Indian Constitution : రాజ్యాంగ స్ఫూర్తికి అవరోధమెవరు?
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:21 AM
ఒక జాతి జీవనంలో 75 ఏళ్ల రాజ్యాంగ బద్ధ ప్రస్థానం పూర్తవడం నిస్సందేహంగా చరిత్రాత్మకమైన సంఘటన. కనుకనే నవంబర్ 26, 2024న, భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకున్నాం. పార్లమెంటు ఉభయ సభలూ
ఒక జాతి జీవనంలో 75 ఏళ్ల రాజ్యాంగ బద్ధ ప్రస్థానం పూర్తవడం నిస్సందేహంగా చరిత్రాత్మకమైన సంఘటన. కనుకనే నవంబర్ 26, 2024న, భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకున్నాం. పార్లమెంటు ఉభయ సభలూ దైనందిన వ్యవహారాలను పక్కన పెట్టి రెండేసి రోజలు చొప్పున భారత రాజ్యాంగ ప్రస్థానంలో వెలుగునీడలను ప్రత్యేకంగా చర్చించాయి. ఉభయ సభలలోను పలువురు సభ్యులు ఉదాత్త ప్రసంగాలు చేశారు; కొంతమంది విమర్శలు, దూషణలతో మాట్లాడారు. రాజ్యాంగ సభలో ఆగస్టు 14–15, 1947 అర్ధరాత్రి జవహర్ లాల్ నెహ్రూ వెలువరించిన ‘భవిష్యత్తుతో భేటీ’, నవంబర్ 25, 1949న బాబాసాహెబ్ అంబేడ్కర్ వెలువరించిన ‘ప్రజల చేత ప్రభుత్వం’ను పోలిన స్ఫూర్తిదాయక ప్రసంగాలను ఈ చర్చలో ఎవరూ చేయలేదు.
75 సంవత్సరాల క్రితం రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, సమాలోచనల వెనుక భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన ప్రేరణ శక్తిగా ఉన్నది. జాతి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనే విషయమై విశాల దృక్పథం, దూర దృష్టితో ప్రతిపాదనలు చేసి, వాటిపై భిన్నాభిప్రాయాలు కలవారు అందరూ చర్చలో పాల్గొనేలా ప్రేరేపించి అంతిమంగా ఏకాభిప్రాయ సాధనతో నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగ రూపకల్పనలో కాంగ్రెస్ చరిత్రాత్మక కీలక పాత్ర వహించింది. రాజ్యాంగ సభకు కాంగ్రెస్ ‘ఒక క్రమ విధానాన్ని, క్రమశిక్షణను తీసుకువచ్చింది’ అని డాక్టర్ అంబేడ్కర్ ప్రశంసించారు. మరి ఈనాడు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? లోక్‌సభలోను, రాజ్యసభలోను ప్రతిపక్షంగా ఉన్నది. ఎంత మార్పు! ఈ మార్పు బాధాకరమైనది, అయితే వెనక్కు మళ్లించలేనిది ఎంత మాత్రం కాదు.
కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తులు అయిన భారతీయ జనతా పార్టీ, ఇతర మితవాద పక్షాలు భారత రాజ్యాంగంతో కాంగ్రెస్ సంబంధాన్ని పూర్తిగా ఒక ప్రతికూల దృక్పథంతో చూస్తున్నాయి. జూన్ 1975, మార్చి 1977 మధ్య అమలులో ఉన్న అత్యవసర పరిస్థితి, ఆ చీకటి రోజుల్లో దేశ పౌరులకు ప్రాథమిక హక్కులను నిరాకరించిన ఒక దురదృష్టకర చరిత్రకు మాత్రమే ఆ సంబంధాన్ని పరిమితం చేస్తున్నాయి. నిజమే, 139 ఏళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో అదొక అసహ్యకరమైన అధ్యాయం. నిస్సందేహంగా నిందార్హమైనది. అయితే ఆ దురదృష్టకర పరిణామాల విషయమై దేశ ప్రజలకు ఇందిరాగాంధీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. అత్యవసర పరిస్థితిని విధించడం ఇంకెన్నడూ జరగబోదని వాగ్దానం చేశారు. ప్రజలు ఆమె క్షమాపణలను అంగీకరించారు. 1980లో అత్యధిక స్థానాలతో కాంగ్రెస్‌ను గెలిపించి ఆమెకు మళ్లీ అధికారాన్ని అప్పగించారు.
