మహాత్ముడిని మనకిచ్చిన ‘ఫీనిక్స్’
ABN , Publish Date - Nov 16 , 2024 | 05:28 AM
సరిగ్గా నూట ఇరవై సంవత్సరాల క్రితం మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ దక్షిణాఫ్రికాలోని డర్బన్ నౌకాశ్రయానికి 14 మైళ్ల దూరంలో దాదాపు 100 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూస్వామ్యానికి పూర్వం ఆయన తన మొదటి మూడున్నర దశాబ్దాల జీవితమంతా పూర్తిగా పట్టణ ప్రదేశాలలోనే నివసించారు :
సరిగ్గా నూట ఇరవై సంవత్సరాల క్రితం మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ దక్షిణాఫ్రికాలోని డర్బన్ నౌకాశ్రయానికి 14 మైళ్ల దూరంలో దాదాపు 100 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూస్వామ్యానికి పూర్వం ఆయన తన మొదటి మూడున్నర దశాబ్దాల జీవితమంతా పూర్తిగా పట్టణ ప్రదేశాలలోనే నివసించారు : పోర్‌బందర్, రాజ్‌కోట్ లాంటి చిన్న పట్టణాలలోను, డర్బన్, జోహన్నెస్‌బర్గ్ లాంటి పెద్ద పట్టణాలలోను, లండన్, బొంబాయి లాంటి మహానగరాలలోను మాత్రమే ఆయన ఉన్నారు. ఈ పట్టణ, నగర వాసాలలో గాంధీ కార్యకలాపాలు మేధో శ్రమ– వివేచన, విలేఖనం, (న్యాయస్థానంలో తన కక్షిదారుల తరపున) వాదనకే పరిమితమయ్యాయి. హెన్రీ పోలక్ అనే స్నేహితుడు తనకు కానుకగా ఇచ్చిన జాన్ రస్కిన్ పుస్తకం ‘Unto This Last’ పఠనం ఆయన జీవితాన్ని ఒక మేలు మలుపు తిప్పింది. రస్కిన్ భావాల స్ఫూర్తితో, దైనందిన జీవితంలో కనీసం కొంత సమయాన్ని తన చేతులతో పనిచేసే మట్టి మనిషిగా జీవించాలని గాంధీ నిర్ణయించుకున్నారు. ‘ఇండియన్ ఒపీనియన్’ అనే బహుభాషా వార్తా పత్రికను కూడా ఆయన ప్రారంభించారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, భయాందోళనలను వ్యక్తం చేసేందుకు ఉద్దేశించిన పత్రిక అది.
గాంధీ తాను కొనుగోలు చేసిన స్థిరాస్థికి, చేరువలోనే ఉన్న రైల్వే స్టేషన్ పేరిట ఫీనిక్స్ ఫామ్ అని పేరు పెట్టారు. ఫీనిక్స్ ఫామ్ 120వ వార్షికోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా విదుషీమణి ఉమా ధూపేలియా –మెస్‌ధ్రియె ఆ సెటిల్‌మెంట్ (కొత్తగా ఏర్పడిన గ్రామం) చరిత్ర (Gandhi's African Legacy: Phoenix Settlement 1904 to 2024)ను ప్రచురించారు. ఫీనిక్స్ ఫామ్ మొదటి పదేళ్ల (దక్షిణాఫ్రికాలో గాంధీ నివసించిన చివరి పది సంవత్సరాలు) చరిత్ర గురించి విపుల కథనంతో ఆ పుస్తకం ప్రారంభమవుతుంది. ఆ తరువాత తొమ్మిది అధ్యాయాలలో, గాంధీ శాశ్వతంగా భారత్‌కు తిరిగి వచ్చిన తరువాత ఫీనిక్స్ చరిత్రను తెలియజేసే (ఎంపిక చేసిన) లేఖలను తన వివరణలు, వ్యాఖ్యలతో ఉమా ప్రతిభావంతంగా నివేదించారు. ప్రస్తుతం ఫీనిక్స్ స్థితిగతుల గురించిన భరతవాక్యంతో ఆ ఆసక్తికరమైన పుస్తకం సమాప్తమవుతుంది.
