Share News

‘నమామి గంగే’ను చూసి నేర్చుకోండి!

ABN , Publish Date - Nov 09 , 2024 | 07:07 AM

నదుల చుట్టూ నాగరికత పరిఢవిల్లిందనేది చారిత్రక సత్యం. ప్రపంచ వ్యాప్తంగా నదులు, సముద్రాలు, పెద్ద పెద్ద నీటివనరులున్నచోటే జనజీవనం కొనసాగింది. భారతదేశంలోనూ.. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద మొదలైన నదీతీరాల్లోనే ఎన్నో పట్టణాలు, నగరాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలు వెలిశాయి.

‘నమామి గంగే’ను చూసి నేర్చుకోండి!

నదుల చుట్టూ నాగరికత పరిఢవిల్లిందనేది చారిత్రక సత్యం. ప్రపంచ వ్యాప్తంగా నదులు, సముద్రాలు, పెద్ద పెద్ద నీటివనరులున్నచోటే జనజీవనం కొనసాగింది. భారతదేశంలోనూ.. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద మొదలైన నదీతీరాల్లోనే ఎన్నో పట్టణాలు, నగరాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలు వెలిశాయి. నేటికీ కొనసాగుతున్నాయి. అంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి నదీతీరాలను, నీటివనరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. వెయ్యిమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలైనట్లు.. నదులను కాపాడుకోవటం, వాటి పునరుజ్జీవనానికి పనిచేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘సబర్మతీ రివర్‌ఫ్రంట్’ ప్రాజెక్టు నిర్మాణంతో.. 2005లోనే తొలి అడుగు వేశారు.

2014 సార్వత్రక ఎన్నికలకు ముందు.. బీజేపీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో నరేంద్రమోదీ గంగానది తీరంలో అనేకవేల సంవత్సరాల క్రితం వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన, పరమపవిత్ర వారణాసి నగరం నుంచి లోక్‌సభ సభ్యుడిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా మాట్లాడుతూ.. ‘గంగమ్మతల్లి నన్ను పిలిచింది’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత వారి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం గంగానదిని, దాని ఉపనదులను ప్రక్షాళన చేయడం, వాటిని పునరుజ్జీవనం లక్ష్యంగా ‘నమామి గంగే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంగానది పరిరక్షణ కోసం మార్చి 2021 వరకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గంగానది పరిరక్షణ, గంగానది ప్రక్షాళన మొదట నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంతో.. మార్చి 2026 వరకు జరగాల్సిన రెండో విడత పనులకు శ్రీకారం చుట్టారు.

‘నమామి గంగే’ కార్యక్రమం అమలుపై మోదీ గారు ప్రత్యేకమైన దృష్టి సారించారు. దీన్ని ఓ యజ్ఞంగా ముందుకు తీసుకెళ్లారు. గంగానదికి పూర్వవైభవాన్ని కల్పించేందుకు సంపూర్ణమైన, సమగ్రమైన విధానాన్ని నిర్దేశించారు. గంగానదిలో పేరుకుపోయిన చెత్తను, మురికిని తొలగించడంతోపాటుగా.. గంగతోపాటుగా దాని ఉపనదులు ప్రవహిస్తున్న 5 రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో.. అక్కడ మురికినీటి నిర్వహణ, చెత్త నిర్వహణ, ఘాట్ల సుందరీకరణ, మొక్కలు నాటడం, అటవీకరణ, జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడం వంటి వాటిపై సానుకూలమైన ప్రగతి సాధించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, పాలకుల అంకితభావం, ప్రధాని మోదీ చొరవ, ప్రజల భాగస్వామ్యం, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతోనే ఇది సాధ్యమైంది.


జూన్ 2024 వరకు గంగానది పరివాహక ప్రాంతంలో రూ.39,080.70 కోట్ల అంచనాతో మొత్తం 467 ప్రాజెక్టులు చేపట్టగా.. ఇందులో 292 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల్లో 200కు పైగా గంగానదిలోకి వస్తున్న వ్యర్థాల నిర్వహణకోసం ఉద్దేశించిన ప్రాజెక్టులే.

గంగానది పరివాహకంలోని 5 రాష్ట్రాల్లో మొత్తం 97 నగరాలున్నాయి. అందుకోసం వీటన్నింటికీ కలిపి, సంయుక్తంగా.. అర్బన్ రివర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (URMP) తీసుకొచ్చారు. దీని ద్వారా ఈ నగరాల్లో పైన పేర్కొన్న ప్లానింగ్‌, అమలులో ఏకరూపత సాధ్యమైంది.

