కేజ్రీవాల్ చాణక్యం
ABN , Publish Date - Sep 17 , 2024 | 04:49 AM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు కానీ, తాను రాజీనామా చేయబోతున్నట్టుగా చేసిన ప్రకటన మాత్రం ఊహించనిది. ఆర్నెల్లుగా ఆ ఊసెత్తకుండా...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు కానీ, తాను రాజీనామా చేయబోతున్నట్టుగా చేసిన ప్రకటన మాత్రం ఊహించనిది. ఆర్నెల్లుగా ఆ ఊసెత్తకుండా, తిహార్ జైలునుంచి బయటకు వచ్చిన తరువాత ఈ నిర్ణయాన్ని ప్రకటించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎన్నికల నిమిత్తం స్వల్పకాలం బెయిల్ దక్కడం వినా, సుదీర్ఘకాలంగా ఆయన జైల్లోనే ఉన్నాడు. మనీష్ సిసోడియా సహా సుప్రీంకోర్టు ఇప్పటికే కొందరికి బెయిల్ మంజూరు చేస్తూ, ఊపావంటి కఠినమైన చట్టాలు మోపిన కేసుల్లో సైతం జైలు అనేది మినహాయింపు, బెయిల్ ఒక రూల్ అన్న సూత్రాన్ని పలుమార్లు ఉద్ఘాటించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పెట్టిన కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిన వెంటనే, దాదాపు రెండేళ్లుగా నిమ్మకునీరెత్తినట్టు ఊన్న సీబీఐ అప్పుడు హడావుడిగా రంగంలోకి దిగిన వైనాన్ని సుప్రీంకోర్టు ఈ తీర్పు సందర్భంగా గుర్తుచేసింది. కేజ్రీవాల్‌ను జైల్లోనే ఉంచాలన్న ఉద్దేశం తప్ప ఇంకేమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.
ఇప్పటికైనా బెయిల్ వచ్చినందుకు సంతోషించి, చక్కగా రాజ్యపాలన చేసుకోవాల్సిన కేజ్రీవాల్ హఠాత్తుగా ఇలా రాజీనామాకు ఎందుకు సిద్ధపడ్డారన్నది ప్రశ్న. నైతికవిలువల అంశమే అయితే, ఆయన జైల్లో కాలూనిన క్షణాన్నే తన పదవికి రాజీనామా చేసివుండవచ్చు. ప్రజలు ఎన్నుకున్న తనకు జైలునుంచి ఏలే హక్కు ఉన్నదని ఆయనా, పార్టీ న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ వాదించారు. రాజీనామా చేయకుండా జైల్లో ఉన్న ఆయనకు ఎన్నికల ప్రచారం చేసుకొనే అవకాశం కూడా న్యాయస్థానాలద్వారా దక్కింది. బెయిల్‌మీద బయటకు వచ్చి లోక్‌సభ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేసుకున్నప్పటికీ, ఢిల్లీ ప్రజలు జాలి పడిందీ లేదు, బ్రహ్మరథం పట్టిందీ లేదు. ఏడు లోక్‌సభ సీట్లనూ ఐదేళ్ళనాటి మెజారీటీలను అధిగమించి మరీ బీజేపీ తన్నుకుపోయింది. పంజాబ్‌లో సైతం కేజ్రీవాల్ జైలు ప్రభావం అంతగా లేదు. పదమూడు లోక్‌సభ స్థానాల్లో మూడుమాత్రమే ఆ పార్టీకి దక్కాయి. కేజ్రీవాల్‌కు ఈ లెక్కలేమీ తెలియనివి కావు. కానీ, కోర్టుల్లో న్యాయం, ప్రజాక్షేత్రంలో తీర్పు అంటూ ఓ ఎత్తుగడకు తెరదీశారు. తాను తెచ్చిన మద్యం విధానం సరైనదని, ఢిల్లీకి ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూర్చేదనీ, తన మెడకు చుట్టిన కేసులన్నీ రాజకీయప్రేరేపితమైనవని వాదిస్తున్నప్పుడు వాటి సంగతి న్యాయస్థానాల్లో తేల్చుకోవాలి, పరిశుద్ధుడై ప్రజలముందుకు రావాలి. ఢిల్లీవాసులు తన సచ్ఛీలతను, నైతికతను విశ్వసించడం లేదని ఆయనకు ఇప్పుడు ఎందుకు అనుమానం కలిగిందో మరి.
