ఆర్థిక ఆర్తిని తీర్చిన మన్మోహనం!
ABN , Publish Date - Dec 27 , 2024 | 06:07 AM
కావాల్సిన వాళ్లు, ప్రేమించిన వాళ్లు, ఆరాధించిన వాళ్లు మరణించినప్పుడు మనసు వికలం అవ్వటం సహజం. వ్యధ చెందటం సహజం. విషాదం వేయిపాయలుగా ప్రవహించటం సహజం. తీర్చలేని లోటు ఏర్పడి...
కావాల్సిన వాళ్లు, ప్రేమించిన వాళ్లు, ఆరాధించిన వాళ్లు మరణించినప్పుడు మనసు వికలం అవ్వటం సహజం. వ్యధ చెందటం సహజం. విషాదం వేయిపాయలుగా ప్రవహించటం సహజం. తీర్చలేని లోటు ఏర్పడి కడలిసుడిలా ఉద్వేగం ఉప్పొంగటమూ సహజం. వ్యక్తులే కాదు ఒక ఘననాగరికత కల దేశమూ కొన్ని సందర్భాల్లో అటువంటి విషాద సన్నివేశంలో పడిపోతుంది. పదికాలాలు గుర్తించుకోదగ్గ నాయకుడూ, గర్వించదగ్గ నాయకుడూ, విలువలున్న నాయకుడు మరణిస్తే ఆ సన్నివేశం వద్దన్నా మన హృదయాల్లో గూడుగట్టి మనల్ని విచలితుల్ని చేస్తుంది. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా, పదేళ్లపాటు దేశ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ మరణంతో ఇప్పుడు భారత్‌కు అదే పరిస్థితి ఎదురైంది. నాయకుడు అన్ని సందర్భాల్లోనూ మహా ధీరోదాత్తుడు అయివుండనక్కర్లేదు. రాజకీయ రంగాన వీరోచిత పాత్రను పోషించాల్సిన అవసరమూ ఉండనక్కర్లేదు. మహాచాకచక్యుడై కౌటిల్యనీతిలో ఘటికుడూ కానక్కర్లేదు. అసాధారణ పరిస్థితుల్లో నమ్రతతో, నవ్యతతో, మర్యాదతో సహజపద్ధతిలో అణగారిన శక్తులను స్వేచ్ఛగా పైకి వచ్చేలా చేయగలిగితే గొప్ప విషయమే. ఆ నాయకుడు గొప్ప నాయకుడే. భారత ఆర్థికవ్యవస్థలో ఎంతోకాలం అణగిమణగి ఉన్న శక్తులను అలా పైకి వచ్చేలా విధానాల నిచ్చెలను ఏర్పరచటంలో మన్మోహన్ పాత్ర అనితరసాధ్యమైంది. ఆర్థికంగా పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని అప్పటి ప్రధాని పీవీ భావించి ఉండొచ్చు.
సంస్కరణలు, మార్పులు అనివార్యమని గట్టిగా అనుకుని ఉండొచ్చు. కాదనలేం! కానీ బండిని దారినపెట్టాలని అనుకోవటం వేరు. ఆ దారిని ఏ కొలతలతో నిర్మించాలి... ఏ పదార్థాలతో పటిష్ఠం చేయాలి... ఎంత బరువు భరించేలా దాన్ని రూపొందించాలి.. అన్నవాటిని నైపుణ్యం ఉన్నవారే నిగ్గుతేల్చగలరు. మన్మోహన్ మౌనముని అయినా ఆ నైపుణ్యం పుష్కలంగా ఉన్న వ్యక్తి. అందుకే భారత్ ఆర్థిక పరివర్తనను అతితక్కువ వ్యవధిలో అతితక్కువ నష్టాలతో సాధించగలిగారు. ఆర్థికసంస్కరణలపై భిన్నాభిప్రాయాలు ఎన్నైనా ఉండొచ్చు. అన్నివర్గాలకూ అవి సమంగా చేరలేదనీ అనొచ్చు. కానీ అవి దేశ ఆర్థిక సామర్థ్యాన్ని, ప్రజల జీవన ప్రమాణాలను అంతకు ముందు పరిస్థితితో పోల్చితే కొంతైనా ముందుకు నడిపించలేదనీ అనలేం. ఎన్ని కొలమానాలు పెట్టుకు చూసినా ఇంతకు భిన్నమైన దృశ్యాన్ని ఊహించలేం.