గంగానది పునరుజ్జీవన ప్రాజెక్టుకు స్ఫూర్తి.. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు. 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కార్యాచరణ.. విడతల వారిగా కొనసాగుతోంది. గుజరాత్ రాజధాని మీదుగా ప్రవహించే సబర్మతి నది అభివృద్ధికి.. ప్రణాళికాబద్ధంగా కరకట్టల నిర్మాణం, సీవరేజ్ ప్లాంట్లు, కారిడార్లు, పార్కులు, క్రీడా సౌకర్యాల నిర్మాణం చేపట్టారు. సుందరీకరణ, వ్యర్థాల నిర్వహణ, వరదలనుంచి సంరక్షణ, నది నీటిని సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలన్నింటిపైనా ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇందుకోసం మొదట్లో రూ.1400 కోట్లు ఖర్చుచేయగా.. ఆ తర్వాత 2020లో మరో రూ.850 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించింది.

ఈనాడు ప్రపంచంలోనే అతితక్కువ ఖర్చుతో అత్యంత అద్భుతంగా, అనేక దేశాలకు ఆదర్శంగా ‘సబర్మతి రివర్‌ఫ్రంట్’ను చూడటానికి దేశ, విదేశీ ప్రతినిధులు ప్రతిరోజూ సందర్శనకు వస్తున్నారు. 2016 డిసెంబర్ 11న చేపట్టిన ‘నర్మద సేవ్ మిషన్’ కూడా నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేసే దిశగా విజయవంతంగా కొనసాగుతోంది.

నదుల సుందరీకరణ, పునరుజ్జీవనం విషయంలో ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా, అవసరమైన మేరకు సద్వినియోగం చేసుకోవడం, ప్రజల సహాయ, సహకారాలతో ముందడుగేయడం చాలా కీలకం. కానీ దురదృష్టవశాత్తూ మూసీ సుందరీకరణ విషయంలో ఇవేవీ జరగడం లేదు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందమొకటి ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటించి.. అక్కడి ‘హాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు’ తరహాలో మూసీ అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి లండన్‌లో పర్యటించి ‘థేమ్స్’ నది తరహాలో మూసీ పురోగతి ఉంటుందని ప్రకటించారు. ఎవరికి వారు తోచిన ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.

మన దేశంలోనే.. మన కళ్లముందే సబర్మతి, గంగానది వంటి విజయగాథలుండగా.. వీటిని అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఏం చేద్దాం? ఎలా చేద్దాం? ఏ విధంగా ముందుకెళ్దాం? వంటి ప్రాథమిక అంశాలపై దృష్టిపెట్టకుండా.. విదేశీ పర్యటనలు, అక్కడి నదుల ప్రాజెక్టుల స్టడీ టూర్లు చేపట్టడం.. ఏకంగా లక్షన్నరకోట్ల బడ్జెట్ అని చెప్పి.. ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించే ప్రయత్నం మాత్రమే జరుగుతోంది.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు బేసిక్ ప్లానింగ్ లేకుండానే.. దశాబ్దాలుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను భయపెట్టి వారిని ఖాళీ చేయించేందుకు దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోంది. వీలైనంత త్వరగా వీరిని ఇక్కడి నుంచి పంపించాలని కుట్ర చేస్తున్నారు. వారందరిపై మూసీ ఆక్రమణదారులుగా ముద్రవేస్తూ.. భయాందోళనలకు గురిచేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. పైనున్న ఉదాహరణలను అధ్యయనం చేసి, తదనుగుణంగా నిధుల సమీకరణ చేసి, మూసీలో కలిసే డ్రైనేజీ, ఇతర వ్యర్థాల నిర్వహణపై దృష్టిపెట్టి, ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలి తప్ప.. గందరగోళమైన ప్రకటనలతో ప్రజల్లో ఆందోళనలు సృష్టించాలనుకునే ఆలోచనలు సరికాదు. గంగానది ప్రక్షాళనకు.. 42వేల కోట్లు కేటాయింపు, సబర్మతి సుందరీకరణకు రూ.2,250 కోట్లు కేటాయించిన సందర్భంలో.. మూసీ ప్రక్షాళనకు ఎలాంటి ప్రణాళికల్లేకుండానే లక్షన్నరకోట్లు.. ఖర్చుచేస్తామని చెప్పడం ఎంతవరకు అర్థవంతమో సీఎం సమాధానం చెప్పాలి.

