ఆకలి.. అవమానం!
ABN , Publish Date - Oct 18 , 2024 | 02:32 AM
ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం స్థానం కాస్తంత మెరుగుపడినందుకు సంతోషించాలో, పరిమాణంలోనూ, ఆర్థికంగానూ చిన్నవైన పొరుగుదేశాలతో పోల్చితే బాగా వెనుకబడి ఉన్నందుకు బాధపడాలో...
ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం స్థానం కాస్తంత మెరుగుపడినందుకు సంతోషించాలో, పరిమాణంలోనూ, ఆర్థికంగానూ చిన్నవైన పొరుగుదేశాలతో పోల్చితే బాగా వెనుకబడి ఉన్నందుకు బాధపడాలో తెలియడం లేదు. శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌లు ఈ సూచీలో భారత్‌కంటే మెరుగ్గా ఉన్నాయి. 127దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 105వ స్థానంలో ఉంది. గత ఏడాది 125దేశాల్లో 111వస్థానంలో, అంతకుముందు 107లోనూ ఉన్నందున ప్రస్తుతానికి స్థానం కాస్తంత మెరుగుపడినట్టే. కానీ, తీవ్రమైన ఆకలిబాధ చవిచూస్తున్న దేశంగా ముద్ర పడటం అవమానకరం. పదేళ్ళలో దేశం అద్భుతంగా అభివృద్ధి చెందిందనీ, జీడీపీ హెచ్చిందనీ, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ పరుగుపందెంలో ముందంజలో ఉన్నదని ప్రచారం చేసుకుంటున్న మన పాలకులను ఇటువంటి నివేదికలు కచ్చితంగా కలవరపెడతాయి. వాటిని విదేశీకుట్రగా ముద్రవేయడం, తప్పులతడక అంటూ తీసిపారేయడం వారికి ఎంతో సులువు.
ఆకలిబాధ ఆందోళనకర స్థాయిలో ఉన్న దేశాల్లో మనది కూడా ఒకటి. మరోలా చెప్పుకోవాలంటే, ఆ లెక్కన పాకిస్థాన్, అఫ్ఘానిస్థా్‌న్ వంటి దేశాల సరసన భారత్ నిలిచింది. పోషకాహారలోపం, శిశుమరణాలు ఇత్యాది ప్రాతిపదికలమీద ఆకలిబాధను లెక్కగట్టే ఈ నివేదిక భారత్‌లో ఉన్న తీవ్రమైన పరిస్థితులను లోతుగా ప్రస్తావించింది. దాదాపు 14శాతం మంది పోషకాహారలోపాన్ని ఎదుర్కొంటున్నారు, ఐదేళ్ళలోపు పిల్లల్లో మూడో వంతుకంటే ఎక్కువమంది వయసుకు తగ్గ ఎత్తు ఎదగలేదు, సుమారు 19శాతం మంది ఎత్తుకు తగ్గబరువు లేరు. ఐదేళ్ళు నిండకుండానే కన్నుమూస్తున్న పిల్లల మూడుశాతం వరకూ ఉన్నారు. నాలుగు కీలకమైన అంశాలను తీసుకొని, పోషకాహారలోపం, శిశుమరణాలకు మూడోవంతు విలువ, మిగతా రెండింటికీ ఆరోవంతు విలువ ఇస్తూ మొత్తం స్కోరు లెక్కగట్టే ప్రక్రియలో భారత్ 27.3 పాయింట్లు దక్కించుకుంది. పోషకాహారం మాట పక్కనబెడితే, ఆహారం అందుబాటులో ఉండటమన్నది కూడా ఒక సమస్య అని ఈ నివేదిక తెలియచెబుతోంది. ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయి అప్పులకోసం వెంపర్లాడుతున్న శ్రీలంక, రాజకీయ సంక్షోభంలో మునిగిన బంగ్లాదేశ్, నలుదిక్కులా పోరాటాలతో, అంతర్యుద్ధంతో తీసుకుంటున్న మయన్మార్ వంటి దేశాలు మనకంటే ఎంతో మెరుగైన స్థానంలో ఎలా నిలవగలిగాయన్నది అసలు ప్రశ్న. పౌష్టికాహారలోపం ఎదుర్కొంటున్న ప్రజల సంఖ్య ప్రపంచస్థాయిలో కూడా పెరుగుతున్నదని, యుద్ధాలు, అంతర్యుద్ధాలు, వలసలు, వాతావరణ మార్పులు వంటివి ప్రపంచ ఆకలిసూచీ స్కోరును పెంచేస్తున్నాయని ఈ నివేదిక అంటోంది.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను భారతదేశ పాలకులు ఒప్పుకోకపోవడం కొత్తేమీ కాదు. లోపభూయిష్టమైన పద్ధతుల్లో, విధానాల్లో ఈ లెక్కలు కడుతున్నారని, కొద్దిమందిని నమూనాగా తీసుకొని, ఆకలిని దేశవ్యాప్తంగా వర్తింపచేస్తున్నారని మన ప్రభుత్వం వాదన. ఈ నివేదికలో దేశాలన్నింటికీ వర్తించిన కొలమానాలే తప్ప మనకు వేరు లెక్కలంటూ ఏమీ ఉండవు. పైగా, నివేదిక తయారీలో వాడిన వివరాలు, గణాంకాలన్నీ ప్రపంచ ఆరోగ్యసంస్థ, యునిసెఫ్ తదితర ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల నుంచి సేకరించినవో, అవి ప్రచురించిన నివేదికలనుంచి తీసుకున్నవో అవుతాయి. గత నివేదికలను ప్రభుత్వం తిరస్కరించినప్పుడు కూడా భారత ప్రభుత్వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల వంటివి ఈ చేదునిజాలను ముందే చెప్పిన విషయాన్ని విపక్షాలు, మీడియా గుర్తుచేశాయి కూడా.
గత కొన్ని దశాబ్దాలుగా భారత్ స్కోరు మెరుగుపడినప్పటికీ, దేశంలో ఇంకా ఆకలికేకలు తగ్గలేదని ఈ సూచీ చెబుతున్నది. అంతర్జాతీయ సమాజం ముందు తలవంపులు తెచ్చే ఇటువంటి నివేదికలను తిరస్కరించడానికే పాలకులు ఉత్సాహపడటం సహజం. ఒప్పుకోనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగే సర్వేలు, వివిధ ప్రభుత్వశాఖలు సేకరించే గణాంకాలమీద ఇటీవలి కాలంలో పాలకులకు అయిష్టత పెరుగుతూ, వాటిని పూర్తిగా నిర్వహించకపోవడమో, వాయిదావేయడమో, సర్వేలు చేపట్టినా వివరాలు బహిర్గతపరచకపోవడమో జరుగుతోంది. కానీ, ప్రజలకు ఆహారాన్ని అందించే విషయంలో ఎంతో శ్రద్ధపెడుతున్నామంటున్నవారు, ఆశించిన లక్ష్యం నెరవేరుతున్నదీ లేనిదీ తెలుసుకోక తప్పదు. జాతీయ ఆహారభద్రతాచట్టం, ప్రధానమంత్రి అన్న యోజన, మాతృవందన, పోషణ్ వంటి అనేకానేక పథకాలతో ఆకలిని ఉపశమింపచేసి, పలు కార్యక్రమాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నామన్న ప్రభుత్వం వాదనను ఆకలిసూచీలో మన స్థానం సవాలు చేస్తున్నమాట నిజం.