ఆర్థిక భారత అద్భుతానికి మోదీ ఎలా ఆద్యుడు?
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:29 AM
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ నాగరీక మర్యాదలు తెలిసినవారు, విద్యాధికులు, మృదుస్వభావులు. ప్రజ్ఞావంతుడైన దౌత్యవేత్తగా జైశకంర్ సుప్రసిద్ధుడు. ఉదారవాదిగా పేరు పొందారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన వైష్ణవ్ వ్యాపార రంగంలో విజయాలు సాధించి
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ నాగరీక మర్యాదలు తెలిసినవారు, విద్యాధికులు, మృదుస్వభావులు. ప్రజ్ఞావంతుడైన దౌత్యవేత్తగా జైశకంర్ సుప్రసిద్ధుడు. ఉదారవాదిగా పేరు పొందారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన వైష్ణవ్ వ్యాపార రంగంలో విజయాలు సాధించి పార్లమెంటుకు ఎన్నికై వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ప్రతిభావంతుడు. అర్థశాస్త్రం, ఆర్థిక రంగ వ్యవహారాలలో జైశంకర్‌కు ఆసక్తి ఉన్నదన్న విషయం నాకు తెలుసు. వార్టన్ బిజినెస్ స్కూల్‌లో గ్రాడ్యుయేట్‌గా వైష్ణవ్ అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి ఈ ఇరువురికీ బాగా తెలుసు. టీవీ ఛానెల్ ఎన్‌డీటీవీ ఇటీవల నిర్వహించిన ఒక సదస్సులో దేశ ఆర్థిక వ్యవస్థపై ఇరువురూ తమ అభిప్రాయాలను సుదీర్ఘంగా వ్యక్తం చేశారు.
అంకెలు ప్రతిభావంతులను సైతం గందరగోళపరుస్తాయి. జైశంకర్ తొలుత భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం గురించి సగర్వంగా మాట్లాడారు: నేడు మన ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల విలువైనది. 80,000 కోట్ల డాలర్ల విదేశీ వాణిజ్యం జరుపుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. మన దేశంలో విదేశీ మదుపులను చూస్తే మన ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది...’. వాస్తవం ఇందుకు చాలా దూరంగా ఉంది సుమా! మనం ఇంకా 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందలేదు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందాలని మనం లక్ష్యం నిర్దేశించుకున్నాం. ఆ గమ్యానికి చేరేందుకు మనం ఆపసోపాలు పడుతున్నాం. ఈ లక్ష్య సాధన విషయమై ఆర్థికమంత్రి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు గత ఆరేళ్లలో మూడుసార్లు భిన్న రీతుల్లో మాట్లాడారు!
2023–24 ఆర్థిక సంవత్సరాంతంలో మన దేశం నుంచి 437 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు ఎగుమతి అయ్యాయి; 677 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకున్నారు. వాణిజ్య లోటు 240 బిలియన్ డాలర్లు. మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2021–22లో 84.84 బిలియన్ డాలర్ల నుంచి 2023–24లో 70.95 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ‘ప్రజలకు లబ్ధి, ముఖ్యంగా ఆహారాన్ని సమకూర్చడంలో మన ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం గురించి ఘనంగా మాట్లాడారు. తలసరిన ఐదు కిలోల ఆహారధాన్యాలను ఉచితంగా సరఫరా చేయడం గురించి జైశంకర్ మాట్లాడుతున్నారా? నేనైతే ఆ ఉచిత సరఫరా ప్రజల దురవస్థలు, అల్ప వేతనాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాల కొరతకు సూచనగా పరిగణిస్తాను. కోవిడ్ కాలంలో వాక్సిన్ల ఉత్పత్తిదారుగా, సృష్టికర్తగా భారత్ సామర్థ్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు. నిజమేమిటి? మన దేశంలో రూపొందించిన ఏకైక వ్యాక్సిన్ కోవాక్సిన్. దీని ప్రభావశీలత 80 శాతంగా ఉందని నిర్ధారణ అయింది. మరో వాక్సిన్ కోవిషీల్డ్. ఇది 90 శాతం ప్రభావశీలతను కలిగి ఉన్నదని రుజువయింది. అయితే ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రజెనెకా నుంచి లైసెన్స్ పొంది ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ ఇది. మన దేశంలో వేసిన 200 కోట్ల వ్యాక్సిన్లలో 160 కోట్లు కోవిషీల్డ్ వ్యాక్సిన్లే.
వైష్ణవ్ సైతం మన ఆర్థిక వ్యవస్థ పురోగతి గురించి ఎంతో ఉద్వేగ భరితంగా మాట్లాడారు. భారత్ 6 నుంచి 8 శాతం సుస్థిర వృద్ధిరేటు సాధించడం గురించి ఆయన మాట్లాడారు. ఈ పురోగతికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిని మూలధన పెట్టుబడులు, వస్తూత్పత్తి, సమ్మిళిత వృద్ధి, సరళీకరణగా ఆయన గుర్తించారు. అయితే వాస్తవాలు ఏమిటి? మన స్థూల దేశియోత్పత్తి (జీడీపీ) పెరుగుదల రేటు కోవిడ్ ప్రభావిత ఏడాదితో సహా గత ఆరు సంవత్సరాలుగా సగటున 4.99 శాతంగా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం, ప్రభుత్వ రంగ సంస్థల మదుపులు వాస్తవంగా 2019–20లో జీడీపీలో 4.7 శాతం నుంచి 2023–24లో 3.8 శాతానికి తగ్గిపోయింది.
