Share News

హైదరాబాద్‌లో వికసిస్తున్న ఎఐ విప్లవం

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:14 AM

మానవ కార్యకలాపాలను వినూత్నంగా మార్చివేస్తున్న అధునాతన సాంకేతికత కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–ఎఐ). ప్రపంచ దేశాలు ఎఐ సామర్థ్య విస్తృతిని అన్వేషించడంలో పోటీపడుతున్నాయి.

హైదరాబాద్‌లో వికసిస్తున్న ఎఐ విప్లవం

మానవ కార్యకలాపాలను వినూత్నంగా మార్చివేస్తున్న అధునాతన సాంకేతికత కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–ఎఐ). ప్రపంచ దేశాలు ఎఐ సామర్థ్య విస్తృతిని అన్వేషించడంలో పోటీపడుతున్నాయి. ఆ శక్తిని ఉయోగించుకుంటూ అందులో మరింత నైపుణ్యాన్ని సముపార్జిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘గ్లోబల్‌ ఎఐ సమ్మిట్‌–2024’ ఆ సమూల పరివర్తన సాధక సాంకేతికతలో అతినూతన పోకడలపై వెలుగులు ప్రసరించనున్నది. ఆరోగ్య భద్రత, జీవశాస్త్రాలు, విద్య, వ్యవసాయం, న్యాయవ్యవస్థ, తయారీ రంగం, పౌర సేవలు ఇత్యాది రంగాలలో ఎఐ ఆధారిత నవీకరణల ప్రగాఢ, విస్తార ప్రభావ ప్రాబల్యాలను అధ్యయనం చేసి, సంబంధిత మార్పులపై మన అవగాహనను మరింతగా మెరుగుపరచుకునేందుకు ఆ సమ్మిట్‌ దోహదం చేయనున్నది.

ట్రాఫిక్‌ జామ్‌లను తగ్గించడం నుంచి అధిక దిగుబడులు సాధించడంలో రైతులకు తోడ్పడడం వరకు ప్రభుత్వాలు తమ పౌరులకు అందిస్తున్న సేవల తీరుతెన్నులను ఎఐ సాంకేతికత కొత్త పుంతలు తొక్కిస్తోన్నది. గ్లోబల్‌ టెక్నాలజీ కేంద్రంగా శీఘ్రగతిన వినుతికెక్కుతున్న హైదరాబాద్‌ ఎఐ ఆధారిత భవిష్యత్తు కల్పించే అవకాశాలను సమగ్రంగా ఉపయోగించుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నది. ప్రెడిక్టివ్‌ ఎనలిటిక్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, ఆటోమేషన్‌ తదితర వ్యవస్థాపిత ఎఐ సాంకేతికతలు ప్రభవిస్తోన్న జెనరేటివ్‌ ఎఐతో కలిసి ఒక కొత్త పారిశ్రామిక విప్లవానికి దారితీస్తున్నాయి. నిన్న ఒక స్వప్నంగా, భవిష్యద్దర్శనంగా మాత్రమే ఉన్న (సకల పారిశ్రామిక కార్యకలాపాలలోనూ) ఎఐను ఉపయోగించుకోవడమనేది నేడు ఒక యథార్థంగా ఉన్నది. తెలంగాణలో సంప్రదాయక వ్యవసాయక సవాళ్లు అధిగమించేందుకు ఎఐని ఫలప్రదంగా ఉపయోగిస్తున్నారు. పంట సమాచారం, సాగు భూముల పరిస్థితులను విశ్లేషించడం ద్వారా ఎఐ, రైతుల వైయక్తిక అవసరాలకు అనుగుణమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ దిగుబడులను అధికం చేస్తోంది. ఎఐని ఉపయోగించుకున్న రైతులు ఎకరాకు సగటున 21 శాతం అధిక దిగుబడిని సాధించారు. పంటల సాగులో వారు ఉపయోగించే క్రిమిసంహారక మందుల వినియోగం 9 శాతం, ఎరువుల వాడకం 5 శాతం తగ్గిపోగా దిగుబడుల విక్రయ ధరలు 8 శాతం మేరకు పెరిగాయి. హైదరాబాద్‌లోను, ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలలోను రోడ్లపై వాహనాల రాకపోకకలను మరింత సమర్థంగా క్రమబద్ధం చేసేందుకు ఎఐ తోడ్పడుతున్నది. ఎఐ శక్తిదాయక వ్యవస్థలు వాహనాల రాకపోకల తీరుతెన్నులను వాస్తవ సమయం (రియల్‌ టైమ్‌)లో విశ్లేషిస్తూ, ట్రాఫిక్‌ లైట్లను నియంత్రించడం ద్వారా ట్రాఫిక్‌ రద్దీని కూడళ్లలో 30 శాతం మేరకు, కాలుష్యకారక ఉద్గారాలను 10 శాతం మేరకు తగ్గించగలుగుతున్నాయి.


