Share News

సెలెబ్రిటీలూ.. స్పందించండి!

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:49 AM

చట్టాలు చుట్టాలై, మాట చెల్లినంత కాలం టాలీవుడ్ స్టార్ నాగార్జున గొంతు బయటకు వినపడలేదు. హైడ్రా చట్ట పరిధిలో ‘ఎన్‌’ కన్వెన్షన్ గోడలు బద్దలు కాగానే ఆయనకు కోపం వచ్చింది. ‘స్టే’ ఉన్న సందర్భంలో కూల్చివేతలు తగవని నాగార్జున తరపున ఓ ప్రకటన వచ్చింది. తప్పు జరిగి వుంటే, తమకు చెప్పి ఉంటే, తామే అక్రమ కట్టడాన్ని కూల్చివుండేవారమని కూడా ప్రకటించారు. అదే నిజమైతే..

సెలెబ్రిటీలూ.. స్పందించండి!

చట్టాలు చుట్టాలై, మాట చెల్లినంత కాలం టాలీవుడ్ స్టార్ నాగార్జున గొంతు బయటకు వినపడలేదు. హైడ్రా చట్ట పరిధిలో ‘ఎన్‌’ కన్వెన్షన్ గోడలు బద్దలు కాగానే ఆయనకు కోపం వచ్చింది. ‘స్టే’ ఉన్న సందర్భంలో కూల్చివేతలు తగవని నాగార్జున తరపున ఓ ప్రకటన వచ్చింది. తప్పు జరిగి వుంటే, తమకు చెప్పి ఉంటే, తామే అక్రమ కట్టడాన్ని కూల్చివుండేవారమని కూడా ప్రకటించారు. అదే నిజమైతే ఇంతకుముందు ప్రభుత్వాలు చెరువు ఆక్రమణకు గురైందని అందులో అక్రమంగా కట్టడాలు తప్పని నోటీసులు ఇచ్చినప్పుడు కోర్టు దాకా వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నట్టు?

సాంకేతికంగా చూస్తే తప్పు జరిగిందో లేదో తేల్చడానికి ప్రభుత్వ విభాగాలు, కోర్టులు ఉన్నాయి. అందుకే ఆ జోలికి వెళ్లడంలేదు కానీ ఇలాంటి కొందరు సెలబ్రిటీల వ్యవహార శైలి మాత్రం ఖచ్చితంగా వందకు వందశాతం స్వార్థపూరితమే! తాను చేసిన తప్పు బయటపడగానే వెంటవెంటనే రెండేసి ప్రకటనలు ఇచ్చి వ్యవస్థలు, జర్నలిస్టులు, అభిమానుల సహకారం కోరిన నాగార్జున ఇంతకు ముందెన్నడూ ప్రజల భావోద్వేగాలని, కష్టాల్ని, ఇబ్బందుల్ని గురించి ఒక్కసారైనా మాట్లాడిన సందర్భం లేదు. అందుకేనేమో ఇప్పుడు ఆయన బహిరంగ ప్రకటనలు చేస్తున్నప్పటికీ చివరకు అక్కినేని అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడడం లేదు. తప్పు జరిగిందని వారు కూడా నముతున్నారు. ఇక ఆయనతో పదేళ్లపాటు అంట కాగిన బీఆర్‌ఎస్‌ నాయకులు సైతం తమ ఇంట్లో మురికి కడుక్కోవడం మీద దృష్టి పెట్టారు తప్ప ఈయనకు అనుకూలంగా నోరు తెరిచే సాహసం చేయడం లేదు. ఎందుకంటే జరిగిందేమిటో, జరుగుతున్నదేమిటో, జరగబోయేదేమిటో కూడా వారికి బాగా అర్థమవుతోంది.

