Share News

చరిత్ర నిద్రా సముద్రంపై మహాస్వప్నం!

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:40 AM

మహాస్వప్న తెలుగు కవిత్వం పైన వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. దిగంబర కవిత్వ సంకలనాలలో అతను రాసిన కవితలు ఆరంటే ఆరే! ఆ ఆరు కవితలతోనే కవిగా చిరస్థాయి నందుకున్నాడు. ఒక లేబిల్‌కో బ్రాండ్‌కో కట్టుబడే కవిత్వం కాదు అతడి కవిత్వం. మహాస్వప్నని ఏ ఇతర కవి తోనూ పోల్చలేం.

చరిత్ర నిద్రా సముద్రంపై మహాస్వప్నం!

మహాస్వప్న తెలుగు కవిత్వం పైన వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. దిగంబర కవిత్వ సంకలనాలలో అతను రాసిన కవితలు ఆరంటే ఆరే! ఆ ఆరు కవితలతోనే కవిగా చిరస్థాయి నందుకున్నాడు. ఒక లేబిల్‌కో బ్రాండ్‌కో కట్టుబడే కవిత్వం కాదు అతడి కవిత్వం. మహాస్వప్నని ఏ ఇతర కవి తోనూ పోల్చలేం. పదునైన వాక్యాలూ, అంతే తీవ్రమైన భావజాలం అతడి కవిత్వంలో కానవచ్చే సాధారణ లేదా విశిష్ట గుణం!

దిగంబర కవిగా రూపు దాల్చకముందు అతడి నామధేయం కమ్మిశెట్టి వేంకటేశ్వరరావు. ఆ పేరు తోనే అతడి ఏకైక కవితాసంపుటి ‘అగ్ని శిఖలు – మంచు జడులు’ వెలువడింది. ఆ తర్వాత దిగంబర కవిగా రూపాంతరం చెందాడు. ‘దిక్’లుగా పిలువబడిన ఆ కవితలతో మహాస్వప్న మహోన్నత శిఖరమై నిలిచాడు. మహాస్వప్న ‘అగ్ని శిఖలు – మంచు జడులు’, దిగంబర కవితలకి మధ్య ‘రాత్రి’ కవితా సంకలనం లోని అతని కవితలు దిగంబర కవిత్వానికి పూర్వ రంగంగా నిలుస్తాయి. ఇదే సూత్రీకరణ నగ్నముని అనబడు మానేపల్లి హృషి కేశవరావుకి కూడా వర్తిస్తుంది. దిగంబర కవిత్వానికి కథానాయకుడూ, ‘రాత్రి’ కవితా సంకలనానికి కర్త, కర్మ, క్రియ నగ్నమునే!

కమ్యూనిస్ట్ మానిఫెస్టోని శ్రీశ్రీ ఎలాగైతే కవిత్వంగా మలిచాడో అలాగే మహాస్వప్న కూడా దిగంబర కవిత్వం ఎజెండాని అద్భుతమైన కవితగా మలిచాడు. ఆ కవిత శీర్షిక ‘గ్లానిర్భవతి భారత’. ఆ కవితలో ‘‘మానవత రెండు కళ్ళు మూసుకపోయినప్పుడు/ విప్పుకుంటున్న మూడో కన్నునై/ కాలం వాయులీనం మీద కమానునై/ చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై/ నేను వస్తున్నాను దిగంబర కవిని/ రాత్రి ఉదయిస్తున్న రవిని’’ ... ‘‘రక్త ధునులు గడ్డకట్టి/ జీవనదులింకి/ మానవత మసిపాతలా మారిపోయినప్పుడు/ మాసిపోయినప్పుడు/ నేను వస్తున్నాను దిగంబర కవిని/ స్తంభించిన కవితా స్తంభం బ్రద్దలై పుట్టుకొస్తున్న ఉగ్రనగ్న నరకేసరిని’’ – అంటూ దిగంబర కవి రాకడ సమయాన్నీ, సందర్భాన్నీ, దిగంబర కవిత్వం పోకడనీ స్పష్టం చేశాడు మహాస్వప్న.