జోహన్సెస్‌బర్గ్‌లోని ఒక శాకాహార భోజనశాలలో గాంధీకి పరిచయమై, ఆ తరువాత ఆప్తమిత్రుడు అయిన ఆల్బెర్ట్ వెస్ట్ అనే ఒక ఇంగ్లీష్ జాతీయుడి గురించి ఉమ సముచిత ప్రాధాన్యంతో రాశారు. ఇండియన్ ఒపీనియన్ నిర్వహణలోను, ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను ఒక స్వతస్సిద్ధ, సమకాలీన సామాజిక సమూహంగా రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. దైనందిన కార్యకలాపాలలో ఒకటిగా గాంధీ ప్రవేశపెట్టిన సర్వ మత ప్రార్థనల గురించి వెస్ట్ ఇలా వ్యాఖ్యానించారు: ‘హిందువులు, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు భక్తిగీతాలు ఆలపించి, తమ మత గ్రంథాలలోని ఉపదేశాలను వివిధ భాషలలో చదివేవారు. ఇది సార్వజనీన సామూహిక ఆరాధనకు అద్వితీయ ఉదాహరణ. ఈ ప్రార్థనా సమావేశంలో ఏ నిర్దిష్ట మతానికి ఇతర మతాల కంటే కించిత్ ఎక్కువ ప్రాధాన్యం లభించదు. సత్యం, ప్రేమను భగవంతుని సర్వవ్యాపక గుణ విశేషాలుగా అంగీకరించడమే ఆ ఉమ్మడి ప్రార్థనలు’.
1914లో గాంధీ భారత్‌కు తిరిగి వచ్చేసిన తరువాత ఫీనిక్స్ ఆశ్రమాన్ని కొనసాగించేందుకు వెస్ట్ చాలా పాటుపడ్డారు. ఫీనిక్స్ పునరుద్ధరణకై 1917లో గాంధీ తన రెండవ కుమారుడు మణిలాల్‌ను దక్షిణాఫ్రికాకు పంపించారు. ఉమా ధూపేలియా ఇలా రాశారు: ‘జీవితంలో ఒక సమున్నత లక్ష్యాన్ని కనుగొనేందుకు, దాని పరిపూర్తికి అంకితమయ్యేందుకు ఫీనిక్స్ మణిలాల్‌కు ఒక అవకాశాన్ని కల్పించింది’. 1919 డిసెంబర్‌లో మణిలాల్ తన తండ్రికి రాసిన ఒక లేఖలో ఇలా పేర్కొన్నారు: ‘ఇప్పుడు భారత్‌కు రావడం ఒక సౌఖ్యదాయక విషయంగా నేను భావించడం లేదు. ఇక్కడే నేను మరింత మనశ్శాంతితో పనిచేసుకుంటూ జీవించదలుచుకున్నాను. కనుక ఇక్కడే ఉండిపోయి ఇండియన్ ఒపీనియన్‌ను నిర్వహిస్తూ అధ్యయన వ్యాపకాలలో మునిగిపోవాలని నిర్ణయించుకున్నాను. అయితే నేను భారత్‌కు రావాలని మీరు అభిలషిస్తే దాన్ని నెరవేర్చేందుకు సంసిద్ధంగా ఉన్నాను’.
