Share News

అభివృద్ధి వేగానికి పెట్టుబడుల ఇంధనం

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:47 AM

‘‘ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాలుగవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలి.

అభివృద్ధి వేగానికి పెట్టుబడుల ఇంధనం

‘‘ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాలుగవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలి. అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలి!’’ ప్ర‌పంచ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా చేసిన అమెరికా ప‌ర్య‌ట‌న‌లో సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాట‌లివి. ఇది సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి రెండో విదేశీ ప‌ర్య‌ట‌న‌. బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి రోజుల్లోనే దావోస్ ప‌ర్య‌ట‌న చేసి రూ.40,232కోట్ల పెట్టుబ‌డుల‌ను రాబట్టారు. తాజాగా ఏడు రోజుల‌ అమెరికా, రెండు రోజుల ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌ల‌లో అమెరికా నుంచి రూ.31,502 కోట్లు, ద‌క్షిణ కొరియా నుంచి రూ.4500 కోట్ల‌ విలువైన పెట్టుబ‌డుల‌కు ఒప్పందాలు కుదిరాయి. దీంతో సుమారు 30,750 పైగా ఉద్యోగాలు రానున్నాయి.


తాము ఇచ్చిన రాష్ట్రాన్ని దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన రాష్ట్రంగా అభివృద్ధి చేసుకోవాల‌ని కాంగ్రెస్‌కు ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం అదే విజ‌న్‌తో ముందుకు సాగుతోంది. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మొద‌ట‌గా ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ ఐటీ దిగ్గ‌జ కంపెనీ కాగ్నిజెంట్ ప్ర‌తినిధుల‌తో జ‌రిగిన స‌మావేశం విజ‌య‌వంత‌మైంది. హైద‌రాబాద్‌లో కాగ్నిజెంట్ 10 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల‌తో భారీ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌డం శుభప‌రిణామం. దీంతో సుమారు 15వేల మందికి ఉద్యోగావ‌కాశం లభిస్తుంది. ఉద్యోగావ‌కాశాలే కాకుండా ఆర్టిఫిషీయ‌ల్ ఇంటెలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్‌, డిజిట‌ల్ ఇంజినీరింగ్‌, క్లౌడ్ సొల్యూష‌న్స్‌తో పాటు ఇత‌ర ఆధునాత‌న సాంకేతిక రంగాల‌లో ప్ర‌గ‌తిని సాధించేందుకు మార్గం ఏర్ప‌డింది. అమెరికాకు చెందిన వాల్ష్‌ క‌ర్రా హోల్డింగ్స్ సంస్థ రూ.839 కోట్ల‌తో పెట్టుబ‌డులను పెట్టేందుకు ముందుకొచ్చింది. మ‌హిళా పారిశ్రామికవేత్త‌ల‌కు ప్రోత్సాహాం అందించేందుకు వి-హ‌బ్‌లో మ‌రో రూ.42 కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు ఒప్ప‌దం కూడా చేసుకుంది. బ‌యో ఫ్యూయ‌ల్స్ త‌యారీ సంస్థ స్వ‌చ్ఛ బ‌యో ప్లాంట్‌ను రూ.1000 కోట్ల‌తో హైద‌రాబాద్‌లో నెల‌కొల్పేందుకు ముందుకొచ్చింది. మ‌రోవైపు టెక్నాల‌జీ, స‌ర్వీసెస్ సొల్యూష‌న్స్‌లో పేరొందిన ఆర్సీసీఎం సంస్థ సైతం న‌గ‌రంలో విస్త‌ర‌ణ‌కు ముందుకొచ్చింది. ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ వివింట్ హైద‌రాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్లతో అత్యాధునిక ఇంజెక్ట‌బుల్స్ త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. 2025 నుంచి కార్నింగ్ వాణిజ్య సంస్థ ఉత్ప‌త్తిని చేప‌ట్టేందుకు అంగీక‌రించింది. ఆర్థికప‌ర‌మైన సేవ‌ల్లో పేరొందిన అమెరికా బ‌హుళ‌ జాతి సంస్థ చార్లెస్ స్క్వాబ్ సెంట‌ర్ భార‌త్‌లోనే తొలి కేంద్రంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటుకు ముందుకొచ్చింది. ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం అడోబ్ సంస్థ సీఈఓ శంత‌ను నారాయ‌ణ్‌ హైద‌రాబాద్ 4.0 సిటీ నిర్మాణం, స్కిల్ వ‌ర్సిటీ, ఏఐలో భాగ‌మ‌య్యేందుకు అంగీక‌రించ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం. ఇదే కాకుండా గ్రీన్ డేటా సెంట‌ర్‌ను రూ.3,350 కోట్ల పెట్టుబ‌డుల‌తో నిర్మిస్తామని ఆర‌మ్ ఈక్విటీ పార్ట్‌న‌ర్స్ సంస్థ ప్ర‌క‌టించింది. ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ కేపబిలిటీ సెంటర్‌ను విస్తరించ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది.

తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీల‌తో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ భాగస్వామ్యం కానుంది. తెలంగాణలో స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, హెల్త్‌కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించే అవ‌కాశం ఉంది. అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్‌ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించడం గొప్ప ప‌రిణామం.

ఇవే కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న ప్రాధామ్యాల అమ‌లుకు కావాల్సిన స‌హ‌కారాన్ని అందించేందుకు ప్ర‌పంచ బ్యాంకు కూడా ముందుకు రావ‌డం మ‌రో గొప్ప విజ‌యం. రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు ద‌క్షిణ కొరియా కూడా ముందుకు రావ‌డం మంచి ప‌రిణామం. హ్యుందాయ్ మోటార్స్ తెలంగాణ‌లో మెగా ఆటోమోటివ్ ప‌రీక్షా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబ‌డుల‌కు కొరియాకు చెందిన 25 అగ్ర‌శ్రేణి కంపెనీలు అంగీక‌రించాయి. దీంతో హైద‌రాబాద్‌తో పాటు వ‌రంగ‌ల్ అభివృద్ధికి కూడా ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ స్వ‌యంగా ముఖ్యమంత్రే రాష్ట్రంలో అంత‌ర్జాతీయ పెట్టుబ‌డుల కోసం చేసిన ప్ర‌య‌త్నం విజయ‌వంతం కావ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం.

తాము ఇచ్చిన తెలంగాణను దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన రాష్ట్రంగా అభివృద్ధి చేసుకోవాల‌ని కాంగ్రెస్‌కు ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం అదే విజ‌న్‌తో ముందుకు సాగుతోంది. అమెరికా, ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌ల‌లో కుదిరిన ఒప్పందాలతో సుమారు 30,750 పైగా ఉద్యోగాలు రానున్నాయి.

n డా. ఎన్‌. యాద‌గిరిరావు

అద‌న‌పు క‌మిష‌న‌ర్, జీహెచ్ఎంసీ

Updated Date - Aug 23 , 2024 | 05:47 AM