Share News

ఇజ్రాయెల్‌ దొంగదెబ్బ

ABN , Publish Date - Sep 20 , 2024 | 12:49 AM

ఇంత అన్యాయమైన యుద్ధం మధ్యయుగాల్లో కూడా లేదు అని గాజాఘాతుకాలను చూ‍స్తున్నవారికి అనిపిస్తున్న తరుణంలో, లెబనాన్‌లో వరుసగా రెండురోజులు సాగిన హైటెక్‌ విధ్వంసం ఇజ్రాయెల్‌ తెగింపు ఏ స్థాయిలో...

ఇజ్రాయెల్‌ దొంగదెబ్బ

ఇంత అన్యాయమైన యుద్ధం మధ్యయుగాల్లో కూడా లేదు అని గాజాఘాతుకాలను చూ‍స్తున్నవారికి అనిపిస్తున్న తరుణంలో, లెబనాన్‌లో వరుసగా రెండురోజులు సాగిన హైటెక్‌ విధ్వంసం ఇజ్రాయెల్‌ తెగింపు ఏ స్థాయిలో ఉంటుందో మరోమారు తెలియచెప్పింది. రెండు ప్రపంచయుద్ధాల్లోనూ అత్యంత అమానుషమైన యుద్ధరీతులను ఈ ప్రపంచం చూసింది. ఉచ్చు బిగించి, అమాయకంగా వలలోపడిన శత్రువును మట్టుబెట్టడం, చుట్టలూ, టోపీలవంటి వస్తువులుగా కనిపించే ఆయుధాలతో శత్రు సైనికులతో పాటు సామాన్యులను సైతం పొట్టనబెట్టుకోవడం వంటివి చూసింది. ఆ తరువాతే, అది యుద్ధం కాదు, అమానుషత్వం, ఉన్మాదం అన్న గ్రహింపుతో, కొన్ని దశాబ్దాల పరిణామంలో కనీస హక్కుల దృష్టితో కొన్ని నిబంధనలు, అంతర్జాతీయ ఒప్పందాలు ఏర్పడ్డాయి. హమాస్‌ ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారన్న పేరిట చిరకు ఆస్పత్రులనూ, ఆశ్రయాలనూ నేలమట్టం చేస్తూ, గాజాలో వేలాదిమంది సామాన్యులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయెల్‌, హిజ్బొల్లాను చావుదెబ్బతీయడానికి ఈ అనైతికమైన విధానాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించదు. తనమీద రాకెట్లతో దాడులు చేస్తున్న శత్రువు గుండెలను చీల్చి యుద్ధక్షేత్రంలో సంహరించడానికి బదులుగా ఊహించనిరీతిలో, ఊహకు అందనిచోట దొంగదెబ్బతీసింది. తనమీద కురుస్తున్న క్షిపణులను అమెరికా అందించిన అత్యాధునిక పరికరాలతో అడ్డుకోగలుగుతున్న ఇజ్రాయెల్‌, ఆత్మరక్షణకు ఏ మాత్రం వీల్లేని రీతిలో, నిస్సహాయస్థితిలో ఉన్న శత్రువుపై దాడిచేసింది. పేజర్ల పేల్చివేతతో ఒకేమారు వేలాదిమంది శత్రువులను దెబ్బతీయడం సాంకేతిక అద్భుతమే కానీ, అనైతికం, దుర్మార్గం కూడా.


