కొత్త బెడద
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:49 AM
మంకీపాక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న మన నౌకాశ్రయాలకు...
మంకీపాక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న మన నౌకాశ్రయాలకు కూడా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ వైరస్ సోకినవారిని ఐసొలేషన్‌లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు ఢిల్లీలోని రామ్‌మనోహర్‌లోహియా, సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింగ్ ఆస్పత్రులను కేంద్రం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొన్ని ఆస్పత్రులను ప్రత్యేకంగా కేటాయించాలని, మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తులు బయటపడినప్పుడు ఆ సమాచారం తమతో పంచుకోవాలని కేంద్రం కోరింది. ప్రస్తుతానికి మన దేశంలో ఒక్కకేసూ లేకున్నా, ఆ వైరస్ పొరుగుదేశంవరకూ సమీపించడంతో మనం అప్రమత్తంగా ఉండక తప్పదు.
భారతదేశానికి సంబంధించినంతవరకూ దాని వ్యాప్తి అంత ఉధృతంగా ఉండదని ప్రస్తుతానికి అంచనాలున్నాయి. భయం అక్కరలేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. పాకిస్థాన్‌లో నాలుగుకేసులు నమోదైనప్పటికీ, వ్యాధిసోకినవారి సంఖ్య అనధికారికంగా ఇంకా ఎక్కువగా ఉండవచ్చును. కేవలం ఎంపాక్స్ కారణంగా దేశాల మధ్య రాకపోకలపై నిషేధాలు లేవు కనుక, రాబోయే రోజుల్లో విదేశాల నుంచి దిగుమతయ్యే కేసుల సంఖ్య మనదేశంలో నమోదుకావచ్చు. విమానాశ్రయాల్లోనూ, నౌకాశ్రయాల్లోనూ తనిఖీలు పెంచడం, అనుమానం ఉన్నవారిని పరీక్షించి, వేగంగా ఫలితాలు సాధించి నిర్దిష్టమైన చర్యలకు నడుంబిగించడం తక్షణ కర్తవ్యం. భారతదేశంలో గత రెండేళ్ళలో ఓ ముప్పై కేసులు నమోదుకావడంతో పాటు, మొన్న మార్చిలో కూడా కేరళలో ఓ మంకీపాక్స్ కేసు బయటపడింది.
కాంగోలో ఈ వ్యాధి వేగంగా విస్తరించి, తీవ్రమైన ప్రభావాన్ని వేయడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ అంతర్జాతీయస్థాయి ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించడంతో పాటు, స్వల్పవ్యవధిలోనే రెండుసార్లు హెచ్చరికలు చేయవలసివచ్చింది. గతంలో కాలూనని ఆఫ్రికన్ దేశాల్లోకి కూడా విస్తరిస్తూ, పదిరోజుల్లో అరడజను దేశాలకు వేగంగా వ్యాపించి, గత ఏడాదితో పోల్చితే రెట్టింపు కేసులు నమోదవుతున్నందున ఆరోగ్యసంస్థ ఆందోళన చెందుతోంది. కాంగోలో వేలాదికేసులు నమోదై, ఆరువందల మరణాల వరకూ రికార్డు కావడం అటుంచితే, స్వీడన్ వంటి సుదూరప్రాంతాల్లో కూడా దీని ఛాయలు కనిపించడం విశేషం. రెండేళ్ళలో రెండుసార్లు ఈ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతూ ప్రపంచాన్ని భయపెట్టగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ఈ తరహా వ్యాధుల విషయంలో అన్ని దేశాలూ ఏకతాటిపైకి వచ్చి వాటిపై సంఘటితంగా యుద్ధం చేయకపోవడమే. దీనితో, గతంలో కంటే మరింత శక్తిమంతమైన వేరియంట్‌తో అవి వ్యాప్తిచెందడానికి అవకాశమేర్పడుతోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా విషయంలో సైతం పేదదేశాలతో ధనికదేశాలు ఎంత అనుచితంగా వ్యవహరించాయో చూశాం. వాక్సిన్ల సరఫరాలో అగ్రరాజ్యాలు చూపిన ఆ వివక్ష సదరు వైరస్ మరికొంతకాలం ప్రపంచాన్ని వేధించడానికి కారణమైంది. ఉన్న ఒక్క ఎంపాక్స్ వాక్సిన్ ఆఫ్రికన్ దేశాలకు పూర్తిస్థాయిలో సరఫరాకాలేదు. అనుమతుల విషయంలో కాంగో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కూడా ప్రమాదాన్ని పెంచింది. వనరులు దోచుకోవడానికి తప్ప ఈ పేద దేశాల మంచిచెడులు పట్టించుకొనే తీరిక అగ్రరాజ్యాలకు ఉండదు. ఆఫ్రికన్ దేశాల పట్ల మిగతా ప్రపంచం చూపుతున్న నిర్లక్ష్యం అందరికీ చేటుచేస్తున్నది. జికా, చికున్‌గున్యా వంటి వ్యాధుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. దాదాపు ఆరుదశాబ్దాల క్రితం గుర్తించిన ఈ వ్యాధిని, నిరుపేద ఆఫ్రికన్ దేశాల సమస్యగా వదిలేయడంతో ఇప్పటికీ దానికి భయపడాల్సివస్తున్నది. సుదీర్ఘకాలం పట్టించుకోని, పరిశోధనలు లేని కారణంగా ఇప్పుడు అది మరింత శక్తిమంతమైన వేరియంట్లతో విజృంభించగలుగుతోంది.
ఎంపాక్స్ విషయంలో ఆఫ్రికన్ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉంది. పరిశోధనలపై పెట్టుబడులకు మిగతా ప్రపంచం సహకరించాలి. ఎంపాక్స్ వాక్సిన్ అభివృద్ధిపరచే పనిలో ఉన్నామని, త్వరలోనే అది వెలుగుచూడవచ్చునని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పూనావాలా మంగళవారం ఆశాభావం వ్యక్తంచేశారు. ఏటా ప్రపంచాన్ని భయపెట్టిపోతున్న ఈ వైరస్ కథ వేగంగా ముగించాల్సిన అవసరం ఉంది.