అత్యవసర పరిస్థితి విధింపు మినహా రాజ్యాంగంతో కాంగ్రెస్‌కు మరేమీ సంబంధం లేదా? రాజ్యాంగ నిర్మాణంలోనూ, దానిని అమలుపరచడంలోనూ కాంగ్రెస్ పార్టీ మహోదాత్త పాత్రను ఎలా విస్మరించగలం? బీజేపీ ఉపేక్షించినా చరిత్ర మరచిపోతుందా? రాజ్యాంగంతో కాంగ్రెస్ సహవాసం ఒక స్ఫూర్తిదాయక గాథ. అరుదుగా మాత్రమే దానిని గుర్తు చేసుకోవడం, చెప్పడం జరుగుతోంది. రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు అధికరణ 368 ద్వారా సమకూరింది. ఏ దేశ రాజ్యాంగానికి అయినా తప్పనిసరిగా ఉండే అధికారమిది. ఎందుకంటే ఏ జాతి జీవనమూ నిల్వ నీరుగా ఉండదు. సుఖదుఃఖాలతో జాతి ప్రస్థానం సాగుతుంటుంది. ఈ సాగుతున్న యాత్రలో అపాయాలు ఎదురవుతాయి, అవకాశాలూ లభిస్తాయి. అధికార వ్యవప్థలో ప్రధాన భాగమైన న్యాయవ్యవస్థ మారుతున్న పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు వివరణలు ఇస్తుంది, భాష్యాలు చెబుతుంది. ఈ న్యాయ వివరణలు, భాష్యాలు తుది మాటగా ఉండవు, ఉండబోవు. కాలానికి అనుగుణంగా ఉండే రాజ్యాంగమే సజీవమైన సంవిధానం. మారుతున్న జాతి జీవనానికి అనుకూలంగా ఆ మౌలిక శాసనాన్ని మార్చుకోవల్సి ఉంటుంది. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ప్రతిస్పందించగలగడమనేది ఒక సరైన రాజ్యాంగానికి తార్కాణం. మరింత స్పష్టంగా చెప్పాలంటే రాజ్యాంగం సదా సమకాలీనంగా ఉండాలి. మన రాజ్యాంగం అటువంటి విశిష్ట సంవిధానం. పార్లమెంటులో రాజ్యాంగంపై జరిగిన చర్చలో నేనూ పాల్గొని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగానికి తీసుకువచ్చిన సవరణల గురించి విపులంగా తప్పక ప్రస్తావించి ఉండేవాణ్ణి. ఎందుకంటే ఆ సవరణలు మన రాజ్యాంగాన్ని మరింతగా శక్తిమంతం చేశాయి. రాజ్యాంగ మున్నుడిలోని మహోదాత్త ఆదర్శాలు దేశ ప్రజల జీవితాలలో ప్రతిఫలించేందుకు ఆ సవరణలు విశేషంగా దోహదం చేశాయి. ముఖ్యంగా న్యాయం (సామాజిక, ఆర్థిక, రాజకీయ), సమానత్వం (అంతస్తు, అవకాశం) ప్రతి ఒక్కరికీ సమకూర్చడమే లక్ష్యంగా ఆ సవరణలు జరిగాయి.
రాజ్యాంగ (ప్రథమ సవరణ) చట్టం, 1951 స్వతంత్ర భారత దేశ మొట్టమొదటి ముఖ్య శాసనం. సామాజికంగా, విద్యా వ్యాసంగాలలో వెనుకబడిన వర్గాలవారు లేదా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల (దళితులు, గిరిజనులు) అభ్యున్నతికి ఉద్దేశించిన రిజర్వేషన్లకు ఆ చట్టం రాజ్యాంగ పరిరక్షణను కల్పించింది. ఆ ప్రథమ రాజ్యాంగ సవరణే లేని పక్షంలో అసలు ఎలాంటి రిజర్వేషన్ల వ్యవస్థనూ ఏర్పాటు చేయడం సాధ్యమయ్యేది కాదు. ఈ మొదటి సవరణ ద్వారా రాజ్యాంగంలో అధికరణ 31ఎ, అధికరణ 31బి ని చేర్చడం జరిగింది. తద్వారా దోపిడీ, అణచివేతలకు నెలవైన భూస్వామ్య జమిందారీ వ్యవస్థ రద్దుకు మార్గం సుగమమైంది. లక్షలాది రైతు, రైతు కూలీ కుటుంబాలు తమ దైన్య పరిస్థితుల నుంచి విముక్తమయ్యారు. భూసంస్కరణలకు, మిగులు భూముల పంపిణీకి కూడా రాజ్యాంగ మొదటి సవరణ విశేషంగా సహకరించింది. వ్యాపార వాణిజ్యాలు, పరిశ్రమలు, సేవల రంగాలలో ప్రభుత్వ రంగ సంస్థల వ్యవస్థాపనకు కూడా చట్టపరమైన పునాదులను ఈ మొదటి సవరణే నిర్మించింది.