నాగార్జునతో పాటు కొందరు హీరోలు తాము అందరికీ అతీతం అన్న భ్రమలో బతుకుతున్నారు. మనిషి సంఘజీవి అనే కనీసమైన అంశం వీళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. మనం నివసించే భూమాత, చుట్టూ ఉండే సమాజం బాగుంటేనే, అందులో భాగమైన తాము కూడా హాయిగా వుంటామన్నది జగమెరిగిన సత్యం. అయితే సమాజం కన్నా ఆర్థికంగా కాసింత ఎత్తులో ఉన్నంత మాత్రాన అన్ని సూత్రాలు తమకు అనుకూలంగా ఉండాలనుకోవడం తప్పు. తెలిసి తెలిసీ ఆ తప్పు చేస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. వారు ఏ సమాజాన్ని అయితే చిన్నచూపు చూస్తున్నారో ఆ సమాజం మాత్రం వారిని కచ్చితంగా అంచనా వేస్తోంది. ఇందుకు ఉదాహరణ ఒకటి చెప్పాలి. నాగార్జున కుమారుడు నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత వీరి వైవాహిక జీవితం బాగోదని జోస్యం చెప్పిన వేణుస్వామి మీద యావత్ సమాజం, మీడియా విరుచుకుపడింది. తమ సొంత ఇంటి మనిషిని అన్నంత స్థాయిలో ఈ సమాజం ప్రతిస్పందించింది. అదే సమయంలో ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేత అంశంలో ప్రభుత్వ వైఖరిని ఏ ఒక్కరూ బహిరంగంగా తప్పు పట్టడం లేదు. ఈ ఒక్క విషయం చాలు ఈ సమాజం ఎంత విచక్షణాయుతంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి. దాన్ని తక్కువ అంచనా వేస్తున్న వాళ్లే ఈ విషయంలో విచక్షణ లేకుండా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక్క సానుభూతి ప్రకటన రాలేదు. సరే, వారి మూలాలు ఆంధ్రలో ఉన్నాయి అనుకుందాం. అప్పట్లో జరిగిన సమైక్యాంధ్రకు అనుకూలంగా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. వందలమంది యువకులు ఆత్మాహుతి అయినా నోరు మెదపలేదు. కనీసం ఆత్మార్పణ వద్దన్న పిలుపు కూడా ఇవ్వలేకపోయారు ఈ సెలబ్రెటీలు. పక్క మనిషి బాధ, ఆవేదన పట్టని ఈ హీరోలకి తమిళనాడు చిత్ర పరిశ్రమతో పాఠాలు చెప్పించాలి. ‘నీట్‌’ పరీక్షలతోపాటు జల్లికట్టు వంటి అంశాలపై వివాదం రేగినప్పుడు ప్రజల భావోద్వేగాలకు మద్దతుగా బహిరంగ ప్రకటనలు ఇవ్వడమే కాదు, తమిళనాట పెద్దపెద్ద హీరోలు సభలూ సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక కావేరి జల వివాదం వచ్చినప్పుడు మధ్యేమార్గంగా మాట్లాడిన సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తప్పుపట్టడానికి సైతం తమిళ నటీనటులు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టబోతున్న తమిళ హీరో విజయ్ గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రజాసమస్యలపై స్పందించి ఆయా ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేగాని ప్రజల కోసం మాట్లాడడం ఆపలేదు.


తమిళ చిత్ర పరిశ్రమల వలే ప్రభుత్వాల మీద గళం ఎత్తలేకపోయినప్పటికీ చాలామంది తెలుగు హీరోలు తమ స్థాయిలో ప్రజలకు సేవ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా, బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో విధాలుగా సేవలందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందరో పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు. మంచులక్ష్మి ఓ మహిళ అయినా విద్యారంగంలో తన వంతు సాయం చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. విద్య అవసరాన్ని గుర్తెరిగి అడుగులేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై స్పందించి తీవ్ర విమర్శలు, ఇబ్బందుల మధ్య కూడా తన వంతు సామాజిక బాధ్యత నెరవేర్చడానికి చేసిన ప్రయత్నం కళ్ళ ముందు కనబడుతూనే వుంది. ఇలా తెలిసి కొందరు, తెలియకుండా కొందరు తమ వంతుగా ప్రజలకు సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. తమకు వస్తే కష్టం, ఇతరుల ఇబ్బంది చేతగానితనం అనుకునే సెలబ్రిటీలారా ఇకనైనా మారండి. ప్రజల భావోద్వేగాల మీద కోట్లు సంపాదిస్తున్న మీరు, వారి భావోద్వేగాలకు కనీస విలువ ఇవ్వండి. తాము చట్టాలకు, సమాజానికి అతీతం అనుకునే భ్రమ నుంచి బయటపడండి. లేదంటే ఇదే సమాజం, కాలం తమ పని తాము చేస్తూ పోతాయి. కాల ప్రవాహంలో నిజాలు నిగ్గుదేలుతాయి. అవినీతి, అక్రమ కోటలు బద్దలవుతాయి.

కొందరు హీరోలు తాము అందరికీ అతీతం అన్న భ్రమలో బతుకుతున్నారు. మనిషి సంఘజీవి అనే కనీసమైన అంశం వీళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. మనం నివసించే భూమాత, చుట్టూ ఉండే సమాజం బాగుంటేనే, అందులో భాగమైన తాము కూడా హాయిగా ఉంటామన్నది జగమెరిగిన సత్యం. అయితే సమాజం కన్నా ఆర్థికంగా కాసింత ఎత్తులో ఉన్నంత మాత్రాన అన్ని సూత్రాలు తమకు అనుకూలంగా ఉండాలనుకోవడం తప్పు. తెలిసి తెలిసీ ఆ తప్పు చేస్తున్నారు కొందరు సెలబ్రిటీలు.

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

శాసనసభ్యులు, మహబూబ్‌నగర్

Updated Date - Aug 31 , 2024 | 08:07 AM