Share News

జీఎస్టీ తకరారు...!

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:40 AM

నాలుగు నెలల క్రితం, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ఓ సమావేశంలో, తమిళనాడులోని ఓ హోటల్‌ యజమాని చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. స్వీట్లమీద 5శాతం జీఎస్టీ ఉంటే...

జీఎస్టీ తకరారు...!

నాలుగు నెలల క్రితం, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ఓ సమావేశంలో, తమిళనాడులోని ఓ హోటల్‌ యజమాని చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. స్వీట్లమీద 5శాతం జీఎస్టీ ఉంటే, కారం చిరుతిండిమీద 12శాతం ఉంటోంది... క్రీమ్‌బన్‌ మీద 18శాతం జీఎస్టీ ఉంటే, విడిగా బన్‌మీద అస్సలు లేదు..., మా హోటల్‌కు వచ్చిన కస్టమర్లు, బన్‌ విడిగా, క్రీమ్‌ విడిగా ఇస్తే మేమే దానిమీద పూసుకొని తింటామని అంటున్నారు మేడమ్‌ అంటూ ఆయన వివిధరకాల ఆహారపదార్థాలమీద జీఎస్టీ రేట్లు విభిన్నరకాలుగా ఉండటాన్ని ఎత్తిచూపాడు. ఒకేబిల్లులో అన్ని రకాల రేట్లను వేర్వేరుగా నమోదుచేయడం కష్టమన్నది కూడా ఆయన బాధ. జీఎస్టీ విషయంలో కస్టమర్ల కష్టాలూ తనబోటి యజమానుల బాధలూ ఆయన సులభంగా అర్థమయ్యేట్టు వివరించాడు. నిజమూ నిష్టూరమూ సమానపాళ్ళలో మేళవించి ఉన్న ఆ వ్యాఖ్యలు క్రీమ్‌బన్‌ విడియోగా విస్తృతప్రచారంలోకి రావడంతో, ఏమైందో ఏమో, సదరు వ్యాపారి వెంటనే ఆర్థికమంత్రిని విడిగా కలిసి క్షమాపణలు చెప్పకున్న మరో విడియో వెలుగుచూసింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సమక్షంలో ఆర్థికమంత్రితో ఆయన ఎంతో వినయంగా మాట్లాడుతున్న ఆ విడియోను తమిళనాడు బీజేపీ శాఖ విడుదల చేయడంతో కాంగ్రెస్‌ సహా విపక్షపార్టీలన్నీ మండిపడ్డాయి. వేర్వేరు జీఎస్టీ రేట్లను లెక్కగట్టలేక కంప్యూటర్లు క్రాష్‌ అవుతున్నాయంటూ ఆ హోటల్‌ యజమాని చేసిన వ్యాఖ్యల్లో అతిశయోక్తి ఉండవచ్చునేమో కానీ, మన జీఎస్టీ స్లాబుల మీద ఈ తరహా విమర్శలు కొత్తేమీ కాదు.


ఇకపై, పాప్‌కార్న్‌ ఫ్లేవర్‌ ఆధారంగానో, అందులో ఉన్న చక్కెర, మసాలా స్థాయిని బట్టో మూడురకాల పన్నులు వేయడం మీద సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో ఈ పాప్‌కార్న్‌ కనుక లేకుంటే మరో విశేషమే ఉండేది కాదు. అత్యంత కీలకమైన నిర్ణయాలు చేయాల్సిన ఈ సమావేశం ప్రజలకు మళ్ళీ అన్యాయం చేసింది. విద్యుత్‌ వాహనాలు సహా పాత వాహనాల క్రయ విక్రయాలమీద జీఎస్టీని పెంచడం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీతో సంబంధం లేనిదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మొత్తంగా కొత్త, పాత వాహనాల మార్కెట్‌మీద ఇది చూపబోయే ప్రభావంపై విభిన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కొత్తకార్ల కంటే వాడిన కార్ల మార్కెట్‌ బాగా వృద్ధి చెందుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలన్న అంశం ఈ సమావేశంలోనూ చర్చకు రాలేదు. ప్రధానంగా ప్రభుత్వరంగ బీమా కంపెనీల ఉద్యోగసంఘాలు సుదీర్ఘకాలంగా ప్రీమియంపై తక్కువ జీఎస్టీని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులకు బీమాను చేరువచేయడానికి ఇది ఉపకరిస్తుందని, వారి హక్కుల పరిరక్షణగా దీనిని చూడాలని సంఘాలు వాదిస్తూ, ఎంతోకాలంగా నాయకులకు విన్నపాలు చేస్తున్నాయి. ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని పార్లమెంట్‌లో విపక్షాలు డిమాండ్‌ చేసినప్పుడు జీఎస్టీ రాకమునుపు కూడా ఈ పన్ను ఉన్నదంటూ ప్రభుత్వం ప్రతివిమర్శ చేసింది. అప్పటి చర్చలూ, రచ్చలూ అటుంచితే, ఆ తరువాత ప్రభుత్వం నియమించిన కమిటీ బీమారంగంలో జీఎస్టీ తగ్గింపు విషయంలో ఏవో కొన్ని సూచనలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, ఐఆర్‌డీఎ ఇంకా తన అభిప్రాయం చెప్పలేదన్న కారణంతో ఈ మారు కూడా నిర్ణయం వాయిదాపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ విషయంలోనూ ఇదే జరిగింది. 148 ఉత్పత్తులపై రేట్లను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన మంత్రుల బృందం నివేదికపై చర్చ జరుగుతుందని అనుకుంటే, ఆ నివేదిక సమర్పణ తదుపరి సమావేశానికి వాయిదాపడింది.


న్యాయంగా, సమానంగా, పారదర్శకంగా, హేతుబద్ధంగా, సరళంగా ఉన్నప్పుడే చక్కని పన్ను విధానం అనిపించుకుంటుంది. జీఎస్టీ ఇప్పటికీ అమ్మకందారులనుంచీ, వినియోగదారులనుంచీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఈ వ్యవస్థను గాడినపెట్టడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి మంటను కాస్తంత తగ్గించడం ఎలాగూ జరగడం లేదు. కానీ, పిల్లలు వాడుకొనే పెన్సిళ్ళు, రబ్బర్ల నుంచి నిరుద్యోగులు ఎదుర్కొనే పరీక్షల వరకూ సమస్తమూ పన్నుపోటుకు గురవుతూండటం సామాన్యులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ప్రజల కనీసావసరాలను దృష్టిలో పెట్టుకొని, రేట్లను తగ్గించి, స్లాబులను కుదించవలసిన పని వెంటనే జరగాలి.

Updated Date - Dec 24 , 2024 | 04:40 AM