Share News

తాలిబాన్‌తో స్నేహం

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:36 AM

భారతదేశంలో అఫ్ఘానిస్థాన్‌ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్‌ను తాలిబాన్‌ ప్రకటించింది. ముంబైలోని అఫ్ఘానిస్థాన్‌ దౌత్యకార్యాలయంనుంచి ఈ యువవిద్యార్థి తన కార్యకలాపాలు నిర్వహిస్తాడని తాలిబాన్‌ మంత్రి...

తాలిబాన్‌తో స్నేహం

భారతదేశంలో అఫ్ఘానిస్థాన్‌ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్‌ను తాలిబాన్‌ ప్రకటించింది. ముంబైలోని అఫ్ఘానిస్థాన్‌ దౌత్యకార్యాలయంనుంచి ఈ యువవిద్యార్థి తన కార్యకలాపాలు నిర్వహిస్తాడని తాలిబాన్‌ మంత్రి ప్రకటించారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తరువాత, ఆ ప్రభుత్వాన్ని ఇంకా భారత్ అధికారికంగా గుర్తించాల్సి ఉండగా జరిగిన తొలి నియామకం ఇది. భారత ప్రభుత్వం ఇంకా ఆమోదించవలసి ఉన్నప్పటికీ, కమిల్‌ పేరును రెండుదేశాలు ఇప్పటికే ఏకమాటగా అనుకున్నాయని వార్త. కమిల్‌ భారత్‌లో ఏడేళ్ళపాటు చదువుకున్నాడు. మనదేశం ఇచ్చిన స్కాలర్‌షిప్‌తో న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ చేశాడు. ముంబైలోనే ఉంటూ ఇప్పటికే అనధికారికంగా తన విధులు నిర్వహిస్తున్నాడని, భారతదేశంలో అఫ్ఘాన్ల శ్రేయస్సుకోసం పనిచేస్తున్న అఫ్ఘాన్‌ జాతీయుడన్న గుర్తింపుతో మన ప్రభుత్వ వ్యవస్థ అతడికి సహకరిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. తాలిబాన్ పాలనను గుర్తించనప్పటికీ, రెండుదేశాల మధ్యా సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమదేశంలో దౌత్యవేత్తలను నియమించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి, గతంలో మాదిరిగా భారత్‌ సన్నిహితంగా ఉండవచ్చునని తాలిబాన్‌ ఎప్పటినుంచో అంటోంది. ఇప్పుడు కమిల్‌ నియామకాన్ని ఆమోదించిన పక్షంలో దౌత్యసంబంధాన్ని భారత్‌ పునరుద్ధరించినట్టు లెక్క. కొత్తగా ఏ గుర్తింపూ ఇవ్వకుండానే అతడితో మనదేశం వ్యవహరించవచ్చునన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.


భారత విదేశీవ్యవహారాలశాఖలో, పాకిస్థాన్‌–అఫ్ఘానిస్థాన్‌‌–ఇరాన్‌ వ్యవహారాల విభాగంలో జాయింట్‌ సెక్రటరీగా ఉన్న జేపీ సింగ్‌ గతవారం కాబూల్‌లో పర్యటించారు. అఫ్ఘాన్‌ రక్షణ, విదేశాంగమంత్రులతో చర్చల్లో, అనేక అంశాలతో పాటు, కమిల్‌ నియామకానికి కూడా అంగీకారం కుదిరిందని అంటారు. ఐక్యరాజ్యసమితిలో స్థానం గురించి తాలిబాన్‌ తహతహలాడుతున్న తరుణంలో మనం ఇలా సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఉత్సాహపడుతున్నామని విశ్లేషకులు అంటున్నారు.


జేపీ సింగ్‌ పర్యటనలో అఫ్ఘాన్‌ రక్షణమంత్రి మహ్మద్‌ ముజాహిద్ భారతదేశంపట్ల పూర్తి సానుకూల దృక్పథాన్ని స్పష్టపరుస్తూ, భారత వ్యతిరేక కార్యకలాపాలకు తమ గడ్డ అడ్డాకాబోదని గట్టిగా హామీ ఇచ్చారట. రెండవ విడత పాలనలో భారతదేశానికి సంబంధించినంతవరకూ గత మూడేళ్ళలో తాలిబాన్ ప్రవర్తన ఇబ్బందికరంగా లేనిమాట నిజం. ప్రధానంగా పాకిస్థాన్‌ మాటను విశ్వసించి, అఫ్ఘానిస్థాన్‌నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ కొనసాగుతూండగానే తాలిబాన్‌ సేనలు దేశాన్ని ఆక్రమించాయి. అప్పటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంతోషంగా అల్లాను తలుచుకున్నారు. పాకిస్థాన్‌ చెప్పుచేతల్లో తాలిబాన్‌ ఉంటుందని, నచ్చినట్టుగా వాడుకోవచ్చునని ఆయన నమ్మారు. కానీ, ఇందుకు భిన్నంగా, స్వతంత్రంగా వ్యవహరించడంతో పాటు, లష్కర్‌, జైష్‌ వంటి పాక్‌ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను తాలిబాన్‌ తన భూభాగంలో ఏమాత్రం అనుమతించలేదు. పాకిస్థాన్‌ ఇంటర్‌సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) ఆశీస్సులున్న ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ గ్రూపులతో పోరాడుతున్నది కూడా. దీనికితోడు, పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ వంటి సంస్థల కారణంగా ఆ రెండు దేశాల మధ్యా దూరం మరింత పెరిగిపోయింది. పాకిస్థాన్‌లో ఉంటున్న లక్షలాదిమంది అఫ్ఘాన్లను వెళ్ళగొట్టడం వరకూ సంబంధాలు చెడిపోయాయి. అఫ్ఘానిస్థాన్‌లో తన ప్రత్యేక ప్రతినిధి ఆసిఫ్‌ దురానీని సెప్టెంబరులో పాకిస్థాన్‌ ఉపసంహరించుకోవడం దిగజారుతున్న సంబంధాలకు నిదర్శనం.

ఈ నేపథ్యంలో, భారత్‌–అఫ్ఘాన్‌ దగ్గరకావడంలో ఆశ్చర్యమేమీ లేదు. గతంలో పార్లమెంట్‌ భవనం నిర్మాణం సహా చాలా ప్రాజెక్టులు చేపట్టిన భారతదేశంనుంచి మరింత సాయాన్ని, మరిన్ని మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని తాలిబాన్‌ కోరుతోంది. భారతదేశంలో అఫ్ఘాన్‌ జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు, చదువుకోసం వైద్యంకోసం అక్కడనుంచి అధికులు వస్తున్న నేపథ్యంలో, వారికి విస్తృతమైన సేవలు అందించేందుకు కార్యాలయాలు తెరవాలని, నియామకాలు జరుపుకోవాలని కూడా ఆశిస్తోంది. గతంలో పోల్చితే అమానుషత్వం తగ్గినప్పటికీ, మహిళలు, విద్య, బహిరంగ శిక్షలు ఇత్యాది విషయాల్లో తాలిబాన్‌ పెద్దగా మారలేదు. రెండుదేశాలు పరస్పర ప్రయోజనాలకోసం కృషిచేయడమే కాక, భారత్‌తో సన్నిహిత సంబంధాలకు వీలుగా తాలిబాన్‌ మరికొంత మార్పు చెందవలసి ఉంది.

Updated Date - Nov 14 , 2024 | 12:36 AM