Share News

సార్థక సమ్మిళిత వృద్ధి ఏదీ?

ABN , Publish Date - Nov 02 , 2024 | 06:28 AM

సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌) అనే భావన ఉదార ఆర్థిక విధానాలు మొదలయ్యాక ప్రాచుర్యంలోకి వచ్చింది. గ్లోబలైజేషన్‌ కారణంగా, దేశంలో ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకున్నాక పెరిగిన ఆర్థిక

సార్థక సమ్మిళిత వృద్ధి ఏదీ?

సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌) అనే భావన ఉదార ఆర్థిక విధానాలు మొదలయ్యాక ప్రాచుర్యంలోకి వచ్చింది. గ్లోబలైజేషన్‌ కారణంగా, దేశంలో ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకున్నాక పెరిగిన ఆర్థిక అంతరాలను తగ్గించే క్రమంలో సమ్మిళిత అభివృద్ధి మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం అనివార్యమైంది.

అసలు సమ్మిళిత అభివృద్ధికి నిర్వచనం ఏమిటి? అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే సమ్మిళిత అభివృద్ధిగా భావించాలా? అభివృద్ధిలో ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించకపోవడమే సమ్మిళిత అభివృద్ధి అవుతుంది. నిజానికి సమ్మిళిత అభివృద్ధి అనే భావన కొత్తదేమీకాదు. మన రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలోనే ఈ భావన ఉంది. దేశ సంపద ఏ కొన్ని వర్గాలకో పరిమితం కారాదని, కొండకోనల్లో, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు సైతం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, ఆందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది.

ఏటా ఏడు శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న భారతదేశంలో సమ్మిళిత అభివృద్ధి ఏవిధంగా ఉన్నదో చెప్పడానికి ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని, కొన్ని రాష్ట్రాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని ఉటంకించాలి. దీనికంటే ముందు ఆ కేసు పుర్వాపరాలను చూద్దాం.

యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి భారత్‌పైన అత్యంత దారుణమైన ప్రభావం చూపడాన్ని ఏ ఒక్కరూ మర్చిపోలేరు. పీడకల లాంటి ఆ విపత్కర సమయంలో దేశంలో వలస కార్మికులు పడిన కష్టాలు, కడగండ్లు అందరి గుండెల్ని పిండేశాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులు తమ పిల్లాపాపలతో, వృద్ధులతో, ఆకలిదప్పులతో మండుటెండల్లో వందల కిలోమీటర్లు నడుచుకొంటూ స్వస్థలాలకు పయనమైన సందర్భాలలో వారు అనుభవించిన వేదన మన వర్తమాన చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వివిధ రకాల పనులు చేసే నిమిత్తం వలసపోయే కార్మికుల సంఖ్య దాదాపు 14 కోట్లు. వీరు తమ శ్రమశక్తితో దేశ స్థూల ఉత్పత్తికి 10 శాతం వాటా అందిస్తున్నారు. కానీ, స్థిర నివాసం లేని కారణంగా వలస కార్మికులకు రేషన్‌ కార్డులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేయడం లేదు.

అటువంటి పూర్వరంగంలోనే వలస కార్మికుల సమస్యలు, కష్టాలపై సుమోటో కేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం జూన్‌ 29, 2021న ఓ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులు, వలస కూలీల వివరాల నమోదు ప్రక్రియ చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలని కేంద్ర కార్మిక శాఖను ఆదేశించింది. ఇందుకుగాను ‘నేషనల్‌ డేటా బేస్‌ పోర్టల్‌’ ఏర్పాటు చేయాలని, వలస కార్మికులకు రేషన్‌ సరుకుల పంపిణీకిగాను రాష్ట్రాలు తగిన పథకాలు రూపొందించాలని, ఆ మేరకు కేంద్రం అదనపు ఆహార ధాన్యాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలని స్పష్టం చేసింది. జూలై 31, 2021 నాటికల్లా ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసుకునే ‘ఒకే దేశం–ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని అమలు చేయాలని, కరోనా కొనసాగినంతకాలం వలస కార్మికులు ఉన్నచోట రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక వంటశాలలు (కమ్యూనిటీ కిచెన్స్‌) నిర్వహించి ఆహారం అందించాలని ధర్మాసనం తన 80 పేజీల తీర్పులో ఆనాడు స్పష్టం చేసింది.


సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువడి ఇప్పటికీ మూడు సంవత్సరాలు దాటింది. అయినా వలస కార్మికులకు రేషన్‌ కార్డుల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. ఈ అసాధారణ జాప్యం సహజంగానే సర్వోన్నత న్యాయస్థానానికి ఆగ్రహం తెప్పించింది. వలస కార్మికులకు రేషన్‌కార్డుల జారీలో చిత్తశుద్ధి చూపని కేంద్రం, కొన్ని రాష్ట్రాలు తమకు తగిన సమయం కావాలంటూ గడువుల మీద గడువులు కోరుతూ వస్తున్నాయి. అయితే అక్టోబర్‌ 4, 2024న ఈ కేసును విచారించిన జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ అసనుద్దీన్‌ల బెంచ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ఓపిక పట్టడం అన్నది గొప్ప సుగుణమే కావొచ్చు. కానీ మా ఓపిక తుది దశకు చేరుకొంది. నవంబర్‌ 19, 2024 మీకు చివరి గడువు. ఈలోగా వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేయండి’ అని ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని, రాష్ట్రాలను తీవ్ర స్వరంతో హెచ్చరించింది.

భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో, ఇతర చోట్ల ముక్కిపోతున్న, ఎలుకలు తినేస్తున్న తిండి గింజలను చూసుకొని దేశ ఆహార భద్రత బేషుగ్గా ఉందని జబ్బలు చరుచుకొంటున్న పాలకుల కళ్లు తెరిపిస్తూ.. ‘అవి మిగులు తిండి గింజలు కాదురా బాబూ! వాటిని ఆకలి గింజలని పిలవాలి.. దేశంలో ప్రజలందరూ రెండు పూటలా కడుపు నిండా తిన్నాక మిగిలిన వాటినే మిగులు గింజలనాలి’ అని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ చెప్పాక, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా గోడౌన్లలో ఉన్న ఆహార ధాన్యాలను సక్రమంగా వినియోగించమని అక్షింతలు వేశాకనే అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి’ శ్రీకారం చుట్టింది. తద్వారా ఉపాధి కూలీలకు వ్యవసాయేతర సీజన్‌లో తిండి తినడానికి అవకాశం ఏర్పడింది.

అయితే, దేశంలో ఇప్పటికీ రేషన్‌ లభించని అభాగ్యులు ఇంకా కోట్ల సంఖ్యలో ఉన్నారు. వలస కార్మికులతో పాటు సంచార జాతుల వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందడం లేదు. వలస కార్మికులు కనీసం ఏదో ఒక ప్రదేశంలో కొన్ని నెలలపాటు నివాసం ఉంటారు. కానీ, సంచార జాతుల వారి పరిస్థితి మరీ దారుణం. వారు మానవ సమూహాలకు దూరంగా అక్కడక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తుంటారు. వీరెవరికి రేషన్‌కార్డులు, ఆధార్‌ కార్డులు ఇవ్వడం లేదు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎం.ఎస్‌ శ్రీనివాసన్‌ చెప్పినట్లు.. వీరి గుడిసెల్లోకి, టెంటుల్లోకి ఇంకా ప్రజాస్వామ్యం ప్రవేశించలేదు.

