Share News

పర్యావరణానికీ, నిర్వాసితులకూ మధ్య హైడ్రా!

ABN , Publish Date - Nov 02 , 2024 | 06:18 AM

భూ కబ్జాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే జరిగాయి. అందులో చెరువులు, కుంటలు, నాలాలు అధికంగా కబ్జాకు గురి అయినాయి. దేశంలో ఏ మహానగరానికీ లేనంతగా మన హైదరాబాద్‌

పర్యావరణానికీ, నిర్వాసితులకూ మధ్య హైడ్రా!

భూ కబ్జాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే జరిగాయి. అందులో చెరువులు, కుంటలు, నాలాలు అధికంగా కబ్జాకు గురి అయినాయి. దేశంలో ఏ మహానగరానికీ లేనంతగా మన హైదరాబాద్‌ నగరంలో నిజాం నిజాం సర్ఫేకాసు భూములన్నీ ప్రభుత్వ భూములుగా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం కారణంగా ఈ నీటి వనరులన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ పేరుతో అవన్నీ తొలగించాలని హైడ్రా పేరున విస్తృతాధికారాలతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. పాత చట్టంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారికి రూ.1000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష, లేదా రెండూ చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ భూమి దురాక్రమణ (నిరోధక) 1982 చట్టంగా ఉండింది. నమోదు కాబడిన చాలా కేసులపై లోతైన విచారణలు జరిగాయి. నేరం రుజువైనప్పటికీ ఎవరికీ శిక్ష పడలేదు, కనీసం జరిమానా కూడా విధించలేదు. 2016లో ఆ చట్టమే తీసివేశారు. అందుకే చట్టం పట్ల భయం లేదు. సమాజంలోని గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి వారి తప్పిదాలకు సాధారణ పౌరులు నష్టపోతున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 168 నోటిఫైడ్‌ కాబడిన చెరువులు ఉన్నాయి. అవి ఇరవై నుంచి తొంభై శాతం వరకు కబ్జాకు గురయ్యాయి. వీటన్నింటికీ బౌండరీలు, హద్దులు, ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ (ఎఫ్‌టిఎల్‌) పూర్తి స్థాయి నీటి మట్టం స్థిరీకరించి 30 ఫీట్లు అదనంగా నీటి నిలువను అంచనా వేస్తూ బఫర్‌ జోన్‌ను కూడా స్థిరపరిచారు. నిజానికి ఈ ఆక్రమణలు అన్ని తీసివేయాల్సిందే. అధికారులు, రాజకీయ నాయకులు, బిల్డర్లు, ప్రభుత్వ స్థలాలను అమ్మిన వాళ్లందరినపై ఏ చర్య తీసుకోకుండా వదిలేయడం సరైనది కాదు. అలాగే ఏ తప్పూ చేయని పేదలు హైడ్రాకు బలి కాకుండా చూడాలి. గత పది సంవత్సరాల నుండి కబ్జాలు మరీ యథేచ్ఛగా జరిగిపోయాయి. గొలుసుకట్టు లింకులు మూసీ నది ఆక్రమణలకు గురి అయ్యాయి. ఈ ఆక్రమణలకు ప్రధాన సూత్రధారులు బస్తీ లీడర్లు, గల్లీ లీడర్లు. వీరికి బలమైన అండగా ఉండేది స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు.


గమనించవలసిన విషయం ఏమిటంటే– బఫర్‌ జోన్‌, ఎఫ్‌టిఎల్‌ వీటిపై 1948 నుండి ఇప్పటివరకు తుది నివేదిక లేదు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పీకల్లోతు అవినీతితో కూరుకుపోయింది. చెరువులు, కుంటలు, నాలాలు అన్ని కబ్జాలు అయి పెద్దపెద్ద మాల్స్‌ వెలిసాయి. రెవిన్యూ, సర్వేయర్‌, ఇరిగేషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి హద్దు రాళ్ళు వేసినారు. ఆ హద్దు రాళ్ళను దౌర్జన్యంగా తొలగించి ముందుకు జరిపారు. అధికారులు బదిలీ అయ్యాక పాత అధికారి ఇక్కడివరకే బౌండరీ గుర్తులు వేశారు అని దబాయించి మరీ అమ్మిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. నగరం నడిబొడ్డున హుస్సేన్‌ సాగర్‌ కూడా మూడు వందల ఎకరాల పైచిలుకు ఆక్రమణకు గురి అయింది. అందులో ప్రధాన పాత్ర గత ప్రభుత్వాలదే. అన్ని విచారణలూ చేసి లోన్‌ ఇచ్చిన బ్యాంకులకు ఇబ్బంది లేదు. వారు ఇచ్చిన డబ్బు మాఫీ కాదు. ఎఫ్‌టిఎల్‌ అని, బఫర్‌ జోన్‌ అని అన్ని విచారణలూ పూర్తి చేసి లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న తర్వాతే బ్యాంకు లోన్‌ ఇస్తుంది. ఇందులో బ్యాంకు పాత్ర కూడా ఉంది. కూల్చివేయబడిన ఇంటికి తీసుకున్న రుణం మాఫీ అవ్వదు. తన లోన్‌ రికవరీని నిలుపుదల చేయదు. ఈ ప్రశ్నను బ్యాంకు అధికారులు వేసుకోవాల్సిన అవసరం ఉంది.

స్వాధీనం చేసుకోబడిన భూమిని ఏం చేస్తారు? ప్రజలు మాకు అధికారమిచ్చారు కాబట్టి మేము ఏదైనా చేయగలం అనేది సరికాదు. ప్రజలకు ప్రశ్నించే అధికారం ఉంది. మీరు హైడ్రా పేరు మీద తీసుకునే భూములలో వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. అందులో వ్యాపార, వాణిజ్య స్థలాలు కూడా ఉన్నాయి. వాటిని ఏం చేస్తారు? అమ్మేస్తారా, లేక పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించి ఇస్తారా? ముందుగా ఉన్న చెరువును యథాస్థితికి తీసుకొస్తారా? ఇప్పుడు అంతటి విస్తీర్ణం గల చెరువులు పునరుద్ధరించడం సాధ్యమైతే కాదు. హైడ్రా మొదలైంది, ఆపడం ఎలా అనే సందిగ్ధంలో ఉన్న దశలో రాష్ట్ర హైకోర్టు ఈ పనిని ఆపగలిగింది. ఈ గ్యాప్‌ ఇలాగే ఉంటుందా? ఆగితే హైడ్రా పరిస్థితి ఏమిటి? దాని పర్యవసానం ఎలా ఉండబోతుంది? పర్యావరణ ప్రేమికులుగా మనం చూస్తూ ఊరుకోలేం. మరో పక్క ఏ తప్పూ చేయని వారు కూల్చిన ఇళ్లను చూసుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఈ రెండింటి మధ్యా ఒక సమన్వయాన్ని హైడ్రా సాధించగలగాలి.

– వి.బాలరాజు, రిటైర్డ్‌ తహసిల్దార్‌

Updated Date - Nov 02 , 2024 | 06:18 AM