అంటువ్యాధుల విజృంభణను ముందస్తుగా మదింపు వేయడం, నిధులు అధికంగా, అత్యవసరమైన వ్యాధి నిరోధక కార్యకలాపాలకు కేటాయింపులు చేయడంలో సహాయపడడం ద్వారా ఆరోగ్య భద్రతలో ఎఐ కీలకపాత్ర వహిస్తోంది. కొవిడ్‌ మహమ్మారి కాలంలో ఆ అనారోగ్య హానికి గురయ్యేందుకు ఎక్కువ అవకాశమున్న ప్రజా సమూహాలను గుర్తించేందుకు ప్రెడిక్టివ్‌ ఎనలిటిక్స్‌ను ఉయోగించి మంచి ఫలితాలను సాధించారు. ఎఐ ఆధారిత ఆరోగ్య భద్రతా పద్ధతులు మారుమూల గ్రామాల ప్రజలకు సైతం అత్యవసర వైద్య సలహాలు సత్వరమే, సుగమంగా సమకూరేందుకు విశేషంగా తోడ్పడుతున్నాయి.

ప్రభుత్వాల పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఎఐ ఆధారిత సాధనాలు, దోహదం చేస్తున్నాయి. భారీ పరిమాణంలో ఉన్న సమాచారాన్ని విద్యుత్‌ వేగంతో మథించి, ప్రభుత్వ వ్యయాలలో అవకతవకలను కనుగొని వనరులను మరింత వివేకవంతంగా వినియోగించేందుకు ఎఐ తోడ్పడుతున్నది విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎఐని ఉపయోగించి వారి అభ్యసన అనుభవాలను సమున్నతం చేసేందుకు ఎఐని ఉపయోగిస్తున్నారు. ఎఐ ఆధారిత విద్యా వేదికలు వైయక్తిక అభ్యసన శైలిని మదింపు చేసి, అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను మార్చి ప్రతి విద్యార్థికి వైయక్తికమైన విద్యాబోధన చేయడంలో ఎఐ విశేష పాత్ర వహిస్తోంది. అలాగే విద్యాసంస్థల దైనందిన పాలనా ప్రక్రియలను ఆటోమేట్‌ చేయడం ద్వారా ఉపాధ్యాయులు తమ దృష్టిని పూర్తిగా బోధన విధులపై కేంద్రీకరించేందుకు ఎఐ తోడ్పడుతున్నది.


పారిశ్రామిక రంగంలో వివిధ సంస్థలు తమ యూనిక్‌ డేటా నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందేందుకు, సమస్త వేల్యూ చైన్స్‌ (ముడిపదార్థాల సేకరణ, ఉత్పత్తి వినియోగం, త్యజించడం, రీసైక్లింగ్‌ ప్రక్రియతో సహా ఒక ఉత్పత్తి సంపూర్ణ జీవితచక్రాన్ని ఉద్దేశించిన భావన)ను తిరిగి ఊహించేందుకు, తమ సిబ్బంది, యంత్రాల పనితీరును విస్తారంగా మెరుగుపరచుకునేందుకు, కొత్త కల్పనలను ప్రోత్సహించేందుకు ఎఐ విశేషంగా తోడ్పడుతున్నది. బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, బీమా రంగంలో అపార సమాచారాన్ని తరచిచూసి దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు ఎఐ సహాయపడుతున్నది. తద్వారా ముందస్తు అంచనా సామర్థ్యాన్ని మెరుగుపరిచి వాస్తవ సమయంలో మోసాలు, అక్రమాలను గుర్తించి నిరోధించడం సాధ్యమవుతోంది.

