Share News

దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:54 AM

జాతి మనుగడకు జవం, జీవం నింపాలని తనవంతు సంపూర్ణ కృషి నిరంతరాయంగా నిర్వహించి నిష్క్రమించిన పురోగమనాభిలాషి ముత్తులక్ష్మి రెడ్డి. ‘గుంపుకి పరిమితమైతే మహిళ అక్కడే నిలబడిపోతుంది; ఒంటిగానైనా సరే ముందుకెళ్ళే స్త్రీ ఇతరులకు దుస్సాధ్యమైన మజిలీలు చూస్తుంది’ అని

దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం

జాతి మనుగడకు జవం, జీవం నింపాలని తనవంతు సంపూర్ణ కృషి నిరంతరాయంగా నిర్వహించి నిష్క్రమించిన పురోగమనాభిలాషి ముత్తులక్ష్మి రెడ్డి. ‘గుంపుకి పరిమితమైతే మహిళ అక్కడే నిలబడిపోతుంది; ఒంటిగానైనా సరే ముందుకెళ్ళే స్త్రీ ఇతరులకు దుస్సాధ్యమైన మజిలీలు చూస్తుంది’ అని ఐన్‌స్టీన్ అన్నారు. దేవదాసీ విధానం రద్దు, కనీస వివాహ వయసు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ తదితర లక్ష్యాలకోసం పాటుపడిన మహనీయురాలు ముత్తులక్ష్మి .

యెల్లలూ యవనికలూ లేని వేదికల మీద కొందరు ముందు తరాలకు గుర్తుండిపోయే జుగల్బందీలు ఆలపిస్తారు; ప్రగతికి నిలువెత్తు ఋజువులై నిలిచిపోతారు. జీవన ఉద్గ్రంథంలో సరికొత్త అధ్యాయాలకు తెరతీసే పవిత్ర యాగం చేస్తారు. పృధ్వి మీద తాము వేసే ప్రతీ పాదముద్రా ఒక చిత్రకల్పన చేసుకుంటారు. కొందరే కోట్లాది జనులకు నడక నేర్పుతారు. కొందరే ప్రవాహానికి బెత్తెడు పైన నిలిచి పరిప్లవిస్తారు. ఈ కోవకు చెందిన మహిళ ముత్తు లక్ష్మి రెడ్డి.

స్త్రీల దాస్య విమోచననాన్ని జీర్ణించుకోలేని పితృస్వామ్య భావజాలాన్ని ఆమె శతాబ్దం కిందటే ప్రశ్నించారు. పురోగమనం వాంఛించే చాలామందిలా ఆమె సామాజిక రుగ్మతలను ప్రశ్నించడంతో ఆగిపోలేదు; ఆగ్రహం వ్యక్తం చేసి ఊరుకోలేదు. క్రియాత్మక పరిష్కారాలు ఆవిష్కరించి అమలు చేసిన అరుదైన ధీరోదాత్త ముత్తు లక్ష్మి రెడ్డి.

ముత్తు లక్ష్మి పుదుక్కోటైలో 1886 జూలై 30న జన్మించింది. నారాయణస్వామి, చంద్రమ్మాళ్ ఆమె తల్లిదండ్రులు. చంద్రమ్మాళ్ దేవదాసి వనిత. ఆ కారణంగానే తండ్రివైపు జనం ఈ కుటుంబాన్ని దూరం నెట్టారు. మిగిలిందిక తల్లివైపు దేవదాసి కుటుంబాల సాన్నిహిత్యమే. ఈ సామీప్యమే లింగ వివక్ష, స్త్రీల కనీస హక్కుల గురించి ముత్తు లక్ష్మి జీవితంలో సాగించిన పోరాటానికి పునాది.

మహిళల్ని చుట్టుకున్న న్యూనత సర్వం సమాజం అల్లిన సాలెగూడేనని ముత్తు లక్ష్మి ఎదుగుతున్న ఆడపిల్లగా తొలి నాళ్ళలోనే తెలుసుకున్నారు. నొక్కేసిన గొంతులకు ఆవిడ వక్త, వ్యవహర్త అయ్యారు. దేవదాసి వ్యవస్థ, బాల్య వివాహాలూ, పురుషాధిపత్య సమాజంలో ఒంటరి మహిళల అగచాట్లూ ముత్తు లక్ష్మిని తొలి నుంచీ కలవరపెట్టాయి. ఆడపిల్లల చదువుకు ఆంక్షలు ఉన్న ఆ కాలంలోనే ముత్తు లక్ష్మి రెడ్డి 1912లో మద్రాసు వైద్య కళాశాల నుంచి పట్టా అందుకున్నారు.

