Share News

సుఖాంతం..!

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:20 AM

మొన్నటిదాకా ముఖ్యమంత్రి కుర్చీలో కూచొని, మళ్ళీ సీఎం కావాలని ఆఖరు వరకూ ప్రయత్నించి, హోం లేని డిప్యూటీ వద్దుగాక వద్దని భీష్మించుకున్న ఏక్‌నాథ్‌ శిందే ఎట్టకేలకు వచ్చారు, ప్రమాణం చేశారు. మహారాష్ట్రలో గురువారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవాన్ని అక్కడే ఉన్న ప్రధాని...

సుఖాంతం..!

మొన్నటిదాకా ముఖ్యమంత్రి కుర్చీలో కూచొని, మళ్ళీ సీఎం కావాలని ఆఖరు వరకూ ప్రయత్నించి, హోం లేని డిప్యూటీ వద్దుగాక వద్దని భీష్మించుకున్న ఏక్‌నాథ్‌ శిందే ఎట్టకేలకు వచ్చారు, ప్రమాణం చేశారు. మహారాష్ట్రలో గురువారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవాన్ని అక్కడే ఉన్న ప్రధాని నరేంద్రమోదీనుంచి, టెలివిజన్‌ చానెళ్ళలో చూసిన పామరజనం వరకూ ఎవరూ అంతత్వరగా మరిచిపోలేరు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు, ఆ ప్రతిలో ఉన్న ప్రతీమాటనూ వల్లెవేయడం తప్ప ఆ వేదికమీద వేరు ప్రసంగం చేయవచ్చునని ఏక్‌నాథ్‌ షిండే తొలిసారిగా నిరూపించారు. మైకుముందుకు రాగానే, గవర్నర్‌ నోటినుంచి మాటను అదుకోవాల్సిన శిందే, దానిని పెడచెవినబెట్టి, నలభైసెకన్లపాటు ఓ అధిక ప్రసంగం చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాకరేనుంచి తనకు రాజకీయబిక్ష పెట్టిన ఆనంద్‌ దిఘేవరకూ అందరినీ తలచుకున్నారు. మోదీ, అమిత్‌షాల పేర్లు కూడా అందులో ఉన్నందుకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు ఊపిరిపీల్చుకొని ఉంటారు. కానీ, శిందే వైఖరి ఆ ఉత్సవానికి హాజరైన పెద్దలందరినీ ఇబ్బందిపెట్టిందని వారి మొఖకవళికలే చెబుతున్నాయి. శిందేలో అణచిపెట్టు్కొని ఉన్న ఆగ్రహం, అసహాయత అలా వ్యక్తమైనాయని గిట్టనివాళ్ళు భాష్యం చెప్పుకుంటున్నారు.


పదిరోజుల సస్పెన్స్‌కు తెరపడింది, ఫడణవీస్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రానురానంటూ ఆఖరు వరకూ అదే ఉద్రిక్తస్థితిని కొనసాగించిన శిందే ఒకవైపు, ఆరోసారి డిప్యూటీ సీఎం పోస్టులో రికార్డు సృష్టించిన అజిత్‌పవార్‌ మరొకవైపు నిలబడివున్న ఆ దృశ్యం చూసినవారికి కథ సుఖాంతమైందని అనిపిస్తుంది. శిందే దెబ్బకు బీజేపీ ఇంకొంత దిగివచ్చిందనీ, మరో మూడు పోస్టులు ఆయనపార్టీకి దక్కాయని వార్తలు వస్తున్నాయి. ఏదో సినిమాలో డైలాగుమాదిరిగా, పదవులు మారాయి తప్ప, మనుషులువారే, దిశా వేగమూ అవే అని కొత్త సీఎం తన ప్రభుత్వం గురించి చెప్పుకున్నారు. మహాయుతి చిరకాలం నిలుస్తుందని, నాలుగుకాలాలు వర్థిల్లుతుందనీ అన్నారు. కలసినడుస్తామని, సంఘటితంగా రాష్ట్రాన్ని పాలిస్తామని హామీ ఇచ్చారు. మహాయుతి మనుగడ విషయంలో ఏ భయమూ అక్కరలేదన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. శిందే ఒత్తిడిరాజకీయాలకు బీజేపీ లొంగిరాలేదన్న మాట నిజమే కానీ, ఈమారు ఫడణవీస్‌ను కాదనగలిగే శక్తి బీజేపీకి కూడా లేదన్నది నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికీ, ఫడణవీస్‌ ముఖ్యమంత్రి కావడానికీ ఆరెస్సెస్‌ కారణమని అందరికీ తెలుసు.


