Share News

బద్లాపూర్‌

ABN , Publish Date - Aug 22 , 2024 | 05:43 AM

మహారాష్ట్రలోని థానేజిల్లా బద్లాపూర్‌లో కిండర్‌గార్టెన్‌ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై అటెండర్‌ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర

బద్లాపూర్‌

మహారాష్ట్రలోని థానేజిల్లా బద్లాపూర్‌లో కిండర్‌గార్టెన్‌ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై అటెండర్‌ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. మూడేళ్ళు, నాలుగేళ్ల వయసున్న ఈ పిల్లలపై లైంగికదాడి జరగడం దేశాన్ని నిర్ఘాంతపరచింది. ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు ఏమాత్రం భద్రతలేదని, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నవీరు, రక్షణకరువై నిస్సహాయంగా అత్యాచారాలకు, హత్యలకు గురికావాల్సి వస్తున్నదని పశ్చిమబెంగాల్‌ ఘటన చెబుతోంది. అభంశుభం తెలియని పిల్లలు చివరకు ఆక్షరాలు దిద్దేచోటకూడా రాక్షసుల చేతికిచిక్కి బలైపోతున్నారని బద్లాపూర్‌ ఘటన హెచ్చరిస్తోంది.

ఈ ఘటనను విపక్షాలు రాజకీయం చేయకూడదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌శిండే అంటున్నారు. పశ్చిమబెంగాల్‌లో అదే జరుగుతున్నదని తృణమూల్‌ వాదిస్తోంది. వైద్యురాలిమీద అత్యాచారం కంటే పసికందుల మీద అఘాయిత్యం మరింత ఘోరమైనదని కొందరు తూకాలు వేస్తున్నారు. బద్లాపూర్‌ ఘోరం వెలుగుచూసిన తరువాత కూడా జాతీయ మీడియా తన దృష్టిని బెంగాల్‌ నుంచి మళ్ళించకపోవడంలో ఏదో దురుద్దేశం ఉన్నదని మరికొందరి వాదన. ఈ విమర్శలను, వ్యాఖ్యలను అటుంచితే, ఈ దేశంలో రాజకీయం కానిదేదీ లేదు. ఆయా పార్టీలు, అవి మోహరించివున్న కూటములు ఈ ఘటనల్లో తమతమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం కనిపిస్తూనే ఉంది. బద్లాపూర్‌ ఉదంతం స్థానికులను తీవ్రంగా కుదిపేసింది. వందలాదిమంది వీధుల్లోకి వచ్చి ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. పసికందులకు పాఠశాలల్లో సైతం రక్షణలేదన్న చేదునిజం వారిని నిలవనివ్వలేదు. రైళ్ళరాకపోకలను నిలిపివేశారు, స్కూలుమీద దాడులుచేశారు, విధ్వంసకాండకు పాల్పడ్డారు. తల్లిదండ్రులనుంచి ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు మొదట నిరాకరించారనీ, కేసు నమోదులో తీవ్రజాప్యంచేశారనీ, ఒక తల్లి పదిగంటలపాటు పోలీసుస్టేషన్‌లోనే నిరీక్షించవలసి వచ్చిందనీ వార్తలు వచ్చాయి. పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కై పోలీసులు ఈ ఘటనను తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని స్థానికుల వాదన. బాధిత చిన్నారులనుంచి సమాచారం సేకరించడం కష్టమైన పని కనుక కేసునమోదు ఆలస్యమైందనీ, తరువాత కొద్దిగంటల్లోనే స్కూల్‌ అటెండర్‌ను అరెస్టుచేశామని పోలీసులు సమర్థించుకుంటున్నారు. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు తక్షణ అరెస్టులు, సస్పెన్షన్లు, సిట్‌ ఏర్పాటు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారణ ఇత్యాదివి ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మరింత నమ్మకం కలగడానికి సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ను స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా రంగంలోకి దించింది. బీజేపీ తరఫున మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా నిలబడిన ఈయనా, సదరు స్కూల్‌ యాజమాన్యం ఒకే పార్టీకి చెందిన విషయాన్ని కాంగ్రెస్‌ గుర్తుచేస్తోంది. న్యాయం చేయడం కంటే, ఘాతుకాలను కప్పిపుచ్చేందుకు రాష్ట్రంలో విశేషప్రయత్నం జరుగుతున్నదని ఆరోపిస్తున్న మహావికాస్‌ ఆగాఢీ ఆగస్టు 24న రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న మహారాష్ట్రలో ఈ ఘటన ప్రభావం చూపకపోదు.


స్కూలు సిబ్బంది ఎంపిక, సీసీకెమెరాలతో సహా పిల్లల భద్రతకు సంబంధించిన సమస్త ఏర్పాట్ల విషయంలో యాజమాన్యాలు ఎంతో శ్రద్ధగా ఉండాలని బద్లాపూర్‌ ఘటన గుర్తుచేస్తోంది. చాలా స్కూళ్ళలో మూత్రశాలలు దూరంగా ఉండటం, పిల్లలను స్కూలుకు తీసుకువచ్చేవారు సైతం వాటిని వినియోగిస్తూండటం ప్రమాదాలకు ఎక్కువ అవకాశాన్నిస్తాయి. మరో రేప్‌, హత్య జరగనిదే మేలుకోమా? అని కోల్‌కతా వైద్యురాలి హత్యాచారంపై సుప్రీంకోర్టు చక్కని ప్రశ్న వేసింది. ఎఫ్‌ఐఆర్‌ దాఖలులో జాప్యంనుంచి ఈ దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించేందుకు చూసిన మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌వరకూ ప్రతీవారినీ, ప్రతీదశనూ తప్పుబడుతూ, మమత సర్కారుకు తలంటుతూ సుప్రీంకోర్టు ప్రశంసనీయమైన చొరవ ప్రదర్శించింది. వ్యవస్థలోని లోపాలను ఈ ఘటన తెరమీదకు తెచ్చిందనీ, వైద్యుల భద్రతకు దేశవ్యాప్త ప్రోటోకాల్‌ ఉండాలనీ అంటూ నివేదికల తయారీకోసం టాస్క్‌ఫోర్స్‌ ప్రకటించింది. అరుణా శాన్‌బాగ్‌ ఉదంతం జరిగిన యాభైఒక్క సంవత్సరాల తరువాత కూడా ఈ దేశంలోని మహిళా వైద్యులు, సిబ్బందికి రక్షణ దక్కడం లేదని కోల్‌కతా ఘటన నిరూపించింది. మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో, వారికి ప్రతీచోటా భద్రత కల్పించే ప్రయత్నం విశేషంగా జరగాలి, నిర్దిష్టమైన విధివిధానాల రూపకల్పనకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాలి.

Updated Date - Aug 22 , 2024 | 05:43 AM