Share News

దళితుల ఐక్యతను కోరిన జాషువ

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:54 AM

కాలంతో పోటీ పడి జీవించే మహాకవి గుర్రం జాషువ. ప్రతినిత్యం ప్రజల నాలుకల మీద ప్రతిధ్వనించే జాషువ పద్యాలు ఎప్పుడు చదివినా తాజాగా ఉంటాయి. మానవ మనుగడకు అడ్డు వచ్చే విద్రోహాలను, జీవించే

దళితుల ఐక్యతను కోరిన జాషువ

కాలంతో పోటీ పడి జీవించే మహాకవి గుర్రం జాషువ. ప్రతినిత్యం ప్రజల నాలుకల మీద ప్రతిధ్వనించే జాషువ పద్యాలు ఎప్పుడు చదివినా తాజాగా ఉంటాయి. మానవ మనుగడకు అడ్డు వచ్చే విద్రోహాలను, జీవించే హక్కును కాలరాచే కుట్రలను వ్యతిరేకించి వాటిని ఎదుర్కొనే శక్తి యుక్తులను తన కవిత్వం ద్వారా జాషువ ప్రచారం చేశాడు. విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లాంటి ఉద్దండ కవి పండితులు ఏర్పరచిన సాహిత్య దృక్పథాలకు భిన్నంగా, ప్రత్యామ్నాయ కవితాతత్త్వాన్ని ఆవిష్కరించాడు. బుద్ధుడు, క్రీస్తు, మహాత్మాగాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వంటి మహనీయులు అందించిన ఉమ్మడి భావజాల స్ఫూర్తికి జాషువా కవిత్వం అక్షర దర్పణంగా నిలుస్తుంది. ‘అకలంకంబగు హేతువాదము’, ‘సత్యాన్వేషణాసక్తి’, ‘సాంఘిక కళ్యాణ పిపాస’, దేశభక్తి, దళితుల సర్వతోముఖ ప్రగతి, మహిళాభ్యుదయ చింతన, తదితర అంశాలను ఆయన ఆర్ద్రంగా కవిత్వీకరించాడు. అందువల్ల జాషువ ఈనాటి అస్తిత్వ ఉద్యమాలకు మార్గదర్శిగా కనిపిస్తాడు. వర్తమాన చైతన్యానికి ఊతమిచ్చే ఎన్నో అంశాలను, సమకాలీన సమాజాభివృద్ధికి అవసరమైన సాంస్కృతిక విలువలను జాషువ ఆనాడే తన కవిత్వంలో పొందుపరచి నవయుగ కవి చక్రవర్తిగా విమర్శకుల నీరాజనాలందుకున్నాడు. జాషువ కవిత్వం వెన్నెల తుఫాన్. ఆ వెన్నెల్లో అంటరాని గబ్బిలాలు ఆవేదనతో భాషించాయి. ఆ తుఫాన్‌లో నాలుగు పడగల హైందవ నాగరాజులు ఉలిక్కి పడ్డాయి. ఈ కవికోకిల సాహిత్యం ఒక కన్నీటి సునామీ. అవిచ్ఛిన్నమైన ఆ సృజనవాహిని ఒక్క కుల సమస్య దగ్గరే ఆగిపోలేదు. మనిషిని పీడించే అనేకరకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను తడుముతూ నిమ్నోన్నతాలను సమం చేస్తూ జీవితపు సన్నని పార్శ్వాల్లోగుండా ప్రవహించింది. కులీన వర్గాల ఆధిపత్యం నిరాఘాటంగా కొనసాగుతున్న సాహిత్యంలో తక్షణం కవిగా నిలబడటానికి తొలిదశలో జాషువ పౌరాణిక నాటకాలు రాసినప్పటికీ ఆ ప్రభావం నుండి బయటపడి సామాజిక బాధ్యతతో విశిష్టమైన ఖండ కావ్యాలను, సందేశాత్మకమైన లఘు కావ్యాలను వెలువరించాడు. భారతీయ సమాజంలో వేళ్లూనుకున్న కులపీడనను తీవ్రంగా నిరసిస్తూ ఆయన రాసిన గబ్బిలం కావ్యం గత సహస్రాబ్దిలో వెలువడిన ఐదు గొప్ప పుస్తకాల్లో ఒకటిగా (ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పయనీర్ సర్వే ప్రకారం) ప్రఖ్యాతిగాంచింది. గబ్బిలం స్వరూపం– దేశారాధన.. స్వభావం– దళిత వేదన. ఈ రకమైన అపూర్వ శిల్పవ్యూహంతో రచించడం వల్లనే ఈ కావ్యం సంప్రదాయ పండితులతో పాటు అధునాతన కవులకు కూడా ప్రీతిపాత్రమయింది.