పుదుక్కొటై మహారాజా హైస్కూల్‌లో చదువు ముగించుకుని ముత్తు లక్ష్మి 1907లో మద్రాసు వైద్య విద్యా కళాశాలలో చేరారు. సర్జరీ విభాగానికి ప్రవేశం పొందిన తొలి భారతీయ మహిళ ముత్తు లక్ష్మి అని వినికిడి. వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడే సరోజినీనాయుడు, అనీబిసెంట్‌లతో ఆమెకు పరిచయమైంది. కారణాలేమైనప్పటికీ ఆ రోజుల్లో సంపన్న వర్గాల స్త్రీలు చాలా వరకు తమ సంతానానికి తామే స్తన్యం ఇచ్చేవారు కాదు. నిమ్న జాతి మహిళలెవరో ఆ పసిబిడ్డలకి పాలిచ్చేవారు. డాక్టర్ అయ్యాక ముత్తు లక్ష్మి ఈ అవివేక, అశాస్త్రీయ దురాచారాన్ని రూపుమాపేందుకు కృషి చేశారు.

1914లో ఆమెకు 28 ఏళ్ళ వయసులో ఆమె డాక్టర్ సుందర రెడ్డిని పరిణయమాడారు. వ్యక్తిగా, ఒక మహిళగా తన సంపూర్ణ స్వాతంత్ర్యానికి వివాహం ఏ రకంగానూ అడ్డంకి కాకూడదని భర్తతో అంగీకారం కుదిరాకే వాళ్ళ వివాహం అయిందని అంటారు. సంస్కరణాపేక్ష ఉన్నవాళ్ళు జీవితాన్ని క్షేమంగా, నిమ్మళంగా ఏదో తూగుటూయల ఊగినట్టు తీసుకోరు. కీర్తి, యశస్సు వాళ్ళ ప్రాధాన్యాలెప్పటికీ కావు. ఒక చిన్నపాటి ముందడుగు కోసం వాళ్ళు పెద్ద సాహసాలే నెత్తికెత్తుకుంటారు.

1927లో ముత్తు లక్ష్మి భారతదేశపు మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలు అయ్యారు. నాటి మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యురాలిగా దేవదాసీ విధానం రద్దు, కనీస వివాహ వయసు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ తదితర విషయాలపై పోరాడారు.

దేవదాసి వ్యవస్థ, బాల్య వివాహాలూ, పురుషాధిపత్య సమాజంలో ఒంటరి మహిళల అగచాట్లూ ముత్తు లక్ష్మిని తొలి నుంచీ కలవరపెట్టాయి. విరిసీ విరియని, ఊహ తెలియని స్నిగ్ధ ముగ్ధ మందారాల్లాంటి ఆడపిల్లలని దైవ కైంకర్యం పేరు మీద గుడిలో నాట్యగత్తెను చేసి అందినవాళ్ళు తమ కామార్తికి వాడుకునే అనాచారం దేవదాసీల జీవితం. దేవదాసీలు చేసే నృత్యగానాల్ని గుడిలో విగ్రహమై నెలకొన్న పరమాత్మకు చేసే షోడశోపచారాల్లో భాగంగా చూడాలే తప్ప అందులో అనైతికం ఏముందని అప్పట్లో సంప్రదాయవాదులు వెనకేసుకొచ్చినప్పటికీ 1947లో దేవదాసీ సంప్రదాయాన్ని నిషేధిస్తూ మద్రాసు ప్రభుత్వం ఒక శాసనాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టానికై ఏళ్ళ తరబడి ముత్తు లక్ష్మి రెడ్డి సాగించిన ఉద్యమం విస్మరించలేనిది.

ఒంటరి ప్రయాణాలు ఒకింత భయపెడతాయి; నిజమే. కానీ ఆ నిర్భీతి విముక్తికి తొలి అడుగు అవుతుంది. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనం కావచ్చు, మానవాళికి మృత్యుగహ్వరమైన క్యాన్సర్ మీద వైద్యశాల పెట్టి ఆమె ప్రకటించిన సమరం కావొచ్చు ఆమె ఒకానొక తాత్త్విక ఒంటరితనంతోనే చేసింది. ఒక గమ్యం, ఒక పయనం, ఒక నిమగ్నత. ఇవే ఆమె కడదాకా అక్కున చేర్చుకున్న విలువలు. కడలిలో కల్లోలాల గురించి ఆమె ఎన్నడూ ఆలోచంచలేదు; నావ సాగించడమే ఆమె ఎన్నుకుంది. లేకపోతే ఆరు దశాబ్దాల క్రితం అడయార్ ఆస్పత్రి అంకురించేదే కాదు. 1952 అక్టోబరులో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పునాదిరాయి వేసిన అడయార్ ఆస్పత్రి 1954లో 12 పడకల వైద్యశాలగా ఆరంభం అయ్యింది. ఈ వైద్యశాల ఇప్పటికీ ఏటా 80,000 మంది రోగ పీడితులకు ఆపన్న హస్తం అందిస్తోంది. ఇప్పటి కార్పొరేట్ వైద్యశాలలకు పూర్వరంగంలో, అంటే దాదాపు 20 ఏళ్ళ క్రితం వరకు యావద్భారతావనిలో క్యాన్సర్ పీడితులకు ఉపశమనం, చికిత్స నెరపిన గమ్యస్థానం అడయార్ హాస్పిటలే.

