Share News

బతుకు చిత్రాల స్రష్ట

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:46 AM

‘భారతీయ వెండితెరపై గ్రామీణ భారతదేశానికి సరైన ప్రాతినిధ్యం లభించలేదని నేను ఎప్పుడూ భావిస్తుంటాను’ అని శ్యామ్ బెనగల్‌ ఒకసారి అన్నారు. సమాంతర చిత్రాలుగా సుప్రసిద్ధమైన కళాత్మక చిత్రాల సృష్టిని 1970, 80లలో...

బతుకు చిత్రాల స్రష్ట

‘భారతీయ వెండితెరపై గ్రామీణ భారతదేశానికి సరైన ప్రాతినిధ్యం లభించలేదని నేను ఎప్పుడూ భావిస్తుంటాను’ అని శ్యామ్ బెనగల్‌ ఒకసారి అన్నారు. సమాంతర చిత్రాలుగా సుప్రసిద్ధమైన కళాత్మక చిత్రాల సృష్టిని 1970, 80లలో సమున్నత స్థాయికి తీసుకువెళ్లిన ఆ అద్వితీయ సృజనశీలి అభిప్రాయం ఆయన తొలిచిత్రాల నవ్య పథాన్ని చెప్పకనే చెప్పుతుంది. అంకుర్‌ (1974), నిషాంత్‌ (1975) మంథన్‌ (1976)తో భారతీయ సినీ ప్రేక్షకులకు అవి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. భారతీయ సమాంతర సినిమాల చరిత్రలో అంకుర్‌ ఒక మైలురాయి. గ్రామాలలో కుల, జెండర్‌ అసమానతలను చూపిన చిత్రమది. భూస్వామ్య అణచివేతలపై తిరుగుబాటు అనివార్యమనే సత్యాన్ని నిషాంత్‌ స్పష్టం చేసింది. గుజరాత్‌లో వెల్లువెత్తిన శ్వేత విప్లవానికి కళాత్మక నివాళి మంథన్‌. ఐదు లక్షల మంది రైతులు తలా రెండు రూపాయలతో ఈ చిత్ర నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చారు. ఈ మూడు సినిమాలు స్వాతంత్ర్య తొలి దశాబ్దాలలో గ్రామీణ భారతంలోని పరిస్థితులకు అద్దం పట్టాయి. బెనగల్‌ సినిమాలు ఆనాటి పల్లెల్లో భూస్వామ్య అభిజాత్యాలు, అణగారిన బతుకులకు నిలువెత్తు దర్పణాలు. ఈ సినిమాలు, ఆ మాటకు వస్తే బెనగల్‌ చిత్రాలు ఏవైనా సరే చూసిన తరువాత భారత్‌ ఒకప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది, ఎలా ఉండాలనే విషయమై మీ ఆలోచనల్లో మార్పు చోటుచేసుకోవచ్చు.


