Sugarcane : చెరకు రాయితీలకు మంగళం!
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:06 AM
రైతాంగ ప్రయోజనాలను హరించే విధంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించక పోవటం; విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెంచటం; ఎరువుల ధరల నిర్ణయ అధికారం ఆ కంపెనీలకే
రైతాంగ ప్రయోజనాలను హరించే విధంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించక పోవటం; విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెంచటం; ఎరువుల ధరల నిర్ణయ అధికారం ఆ కంపెనీలకే ఇవ్వటం; పోషకాలను బట్టి ఎరువుల సబ్సిడీ ఇవ్వటం; ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సీఐని తప్పించటం; వ్యవసాయ రంగంలోకి బహుళజాతి సంస్థలకు అవకాశం కల్పించటం; ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూముల సర్వే చేయించి కార్పొరేట్లకు భూములు కట్టబెట్టటం; రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు బిగించమని రాష్ట్రాలకు చెప్పటం లాంటి చర్యలు ఇప్పటికే అమలు చేసింది. తాజాగా చెరకు రైతులకు ప్రయోజనంగా ఉన్నవాటిని కూడా ఉపసంహరిస్తూ ఆర్డర్ జారీ చేసింది.
మోదీ ప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 1966 షుగర్ (నియంత్రణ) ఆర్డర్, 2018 నాటి చక్కెర నియంత్రణ ఆర్డర్‌ను కలిపి... ది షుగర్ (నియంత్రణ) ఆర్డర్– 2024 ముసాయిదాను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఉత్పత్తి ప్రక్రియలో సాంకేతిక పురోగతి, పరిశ్రమలో మార్పులను పేర్కొంటూ ఈ ముసాయిదా విడుదల చేసినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందటానికి పంచదార రికవరీ రేటు 8.5శాతం నుంచి 10శాతానికి కొత్త ముసాయిదాలో పెంచింది. భారతదేశంలో రికవరీ రేట్ రీడింగ్‌ను సక్రమంగా తెలిపే మిషన్లు లేని కారణంతో పాటు, రికవరీని పెంచే నాణ్యమైన విత్తనం అందకపోవటం వల్ల కొత్త ముసాయిదాలో పేర్కొన్న 10శాతం రికవరీ రేటు రాని పరిస్థితుల్లో రైతులు మద్దతు ధర పొందలేరు. దేశంలో పంచదార రికవరీ 9శాతం మించి ఎప్పుడు రాలేదు. 2024 నవంబర్ మొదటి వారంలో 8.82శాతం మాత్రమే ఉంది. బ్రెజిల్ లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే 11 నుంచి 14శాతం పైగా పంచదార రికవరీ వస్తుంది.
చక్కెర మిల్లులు బ్యాంకుల్లో తనఖా పెట్టిన పంచదార అమ్ముకోవటానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని కొత్త ముసాయిదాలో పేర్కొన్నారు. ఫలితంగా చెరుకు కొనుగోలు చేసిన 14 రోజులలోపు మిల్లులు డబ్బులు చెల్లించాలన్న నిబంధన నిరుపయోగమైంది. రైతులకు డబ్బులు ఎప్పుడు చెల్లించాలన్న అధికారం మిల్లులకు దక్కింది. చెరకు విక్రయ డబ్బులు పొందటానికి మిల్లర్ల దయపై రైతులు ఆధారపడాల్సి వస్తుంది.
దేశంలో లక్షలాది రైతు కుటుంబాలకు జీవనోపాధిగా ఉండి, ఎందరికో ఉపాధి కల్పిస్తూ, పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని దేశానికి అందిస్తున్న చెరకు రైతాంగం ఎడల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా చెరకు సేద్యం నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర చెరకు రైతులకు ఏ మాత్రం మేలు చేయలేదు. ఎకరాకు అన్ని రకాల సేద్యపు ఖర్చు లక్ష దాకా ఉంది. కౌలు రైతుకు అదనంగా మరో 20 వేలు ఖర్చవుతుంది. దిగుబడి ఎకరాకు 30 టన్నులు. ప్రభుత్వ చెప్పే క్వింటాల్ చెరకు ఉత్పత్తి ఖర్చు 157 రూపాయలు. వాస్తవ ఖర్చు 305 రూపాయలు. కేంద్రం ప్రకటించిన క్వింటాల్ మద్దతు ధర 350 రూపాయలు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం వాస్తవ ఖర్చుపై 50శాతం పెంచితే రూ.450 ప్రకటించాలి. 10శాతం పంచదార రికవరీ వచ్చే చెరకుకి మాత్రమే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుంది. అంతకన్నా తక్కువ రికవరీ వస్తే తగ్గిన దాని ప్రకారం మద్దతు ధరలో కోత పడుతుంది.
మద్దతు ధర ప్రకారం 30 క్వింటాళ్లు వచ్చిన రైతుకు లక్షా ఐదు వేల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం సొంత భూమి రైతులకు ఖర్చులకు సరిపోవటం లేదా నామమాత్రపు మిగులు ఉంటుంది. కౌలు రైతులకు పెట్టుబడి కూడా రాదు. టన్ను చెరకు ద్వారా 280 కిలోల పంచదార లభిస్తుంది. కేజీ రూ. 30 చొప్పున 8,680 రూపాయలు వస్తుంది. మద్దతు ధర ప్రకారం టన్ను చెరకు ద్వారా రైతుకు లభించేది 3,500 రూపాయలు. మిల్లు యజమానులకు మిగులుతున్నది 5,180 రూపాయలు. ఎకరం చెరకు పైన మిల్లు యజమాని 1,60,580 రూపాయలు మిగులు పొందుతాడు. ఫ్యాక్టరీ ఖర్చుల కింద 50 వేలు తీసేసినా, లక్షకు పైగా మిగులుతుంది. చెరకు సేద్యం నష్టదాయకంగా మారటంతో ఆ రైతుల్లో విముఖత ఏర్పడి, లక్షలాది ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఫలితంగా 2022లో పంచదార ఉత్పత్తి 328.7 లక్షల టన్నులు ఉండగా, 2023 నాటికి 311 లక్షల టన్నులకు తగ్గింది. సేద్యాన్ని నష్టదాయకంగా మార్చి, రైతాంగం సాగు నుండి తప్పుకునేలా చేసి, చెరకు సాగును కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి, పంచదారను విదేశాల నుంచి మోదీ ప్రభుత్వం దిగుమతి చేసుకోనున్నది. ఇప్పటికే మూడు లక్షల టన్నుల చక్కెర దేశంలోకి దిగుమతి అయ్యింది.
ఈ విధానాలకు వ్యతిరేకంగా యావన్మంది చెరకు రైతులు ఉద్యమించాలి. కొత్త షుగర్ (నియంత్రణ) ఆర్డర్ ముసాయిదాను ఉపసంహరించాలని, టన్ను చెరకుకు 4,775 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేయాలి.
l బొల్లిముంత సాంబశివరావు
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం (ఆం.ప్ర)