చెన్నై అడయార్‌లో ఉన్న ‘అవ్వై హోం’ ఆమె 1931లో నిర్భాగ్య మహిళల నిమిత్తం నెలకొల్పిన శరణాలయం. విద్య, ఆత్మ గౌరవంతో మహిళలు స్వతంత్రంగా బతికేందుకు అవ్వై హోం తోడ్పడుతోంది. ఈ ప్రయాణం అంతా ఆమె అవినాభావంగా, అనురాగపూరితంగా సాగినట్టు సుస్పష్టంగా తెలుస్తుంది. జాతి మనుగడకు జవం, జీవం నింపాలని తనవంతు సంపూర్ణ కృషి నిరంతరాయంగా నిర్వహించి నిష్క్రమించిన పురోగమనాభిలాషి శ్రీమతి ముత్తు లక్ష్మి.


లెక్కకు మనం ప్రప్రథమంగా ఇన్ని ఘనతలు సంతరించుకుంది అని చెప్పుకున్నా, ఆవిడను ప్రేరేపించింది మాత్రం సమాజానికి ఒకింత సేవ చెయ్యాలన్న ఏకైక దృక్పథమే. సాగించిన ప్రయాణంలో ఎన్నేసి అడ్డంకులు, అవరోధాలు, కంటకాలూ చవి చూసి ఉంటారో కేవలం ఆవిడే చెప్పగలరు. ప్రగతి కేసి నడక తేలిక కానేరదు. దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం ఆమె. దాశరథి మాటల్లో ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో’ బహుశా ఆమెకే తెలిసి ఉంటుంది. శుష్క వచనాల వరదలో కొట్టుకుపొకుండా ధీర గంభీర కార్యాచరణ ఆమె యెంచుకున్న రీతి; నిర్భీతి. సానుకూలతా, అవకాశమూ ఉంటే ప్రతి మహిళా తళుకులీనే ఒక తారక కాగలదని ఆమె నమ్మారు.

1930లో లండన్‌లో, 1932లో చికాగోలోనూ జరిగిన ప్రపంచ స్థాయి మహిళా సాధికార వేదికల నుంచి ఆవిడ భారతీయ మహిళల కడగళ్ళ గురించి ప్రపంచానికి చాటారు. 1931లో అఖిల భారత మహిళల సదస్సు (ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్)కు ఆమె అధ్యక్షత వహించారు. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడారు. ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. మహిళాభ్యుదయం కొరకు ‘స్త్రీధర్మ’ అనే పత్రికను నడిపారు. 1956లో ‘పద్మ భూషణ్’ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఈ వరుస స్త్రీ జనహిత ప్రయాసల మాటున అసలు సిసలు మానవ హక్కుల నినాదం ఒకటి తొంగిచూసిన ప్రక్షాళన ఆమెది.

స్వీయ జీవిత చరిత్రతో పాటు, ముత్తు లక్ష్మి ‘శాసనసభలో నా అనుభవాలు’ అనే రచనలు చేశారు. 82 ఏళ్ళ పరిపూర్ణ జీవితం గడిపిన త్యాగశీలి ముత్తు లక్ష్మి రెడ్డి 1968 జూలై 22న కీర్తి శేషురాలు అయ్యారు. ‘గుంపుకి పరిమితమైతే మహిళ అక్కడే నిలబడిపోతుంది; ఒంటిగానైనా సరే ముందుకెళ్ళే స్త్రీ ఇతరులకు దుస్సాధ్యమైన మజిలీలు చూస్తుంది’ అని ఐన్‌స్టీన్ అన్నారు. ఆయనకు సమకాలీన ప్రపంచంలో ఎక్కడో మరోచోట, మరో వ్యాపకం, మరో తపనతో ఈ వాక్కును రూఢి చేసిన మహిళగా ముత్తు లక్ష్మి రెడ్డి జీవితం, కృషిని మనం ఇవాళ పునస్సమీక్షించుకోవచ్చు. నీడలూ జాడలూ ఉపేక్షించి నిత్యం వెలుతురుకేసి సాగిన గమనం ముత్తు లక్ష్మిది.

తిరువాయపాటి రాజగోపాల్

(జూలై 22: ముత్తులక్ష్మి రెడ్డి వర్ధంతి)

Updated Date - Jul 20 , 2024 | 05:04 AM