ఇరాన్ గద్దెపై ఉదారవాది
ABN , Publish Date - Jul 12 , 2024 | 02:02 AM
ఇరాన్ కొత్త అధ్యక్షుడుగా మసూద్ పెజెష్కియాన్ ఎన్నికకావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఛాందసవాది, ఇరాక్ యుద్ధ వీరుడు అయిన సయ్యద్ జలీలీమీద సంస్కరణవాది మసూద్ మంచి మెజారిటీతో...
ఇరాన్ కొత్త అధ్యక్షుడుగా మసూద్ పెజెష్కియాన్ ఎన్నికకావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఛాందసవాది, ఇరాక్ యుద్ధ వీరుడు అయిన సయ్యద్ జలీలీమీద సంస్కరణవాది మసూద్ మంచి మెజారిటీతో గెలవడం విశేషమైన పరిణామం. అమెరికాలో ఈ ఏడాది చివర్లో జరగబోయే ఎన్నికల్లో గెలవబోతున్న అధ్యక్షుడితో మళ్ళీ అణు ఒప్పందం కుదర్చుకోవడానికి ఇరాన్ ఇలా ముందుగానే సిద్ధమైందని కొందరు ఉత్సాహంగా వ్యాఖ్యానిస్తున్నారు. బైడెన్ వెనుకంజలో ఉన్నారని అంచనాలున్న స్థితిలో, గతంలో ఆ ఒప్పందాన్ని తుత్తునియలు చేసిన డోనాల్డ్ ట్రంప్ మహాశయుడే తిరిగి అధ్యక్షుడైతేనో అన్న ప్రశ్న ఓ పక్కన ఉండనే ఉంది. కానీ, ఇంటాబయటా పలురకాల సంక్షోభాలు ఎదుర్కొంటున్న ఇరాన్‌కు ఈ ఆపత్సమయంలో పెజెష్కియాన్ సారథ్యం ఎంతోకొంత మేలుచేస్తుందన్న నమ్మకమైతే విశ్లేషకుల్లో బలంగానే ఉంది.
రెండుదశాబ్దాల క్రితం ఆరోగ్యమంత్రిగా పనిచేసిన ఈయన, పోటీలో నిలబడిన మిగతాఛాందసులకంటే ప్రజలకు నచ్చాడు. వారి కోర్కెలకు, ఆశలకూ ఆయన ప్రతినిధి. దేశప్రజల్లో తీవ్రమైన నైరాశ్యం ఆవరించి ఉందని, వారిలో అంతర్లీనంగా రగులుతున్న ఆగ్రహం ఏదో రూపంలో చల్లార్చాల్సిన అవసరం ఉన్నదని ఇరాన్ అధినాయకుడు, ఆయన ఆధ్వర్యంలోని మతాచార్యుల మండలి గుర్తించాయి. ఈ కారణంగానే గత అధ్యక్ష ఎన్నికల్లోనూ, ఇటీవలి మజ్లిస్ ఎన్నికల్లోనూ పెజెష్కియాన్‌ను దూరంపెట్టినవారే ఇప్పుడు పిలిచి మరీ ఈ పదవికి పోటీపడమన్నారు. ఆయన రాకవల్లనే ఈ ఎన్నికలకు కళవచ్చిందనీ, ప్రజల భాగస్వామ్యం పెరిగిందనీ అంటారు. ఎన్నికలబరిలో నిలవడానికి షియా మతాచార్యుల మండలి అనుమతించిన ఏకైక ఉదారవాది పెజెష్కియాన్.