శ్యామ్‌ బెనగల్‌ తన సినిమాలలో మొదటి నుంచీ మహిళా పాత్రలను ప్రధానస్రవంతి సినిమాలకు విభిన్నంగా, నవ్య రీతులలో చూపించేందుకు నిబద్ధమయ్యారు. మహిళల స్వతస్సిద్ధ ఔన్నత్యాన్ని, పరిస్థితులకు తలవంచని చైతన్యాన్ని ఆ స్త్రీ పాత్రలు మూర్తీభవించి ఉంటాయి. ‘బెనగల్‌ స్త్రీ వాది అయివుంటారని’ ప్రగతిశీల విదుషీమణులు అభిప్రాయపడ్డారంటే ఆయన సినిమాలలోని స్త్రీ పాత్రలు ఎంత విలక్షణమైనవో అర్థం చేసుకోవచ్చు. కులం, వర్గం, మతం, జెండర్ అసమానతలు, అణచివేతలకు బలవుతున్న అభాగ్య జీవితాలను చిత్రించినప్పటికీ ప్రధానస్రవంతి సమాజంపై ఆయన ఆగ్రహావేశాలు వ్యక్తం చేయలేదు. ఆయన సినిమాలు ప్రశ్నలు లేవనెత్తుతాయికాని ఏ పక్షమూ వహించవు. 1974–2023 మధ్య 24 కళాత్మక సినిమాలతో పాటు ఎన్నో టెలివిజన్‌ సీరియల్స్‌, బయోపిక్‌లు, డాక్యుమెంటరీలు శ్యామ్‌ బెనగల్‌ నిర్మించారు. ‘సినిమా స్రష్ట కావడం ఒక రచయిత లేదా చిత్రకారుడుగా ఉండడం లాంటిదే. సినిమా నిర్మాణ వ్యాసంగం మీకు స్పష్టతనే కాదు, ప్రపంచ దృక్పథాన్ని కూడా ఇస్తుంది. అది ఎంత స్థానికమో అంత విశ్వజనీనమైనది. మరే వృత్తి మీకు ఇలాంటి దృక్పథాన్ని భావ వైచిత్రిని ఇవ్వగలుగుతుంది? మీరు సినిమా సృజనలో ఉండడమంటే ఒక ప్రయోగశాలలో సూక్ష్మదర్శినితో పాటు దూరదర్శిని ద్వారా జగత్తును వీక్షిస్తున్న వైజ్ఞానికునిలా ఉండడమే’ అని బెనగల్‌ అంటారు. భారతదేశ ఉత్కృష్ట నటీనటులు పలువురు బెనగల్‌ సినిమాలలో నటించడమో లేదా వాటి ద్వారా పరిచయమవ్వడమో జరిగింది. స్మితా పాటిల్‌, షబనా అజ్మీ, నసీరుద్దీన్ షా, ఓంపురి, అమ్రిష్‌పురి, అనంతనాగ్‌, నీనాగుప్త, మోహన్‌ అగాసె తదితరులు వారిలో కొందరు మాత్రమే. తెలుగునటి వాణిశ్రీ ఆయన దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా ‘అనుగ్రహం’లో నాయికగా జీవించారు.


శ్యామ్‌ బెనగల్‌ పూర్వీకులు కొంకణ్‌ ప్రాంతానికి చెందినవారు. ఆయన హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు, విద్యాభ్యాసమంతా ఈ నగరంలోనే జరిగింది. తెలంగాణతో ఆయనకు అనుబంధం ఉన్నది. తన సినిమాలలో దక్కనీ కవిత్వాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. తొలి సినిమాలో సంభాషణలు దక్కనీ ఉర్దూలో ఉంటాయి. అంకుర్‌, నిషాంత్‌, మరికొన్ని సినిమాలను తెలంగాణ గడ్డపైనే ఆయన చిత్రీకరించారు. ఇక్కడి గంగా–యమున తెహజీబ్ సంస్కృతికి ఆయన వారసుడు. నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ను భారత్‌ ఏక్‌ ఖోజ్‌’ పేరిట 53 భాగాల టెలివిజన్‌ సిరీస్‌ను బెనగల్‌ నిర్మించారు. శ్యామ్‌ బెనగల్‌ కళాస్రష్టగానే కాదు, భారత పౌరుడుగా కూడా తన బాధ్యతలను భారత రాజ్యాంగ నైతికతా నిష్ఠతో నిర్వహించిన ఉదాత్తుడు. భారత రాజ్యాంగ నిర్మాణ ఇతిహాసంపై ‘సంవిధాన్‌’ పేరిట ఆయన ఒక టీవీ డాక్యుమెంటరీని నిర్మించారు. ఆ ఆధునిక భారతీయ ధర్మ గ్రంథం అమృతోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుత సందర్భంలో బెనగల్‌ ‘సంవిధాన్‌’ను పాఠశాల బాలలు, కళాశాల యువతకు ప్రత్యేకంగా ప్రదర్శించడమూ ఆయనకు సముచిత నివాళి అవుతుంది.

Updated Date - Dec 25 , 2024 | 05:46 AM