శాంతి–దౌత్యం
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:31 AM
గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ రష్యాలో పర్యటించి ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను గాఢంగా ఆలిగనం చేసుకున్నారు. ఆరువారాల
గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ రష్యాలో పర్యటించి ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను గాఢంగా ఆలిగనం చేసుకున్నారు. ఆరువారాల అనంతరం ఇప్పుడు తన పర్యటనలో పోలెండ్ నుంచి రైల్లో వెళ్ళి ఉక్రెయిన్ అధ్యక్షుడిని కూడా అదే తీరున గాఢంగా కౌగలించుకున్నారు. సన్నిహితులని తాను అనుకొనే విదేశీప్రముఖులతో భేటీ అయిన సందర్భాల్లో భారత ప్రధాని ఈ తీరున వారిపట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించడం పదేళ్ళుగా చూస్తున్నదే. కానీ, దాదాపు రెండున్నరేళ్లుగా యుద్ధంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న పుతిన్–జెలెన్‌స్కీలు ఇద్దరినీ నరేంద్రమోదీ కొద్దిరోజుల తేడాలో ఒకేలా అక్కున చేర్చుకోవడం అనేకులను ఆకర్షిస్తున్నది. వారిద్దరి ప్రతిస్పందనల్లో ఎంతో తేడా ఉన్నా, మోదీ మాత్రం ఒకేవిధంగా వ్యవహరించారని కొందరు మెచ్చుకుంటున్నారు.
రష్యాలో నరేంద్రమోదీ ఉన్నసమయంలోనే ఉక్రెయిన్‌లోని పిల్లల ఆస్పత్రిమీద బాంబుదాడులు జరిగి పెద్దసంఖ్యలో పిల్లలు మరణించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎంతో తెలివిగా ధ్వంసమైన ఆస్పత్రి ఫోటోలను ట్విటర్‌లో పోస్టుచేస్తూ, అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాధినేత ఓ క్రూరుడైన నేరగాడిని కౌగలించుకున్న ఘట్టం అంటూ పుతిన్–మోదీ ఆలింగనాన్ని ఉటంకించారు. మోదీ రష్యా పర్యటన శాంతియత్నాలకు తీవ్ర విఘాతమని కూడా జెలెన్‌స్కీ దెప్పిపొడిచారు. రష్యాతో యుద్ధం మొదలైన తరువాత జెలెన్‌స్కీ భారతదేశాన్ని నేరుగా తప్పుబట్టడం అదే తొలిసారి. ముచ్చటగా మూడోసారి ప్రధాని అయిన తరువాత నరేంద్రమోదీ తన తొలిపర్యటనకు పొరుగుదేశాలను కాక రష్యాను ఎంచుకుంటే, అది ఎందుకో అంతగా కలిసిరాలేదు. ఇప్పుడు జెలెన్‌స్కీ ప్రవర్తన కాస్తంత గంభీరంగా, భిన్నంగా కనిపించినప్పటికీ మోదీ దానిని గుర్తించనట్టుగానే వ్యవహరించారు. జెలెన్‌స్కీ భుజంమీద చేయివేసి ఉంచడం, మరీ ముఖ్యంగా యుద్ధంలో మరణించిన పిల్లల స్మృతికేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించడం వంటివి భారతదేశం తన దౌత్యవ్యవహారాల్లో స్వతంత్రంగా ఉంటుందన్న సందేశాన్నిస్తాయి.
ఉక్రెయిన్ వేరుపడిన తరువాత భారతప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. దాదాపు పూర్తిగా నేలమట్టమైపోయిన దేశంలో, ఒకపక్క యుద్ధం జరుగుతూంటే వెళ్ళిరావడం నిజానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గతనెలలో రష్యా పర్యటనమీద ఉక్రెయిన్‌తోపాటు పాశ్చాత్యదేశాలనుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో భారత్‌కు దౌత్యపరంగా ఇది అవసరమే. ఉక్రెయిన్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రధాని అక్కడ కాలూనడం ద్వారా, ఆ దేశాన్ని విస్మరించలేదని, దాని బాధలు, సమస్యల పట్ల తనకు పట్టింపు ఉన్నదని భారత్ చెప్పినట్టు అయింది. మోదీతో తన మనసులో ఉన్నది చెప్పడానికి జెలెన్‌స్కీ కూడా సందేహించలేదు. తటస్థంగా కాదు, పూర్తిగా మా పక్షాన ఉండండి అని ఆయన అంటే, శాంతివైపు ఉన్నామని మనదేశం నిర్మొహమాటంగా చెప్పింది. మహాత్మాగాంధీ, బుద్ధుడూ జన్మించిన భారతదేశం ఆదినుంచీ శాంతికోసమే కట్టుబడివుందని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశం అతిగొప్పదేశమని, శాంతిసాధనలో కీలకభూమిక నిర్వహించగలదని అంటూనే, యుద్ధం ముగియాలంటే తనవైపు ఉండాలంటున్నారు జెలెన్‌స్కీ. పరమ దుర్మార్గుడైన పుతిన్ కారణంగానే యుద్ధం మొదలైందని, తమమీద అకారణంగా కక్షకట్టాడనీ చెప్పుకొస్తూ, చమురు దిగుమతులను తగ్గించుకొని పుతిన్‌నూ, రష్యా ఆర్థికశక్తిని దెబ్బతీయాలన్నది జెలెన్‌స్కీ వ్యాఖ్యల సారాంశం.
భారత ప్రధాని అక్కడ కొద్దిగంటలు మాత్రమే ఉన్నప్పటికీ ఆయన పర్యటనకు విశేష ప్రాచుర్యం లభించింది. యుద్ధంలో ఉన్న ఈ రెండుదేశాల్లోనూ పర్యటించిన ఇతరదేశాధినేతల సంఖ్య చాలాతక్కువ. మోదీ శాంతిదూతగా వ్యవహరించాలని ఉక్రెయిన్ కోరుకుంటోంది. యుద్ధం వల్ల సమస్యలు పరిష్కారం కాబోవనీ, యుద్ధాన్ని ముగించాలనీ మోదీ ఇప్పటికే పలుపర్యాయాలు స్పష్టంచేశారు. పుతిన్‌తో ప్రత్యక్షంగా భేటీ అయిన సందర్భాల్లో కూడా అదే విషయాన్ని చెప్పారు. గతనెలలోనూ తాను పుతిన్‌తో అదేమాట చెప్పానని ఇప్పుడు జెలెన్‌స్కీ సమక్షంలో వ్యాఖ్యానించడంతో పాటు, త్వరలోనే యుద్ధం ముగిసి శాంతిస్థాపన జరగాలని తాను గట్టిగా కోరుకుంటున్నట్టు కూడా మోదీ ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన తరువాత గతనెల రష్యాలోనూ, ఇప్పుడు ఉక్రెయిన్‌లోనూ మోదీ తొలిసారిగా పర్యటించారు. ఈ పర్యటనలు ఆ యుద్ధం ముగింపుదిశగా ఉపకరిస్తే కచ్చితంగా సంతోషించాల్సిందే.