దేశంలో దాదాపుగా ప్రతి పట్టణంలో భవన నిర్మాణ కూలీలు, యాచకులు, పారిశుద్ధ్య కార్మికులు.. రోడ్లవెంట అద్దాలు, దువ్వెనలు, రంగురాళ్లు, ప్లాస్టిక్‌ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు అమ్మేవాళ్లు వందలు, వేల సంఖ్యలో కనిపిస్తుంటారు. అందులో అత్యధికులకు రేషన్‌ కార్డులు ఉండవు. ఒకవేళ ఉన్నా, ఒకేసారి రేషన్‌ తెచ్చుకొనే ఆర్థిక స్థోమత వారికి ఉండదు. అటువంటి వారికి నామమాత్రపు ధరలతో కడుపునిండా భోజనం పెట్టడానికి క్యాంటీన్లు తెరవటం ప్రభుత్వాల బాధ్యత. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘అన్న క్యాంటీన్లు’ ప్రవేశపెట్టి పేదలను అక్షయపాత్రలా ఆదుకొంటోంది.


నిజానికి కరోనా సమయంలోనే వలస కార్మికులకు, నిరుపేదలకు కమ్యూనిటీ కిచెన్స్‌ ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటికే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ముందు వరకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 100 పట్టణాల్లో అన్న క్యాంటీన్లు నిర్వహించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో అన్న క్యాంటీన్లను మూత వేయించింది. కరోనా సమయంలో కూడా వాటిని పునరుద్ధరించలేదు. నిరుపేదల కడుపులు నింపలేదు. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ క్యాంటీన్లను పునరుద్ధరించి నిరుపేదల పాలిట కల్పతరువుగా మారింది. వలస కార్మికులకు, సంచార జాతుల వారికి రేషన్‌ కార్డులు అందించేవరకు ఈ క్యాంటీన్లు వాళ్ల కడుపు నింపుతాయి.. అన్న క్యాంటీన్‌ వంటి పథకాన్ని నిజానికి కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఎందుకంటే కోట్లాది శ్రామికులు ఆకలితోనో, అర్ధాకలితోనో అలమటిస్తుంటే, అభివృద్ధి గురించి, భవిష్యత్‌ గురించి మాట్లాడటం ఆత్మవంచనే అవుతుంది. అంతేకాదు.. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్ని ఖాతరు చేయకపోవడం, రేషన్‌ కార్డుల జారీలో మితిమీరిన జాప్యం చేయడం దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేదల కోసం గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన తదితర పథకాలను అమలు చేస్తూ ఉండొచ్చు. కానీ, వలస కార్మికుల్ని, సంచార జాతుల వారిని.. ముఖ్యంగా పౌర సమాజానికి వెలుపల జీవిస్తూ ఎటువంటి గుర్తింపు, అస్తిత్వం లేకుండా సుస్థిర స్వయం ప్రతిపత్తి పొందే అవకాశం లేకుండా.. జాతి సంపదలో ఎటువంటి వాటా పొందటానికి నోచుకోకుండా జీవిస్తున్న వీరందర్నీ జాతీయ జీవన స్రవంతిలోకి తేవాలి. వారికి రేషన్‌కార్డులు, ఆధార్‌ కార్డులు, ఎన్నికల ఓటింగ్‌ కార్డులు మొదలైనవి అందించడం ద్వారా వారికున్న హక్కులను పరిరక్షించి వారందరినీ ప్రజాస్వామ్య పరిధిలోకి తీసుకురావాలి. అప్పుడే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే సమ్మిళిత అభివృద్ధికి నిజమైన అర్థం లభిస్తుంది.

చంద్రబాబు నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం మళ్లీ అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి నిరుపేదల పాలిట కల్పతరువుగా మారింది. వలస కార్మికులకు, సంచార జాతుల వారికి రేషన్‌ కార్డులు అందించేవరకు ఈ క్యాంటీన్లు వాళ్ల కడుపు నింపుతాయి. అన్న క్యాంటీన్‌ వంటి పథకాన్ని నిజానికి కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఎందుకంటే కోట్లాది శ్రామికులు ఆకలితోనో, అర్ధాకలితోనో అలమటిస్తుంటే, అభివృద్ధి గురించి, భవిష్యత్‌ గురించి మాట్లాడటం ఆత్మవంచనే అవుతుంది.

సి. రామచంద్రయ్య

శాసనమండలి సభ్యులు

Updated Date - Nov 02 , 2024 | 06:28 AM