మన సమస్త జీవిత పార్శ్వాలను విప్లవీకరించే శక్తి ఎఐకి ఉన్నది. ఈ అధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవడం అంతకంతకూ పెరుగుతున్నందున తత్ఫలితంగా ఉత్పన్నమవుతున్న పలు క్లిష్ట విషయాలనూ నిశితంగా పరిశీలించి వాటిని పరిష్కరించుకోవడంపై దృష్టిపెట్టాల్సిన అవసరమున్నది. వ్యక్తిగత గోప్యత, పారదర్శకత, వివరణీయత, నిష్పాక్షికత, జవాబుదారీతనం, అనువర్తన, భద్రత, రక్షణ మొదలైన వ్యవహారాలలో ఎఐ మూలంగా పలు సమస్యలు నెలకొంటున్నాయి. ఎఐ మూలంగా తలెత్తే సమస్యలు, ఇక్కట్లను జరూరుగా గుర్తించి, సకాలంలో సంపూర్ణంగా పరిష్కరించుకోవాలి. ఎఐ వ్యవస్థలు సేకరిస్తున్న సమాచారం గోప్యత భంగానికి, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీసే ప్రమాదమున్నది. ఎఐ వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకుసాగుతున్న సంస్థలు అనేకం అపాయాలు, అవకాశాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలనే విషయమై శ్రద్ధ చూపుతున్నయని మా (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌) సొంత అనుభవాలతో పాటు టిసిఎస్‌ ఎఐ ఫర్‌ బిజినెస్‌ స్టడీ కనుగొన్న విషయాలూ స్పష్టం చేస్తున్నాయి.

భారతదేశ సైబర్‌ సిటీగా ప్రసిద్ధికెక్కిన హైదరాబాద్‌ ఎఐ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాల సర్వసన్నద్ధంగా ఉన్నది. నగరంలో సాటిలేని రీతిలో పెరుగుతూ, ప్రభావదాయకంగా ఉన్న నవీన సాంకేతికతల వ్యవస్థలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఎఐ విప్లవ పురోగమనానికి సానుకూల పరిస్థితులను సమృద్ధంగా సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌ ఒక ఉన్నతస్థాయి విద్యాకేంద్రం. నగరంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏటా వేలాది ఇంజినీరింగ్‌ పట్టభద్రులను రూపొందిస్తున్నాయి. ఎఐ విప్లవాన్ని నగరంలోనే కాకుండా విశాల భారతదేశమంతటా ఎఐ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఆ ప్రతిభావంతుల పాత్ర కీలకమైనది.