గత అధ్యక్ష ఎన్నికల్లో ఖమేనీ ఆశీస్సులతో దేశాధ్యక్షుడైన ఇబ్రాహీం రైసీ తన నిరంకుశత్వంతో, ఛాందసత్వంతో అధికశాతం ప్రజలకు శత్రువైనాడు. అమెరికా అధ్యక్షుడుగా బరాక్ ఒబామా ఉండగా, ఇరాన్‌లో హసన్ రౌహానీ సాధించిన అణు ఒప్పందం ప్రపంచానికి ఎంతో ఉపశమనం ఇచ్చింది. ఆధునికుడిగా, ఆలోచనాపరుడుగా ప్రజల్లో మంచి పేరున్న రౌహానీ దీనితో ఎంతో సులువుగా రైసీని 2017 అధ్యక్ష ఎన్నికల్లో ఓడించగలిగారు. కానీ, ట్రంప్ తిక్కచేష్టలవల్ల ఆ ఒప్పందం స్వల్పకాలంలోనే నీరుగారిపోయి, అమెరికా చేతిలో ఇరాన్ పలు ఆంక్షలనూ, వేధింపులనూ అనుభవించాల్సివచ్చింది. ఈ వాతావరణం రైసీ తరహా ఛాందసశక్తుల ఎదుగుదలకు తోడ్పడింది. ఖమేనీ పట్టు బిగించడంతో రౌహానీని రైసీ 2021అధ్యక్ష ఎన్నికల్లో సులువుగా ఓడించగలిగారు. ఉదారవాదులు, సంస్కరణవాదుల గొంతులు బలహీనమైపోయిన ఆ తరుణంలో, ఖమేనీ ఆశీస్సులతో రెచ్చిపోయిన రైసీ వివిధ రకాల ఆంక్షలు అమలుచేశారు. అక్రమ నిర్బంధాలు, అణచివేతలు, రహస్య హత్యలు ఆయన హయాంలో చాలా జరిగాయి. ప్రజలకు స్వేచ్ఛ అపురూపమైపోయింది. మహిళల వస్త్రధారణకు సంబంధించి ప్రత్యేకమైన ఆంక్షలు, నిఘా నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటైనాయి. చాదోర్ వస్త్రాన్ని ధరించనందుకు మెహసా అమీనీ అనే కుర్దు యువతిని పోలీసులు తమ కస్టడీలో హతమార్చిన ఘటన దేశాన్ని కుదిపివేసింది. ప్రజల మనసుల్లో పాలకులపట్ల గూడుకట్టుకొని ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ మహిళా ఉద్యమాన్ని అణచివేయడంలో ఇబ్రాహీం రైసీ ప్రదర్శించిన కాఠిన్యం ఇరాన్ ఎన్నటికీ మరిచిపోదు. విమానప్రమాదంలో మొన్న మే నెలలో ఆయన మరణించినప్పుడు చాలా సమూహాలు వేడుకచేసుకున్నాయని కూడా వార్తలు వచ్చాయి.
ఛాందసవాది రైసీ స్థానాన్ని సంస్కరణవాది పెజెష్కియాన్ భర్తీచేయడం ఇరాన్ ప్రజలు, పాలకులు కూడా ఆశిస్తున్న మార్పు. ఆయన తన ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చలేకపోవచ్చు, వ్యవస్థలని సమూలంగా ప్రక్షాళించలేకపోవచ్చు. కానీ, రైసీ హయాంలో ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛనీ, హక్కులనీ కొంతమేరకు వారికి తిరిగి ఇవ్వగలిగినా చాలు. విదేశాంగం సహా చాలా విషయాల్లో ఖమేనీ, ఆయన ఆధ్వర్యంలోని సుప్రీం కౌన్సిల్ నిర్ణయాలే చెల్లుబాటవుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖమేనీ అనంతరం ఆ స్థానాన్ని రైసీ భర్తీచేస్తారని, మరో ఛాందసుడు దేశాధ్యక్షుడవుతాడని దేశంలోని మైనారిటీలు, సంస్కరణాభిలాషులు, ఉదారవాదులు భయపడుతున్న తరుణంలో పెజెష్కియాన్ రాక ఇంటాబయటా కూడా ఒక సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఉపకరిస్తుంది.