడు సింహళ జాత్యహంకార పార్టీగా అది ఎన్నడూ తన తమిళవ్యతిరేకను దాచుకోలేదు, వారికి దక్కవలసిన అధికారాలూ ప్రయోజనాలూ దక్కనివ్వలేదు. భారత్‌–లంక ఒప్పందాన్ని అది తీవ్రంగా వ్యతిరేకించింది, తమిళులను ఊచకోతలను సమర్థించింది, వారికి ఏ విధమైన హక్కులూ ఉండకూడదని పోరాడింది. కానీ, ఇటీవల ఆ పార్టీ వైఖరిలోనూ, నాయకత్వంలోనూ మార్పువచ్చింది. దిస్సనాయకేను మార్క్సిస్టు అనేకంటే, ఆచరణవాది అనడం సముచితమని విశ్లేషకుల అభిప్రాయం. విమర్శకులు మాత్రం అవకాశవాది అంటారు.


దేశం అన్ని విధాలుగా దెబ్బతినివున్న స్థితిలో ప్రజలు దశాబ్దాలుగా రాజకీయాల్లో పాతుకుపోయి ఉన్న రాజపక్సేలు, విక్రమసింఘేలు, ప్రేమదాసలను ఏ మాత్రం విశ్వసించలేదని, వారిని అవమానకరంగా తరిమికొట్టారని ఈ ఫలితాలు తెలియచేస్తున్నాయి. రాజపక్సేలకు వ్యతిరేకంగా రెండేళ్ళక్రితం సాగిన ప్రజాఉద్యమం (అరగాలయ)లో ఇప్పటి ఎన్‌పిపి భాగస్వామ్య పక్షాలు కీలకభూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. ఒక సమూలమైన మార్పు, కొత్త రాజకీయ సంస్కృతికి హామీ పడుతూ సాగిన ఈ ఉద్యమం తమిళులను, ముస్లింలను దగ్గరకు తీసుకుంది, వారిలో విశ్వాసాన్ని నెలకొల్పింది. లంకప్రజలు ఇప్పుడు ఎన్నడూ లేనంత సంఘటితంగా ఉన్నారు. శ్రీలంకను ఒడ్డునపడేయడానికి దిస్సనాయకేకు విస్తృతమైన అధికారాలు ఇచ్చారు. అప్పుల ఊబిలో మునిగి, ప్రధానంగా చైనా కబంధహస్తాల్లో చిక్కుకొనివున్న లంకను కాపాడాల్సిన బాధ్యత ఆయనమీద ఉంది. తమిళులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ఆయనకు మరింత అవసరం.

Updated Date - Nov 20 , 2024 | 01:50 AM