దిగంబర కవిత్వ ఆవిర్భావ సన్నివేశాన్ని స్మరించినప్పుడు యూరప్‌లో జెనీవా కేంద్రంగా 1916, 1923 ప్రాంతాల్లో పరిఢవిల్లిన ‘డాడాయిజం’ గుర్తుకు రాక మానదు. మొదటి ప్రపంచ యుద్ధ పర్యవసానంగా అన్ని విలువల్ని, సంస్కారాల్ని, సభ్యతల్ని తిరస్కరిస్తూ వెల్లువెత్తిన ఉద్యమం అది. హ్యూగో బాల్ దాన్ని ముందుండి నడిపించాడు. ఒక్క కవిత్వం లోనే కాకుండా చిత్రకళ, సంగీతం లాంటి ఇతర కళల్ని కూడా డాడాయిజం ప్రభావితం చేసింది. డాడాయిస్టులు వాళ్ళ కవితల్ని ‘డాడా’ అన్నారు. మన దిగంబరులు ‘దిక్’లన్నారు! అక్కడ హ్యూగో బాల్ నిర్వహించిన పాత్రని ఇక్కడ నగ్నముని నిర్వహించాడు.

1960వ దశకం రాజకీయ భ్రష్టత్వం, విలువల పతనం, అరాచకత్వం నిస్సిగ్గుగా బట్టబయలైన సంధికాలం! తక్షణ చర్యగా దిగంబర కవిత్వం తెలుగునాట మొదలైంది. ఆ పరిణామ క్రమంలో నగ్నముని, మహాస్వప్న లాంటి గొప్ప కవులు ఆవిర్భవించారు. దిగంబర కవిత్వం ఒక చారిత్రక సందర్భమే కాదు. చారిత్రక అవసరం కూడా. దిగంబర కవిత్వం కూడా డాడాయిజం మాదిరి కుళ్ళిన సమాజానికి షాక్ ట్రీట్మెంట్‌గా మొదలైన కవిత్వోద్యమమే! విరసం పుట్టుకకి బీజం పడింది కూడా దిగంబర కవిత్వం తోనే!

‘నట సామ్రాట్’ అనే కవితలో తనని తాను ఇలా పరిచయం చేసుకుంటాడు మహాస్వప్న: ‘‘పాతికేళ్ల నాడు ఈ కల/ కళ్ళు తెరచింది నెల్లూరు జిల్లా లింగసముద్రంలో/ కావలి, హైదరాబాద్ లోని ఆకాశాన్ని, భూమినీ చదువుకున్నాడు. .... ఈ ప్రపంచం వేసుకున్న ముసుగుని చీల్చడానికే పుట్టానంటాడు.’’ అదే కవితలో ఇంకా యిలా అంటాడు– ‘‘మహాశయా/ తెల్లగా తెల్లవారింది/ నాటకానికి తెర జారింది/ ప్రపంచంలా పరచుకున్న/ జీవితం మీద/ నగ్న సూర్యోదయమైంది/ నీ పాత్ర చిలుం పట్టింది తోముకో నిజం లాగా/ ధ్వజం లాగా నిటారుగా - లే/ భయం వీడి నగ్నంగా బజార్లోకి రా!’’ అని.


మహాస్వప్నది తనదైన విస్పష్ట గళం. తన కాలం కంటే ముందు నడిచాడు. 2024ల నాటి ఆధునిక కవిత్వాన్ని 1960 ల్లోనే వినిపించిన ద్రష్ట మహాస్వప్న! ‘హటాత్తుగా బట్టలన్నీ విప్పేసి’ అనే కవితలో ఇలా అంటాడు: ‘‘ట్రాఫిక్ బంద్/ సందులు గొందులకి జ్వరాలు/ బజార్లు బజార్లకే మూర్ఛలు/ అంతా నిశ్శబ్దం/ నా దగ్గిరకొకడైనా రాడు/ నేనంటే నగరానికి మహాభయం/ నాకు తెలుసు మీరు నన్ను చూళ్ళేరని/ నాకు తెలుసు మీరు నన్ను వినలేరని.’’