రాజ్యాంగ (42వ సవరణ) చట్టం–1976 రాజ్యాంగంలో అనేక మార్పులు చేసింది. అందుకే ఆ మార్పులను, వాటికి కారణమైన కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించడం జరగుతోంది. అయితే అదే చట్టం ద్వారా రాజ్యంగంలో జరిగిన రెండు మార్పులను భావి తరాలు తప్పక గుర్తుంచుకుంటాయనే వాస్తవాన్ని చాలా తక్కువమంది మాత్రమే ప్రస్తావిస్తున్నారు. వాటిలో ఒకటి రాజ్యాంగంలో అధికరణ 39ఎ చేర్పు. ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం జరిగేందుకు ప్రభత్వమే ‘ఉచిత న్యాయ సహాయం’ను సమకూర్చాలని ఆ మార్పు నిర్దేశించింది. మరొక మార్పు అధికరణ 48ఎ చేర్పు. ప్రభుత్వమే ‘పర్యావరణాన్ని పరిరక్షించి, మెరుగుపరచాలని, అడవులు, వన్య ప్రాణులను సంరక్షించాలని’ ఈ కొత్త అధికరణ నిర్దేశించింది.
రాజ్యాంగ (52వ సవరణ) చట్టం–1985 రాజ్యాంగంలో 10వ షెడ్యూలును ప్రవేశపెట్టింది. దేశ రాజకీయాలకు చీడగా పరిణమించిన ఆయారామ్, గయారామ్ బెడద అంటే పార్టీ ఫిరాయింపుల సమస్యను తుదముట్టించేందుకు ఈ సవరణ చట్టం ప్రప్రథమంగా ప్రయత్నించింది. శోచనీయమైన విషయమేమిటంటే అది చట్ట సభలకు ఎన్నికైన సభ్యుల జిత్తులమారితనం, వారికి సభాపతుల (స్పీకర్ల) నుంచి రహస్య ప్రోత్సాహం, ఈ పరిణామాలపై న్యాయస్థానాల అయోమయ తీర్పులు ఇత్యాది వైపరీత్యాలను ఆ చట్ట నిర్మాతలు ఊహించలేకపోయారు. పదవ షెడ్యూలును సవరించిప్పుడే ఆ షెడ్యూలు లక్ష్యం నెరవేరుతుందని నిక్కచ్చిగా చెప్పక తప్పదు.
చాలా విస్తృత పర్యవసానాలకు దారితీసి, విశేష ప్రభావాన్ని చూపిన సవరణలు: రాజ్యాంగ (73వ సవరణ) చట్టం–1992, రాజ్యాంగ (74వ సవరణ) చట్టం–1992. ఇవి స్థానిక స్వపరిపాలనా సంస్థలు అయిన పంచాయత్‌లు, పురపాలక సంఘాలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా చేయడం ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ఠమూ, ప్రగాఢమూ చేశాయి. ఈ చట్టాల ఫలితంగా మహిళలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన లక్షలాది మందిని రాజకీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చాయి. మహిళలు, దళితులు, ఆదివాసీలకు తమ ప్రజాస్వామ్య అధికారాలను వినియోగించే సాధికారతను అవి కల్పించాయి. పాలనాధికారాలను ఇంతగా క్రిందిస్థాయి పాలనా సంస్థలకు బదిలీ చేయడం, రాజకీయ అధికారాలు, అవకాశాలను విస్తృతంగా పునఃపంపిణీ చేయడం చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదు.
పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ, దురదృష్ట వశాత్తు పాలక, ప్రతిపక్షాల పరస్పర ప్రత్యారోపణల మయంగా జరిగింది. భారత గణతంత్ర రాజ్య 75 సంవత్సరాల రాజ్యాంగ బద్ధ ప్రస్థానంలో ఏకైక పథ భ్రష్టత (అత్యవసర పరిస్థితి విధింపు) కేంద్రంగా వాదోపవాదాలు సాగాయి. అవేవీ ఉదాత్తమైనవి కావు. మరి బీజేపీ సంకల్పించిన ఒకే దేశం ఒకే ఎన్నిక సహా వివిధ మార్పులు ఆ ఏకైక పథ భ్రష్టత కంటే మన ప్రజాస్వామ్యానికి, సమాఖ్య పాలనా విధానానికి మరింత ఎక్కువగా హానిచేసేవే కావూ? అయినప్పటికీ మన రాజ్యాంగం వెన్ను దృఢమైనదని, ఆ మహోన్నత సంవిధాన ప్రగతిశీల స్ఫూర్తి అంతిమంగా అజేయంగా వెలుగొందుతుందని నేను నిండుగా విశ్వసిస్తున్నాను.
పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ పాలక, ప్రతి పక్షాల పరస్పర ప్రత్యారోపణల మయంగా జరిగింది. భారత గణతంత్ర రాజ్య 75 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రస్థానంలో ఏకైక పథ భ్రష్టత (అత్యవసర పరిస్థితి విధింపు) కేంద్రంగా వాదోపవాదాలు సాగాయి. మరి బీజేపీ సంకల్పించిన ఒకే దేశం ఒకే ఎన్నిక సహా వివిధ మార్పులు ఆ ఏకైక పథ భ్రష్టత కంటే మన ప్రజాస్వామ్యానికి, సమాఖ్య పాలనా విధానానికి మరింత ఎక్కువగా హానిచేసేవే కావూ?
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)