గతంలో కంటే మరింత బలపడిన రెండు పక్షాలతో ఫడణవీస్‌ కలసి నడవబోతున్నారు. యాభై ఏడుస్థానాలు నెగ్గిన శిందేకు ముఖ్యమంత్రిగా మరోమారు కొనసాగాలన్న కోరిక ఉన్నట్టుగానే, ఎప్పటికైనా ఆ కుర్చీలో కూచోవాలన్న ఆశ అజిత్‌పవార్‌కు ఉండటం సహజం. శరద్‌పవార్‌నుంచి చీలివచ్చినప్పుడు అజిత్‌ స్థితివేరు, ఇప్పుడు 41స్థానాలతో, పెద్దాయన పార్టీని పదిస్థానాలకు పరిమితం చేసిన స్థాయి వేరు. పార్టీ వ్యవస్థాపకులు, వారసులకంటే మాతృసంస్థలను చీల్చివచ్చినవారు ఈమారు విస్తృత ప్రజామోదంతో మరింత బలమైన భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఓ యాభైస్థానాలు మినహా శాసనసభను మొత్తంగా కొల్లగొట్టినందువల్ల మహాయుతి ఓ మహాశక్తి. పూర్తి మెజారిటీకి ఓ పాతికస్థానాల దూరంలో ఉన్న బీజేపీకి కూడా తిరుగులేదు. మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని ఫడణవీస్‌ ఏ ధైర్యంతో అన్నారో గానీ, అదే జరిగింది. ఐదేళ్ళక్రితం ఉద్ధవ్‌థాకరేతో కలిసి ఎన్నికల్లో గెలిచాక, ఎప్పటిలాగానే బీజేపీ నుంచి తానే సీఎం అవుతానని ఈయన నమ్మాడు. కానీ, బాల్‌థాకరే కాలం నుంచీ రెండుపార్టీలూ పాటిస్తున్న సంప్రదాయాన్ని ఉద్ధవ్‌ కాదుపొమ్మన్నారు. ఈ మారు తానే కూర్చుంటానని నిర్ణయించి అప్పటికింకా చీలని ఎన్సీపీతోనూ, కాంగ్రెస్‌తోనూ చేతులు కలిపి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. తన తరువాత ఎదిగివచ్చిన కుమారుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలని కూడా ఆశపడ్డాడు. ఆ తరువాత శిందేను సృష్టించి శివసేనను చీల్చి బీజేపీ తిరిగి రాజ్యం దక్కించుకున్నప్పటికీ, అధిష్ఠానం మాట కాదనలేక ఫడణవీస్‌ ఆ కుర్చీని వదులుకోవలసి వచ్చింది. చేజేతులా ఏక్‌నాథ్‌కు అప్పగించాల్సివచ్చింది. సముద్రం వెనక్కుపోయింది కదా అని ఒడ్డున పిచికగూళ్ళు కట్టకూడదు, నేను సముద్రాన్ని, మళ్ళీ వస్తాను అని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు అంతా గుర్తుచేసుకుంటున్నారు. రాజకీయ యుద్ధంలో ఓడిగెలిచిన ఫడణవీస్‌కు రాబోయేరోజుల్లో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియనిదేమీ కాదు. ప్రస్తుతం...సుఖాంతం!

Updated Date - Dec 06 , 2024 | 01:20 AM