ఢిల్లీలో ఎన్నికలు ఎలాగూ మరో ఐదునెలల్లో జరగాల్సి ఉన్న తరుణంలో కేజ్రీవాల్ ఎత్తుగడ ఆయనకు ఏ మేరకు లాభిస్తుందో చూడాలి. సుప్రీంకోర్టు విధించిన కఠినమైన బెయిల్ నిబంధనలు కూడా ఆయనకు అడుగడుగునా అడ్డుపడుతున్న తరుణంలో ఎన్నికలు ముందుకు జరగాలని ఆయన కోరుతున్నారు. ఆయన కోరికమేరకు ఇంతస్వల్పవ్యవధిలో, మరో రెండురాష్ట్రాలతో కలిపి ఢిల్లీలో ఎన్నికలు జరగడం అసాధ్యం. కానీ, ఫిబ్రవరివరకూ తన స్థానంలో మరొకరిని కూచోబెట్టి, పరోక్షంగా తానే రాజ్యాన్ని ఏలుతూ, బీజేపీ కక్షరాజకీయాలకు తాను బలైపోయానని, ప్రజలు గట్టిగా తనపక్షాన నిలిస్తే కానీ, తాను మళ్ళీ గద్దెనెక్కననీ ఆయన చెప్పుకోబోతున్నారు. తననూ, పార్టీలోని కీలకమైన నాయకులందరినీ అవినీతి ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో, ఈ రాజీనామా ద్వారా ప్రజలు తనను అగ్నిప్రవేశం చేసినట్టుగా భావిస్తారన్నది ఆయన ఆలోచన కావచ్చు. ఈ మూడునెలలూ ముఖ్యమంత్రి కుర్చీలోనే కూర్చొని, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేకంటే, వేరొకరిని ఆ సీట్లో తాత్కాలికంగా కూచోబెట్టి, తాను ఒక కొత్త ముఖంతో, మళ్ళీ సరికొత్త సీఎం అభ్యర్థిగా ప్రజలముందుకు వెళ్ళడం వల్ల అధిక రాజకీయ ప్రయోజనం ఉంటుందని ఆయన నమ్మకం. సీఎం కార్యాలయం,
సచివాలయం ఇత్యాది చోట్లకు వెళ్ళకూడదనీ, గవర్నర్‌కు పంపాల్సిన ఫైళ్ళమీదే సంతకాలు చేయాలని అంటూ సుప్రీంకోర్టు సవాలక్ష బెయిల్ నిబంధనలు విధించిన నేపథ్యంలో, ఈయన సీఎంగా కొనసాగితే రాష్ట్రపతిపాలన విధించాలన్న వాదన కూడా మరింత హెచ్చే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు తాను తప్పుకొని, కొత్త వ్యక్తిని అక్కడ కూచోబెట్టి, ఎన్నికలు ముందుగా నిర్వహించాలన్న డిమాండ్ తెచ్చి, కేజ్రీవాల్ రాజకీయచదరంగంలో అతి వేగంగా ఎన్నో ఎత్తులు వేశారు. దశాబ్దంన్నర క్రితం అవినీతి వ్యతిరేక పోరాట యోధుడుగా తాము చూసిన కేజ్రీవాల్ ఇప్పటికీ అంతే పవిత్రంగా ఉన్నాడని ప్రజలు నమ్ముతున్నదీ లేనిదీ ఎన్నికల అగ్నిపరీక్షలో తేలుతుంది.