కొత్త విజయాలు
ABN , Publish Date - Oct 09 , 2024 | 01:27 AM
హరియాణా, జమ్మూకశ్మీర్‌లలో ఓటర్లు మంగళవారం ఇచ్చిన తీర్పు బీజేపీకి కొత్తశక్తిని ఇవ్వడం ఖాయం. ఇటీవలి సార్వత్రక ఎన్నికల్లో మూడోమారు కేంద్రంలో అధికారం దక్కినప్పటికీ, అది సొంతకాళ్ళమీద కాక, మిత్రపక్షాల ఊతంతో...
హరియాణా, జమ్మూకశ్మీర్‌లలో ఓటర్లు మంగళవారం ఇచ్చిన తీర్పు బీజేపీకి కొత్తశక్తిని ఇవ్వడం ఖాయం. ఇటీవలి సార్వత్రక ఎన్నికల్లో మూడోమారు కేంద్రంలో అధికారం దక్కినప్పటికీ, అది సొంతకాళ్ళమీద కాక, మిత్రపక్షాల ఊతంతో సాధ్యపడిన స్థితిలో బీజేపీకి ఈ రెండు ఫలితాలు సమధికోత్సాహాన్నిస్తాయి. హర్యానాలో మూడోమారు మంచిస్కోరుతో అధికారంలోకి రావడం, జమ్మూకశ్మీర్‌లో పదేళ్ళ తరువాత ఎన్నికలు జరిగినా, గతంలో కంటే ఘనంగా తన ఉనికిని చాటుకోవడం మెచ్చదగ్గ విషయం. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, మనోహర్ లాల్ ఖట్టర్ వంటి యోధుడిని మార్చి, ఆ స్థానంలో ఎవరికీ అంతగా తెలియని ఓబీసీ నేత నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా బీజేపీ కూచోబెట్టిన సాహసోపేతమైన వ్యూహం ఇప్పుడు సత్ఫలితాన్నిచ్చింది. సీఎంను మార్చడంతో ఆరంభమైన ఆ ప్రక్షాళన ఆ తరువాత అధికశాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు టిక్కెట్లు ఇవ్వకపోవడం, ఆఖరునిముషం దాకా అభ్యర్థుల జాబితాలు తిరగరాయడం వరకూ కొనసాగింది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అతి తక్కువ ఎంపీసీట్లతో చతికిలబడిన తరువాత, ఎగ్జిట్ పోల్స్ సైతం ఎదురుగాలి వీస్తున్నదని తేల్చేశాక, మూడోమారు హర్యానాలో బీజేపీ విజేతగా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు.
హర్యానాలో నరేంద్రమోదీ ఉధృతంగా ప్రచారం చేయకపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ, అగ్నివీర్, రైతువ్యతిరేక చట్టాలు, మహిళా మల్లయోధుల ఉద్యమం, మద్దతుధర హామీలు ఇత్యాదివి ప్రభావం చూపుతాయని చాలామంది అంచనావేశారు. హర్యానా కొత్త సీఎంకు మొదట లోక్‌సభ, ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల కోడ్‌లతో తన ప్రభావాన్ని చూపడానికి పెద్దగా సమయం చిక్కలేదన్నమాట నిజం. కానీ, రెండువిడతల పాలనలో తన పార్టీ బాగా పరువుకోల్పోయిన స్థితిలో, నష్టాన్ని పూడ్చేందుకు కొన్ని పథకాలు ప్రకటించారు. అగ్నివీర్‌లకు ప్రత్యేక ఉపాధి, పాతికరకాల పంట ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనడం, సబ్సిడీ గ్యాస్, మహిళలకు ప్రత్యేక ఉపాధి వంటివి అనేకం అందులో ఉన్నాయి. ఓబీసీ సైనీని ఎంపికచేయడంతో పాటు, అనేక జాట్‌యేతర కులాలను తనవైపు తిప్పుకోవడంలోనూ బీజేపీ విజయం సాధించింది. కిసాన్, జవాన్, పహెల్వాన్ అన్న కాంగ్రెస్ నినాదం పూర్తిగా జాట్‌లను ఉద్దేశించినట్టుగా, ఆ పార్టీ వారి చుట్టూ తిరుగుతున్నట్టుగా మిగతా కులాలకు అనిపించిందట. ఇక, క్షేత్రస్థాయిలో బీజేపీ, దాని అనుబంధ సంస్థల కార్యకర్తలు పడిన శ్రమ, అట్టడుగువరకూ విస్తరించిన కులచీలికల వ్యూహాలు ఊహకు అందనివి.