తెలుగు సాహిత్యంలో ఘనత వహించిన చాలామంది కవులు, రచయితలు వీధిలో తిష్టవేసిన చెత్త గురించి మాట్లాడారు కానీ తమ ఇంటిని ఆవరించిన బూజు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇందుకు భిన్నంగా జాషువ స్వీయ లోపమ్ములను అర్థం చేసుకొని, సాంఘిక దురన్యాయాలను ఖండిస్తూ గొప్ప సాహిత్యాన్ని సృష్టించాడు. సామాజిక అసమానతలను ఎంత తీవ్రంగా ప్రశ్నించాడో అంతే పదునుగా దళితుల మధ్య రగులుతున్న అంతర్గత ఉప కుల భేదాలను కూడా విమర్శించాడు. ‘ఇంటి గుట్టు’, ‘పంచముడు’ వంటి ఖండికలతో పాటు గబ్బిలం తదితర కావ్యాలలో కూడా అనేక సందర్భాలలో ఈ వైరుధ్యాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. మాల మాదిగల నడుమ బుసలు కొట్టే కుల, మత శాఖాపరమైన విభేదాలను, వివాదాలను కుండబద్దలు కొట్టినట్లు తన కవిత్వంలో తేటతెల్లం చేశాడు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావనతో అనునిత్యం సంఘర్షణలు రగులుతూనే ఉంటాయి. అణగారినవర్గాలు కూడా దీనికి అతీతం కాదు. ‘‘కలదమ్మావ్రణమంటరానితన మాకర్ణింపుమీయిండియాపొలమమందుంగల మాలమాదిగలకున్’’ అంటూ జాషువ సామాజికరోగాన్ని గూర్చి తెలియజేశాడు. ఇలాంటి పెను రోగంతోనే మాలమాదిగలు పరస్పరం దూషించుకుంటున్నారని, కృష్ణులు, క్రీస్తులు ఎంతమంది దేవుళ్ళు జన్మించినా ఈ రెండు జాతుల మధ్య ఐక్యతను సాధించలేరని జాషువ ఆవేదన చెందాడు. అంతఃకలహాలలో సతమతమవుతూ సమాజంలో తమకు జరుగుతున్న అన్యాయాలను వారు ఎదిరించలేక పోతున్నారని జాషువ మధన పడ్డాడు. ‘‘పంచముల లోన మాదిగవాడ నేను/ పంచమీయులలో మాలవాడతండు/ ఉభయులము క్రైస్తవ మతాన నొదిగినాము/ సోదరత గిట్టుబాటు కాలేదు మాకు’’ అని దళితుల మధ్య ఉన్న వైషమ్యాలను జాషువ నిరసించాడు. ‘సిగ్గు విడిచి హెచ్చు తగ్గుల కోసమై తన్నుకొనుట మాకు తప్పు గాదు’’ అని వ్యంగ్యంగా నిందించాడు. ‘బియేలె మేలు’ విద్యాబిరుదుల్ సాధించామని గర్వపడే మాలలు, మాదిగలు కుల మహాలోభంతో, తగాదాలతో తెగలుగా విడిపోతున్నారని జాషువ ఆవేదన చెందాడు. ‘కులకక్ష్యాబ్రష్ట దుర్జాతి’ అని తన జాతి జనులను ఆయన తీవ్రంగా మందలించాడు. ‘‘మాల యేసుక్రీస్తు, మాదిగలకు