ఫీనిక్స్ ఫామ్ బాధ్యతలు చేపట్టిన తరువాత దాని నిర్వహణ వ్యయాలకు తోడ్పడేందుకు గాను చెరకు, మొక్కజొన్న పంటల సాగును మణిలాల్ ప్రారంభించారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన సుశీలా మష్రువాలాను 1927లో మణిలాల్ వివాహం చేసుకున్నారు. వారిది ఆదర్శ దాంపత్యం. ఇరువురూ ఉత్తమ జీవన సహచరులు. ఫీనిక్స్ ఫామ్ నిర్వహణలోను, ఇండియన్ ఒపీనియన్‌ను నడపడంలోను సుశీల కీలకపాత్ర వహించారు. ‘సతీమణిగా, మాతృమూర్తిగా, పత్రిక ముద్రాపకురాలుగా ఆమె తన పాత్రలను ఎంతో నైపుణ్యంతో సమతుల్యపరిచారు’ అని ఉమా వ్యాఖ్యానించారు. మణిలాల్–సుశీల మనవరాలే ఉమా ధూఫేలియా. అయితే ఈ పుస్తకంలోను, వేరే రచనలలోను ఆమె వ్యాఖ్యలు, అభిప్రాయాలు కుటుంబ ప్రేమను కాకుండా వృత్తి నిబద్ధ చరిత్రకారుడి దృక్కోణాన్నే ప్రతిబింబిస్తాయి.
గాంధీ సంపాదకత్వంలో వలే, ఆయన కుమారుడి సారథ్యంలో కూడా ఇండియన్ ఒపీనియన్ దక్షిణాఫ్రికా భారతీయుల వ్యవహారాలు, భారత్‌లో ప్రధాన పరిణామాలకు సంబంధించిన వార్తలు, వ్యాఖ్యల కలగలుపుగా ఉండేది. అయితే ముద్రణా వ్యయాలు పెరిగిపోవడం, చందాదారులు తగ్గిపోవడంతో పత్రికను కొనసాగించడం తలకు మించిన భారమై పోయింది. 1938లో మణిలాల్ తన స్నేహితుడు బాబర్ చావ్డాకు ఇలా రాశారు: ‘ఇండియన్ ఒపీనియన్’ను కొనసాగించేందుకుకై తలా 25 పౌండ్ల చొప్పున ఆర్థిక సహాయమందించాలని 200 మంది దక్షిణాఫ్రికా భారతీయులకు విజ్ఞప్తి చేశాను. ఈ సహాయమందకపోతే ఇండియన్ ఒపీనియన్ కొనసాగవలసిన అవసరం లేదని నేను భావించకతప్పదు. అదే జరిగితే పత్రికను మూసివేసి భారత్‌కు తిరిగి వెళ్లిపోతాను’. సెప్టెంబర్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిష్ పాలకులు దానిని అణచివేసిన తీరుతెన్నులపై ఒక ప్రత్యేక సంచికను ప్రచురించడానికి మణిలాల్ పూనుకున్నారు. పత్రిక కవర్‌పై సముచిత బొమ్మను సృజించగల చిత్రకారుడిని సూచించమని చావ్డాను ఆయన అడిగారు. బొమ్మ ఎలా ఉండాలో కూడా మణిలాల్ సూచించారు: చిత్ర నేపథ్యంలో భారతదేశ రేఖాపటం ఉండాలి. దానిలో భారతమాత శృంఖలాలలో ఉన్నట్టు చూపించాలి. కుడివైపు బ్రిటన్ రేఖాపటం ఉండాలి. దాని నుంచి ప్రజ్వరిల్లుతున్న మంటలు భారత్‌ను చుట్టు ముట్టుతున్నట్టు చూపించాలి. ఆ మంటలపై సామ్రాజ్యవాదం అని రాసి ఉండాలి. ఆకాశం నుంచి ఐదుగురు కీర్తి శేషులు అయిన దేశభక్తులు బాల్‌గంగాధర్ తిలక్, దాదా భాయి నౌరోజీ, రవీంద్రనాథ్ టాగోర్, అబ్బాస్ త్యాబ్జీ, మహదేవ్ దేశాయిలు ప్రస్తుతం కారాగారంలో ఉన్న దేశ భక్తులపై పువ్వులు జల్లుతుండడాన్ని దృశ్యమానం చేయాలి’.