జీడీపీలో వస్తూత్పత్తి రంగ వాటా 2014లో 15.07 శాతం నుంచి 2019లో 12.84 శాతానికి, 2023లో 12.84 శాతానికి తగ్గిపోయింది. సమ్మిళిత వృద్ధి అనేది తీవ్ర చర్చనీయాంశం. అటువంటి పురోగతి ఉన్నదా లేదా అనేది ఇంత చిన్న వ్యాసంలో నిరూపించడం కష్టం. కనుక ఈ అంశాన్ని వదిలివేస్తున్నాను. ఇక సరళీకరణ విషయానికి వస్తే పది సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడే, ముఖ్యంగా క్రమబద్ధీకరణ చట్టాల కింద నియమనిబంధనలు ఎక్కువగా ఉన్నాయి. ఏ చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కంపెనీ సెక్రెటరీ లేదా లీగల్ ప్రాక్టీషనర్‌ను అయినా అడగండి, నియమ నిబంధనలు, నియంత్రణలు ఎంత ఎక్కువ స్థాయిలో అదనంగా వచ్చాయో వివరిస్తారు.
1991లో సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ సాధించిన పురోగతి గురించి జైశంకర్, వైష్ణవ్‌లు సహేతుకంగా గర్వపడవచ్చు. అది ఆర్థిక స్వాతంత్ర్య నవోదయం. అయితే దానికి 1997లో (ఆసియన్ ఆర్థిక సంక్షోభం), 2008 (అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం), 2016 (పెద్దనోట్ల రద్దు), 2020 (కోవిడ్ విలయం) తీవ్ర అవరోధాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తమకు ముందున్న ప్రభుత్వాల భుజస్కంధాలపై నిలబడి భవిష్యత్తులోకి దృష్టి సారించి, దేశ సౌభాగ్య సౌధాన్ని మరింత సమున్నతం, శోభావంతం చేశాయి. ఆర్థిక పురోగతి పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల నుంచి తమ పాలనా ప్రస్థానాన్ని ప్రారంభించామని మోదీ ప్రభుత్వం చెప్పుకోవడంలో సత్యం లేదు. ఏ ప్రభుత్వమూ అలా ప్రారంభమవదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయాన్నే తీసుకోండి. సీరమ్ ఇనిస్టిట్యూట్‌ను 1996లో నెలకొల్పారు. ఔషధాల ఉత్పత్తిలో ఒక బృహత్తర సంస్థగా అది అభివృద్ధి చెందింది. అపార అనుభవాన్ని సంతరించుకుంది. కోవిడ్ ఉపద్రవం సంభవించినప్పుడు ఆస్ట్ర జనెకా సాంకేతికతను సమకూర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచ అగ్రగామి సంస్థగా ఆవిర్భవించింది. అలాగే అతిగా పొగుడుతుండే JAM – జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఆద్యక్షర సంక్షిప్త పదం– నే తీసుకోండి నో–ఫ్రిల్స్ బ్యాంక్ ఖాతాల (జీరో బ్యాలెన్స్ ఎకౌంట్)కు బీజాలు ఇరువురు ఆర్బీఐ గవర్నర్ల– డాక్టర్ ఎస్. రంగరాజన్ (1992–97), డాక్టర్ బిమల్ జలాన్ (1997–2003) హయాంల్లో పడ్డాయి. లక్షలాది కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ప్రప్రథమ ఆధార్ నంబర్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకత్వంలో సెప్టెంబర్ 29, 2010న జారీ అయింది. సెల్‌ఫోన్ ద్వారా తొలి కాల్ చేసిన జూలై 31, 1995న మోబైల్ విప్లవం ప్రారంభమయింది.
సరే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతుల గురించి తెలుకోవాలంటే దాని అసాధారణ పురోగతి గురించి గౌరవనీయ మంత్రులు జైశంకర్, వైష్ణవ్‌ల ప్రశంసాపూర్వక ప్రసంగాలను మీరు వినితీరవలసిందే. అయిత ప్రతినెలా ప్రచురితమయ్యే ఆర్బీఐ బులెటిన్‌లో ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితిపై విపుల సమీక్షా వ్యాసాన్ని కూడా మీరు తప్పక చదవాలి.
1991లో ప్రారంభమైన సరళీకృత ఆర్థిక విధానాలతో భారత్‌లో ఆర్థిక స్వాతంత్ర్యం ఉదయించింది. ఆ నవశకానికి తీవ్ర అవరోధాలు ఎదురయినా కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తమకు ముందున్న ప్రభుత్వాల కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లి దేశ సౌభాగ్య సౌధాన్ని మరింత సమున్నతమూ, శోభావంతమూ చేశాయి. ఆర్థిక పురోగతి పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల నుంచి తమ పాలనా ప్రస్థానాన్ని ప్రారంభించామని మోదీ ప్రభుత్వం చెప్పుకోవడంలో సత్యం లేదు.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)