గాడు / మాదిగేసుక్రీస్తు మాకూ గాడు’’ అంటూ కరుణామయునికి కూడా వర్ణ పంకిలము పులుముతున్నారని, ‘కాకులందు మాలకాకి, మాదిగ కాకి’ వారి విరోధములను బహిర్గతం చేస్తున్నాయని ఇరువర్గాలను చూసి ఆ కవిచక్రవర్తి విస్మయంతో బాధ పడ్డాడు. ప్రాబల్య వర్గాల, సవర్ణ హిందువుల ఆధిపత్యాన్ని అవహేళన చేస్తున్నారు కానీ దళితులు తమ తప్పులను తెలుసుకోవటం లేదని జాషువ హితవు చెప్పాడు. రోదసీలోకి కూడా సునాయాసంగా ప్రయాణం చేసే ప్రజ్ఞాశాలియైన మానవుడు ‘పరస్పర విద్వేష విషాద చండశిఖ’ను ఆర్పలేక పోతున్నాడని వ్యాఖ్యానించాడు. ‘‘చండా లత్వంబొక పక్క/ గుండెలు తిని వేయుచుండ గొప్పల కొరకై/ యొండొరులుకలహమాడుచు/ నుండెదరా’’ అని జాషువ దళితుల దయనీయమైన పరిస్థితిని సూటిగా దూషించాడు. బహుజనుల మధ్య రగులుతున్న అంతర్గత వైషమ్యాలను కూడా జాషువ విమర్శించాడు. ‘‘మా చాకలి వారు మంగలియు జాతుల గొప్పదనాల కోసమై /బాకులు బట్టి నిల్చెదరు పంచమజాతియున్ రెండు ముక్కలై/ తాకదు ముట్టదని’ దళితులతో పాటు బహుజనులకు ఆయన లెక్కలేని చివాట్లు పెట్టాడు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పదవి కట్టబెట్టటం ద్వారా ఆ కుల చైతన్యాన్ని నీరుగార్చ వచ్చునని రాజకీయ నాయకులు భావిస్తారని, ఈ పదవుల వలలో చిక్కుకోవద్దని దళితులకు జాషువ సూచించాడు. ‘‘ఐకమత్య బలవద్ఘన రజ్జువు నుండి భిన్నమై తొలగిన నూలు పోగులకు తోరపు చిక్కులు రాకపోవునే’’ అని జాషువ హెచ్చరించాడు.

జాషువ కవిత్వం వెన్నెల తుఫాన్. ఆ వెన్నెల్లో అంటరాని గబ్బిలాలు ఆవేదనతో భాషించాయి. ఆ తుఫాన్‌లో నాలుగు పడగల హైందవ నాగరాజులు ఉలిక్కిపడ్డాయి. ఈ కవికోకిల సాహిత్యం ఒక కన్నీటి సునామీ. అవిచ్ఛిన్నమైన ఆ సృజనవాహిని ఒక్క కుల సమస్య దగ్గరే ఆగిపోలేదు. మనిషిని పీడించే అనేకరకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను తడుముతూ నిమ్నోన్నతాలను సమం చేస్తూ జీవితపు సన్నని పార్శ్వాల్లోగుండా ప్రవహించింది.

డాక్టర్ కోయి కోటేశ్వర రావు

ప్రభుత్వ సిటీ కళాశాల, హైదరాబాద్‌

(నేడు గుర్రం జాషువ జయంతి)

Updated Date - Sep 28 , 2024 | 04:54 AM