జమ్మూకశ్మీర్‌లో సైతం ఫలితాలు ఆశ్చర్యం కలిగించేవే. అబ్దుల్లాల విజయం ఎలా ఉన్నా, ముఫ్తీలు ఇంతగా చతికిలబడిపోవడం వారి పార్టీ చరిత్రలో ఇదే ప్రథమం. పదేళ్ళక్రితం మెహబూబా ముఫ్తీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అది కూలడం, రాష్ట్రపతి పాలన, ప్రత్యేక ప్రతిపత్తి రద్దునుంచి సుదీర్ఘకాలం సాగిన నిర్బధం వరకూ ప్రజలు ఏ ఘట్టాన్నీ మరిచిపోయినట్టు లేదు. కశ్మీరానికి హిందూ పాలకుడిని ఇవ్వాలన్న బీజేపీ ఆశయం నెరవేరకపోవచ్చును కానీ, హిందూ ఆధిపత్య జమ్మూలో దాని పట్టు బాగానే ఉంది. కానీ, ముప్పైరెండుస్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కశ్మీర్‌లోయలో ఐదు, జమ్మూలో ఒకటి మాత్రమే గెలవడం హర్యానా ఓటమికి తోడు మరో శరాఘాతం. అత్యధికం పీడీపీ స్థానాలను నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు గెలుచుకోవడం లోయలో ప్రజాభిపాయానికి అద్దంపడుతున్నది. జమ్మూలో బీజేపీ బలం ఎంత హెచ్చినా దానిని అధికారానికి దూరంగా ఉంచడం లోయ ప్రజల అభీష్టం కావచ్చు. తాను గతంలో తిట్టిపోసి, జైళ్ళలోకి నెట్టి, ఆస్తులను సైతం స్వాధీనం చేసుకున్న పలువురు వేర్పాటువాదులను బీజేపీ రంగంలోకి దించినా, అనేక చిన్నాచితకాపార్టీలు ఓట్లను చీల్చేందుకు శాయశక్తులా కృషిచేసినా, కాంగ్రెస్ కొంతమేరకు నష్టపోయిందేమో కానీ, అబ్దుల్లాల పక్షాన ప్రజలు గట్టిగా నిలబడటం విశేషం.
అత్యధికస్థానాలు గెలుచుకున్న పార్టీ నాయకుడుగా ఒమర్ అబ్దుల్లా సునాయాసంగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాంగ్రెస్ మద్దతు కూడా ఉన్నది కాబట్టి, ఐదుగురు ఎమ్మెల్యేలను నామినేట్ చేసే అధికారాన్ని దఖలు పరుచుకున్న లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్డుతోవలు తొక్కకపోవచ్చు. కానీ, కశ్మీర్ చరిత్రలో అత్యంత బలహీనమైన, ఎటువంటి నిర్ణయాధికారాలూ లేని అసెంబ్లీకి సారథ్యం వహిస్తూ ఇకపై నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం నిత్యం గవర్నర్‌తో ఘర్షణపడాల్సి ఉంటుంది. భవిష్యత్తు పరిణామాలను అటుంచితే, పదేళ్ళ తరువాత ఎన్నికలు ప్రశాంతంగా జరగడం, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం, తమకు నచ్చినవారిని ఎన్నుకోవడం మెచ్చదగ్గ విషయం.