ఎఐ మూలంగా లక్షలాది ఉద్యోగాలు మటుమాయమవుతున్న మాట నిజం. అయితే 2025 సంవత్సరం నాటికి ఎఐ, తన మూలంగా మాయమవుతున్న ఉద్యోగాల కంటే 12 మిలియన్‌ ఉద్యోగాలను అధికంగా సృష్టించనున్నదని అంచనా. ఒక్క భారతదేశంలోనే రాబోయే కొద్ది సంవత్సరాలలో దాదాపు 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఎఐ మూలంగా సృష్టి కానున్నాయి. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే వేలాది ఇంజినీరింగ్‌ నిపుణులు ఎఐలోను, ఎఐ సంబంధిత సాంకేతికతలలోను శిక్షణ పొందుతున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌, తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఇందుకు విశేషంగా దోహదం చేస్తున్నాయి. వీటికి తోడు కొత్తగా తెలంగాణ స్కిల్స్‌ యూనివర్శిటీ రాబోతున్నది. శీఘ్రగతిన ఆవిర్భవిస్తున్న జాబ్‌ మార్కెట్‌ డిమాండ్లనును తీర్చేందుకు అవసరమైన నిపుణులను ఆ శిక్షణా కార్యక్రమాలు తీర్చిదిద్దుతున్నాయి. హైదరాబాద్‌లోని టిసిఎస్‌ సెంటర్‌ ఎఐ సంబంధిత సాంకేతికతలలో 67 వేల మందికి శిక్షణ ఇచ్చింది. హైదరాబాద్‌లో స్టార్టప్‌లకు నూతన సాంకేతికతల సృష్టికి అద్వితీయమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ మహానగరంలో 6000కి పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. వీటిలో అత్యధిక సంస్థలు ఎఐ, మెషీన్‌ లెర్నింగ్‌ ఇన్నోవేషన్‌లో అగ్రగాములుగా ఉన్నాయి. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే వ్యోమనౌకలను నిర్మించడమే కాకుండా సంబంధిత ఇతర సాంకేతికతలనూ సృష్టించే స్టార్టప్‌ ఒకటి హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది. భద్రత, నిఘా ఏర్పట్లకు అవసరమైన ఎఐ శక్తిదాయక రోబోలను మరొక స్టార్టప్‌ తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి స్మార్ట్‌ సిటీలోను ఇవి త్వరలోనే అంతర్భాగం కానున్నాయి. హైదరాబాద్‌ ఎఐ రంగంలో మదుపులూ పెరుగుతున్నాయి. ఈ నగరంలోని స్టార్టప్‌లు ఏటా 0.54 బిలియన్‌ డార్ల నిధులను సమకూర్చుకోగలుగుతున్నాయి.

గ్లోబల్‌ టెక్‌ కంపెనీలు, సెమికండక్టర్‌ కంపెనీలు, హైపర్‌ స్కేలర్స్‌, వివిధ రంగాలలోని బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్‌లో విశేషంగా ఉన్నాయి. వీటి భాగస్వామ్యంతో ఎఐ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. అధునాతన సాంకేతికతలకు నెలవుగా ఉండడమే కాకుండా వాటి వికాసానికి అవసరమైన సమస్త అనుకూలతలకు సంగమ స్థలంగా ఉన్న హైదరాబాద్‌ ఎఐ ఆధారిత భవిష్యత్‌ నిర్మాణానికి సరైన నెలవు. ప్రతి ఒక్క పౌరుని శ్రేయస్సు, రక్షణకు ఉపయోగపడే ఫలప్రదమైన ఎఐ ఆధారిత భవిష్యత్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ అభయమిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గ్లోబల్‌ ఎఐ సమ్మిట్‌–2024’ ఆ సమున్నత, వినూత్న భవిష్యత్తును దర్శించే అవకాశాన్ని సమకూర్చుతోంది. ఈ ఉత్తేజకర ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అయ్యేందుకు సరైన పరిస్థితులను, సబబైన భావాలను, సవ్యమైన సంధానాన్ని ఆ ప్రపంచ సదస్సు స్థిరపరచనున్నది.

మానవ కార్యకలాపాలను వినూత్నంగా మార్చివేస్తున్న అధునాతన సాంకేతికత కృత్రిమ మేధ (ఎఐ). భారతదేశ సైబర్‌ సిటీగా ప్రసిద్ధికెక్కిన హైదరాబాద్‌లో సాటిలేని రీతిలో పెరుగుతూ, ప్రభావదాయకంగా ఉన్న నవీన సాంకేతికతల వ్యవస్థలు ఎఐ విప్లవ పురోగమనానికి సానుకూల పరిస్థితులను సమృద్ధంగా సృష్టిస్తున్నాయి. ఈ ఉత్తేజకర విప్లవ ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అయ్యేందుకు సరైన పరిస్థితులను, సబబైన భావాలను, సవ్యమైన సంధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘గ్లోబల్‌ ఎఐ సమ్మిట్‌ – 2024’ సమకూర్చనున్నది.

వి.రాజన్న

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌

(సెప్టెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని

హెచ్‌ఐసీసీలో ‘గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌’)

Updated Date - Sep 03 , 2024 | 05:14 AM