1948లో దక్షిణాఫ్రికాలో నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతి వివక్ష విధానాన్ని మరింతగా ప్రోత్సహించింది, కఠినంగా అమలుపరిచింది. ఆగస్టు 1951లో మణిలాల్ జాతి వివక్షను తీవ్రంగా ఆక్షేపిస్తూ ప్రధానమంత్రి డి.ఎఫ్. మలాన్‌కు ఇలా రాశారు: ‘మీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి చర్యా యూరోపియనేతరులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. యూరోపియనేతరుల పట్ల మీ ప్రభుత్వ విద్వేషానికి చిహ్నాలుగా ఆ చర్యలు కనిపిస్తున్నాయి.. అపార్థీడ్ (జాతి వివక్ష) విధానం ఈ దేశ యూరోపియనేతర పౌరుల ఆర్థిక, రాజకీయ హక్కులను కాలరాచివేయడమే కాకుండా వారు భగవంతుడి సంతానంగా తమ వ్యక్తిత్వాన్ని, ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పరిపూర్ణంగా వికసింప చేసుకునే అవకాశాలను నిరాకరిస్తుంది. రాజకీయాలలోకి రాక ముందు క్రైస్తవ మతాచార్యుడుగా ఉన్న మీరు భగవంతుని బోధనల నేపథ్యంలో మీ ప్రభుత్వ విధానాలను పునః పరిశీలించి సముచిత నిర్ణయం తీసుకోవాలి’. రెండు సంవత్సరాల అనంతరం జాతి వివక్షకు వ్యతిరకంగా ఒక పౌర ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయిన మణిలాల్ నెల రోజులకు పైగా కారాగారవాసం చేశారు.
మణిలాల్ 1956లో మరణించారు. సుశీల మరో ఐదు సంవత్సరాల పాటు ఇండియన్ ఒపీనియన్‌ను కొనసాగించి ఆగస్టు 1961లో ఆ పత్రిక ప్రచురణను శాశ్వతంగా నిలిపివేశారు. తదుపరి సంవత్సరాలలో ఆమె కుమార్తె ఎలా, అల్లుడు మేవా అత్తగారితో పాటు ఫీనిక్స్ ఫామ్‌లోనే ఉండేవారు. ఈ ఇరువురూ జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలంగా ఉండేవారు. నిత్యం పోలీసు వేధింపులకు గురవుతుండేవారు. మణిలాల్, సుశీల రాసిన లేఖలలో ఆనాడు దక్షిణాఫ్రికాలోని భారతీయుల వ్యవహారాలలో ప్రధానపాత్ర వహించిన ఉదారవాద రాజనీతిజ్ఞుడు విఎస్ శ్రీనివాసశాస్త్రి, ప్రభవిస్తున్న యువ కమ్యూనిస్టు డాక్టర్ యూసుఫ్ దాదూ గురించి ఆసక్తికరమైన ప్రస్తావనలు ఉన్నాయి. భార్యాభర్తలిరువురు ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించిన ఒక ప్రముఖుడు నవలా రచయిత అలన్ పేటన్. తన స్నేహితుడు మణిలాల్ మరణానంతరం ఫీనిక్స్ ఫామ్ నిర్వహణలో సుశీలకు కీలక సహాయసహకారాలను ఆయన సమకూర్చారు.
