విశ్వఐక్యతకు నాంది ‘లోక్‌మంథన్’
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:23 AM
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎన్నో శతాబ్దాలుగా అనేక మార్పులు చవిచూశాయి. వనవాసం, గ్రామీణ సమాజం, పట్టణ జీవితం, నగర నాగరికత అనేవి ఒకదానితో ఒకటి విడదీయరాని భాగాలుగా మన సంస్కృతికి బలమైన పునాదులుగా నిలిచాయి.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎన్నో శతాబ్దాలుగా అనేక మార్పులు చవిచూశాయి. వనవాసం, గ్రామీణ సమాజం, పట్టణ జీవితం, నగర నాగరికత అనేవి ఒకదానితో ఒకటి విడదీయరాని భాగాలుగా మన సంస్కృతికి బలమైన పునాదులుగా నిలిచాయి. అయితే కాలక్రమేణా వివిధ ప్రభావాల కారణంగా వనవాసుల కంటే గ్రామవాసులు, వీరికంటే పట్టణ ప్రజలు, వీరందరినీ మించి నగరవాసులు గొప్పవారన్న భావన పెరిగిపోయింది. వాణిజ్య దృష్టికోణంలో స్థూలంగా చూసినప్పుడు వీరందరూ ఒకరిని మించినవారు మరొకరు అన్నట్టుగా భేదదృష్టిని కల్పించి, విభజించి, విద్వేషాలు రగిలించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, వీరంతా ఒకరితో ఒకరు పెనవేసుకుని జీవించాలనీ, జీవిస్తున్నారనే విషయం సూక్ష్మంగా చూస్తే తప్ప అర్థం కాదు. ఇది భారతదేశంతో పాటుగా యావత్ ప్రపంచానికి అన్వయించే విషయం.
నేటి సమాజంలో ఈ విషయం ఎందరికి తెలుసన్నదే అసలు ప్రశ్న. వన జీవనం, గ్రామ సమాజం, పట్టణ జీవితం, నగర నాగరికత అనేవి కచ్చితంగా వేర్వేరు వ్యవస్థలనీ, ఒక దానిని మించినది మరొకటి అనేది వీరి దృష్టి కోణం. ఇలాంటి భావనలు తొలగించి– మన సంస్కృతీ సంప్రదాయాలను తిరిగి పునరుద్ధరించేందుకు, సమాజంలో ఏకీకృత భావనను తీసుకొచ్చేందుకు, విశ్వ ఐక్యత ప్రాశస్త్యాన్ని ప్రతిపాదించేందుకు భాగ్యనగర్ వేదికగా ఈ రోజు నుంచీ ‘లోక్‌మంథన్ – 2024’ పేరుతో ఒక అద్భుత అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ మహోత్సవం నవంబరు 24 వరకు భాగ్యనగరం లోని శిల్పకళావేదికలో నాలుగు రోజుల పాటు జరగనుంది.
భారతదేశంలో నగరీకరణ జరిగినప్పటికీ, మనది గ్రామీణ కేంద్రిత సంస్కృతి. ఈ వ్యవస్థలో ఉన్నత విద్యాభ్యాసం, బోధన, అధ్యయనం అధికంగా అటవీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఋషుల ఆశ్రమాల్లోనే జరిగేవి. నగరాల్లో గొప్ప నాగరికతను ఆస్వాదిస్తున్న అత్యున్నత వర్గాలవారు, వారి సంతానం, చివరికి మహారాజులు, వారి వారసులు సైతం జ్ఞానాన్ని పొందేందుకు, యుద్ధవిద్యలు నేర్చుకునేందుకు, ఆర్థిక సామాజిక జ్ఞాన సముపార్జనకు ఈ ఆశ్రమాలకే వెళ్లేవారు. భారతీయ పురాణాలను, చరిత్రను పరిశీలిస్తే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సహా గొప్ప గొప్ప చక్రవర్తులు సైతం వనాలు, గ్రామాల్లోని గురుకులాలలో వేదాధ్యయనం, ఇతర విద్యలు నేర్చుకున్నవారే. ఈ మహారాజులు తమ రాజ్యపాలన అనంతరం సమస్తం త్యజించి వారసులకు రాజ్యం అప్పగించి జీవిత చరమాంకాన్ని వానప్రస్థంగా ఆ ఋషుల ఆశ్రమాల్లోనే గడిపేవారు. ఈ విధంగా వనాల నుంచి నగరవాసం, ఇక్కడి నుంచి తిరిగి వనవాసం వరకూ జీవన ప్రస్థానం పెనవేసుకుని నడిచిన పరిస్థితులు మన చరిత్రలో కీలకమైన ఘట్టాలుగా నిలిచిపోయాయి. ఆనాటి ఆచార సంప్రదాయాల విలువలను పునఃప్రతిష్టించి లోక ఐక్యతను చాటేందుకు ‘లోక్‌మంథన్ – భాగ్యనగర్’ ఒక మేలి మలుపుగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను.