అనుకున్నవి చేయగలిగినవాళ్లు జీవితాల్లోనే అరుదుగా ఉంటారు. రాజకీయాల్లో అదింకా అరుదు. ఆర్థిక సంస్కరణల విషయంలో అనుకున్న వాటిని సాధించలేదన్న అసంతృప్తి మన్మోహన్‌కూ ఉండేది. సొంతపార్టీకి లోక్‌సభలో బలం అరకొరగా ఉన్నపరిస్థితుల్లో, ఆర్థిక సంస్కరణలతో అన్ని అనర్థాలే కలుగుతాయన్న వాతావరణంలో పరిస్థితులను నెట్టుకురావటం అంత సులభం కాదు. సున్నిత మనస్కుడైన మన్మోహన్‌కు అది మరింత కష్టం. అయినా నెగ్గుకొచ్చారు. భారత రాజకీయాల్లో అదొక వింత.
2004లో ప్రధాని పదవిని చేపట్టి పదేళ్ల పాటు కొనసాగినా ఎక్కువ భాగం ఆయనకు ముళ్లపాన్పుగానే ఉండిపోయింది. ప్రధాని పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని సొంతపార్టీ నేతలే ఇవ్వని పరిస్థితిని బహుశా ఏ ప్రధాని మన్మోహన్‌లా ఎదుర్కోలేదు. అధికార ఉత్తర్వులను ముఖం ముందే చించివేసినా ఎదిరించలేని అశక్తతనే ప్రదర్శించారు. తన ప్రమేయంలేని, తను ఆశించని, తను ఊహించని అవినీతి పరిణామాలు, ఆరోపణలు తనను కారుమేఘాల్లా కమ్ముకున్నప్పుడూ ఆయన ఆక్రోశాన్నీ ఆవేశాన్నీ ఆవేదననూ వ్యక్తంచేయలేని నిస్సహాయుడిగా మిగిలిపోయారు. ఎవరినో లక్షిస్తూ వేసిన బాణాలకు ఆయన బాధితుడిగా ఉండిపోయారు. ఆయన సారథ్యంలో దేశం అవినీతిలో, కుంభకోణాల్లో కూరుకుపోయిందనీ ఆరోపించినవారు కూడా మన్మోహన్‌కు వాటిల్లో ప్రమేయం లేదనీ తెలుసు. రాజకీయాల కోసం ఎంతటి వారినైనా ఏ స్థాయికైనా దిగజార్చగలగటం మన ఘన ప్రజాస్వామ్యం విశిష్టతేమో!
భారత ప్రధానిగా ఉండే వ్యక్తికి కొన్ని సుగుణాలు ఉండాలని మనం కోరుకుంటాం. మోసం, కపటం, అవినీతి ఉండకూడదనీ ఆశిస్తాం. దయ, కరుణ, సానుభూతితో వ్యవహరించాలని కోరుకుంటాం. మతోన్మత్తత ఏ కణంలోనూ ఉండని గుణసంపన్నుడు కావాలనుకుంటాం. ఇవన్నీ నిండుగా ఉన్న వ్యక్తి మన్మోహన్. రాజకీయాల్లో అరుదైన సందర్భాల్లో అంతే అరుదైన పాత్రను పోషించగలగటం భారత చరిత్ర వింత మలుపులు తిరగగలిన శక్తికి నిదర్శనం!