గాంధీ మహాత్ముడిని స్మరిస్తూ, ‘మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు’ అనే కవితలో తన ఆగ్రహాన్ని ఇలా ప్రకటిస్తున్నాడు: ‘‘దగాలు వంచనలు కుహనాసత్యాలు/ జరా రుజా దురాక్రమణలో నిజరూపాల్ని కోల్పోయిన మానవజాతి/ వినిపించే నాగరికతా సిఫిలిస్సంగీతం/ ఎంత భ్రమపడ్డావ్ మా దుస్తుల్ని చూసి/ ఎంత శ్రమపడ్డావ్ మమ్మల్ని నమ్మి/ మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు/ ఇన్ని కోట్ల గాడ్సేల ఘాతుక హస్తాల నడుమ/ నలువైపుల హోరుమని విరుచుకు పడుతున్న చీకటి సముద్రాల నడుమ/ నిశ్చలంగా వెలిగే నీ చిరునవ్వు.... / బాపూ, మోసపోలేదు కదా నువ్వు.’’

మానవుడి అస్తిత్వ వేదనని అతడు పలికించిన తీరు అబ్బురపరుస్తుంది. తప్పిపోయిన మనిషి ఆత్మ హాహాకారాన్ని ‘ఆపండి ఆర్కెస్ట్రాని – ఆర్పండి కాగాడాల్ని’ అనే కవితలో పతాక స్థాయికి చేరిన ఫ్రీక్వెన్సీలో వినిపించాడు: ‘‘నేను పుట్టకముందే/ మిట్ట మధ్యాహ్నం మండుటెండలో/ మార్కెట్లో పెట్టి అమ్మారు శిరాన్ని ఖండించి/... .../ నిర్జీవంగా/ నిస్సహాయంగా/ వొరిగిపోయాను ఈ ఫుట్‌పాత్ మీద/ ఆపండి ఆర్కెస్ట్రాని/ ఆర్పండి కాగడాల్ని!// ఇంక మోయలేను ఈ దేవుళ్ళనీ ఉద్గ్రంథాల్నీ/ ఇంక మోయలేను ఈ జైళ్ళనీ సంకెళ్ళనీ శాసనాల్నీ/ ఇంక మోయలేను ఈ యుద్ధాల్నీ బీటలెత్తిన చరిత్రనీ/... .../ చెప్పు/ ఇప్పుడైనా నిజం చెప్పు/ పోనీ దయుంచి/ ఈ దిక్కుమాలిన శవం మీద ఆకాశాన్ని కప్పు’’ అంటూ! అలాగే, ‘మురిగిన సూర్యుణ్ణి నంజుకుంటూ మృత్యువుని కాస్త కాస్తగా కొరుక్కుతిన్నాను’ కవితలో ఆధునిక మానవ జీవన బీభత్సాన్ని, భయద జీవన మృత్యు సంగీతాన్ని విరచించాడు మహాస్వప్న. ‘‘వెన్నెల మీద వుమ్మేసి చంద్రుణ్ణి నక్షత్రాల్నీ/ గ్రహాల్నీ రాళ్ళతో కొట్టాను/ భూగోళాన్ని శిశ్నశిఖరాగ్రం మీద నిలబెట్టాను/ చెట్ల గుబురుల్లో గూబలా తీతువులా కీచురాయిలా/ గీ పెట్టి భయపెట్టింది నేనే/ పాతాళవాణిలో భూతాలు పాడిన గీతాల్ని ప్రసారం చేసింది నేనే/ భగ భగ మంటల్లో నగరం తగలబడి పోతున్నట్లు/ నిర్వికల్ప సమాధిలో నిదర్శించి నిర్భరానందంలో తాండవం చేసింది నేనే’’ అంటాడు.

వేళ్ళ మీద లెక్కబెట్టగలిగినన్ని కవితలే రాసి వుంటే ఉండొచ్చు గాక! తదనంతర కాలంలో తన ఆకాంక్షలూ ఆశయాలూ కేవలం భ్రమలుగా తేలిపోయాయని, తానొక భగ్నస్వప్నమై మిగిలానని అతడు పశ్చాతాప్త పడితే పడి ఉండొచ్చు గాక! బ్రతుకు వృథా, కవిత్వం వృథా అనే వ్యాకులతకి లోనై అజ్ఞాతాన్ని వరిస్తే వరించి ఉండొచ్చు గాక! – ఐనా కూడా, దిగంబర కవుల్లోనే కాదు, ఏ ఇతర కవి సమూహాలలోనైనా, అప్పుడైనా ఇప్పుడైనా ఎన్నదగిన ప్రథమ శ్రేణి కవి మహాస్వప్న!

రవూఫ్

raoufpoettelugu@gmail.com

Updated Date - Sep 09 , 2024 | 05:40 AM