మూసీ ఒడ్డుపై ఉన్న వేలాది పేదలు 40–50 ఏళ్ల క్రితం నిర్మించుకుని నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చేయడం, హైకోర్టు, సిటీ కాలేజ్ మొదలైన ప్రతిష్ఠాత్మక సంస్థలను నగర శివార్లకు తరలించి.. ఈ చారిత్రక భవనాలను కూల్చేయాలన్న కుట్ర అత్యంత దుర్మార్గమైనది. విలువైన ఈ భూములపై కన్నేసే.. కాంగ్రెస్ ప్రభుత్వం ‘మూసీ ప్రాజెక్టు’ తెరపైకి తెచ్చిందనే విమర్శలు మొదలయ్యాయి. ఇదే నిజమైతే తీవ్ర ఆక్షేపణీయం. ఏ ప్రాజెక్టు అయినా, ఏ పథకమైనా, ఏ కార్యక్రమమైనా ఒక సమగ్రమైన కార్యాచరణ లేకుండా పనిచేస్తూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించదు.

ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. 2021లో.. దేశవ్యాప్తంగా నదుల ఒడ్డున ఉన్న నగరాలన్నీ కలిసి రివర్ సిటీస్ అలయెన్స్ (RCA) ఏర్పాటైంది. ఇందులో మూసీ ఒడ్డున ఉన్న హైదరాబాద్ కూడా ఒకటి. ప్రారంభంలో రిషికేష్, హరిద్వార్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, మథుర, అయోధ్య, చెన్నై, హైదరాబాద్, విజయవాడ వంటి దాదాపు 30 నగరాలతో ఈ కూటమి ఏర్పడింది. తర్వాత ఇతర నగరాలు కూడా ఇందులో చేరాయి. పట్టణ నదుల సుస్థిర నిర్వహణ, వివిధ పరిశోధనలు – అధ్యయనాలు – ఉత్తమ పనితీరు పద్ధతుల మార్పిడి మొదలైన అంశాలను చర్చించడం, వాటిని అమలు చేయడం ఈ కూటమి ఏర్పాటు వెనక ప్రధాన లక్ష్యం.


ఇది ఆయా రాష్ట్రాల్లో సత్ఫలితాలను సాధించడంతో.. ప్రధానమంత్రి మోదీ గారి ఆలోచనకు అనుగుణంగా.. భారత్ చొరవతో అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ రివర్ సిటీస్ అలయెన్స్ (GRCA) ఏర్పాటైంది. COP28 (Conference of Parties on Climate Change) సమావేశాల్లో ప్రధాని మోదీ కృషితో.. భారత జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ GRCA రూపుదిద్దుకుంది. దీని ద్వారా అంతర్జాతీయంగా నదీతీరాన ఉన్న వివిధ నగరాలు అవలంభిస్తున్న విధానాలు అనేక నగరాల అభివృద్ధికి కూడా దోహదపడతాయి.

2019లో నేషనల్ గంగా కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా.. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నదుల ఒడ్డున ఉన్న నగరాలు నదీకేంద్రిత (river centric) ఆలోచన, కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. URMP (Urban River Management Plan)ని మరింత బలోపేతం చేస్తూ అర్బన్ ప్లానింగ్ ప్రక్రియలో నదుల శుద్ధీకరణపై దృష్టి పెట్టాలి. నదుల పునరుజ్జీవన బాధ్యత ఆయా నగరాలదే. నదుల పునరుజ్జీవన అనేకాకుండా.. ఓ అభివృద్ధి కార్యక్రమంగా చూడాలి’ అని పేర్కొన్నారు.

మూసీ నదిలో వ్యర్థాలు కలవకుండా.. మురుగునీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. కానీ.. ఇలాంటి ప్రయత్నాలేమీ ప్రారంభించకుండానే.. పేదల ఇండ్లను కూల్చాలనే ప్రయత్నం విమర్శలకు దారితీస్తోంది. కావున పేదల ఇళ్లను కూల్చకుండా ప్రభుత్వం పునరాలోచించి అందరికీ ఆమోదయోగ్యమైన, నిధుల దుర్వినియోగానికి అవకాశం ఇవ్వకుండా సమగ్ర విధానంతో ముందుకెళ్తే అందరి సహకారం అందుతుంది. పేదల కోసం, మరోపక్క మూసీ ప్రక్షాళన కోసం పూర్తి అంకితభావంతో అందరూ సహకరిస్తారనడంలో ఎలాంటి అనుమానం ఉండదు.

మన కళ్లముందే సబర్మతి, గంగానది వంటి విజయగాథలుండగా.. వీటిని అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? గంగానది ప్రక్షాళనకు రూ.42వేల కోట్లు, సబర్మతి సుందరీకరణకు రూ.2,250 కోట్లు కేటాయించగా మూసీ ప్రక్షాళనకు ఎలాంటి ప్రణాళికల్లేకుండానే లక్షన్నరకోట్లు ఖర్చుచేస్తామని చెప్పడం ఎంతవరకు అర్థవంతమో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పగలరా?

జి.కిషన్ రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

Updated Date - Nov 09 , 2024 | 07:07 AM