ఒక విశిష్టమైన ప్రజాస్వామ్య కేంద్రిత విజ్ఞానవ్యవస్థ భారతదేశమంతటా ఒకప్పుడు ఆచరణలో ఉండేది. అయితే ఇస్లామిక్ దండయాత్రలు, ఆ తర్వాతి కాలంలో క్రైస్తవ దురాక్రమణల వల్ల గ్రామీణ ప్రజల కంటే పట్టణవాసులను, వీరిని మించి నగరవాసులను గొప్పవారిగా భావించే ఒక వివక్ష క్రమంగా పెరిగిపోయింది. పట్టణాలు–నగరేతర ప్రాంతాలలో నివసించే వారిని చులకనగా చూడడం. పల్లె విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసి, పట్టణ–నగర ప్రాంతాల్లోని జ్ఞానం కంటే తక్కువ అనే భావనతో వ్యవహరించడం ప్రారంభమైంది. పాశ్చాత్య దేశాలలో ఉన్న శాస్త్రీయం, జానపదం అనే వర్గీకరణను భారతీయ సమాజంపై బలవంతంగా రుద్ది, గ్రామీణ ప్రాంతాల ప్రజలను మరీ ముఖ్యంగా వనవాసులను ఏమీ తెలియని జానపదులుగా భావించటం మొదలైంది.
శాస్త్రీయం కానివన్నీ అనాగరికమైనవనీ, తక్కువ స్థాయికి చెందినవనే భిన్నమైన నిర్వచనాన్ని మన సమాజంలో చొప్పించారు. ఫలితంగా సామాజిక సామరస్యత, ఆరోగ్యం, సాంకేతికత, ఆహారపు అభిరుచులు, ప్రకృతి ప్రాధాన్యత మొదలైన ఎన్నో అంశాల్లో భారతదేశంలో నిక్షిప్తమై ఉన్న అపార అనుభవాన్ని, జ్ఞానాన్ని గణనీయంగా నష్టపోయాం. ఫలితంగా ప్రకృతి దోపిడీ, సామాజిక సమతుల్యతకు తీవ్రమైన నష్టం జరిగింది. ఈ కృత్రిమ విభజనను నిర్మూలించి, పట్టణాలు – నగర ప్రాంతాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లో జీవించే ప్రజల విజ్ఞానం, వివేకం, సాంస్కృతిక నైతికతను సమకాలీకరించి, పట్టణాలు–నగరవాసులతో అనుసంధానించాల్సిన తక్షణావసరం ఉంది.
అందుకే.. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతులవారు సైతం ఈ లోక్‌మంథన్‌కి విచ్చేస్తున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం వస్తున్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆ దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, హవన విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో ప్రదర్శించనున్నారు. ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే కేచక్ నృత్య ప్రదర్శన సహా లోక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన గొప్ప సంప్రదాయాలను వీక్షించే తరుణం లోక్‌మంథన్ ద్వారా సాకారం కానుంది.
‘లోక అవలోకనం’ ప్రధాన అంశంగా లోక విచార్ (ప్రకృతి, సాంస్కృతిక సంబంధమైన ఆలోచన ప్రక్రియ), లోక వ్యవహార్ (సంప్రదాయాలు–ఆచరణ), లోక్ వ్యవస్థ (సంస్థలు– వ్యవస్థలు) అనే మూడు ఉప అంశాలు లోక్‌మంథన్ భాగ్యనగర్ ఉత్సవం ప్రత్యేకత. ఇందులో భాగంగా లోక జీవనదృష్టి, లోక జీవన విజ్ఞానం, లోక సాహిత్యం, లోక అర్థశాస్త్రం, భారతీయ లోక చేతనలో పర్యావరణం, లోక సురక్ష–న్యాయం, లోక సర్వసమావేశీ వ్యవస్థ తదితర అంశాలపై సదస్సులు ఉంటాయి. ప్రత్యేకించి మన భావితరాలైన విద్యార్థులు, యువతరం దృష్టి సారించేలా లోక్‌మంథన్ రూపకల్పన జరిగింది.