అంతర్జాతీయ చట్టాలు, నియమనిబంధనలు ఇజ్రాయెల్‌కూ వర్తిస్తాయి కానీ, వాటిని అది ఉల్లంఘించి ఎన్ని అకృత్యాలకు పాల్పడినా కాపాడుకురావడానికి అమెరికా ఎలాగూ ఉంది. పైగా, ఒక రాజ్యేతరశక్తిని, ఒక ఉగ్రవాద సంస్థని దుంపనాశనం చేయడంలో ఈ చట్టాలూ చట్టుబండలూ ఏమిటన్న వాదన కూడా చేయవచ్చు. సమాచారాన్ని చేరవేయడానికీ, మాట్లాడుకోవడానికీ ఉపయోగించే ఓ సాధారణమైన పేజర్‌, వాకీటాకీలను ఇలా బాంబులుగా మార్చింది తానేనని ఇజ్రాయెల్‌ ఎప్పటికీ ఒప్పుకోదు. తైవాన్‌నుంచి రవాణా అవుతున్న పేజర్లను దారిమళ్ళించి, వాటిలో పేలుడుపదార్థాలను కుక్కి, సూక్ష్మస్థాయి డిటోనేటర్లను అమర్చారని అంటున్నారు. మొబైల్‌ ఫోన్‌ తమ ఉనికిని శత్రువులకు తెలియచేస్తుందన్న జాగ్రత్తతో, హిజ్బొల్లా మిలిటెంట్‌ దళం ఒకేమారు వేలాదిపేజర్లను దిగుమతి చేసుకొని, వాటినివాడటం ఆరంభించింది. కానీ, మార్గమధ్యంలో శత్రువు మాటువేసి, వాటిని తమపాలిట మారణాయుధాలుగా మార్చేస్తాడని ఆ సంస్థ ఊహించలేదు. అనేకనెలలుగా హిజ్బొల్లా అత్యున్నతస్థాయి నాయకులనుంచి తమ కేడర్‌కు చాలా మెసేజ్‌లు ఈ పేజర్ల ద్వారా అందినందున ఇజ్రాయెల్‌ వాటిని ట్రాక్‌ చేయకుండా ఉండదు. ఇప్పుడు అవి పేలడం, వెనువెంటనే లెబనాన్‌మీద క్షేత్రస్థాయి దాడులు ఊపందుకోవడం వెనుక ఇజ్రాయెల్‌ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. సాంకేతికతను ఈ స్థాయిలో వినియోగించి, శత్రువును మానసికంగా భయోత్పాతంలో ముంచిన నేపథ్యంలో హమాస్‌ మాదిరిగానే హిజ్బొల్లాను కూడా సమూలంగా పెకిలించివేస్తానని ఇజ్రాయెల్‌ అంటోంది. పేజర్లు, వాకీటాకీలు పేలుడుపదార్థాలుగా మారిన ఈ ఉదంతం హిజ్బొల్లాను కకావికలు చేసినమాట నిజం.


పెగాసస్‌ వంటి అధునాతన, అత్యున్నత స్థాయి స్పైవేర్‌ను ఆయా ప్రభుత్వాలకు అందించి, తమకు గిట్టనివారి ఫోన్‌లను హ్యాక్‌ చేయగలిగే అవకాశం కల్పించింది ఇజ్రాయెల్‌. ఆ నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకొని విపక్షనేతలనుంచి పాత్రికేయులవరకూ అందరిమీదా ఓ కన్నేసి ఉంచగలిగే అవకాశం పాలకులకు దక్కింది. తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని జైళ్ళలో కుక్కేందుకు వీలుగా, వారి కంప్యూటర్లలోకి చొరబడటమూ చూశాం. ఇజ్రాయెల్‌ సాంకేతిక నైపుణ్యానికీ, చావుతెలివితేటలకీ ఈ పేజర్ల పేలుళ్ళు మరో నిదర్శనం. సాధారణపౌరులు ఉపయోగించే పరికరాలను సైతం ఆయుధాలుగా, అధునికకాలపు బూబీట్రాప్‌లుగా మార్చేయడం వాటిని ఉపయోగిస్తున్నవారిని కచ్చితంగా భయపెట్టే అంశం. మీ మొబైల్‌, లాప్‌టాప్‌ సరే, కనీసం మీ టీవీ, ఫ్రిడ్జ్‌ ఇత్యాదివి ఇజ్రాయెల్‌కు అందకుండా ఉంటాయా? అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్‌ చొరబడలేని చోటు ఉండబోదన్నది ఇప్పుడు అందరినీ భయపెడుతున్న అంశం.

Updated Date - Sep 20 , 2024 | 07:45 AM