మళ్లీ మణిపూర్ హింస
ABN , Publish Date - Sep 04 , 2024 | 12:43 AM
మణిపూర్‌లో హింస పూర్తిగా తగ్గిపోయిందనీ, ఆర్నెల్లలో రాష్ట్రం ప్రశాంతతని చవిచూడబోతున్నదని ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇందుకు పూర్తిభిన్నంగా మొన్న ఆది, సోమవారాల్లో...
మణిపూర్‌లో హింస పూర్తిగా తగ్గిపోయిందనీ, ఆర్నెల్లలో రాష్ట్రం ప్రశాంతతని చవిచూడబోతున్నదని ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇందుకు పూర్తిభిన్నంగా మొన్న ఆది, సోమవారాల్లో వరుసగా రెండురోజులపాటు డ్రోన్‌లద్వారా గ్రామాలపై బాంబులు కురిసి, పలువురు మరణించిన ఘటన ఆ రాష్ట్రంలో తెగలమధ్య వైరం ఏమాత్రం చల్లారలేదని, నివురుగప్పిన నిప్పులాగా ఉందని నిరూపించింది. అన్ని నెలల తీవ్రహింసాగ్నిలో కూడా మణిపూర్ ఎన్నడూ ఆకాశంనుంచి బాంబులు పడటం ఎరగదు. ఇప్పుడు కుకీ మిలిటెంట్లు ముందు డ్రోన్లద్వారా మీతీ గ్రామాలమీద బాంబులు వేశారు, ఆ తరువాత కొందరు రైఫిళ్ళతో చొరబడి కాల్పులు జరిపారు. మర్నాడు కూడా ఇదే రకమైన రీతిలో దాడి జరిగింది. మూడునెలలుగా ఘర్షణలు కాస్తంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, ఈ ఘటనలు రాష్ట్రంలో తిరిగి నిప్పురాజేయవచ్చునని భావిస్తున్నారు.
కుకీమిలిటెంట్లు మీతీ గ్రామాలమీద దాడిచేసిన ఈ ఘటనకు ముందు, శనివారం రోజున అక్కడ కుకీ–జో తెగకు చెందిన వందలాదిమంది ర్యాలీ నిర్వహించారు. తమకు వేరుగా ప్రత్యేకపాలనావ్యవస్థ ఉండాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ కార్యక్రమం జరిగింది. ఈ తెగవారు ఎప్పటినుంచో ఈ డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఈ ర్యాలీకి ప్రధానకారణం బీరేన్‌సింగ్ చేసినట్టుగా ప్రచారంలో ఉన్న కొన్ని వ్యాఖ్యలు. మీతీతెగకు చెందిన ఆయన స్వజాతి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనీ, మీతీలకు కూడా ఎస్టీ రిజర్వేషన్ ఇప్పించడానికి ఆయన కుట్రపన్నారని, తమ ఉద్యోగాలు, భూములను మీతీలు వశం చేసుకోవడం, తమను కొండలనుంచి తరిమికొట్టడం వారి ఎజెండాలో ఉన్నదని మిగతా ఆదివాసులు అనుమానించిన విషయం తెలిసిందే. అప్పటికే బీరేన్‌సింగ్ తీసుకున్న కొన్ని కుకీ–జో వ్యతిరేక చర్యలకు తోడుగా, మీతీలకు రిజర్వేషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో గత ఏడాది మేనెలలో మీతీ–కుకీల మధ్య తీవ్రమైన హింస రేగి నెలలబాటు రాష్ట్రం అగ్నిగుండమైంది. ఈ పరిణామాలన్నింటికీ సంబంధించి, ముఖ్యంగా తెగలమధ్య వైరాన్ని, హింసను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రోత్సహించడంలోనూ బీరేన్‌సింగ్ ప్రమేయం ఉన్నట్టుగా ఇటీవల లీకైన కొన్ని ఆడియో టేపుల్లో బయటపడింది. ఇందులో స్వయంగా బీరేన్ చేశారంటున్నట్టుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి నకిలీటేపులనీ, కొందరు ద్రోహుల, కుట్రదారుల సృష్టి అనీ ప్రభుత్వమూ అధికారపక్షమూ స్పష్టంచేస్తున్నప్పటికీ కుకీ–జో తెగలు మాత్రం తాము ఇంతకాలంగా నమ్ముతున్నదీ, అంటున్నదే ఈ టేపుల్లో ఉన్నదని, అవే నిజాలని వాదిస్తున్నాయి.
ఈ టేపుల ఉదంతంతో బీరేన్‌సింగ్‌ను తప్పించాలన్న డిమాండ్‌కు మళ్ళీ ఊపువచ్చింది. ‘నిజం వెలుగుచూసింది, బీరేన్‌ను ప్రాసిక్యూట్ చేయండి’ అంటూ కుకీ–జో తెగలకు చెందిన అన్ని సంఘాలూ సంయుక్తంగా శనివారం పెద్ద ర్యాలీ నిర్వహించాయి. బీరేన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుకీ–జోలకు వ్యతిరేకంగా జాతిహననానికి పాల్పడుతున్న నగ్నసత్యం బయటపడిందని నినదాలు చేస్తూ, స్వయంపాలన, బీరేన్ రాజీనామా వీరు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలను భగ్నంచేసేందుకూ, బలహీనపరచేందుకు ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేసింది. మరోపక్క మీతీ సంఘాలు కూడా తమకు ఎస్టీ హోదా ఇవ్వాలనీ, కుకీ–జోలకు దానిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అదేరోజున ప్రదర్శనలు నిర్వహించాయి.
నకిలీ టేపులనీ, ఒడ్డునపడుతున్న రాష్ట్రంలో తిరిగి మంటలు రేపేందుకు కొందరు కుట్రచేశారనీ బీరేన్‌సింగ్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తూ, మరోపక్క విచారణకు ఆదేశించడంతో నివేదికలో ఏమివుంటుందో చాలామందికి అర్థమైపోతోంది. ఇక, ఆర్నెల్లలో రాష్ట్రంలో ప్రశాంతత నెలకొంటుందన్న బీరేన్‌వ్యాఖ్యలు కూడా, ఆయన తమకు వ్యతిరేకంగా మళ్ళీ ఏదో చేయబోతున్నారని కుకీజో తెగల్లో అనుమానాలు పెంచిందట. మీతీల అధిపత్యం, వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు మినహా మిగతా ఆదివాసీ తెగలున్న ప్రాంతాలకు స్వయంపాలన కావాలన్న డిమాండ్ నెరవేరనంత వరకూ మణిపూర్‌లో శాంతి ఏర్పడదని కుకీజోల వాదన. అనేకనెలలుగా సాగిన హింస కారణంగా ఇప్పటికే వారంతా ఇంఫాల్ లోయనుంచి వెళ్ళిపోయి మీతీలకు దూరంగా బతుకుతున్నారు. స్వయంపాలన హామీ నెరవేరనంతకాలం రాష్ట్రంలో శాంతి ఏర్పడదనీ, హింస రేగుతూనే ఉంటుందని మీతీ గ్రామాల్లో కాల్పులు, వరుస డ్రోన్‌దాడులు హెచ్చరిస్తున్నాయి.