భారతీయతకు ప్రాధాన్యతనిచ్చి, ఆ దిశగా ఆలోచన–ఆచరణ చేసేవారిని ఒకే వేదికపైకి తెచ్చి, తద్వారా సామాజిక ప్రధాన జీవన స్రవంతిలో మరుగునపడిన వర్గాలు, సమాజాలకు ఒక స్థానం, ఒక గళం ఇవ్వాలన్నది ‘లోక్‌మంథన్’ లక్ష్యం. ఈ దృష్టి కోణంలో మేధావులు, కళాకారులు, వివిధ రంగాలవారిని ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది మా ప్రయత్నం. జానపద కళలు, జీవనశైలి, పద్ధతులు, సంప్రదాయాలు, సంస్థల వంటివన్నీ.. గొప్ప శాస్త్రీయ, నాగరిక అంశాలుగా చెప్పుకుంటున్న వాటికి ఏ మాత్రం తక్కువ కాదని ఘంటాపథంగా చూపించేందుకే ఈ మహత్తర కార్యక్రమం.
లోక్‌మంథన్ 2016 నుంచి రెండేళ్లకు ఒకసారి విభిన్న అంశాలను ఇతివృత్తంగా తీసుకుని– భోపాల్, రాంచీ, గువాహతి నగరాలలో అంతర్జాతీయ మహోత్సవాలను నిర్వహించింది. ఈసారి మన భాగ్యనగరాన్ని వేదికగా చేసుకున్న లోక్‌మంథన్ మహోత్సవాలలో 1,500 మందికి పైగా కళాకారులు 100కు పైగా కళారూపాలను ప్రదర్శించడం, 400కు పైగా అరుదైన సంప్రదాయ సంగీత వాయిద్యాలను చూసే మహదవకాశం ఈసారి ఈ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
లోక్‌మంథన్ ఎగ్జిబిషన్స్‌లో భాగంగా తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, కళలు, చిత్రాల ప్రదర్శన, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ క్రీడలు, సాహిత్యం, చర్చలు ఉంటాయి. లోక్‌మంథన్ ఉత్సవం జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది. విశ్వజనీన భావన (వసుధైవ కుటుంబకం)తో పనిచేస్తున్న ‘లోక్‌మంథన్ – భాగ్యనగర్’ వేడుకల్లో పాలుపంచుకుందాం. సంప్రదాయ విజ్ఞానాన్ని, వివేకాన్ని అవగతం చేసుకుని లోక ఐక్యతా మహాయజ్ఞంలో భాగస్వాములమవుదాం.
భారతీయతకు ప్రాధాన్యతనిచ్చి, ఆ దిశగా ఆలోచన–ఆచరణ చేసేవారిని ఒకే వేదికపైకి తెచ్చి, తద్వారా సామాజిక ప్రధాన జీవన స్రవంతిలో మరుగున పడిన వర్గాలు, సమాజాలకు ఒక స్థానం, ఒక గళం ఇవ్వాలన్నది ‘లోక్‌మంథన్’ లక్ష్యం. ఈ దృష్టి కోణంలో మేధావులు, కళాకారులు, వివిధ రంగాలవారిని ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది మా ప్రయత్నం. జానపద కళలు, జీవనశైలి, పద్ధతులు, సంప్రదాయాలు, సంస్థల వంటివన్నీ.. గొప్ప శాస్త్రీయ, నాగరిక అంశాలుగా చెప్పుకుంటున్న వాటికి ఏ మాత్రం తక్కువ కాదని చూపించేందుకే ఈ మహత్తర కార్యక్రమం.
జి. కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి, ‘లోక్‌మంథన్’ రిసెప్షన్ కమిటీ చైర్మన్