1985లో ఫీనిక్స్ ఫామ్ పరిసరాలలో తీవ్ర హింసాకాండ చోటుచేసుకున్నది. పోలీసుల చేతుల్లో ఒక నల్లజాతి ఉద్యమకారుడు మరణించడమే ఆ హింసాకాండకు దారి తీసింది. దీంతో ఫీనిక్స్ సెటిల్‌మెంట్ వాసులు అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభమయింది. ఫీనిక్స్‌లోని గాంధీ గృహం కిటీకీలను ధ్వంసం చేశారని, ఆయన జీవితానికి సంబంధించిన ఫోటోలు అన్నిటినీ బయటకు విసిరివేసి వాటిని తొక్కివేసి పూర్తిగా రూపుమాపారని ఒక పత్రికా వార్త వెల్లడించింది. ఒకప్పుడు పాడిపంటలతో, నాగరిక విలువలను ఔదలదాల్చిన సంస్కారవంతులతో వర్ధిల్లిన ఫీనిక్స్ ఫామ్ కబ్జాదారుల పాలయింది. ఫీనిక్స్ విధ్వంసం సుశీలను సహజంగానే అమితంగా కృంగదీసింది. 1988లో ఆమె మరణించారు. ఇరవై సంవత్సరాల అనంతరం ఆమె కుమార్తె ఎలా (దక్షిణాఫ్రికా బహుళ జాతుల తొలి పార్లమెంటు సభ్యురాలు) నన్ను తన కారులో ఫీనిక్స్ ఫామ్‌కు తీసుకువెళ్లారు. గాంధీ వ్యవస్థాపించిన వంద ఎకరాలకు పైగా ఫీనిక్స్ ఫామ్ నేను సందర్శించిన నాటికి కేవలం మూడు ఎకరాల స్థిరాస్తిగా మిగిలిపోయి ఉన్నది. దక్షిణాఫ్రికాలో గాంధీ జీవితానికి సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలతో అక్కడ ఒక మ్యూజియం ఉన్నది. ఒకప్పటి వైభవాన్ని కోల్పోయినప్పటికీ ఆ మ్యూజియం ఇప్పటికీ సందర్శకులకు స్ఫూర్తిదాయకంగానే ఉన్నది.
గాంధీ నెలకొల్పిన ఐదు ఆశ్రమాలలో ఫీనిక్స్ ఫామ్ మొదటిది. ఆ తరువాత దక్షిణాఫ్రికాలోనే టాల్‌స్టాయ్ ఫామ్; భారత్‌కు తిరిగివచ్చిన తరువాత అహ్మదాబాద్‌లో కొచ్రాబ్, సబర్మతి; మహారాష్ట్రలోని వార్ధా సమీపంలో సేవాగ్రామ్ ఆశ్రమాన్ని ఆయన వ్యవస్థాపించారు. ఫీనిక్స్ ఫామ్ మిగతా అన్ని ఆశ్రమాలకు ఒరవడి అయింది. సర్వ మతాల, సకల జాతుల, సమస్త కులాల ప్రజల పరస్పర సహజీవనానికి ఆ ఆశ్రమాలు అన్నీ ఆలవాలంగా ఉండేవి. గాంధీ ఆశ్రమాలలో, మేధోశ్రమకు సమున్నత విలువ ఇచ్చినట్టుగానే భౌతిక శ్రమకూ ప్రాముఖ్యత ఉండేది. ఫీనిక్స్ ఆశ్రమంలోనే గాంధీ తన తొలి వార్తాపత్రిక ఇండియన్ ఓపీనియన్‌ను ముద్రించేవారు. గాంధీ ఆశ్రమాలకు ఫీనిక్స్ ఎలా ఒరవడి అయిందో భారత్‌లో ఆయన సమస్త పాత్రికేయ వ్యాసంగాలకు ఇండియన్ ఒపీనియన్ అలా ఒక మార్గదర్శిగా ఉండేది. ఫీనిక్స్ ఆశ్రమం లేనిపక్షంలో మనకు మహాత్ముడు ఉండేవారే కాదు. ఉమా ధూపేలియా తన పుస్తకంలో ఫీనిక్స్ సెటిల్‌మెంట్ సమున్నత చరిత్రకు మళ్లీ ఒక స్ఫూర్తిదాయక సజీవత్వం కల్పించారు.
(వ్యాసకర్త చరిత్రకారుడు)