Share News

రంగవల్లి విజ్ఞానకేంద్రం ప్రారంభోత్సవం

ABN , Publish Date - Nov 09 , 2024 | 07:09 AM

సమసమాజ నిర్మాణ దార్శనికురాలిగా, కమ్యూనిస్టుగా తెలుగునేలకు పరిచయమైన త్యాగధనుల్లో రంగవల్లి ఒకరు. నిజామాబాద్‌ జిల్లాలో 1959లో బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎల్. నరసింహారావు–గిరిజ దంపతులకు జన్మించింది ఆమె. పీడీఎస్‌యు

రంగవల్లి విజ్ఞానకేంద్రం ప్రారంభోత్సవం

సమసమాజ నిర్మాణ దార్శనికురాలిగా, కమ్యూనిస్టుగా తెలుగునేలకు పరిచయమైన త్యాగధనుల్లో రంగవల్లి ఒకరు. నిజామాబాద్‌ జిల్లాలో 1959లో బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎల్. నరసింహారావు–గిరిజ దంపతులకు జన్మించింది ఆమె. పీడీఎస్‌యు నాయకురాలిగా, విజృంభణ పత్రిక సంపాదకత్వ బాధ్యురాలిగా, స్త్రీ విముక్తి ఉద్యమ నిర్దేశకురాలిగా, పల్నాడు రైతాంగ ఉద్యమ కార్యకర్తగా, వివిధ భూపోరాటాలకు నాయకత్వం వహించిన వీరవనితగా, గోదావరిలోయ ఉద్యమ రాజకీయ బాధ్యురాలిగా రెండు దశాబ్దాల తన విప్లవ జీవితాన్ని విలువలతో కొనసాగించింది. సీపీఐ (ఎం–ఎల్‌) జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉంటూ ములుగు జిల్లా జగ్గన్నగూడెం అడవుల్లో జరిగిన పోలీసు దాడిలో నవంబరు 11, 1999న నేలరాలిపోయింది. పాతిక సంవత్సరాలు గడిచినా చెరిగిపోని ఆమె స్మృతులను ఎత్తిపడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నందికమాన్‌ వద్ద రంగవల్లి విజ్ఞాన కేంద్రం రూపుదిద్దుకుంది. రంగవల్లి 25వ వర్ధంతి సందర్భంగా నవంబరు 11వ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు రంగవల్లి విజ్ఞానకేంద్రం ప్రారంభోత్సవం జరుగుతుంది. హక్కుల కార్యకర్త, న్యాయవాది లక్ష్మిదేవి గ్రంథాలయ ప్రారంభకులు. అమరుల స్మృతిగీతాన్ని లత ఆవిష్కరిస్తారు. ఆచార్య కట్టా భగవంతరెడ్డి, ప్రొఫెసర్‌ కాశీం స్మారకోపన్యాసాలు చేస్తారు. తదనంతరం అరుణోదయ విమలక్క అధ్యక్షతన జరిగే విజ్ఞానకేంద్రం ప్రారంభోత్సవ సభలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు తమ సందేశాలు అందిస్తారు.

– నిర్వాహకులు,

రంగవల్లి విజ్ఞానకేంద్రం

Updated Date - Nov 09 , 2024 | 07:09 AM