మళ్లీ ఒమర్...!
ABN , Publish Date - Oct 17 , 2024 | 02:11 AM
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జమ్మూప్రాంతానికి చెందిన సురేందర్ కుమార్ చౌదరీని ఆయన ఉపముఖ్యమంత్రిగా...
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జమ్మూప్రాంతానికి చెందిన సురేందర్ కుమార్ చౌదరీని ఆయన ఉపముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు, ఇండియా కూటమికి చెందిన ఇతర నేతల సమక్షంలో శ్రీనగర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదారద్దుచేసి, రాష్ట్రహోదాను కేంద్రపాలిత ప్రాంతం స్థాయికి కుదించిన తరువాత తొలిగా ఏర్పాటైన ప్రభుత్వం ఇది. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించడానికి వెళ్ళినప్పుడు అధికారులు, ఉద్యోగులు ఒమర్‌కు ఘనస్వాగతం పలికారు. తనతోపాటు ప్రమాణం చేసిన ఉపముఖ్యమంత్రి, మంత్రులతో కలసి ఆయన ఉన్నతాధికారులతో ఓ సమావేశం కూడా నిర్వహించారు. సీఎం కుర్చీలో తాను ఉన్న ఫోటో ఒకటి ట్విటర్‌లో పోస్టు చేసి ‘ఐయామ్ బ్యాక్’ అని ఓ వ్యాఖ్య కూడా జతచేశారు. 2009–14 మధ్యకాలంలో, అంటే, జమ్మూకశ్మీర్ పూర్తిస్థాయి రాష్ట్రహోదాను అనుభవిస్తున్న కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే కుర్చీలో కూర్చున్నంతమాత్రాన, ఆ అధికారాలు, స్వేచ్ఛాస్వాతంత్రాలు తనకు ఇప్పుడు లేవని, తన ఉనికిని నిలబెట్టుకోవడానికీ, ప్రజలపక్షాన కేంద్రంతో అనునిత్యం పోరాడక తప్పదని ఆయనకు బాగా తెలుసు.
గతకాలంలో ప్రజలకు, పాలకులకు మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించి, ఇది మన ప్రభుత్వం అని జనం అనుకొనేట్టు చేస్తానని ఒమర్ హామీ ఇస్తున్నారు. తనది ప్రజాప్రభుత్వం అనిపించుకోవడానికి పోలీసులకు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు కూడా జారీచేశారు. తన కాన్వాయ్ కోసం జనం రాకపోకలను అడ్డుకోవడం, లాఠీలు ఊపుతూ ప్రజలను బెదిరించడం ఇత్యాదివి కూడదని ఆదేశించారు. అధికారులతో సైతం సన్నిహితంగా ఉండాలన్న ప్రయత్నం ఆయన మాటల్లో కనిపిస్తోంది. కానీ, కేంద్రం చేయూత లేనిదే అడుగుకూడా వేయలేనిస్థితి. ఓ కేంద్రపాలిత ప్రాంతానికి, అందునా జమ్మూకశ్మీర్‌కు సీఎంగా కొనసాగడం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆశీస్సులతో మాత్రమే సాధ్యం. పూర్తిసహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ సహా బీజేపీ పెద్దలంతా హామీ ఇచ్చినప్పటికీ, ఒమర్ నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడటం ఓ అద్భుతం, అమోఘం అని వారంతా కీర్తిస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఎదురీత అంత సులభం కాదు. సాధ్యమైనంత వేగంగా రాష్ట్రహోదా ఇవ్వాలని ఒమర్ బుధవారం కూడా మరోమారు అన్నారు. కానీ, ఎన్నికల ప్రచారంలో మిగతాపార్టీల కంటే గట్టిగా నేషనల్ కాన్ఫరెన్స్ వాదిస్తూ వచ్చిన అంశం ప్రత్యేకప్రతిపత్తిని తిరిగి సాధించడం. లోయలో ప్రజలు ఆయన పార్టీకి అత్యధికస్థానాలు కట్టబెట్టడంలో ఇది ప్రముఖంగా పనిచేసిందని అంటారు. కానీ, కేంద్రంతో కలసి పనిచేయవలసిన అవసరం గురించి ఇటీవల ఒమర్ మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఈ తీవ్రమైన అంశాన్ని పక్కనబెట్టాల్సి ఉన్నదంటూ వ్యాఖ్యానించడం సయోధ్య సాధనలో భాగం కావచ్చు. బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టేసిన జమ్మూమీద కూడా ఆయన ఎంతో ప్రేమ కురిపిస్తున్నారు. అక్కడనుంచి ఐదుగురు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకున్న ఆయన ఆ ప్రాంతానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతోపాటు, తమ ప్రభుత్వాన్ని అక్కడివారు సైతం మన ప్రభుత్వం అనుకొనేట్టుగా పరిపాలిస్తామని హామీ ఇస్తున్నారు.
2019 ఆగస్టు ౫న కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ ఎన్నికల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, ఒమర్ ప్రభుత్వం ప్రప్రధమంగా ఆ నిర్ణయాలను ఖండిస్తూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేయాలని మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన ఒమర్ పార్టీ ఏం చేయబోతుందో చూడాలి. పదేళ్ళ తరువాత మూడువిడతల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు చక్కగా పాల్గొని తమకు నచ్చినవారిని ఎన్నుకున్నారు. గవర్నర్ ఏలుబడిలో తమ గోడు వినేవారే లేకపోయారని బాధపడుతున్నవారికి కొత్త ప్రభుత్వం ఉపశమనం అందించాలి. సర్వాధికారాలు దఖలుపరచుకున్న కేంద్రప్రభుత్వం గతంలో మాదిరిగా, ఏకపక్షంగా వ్యవహరించడం కాక, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో సమన్వయంతో వ్యవహరించాలి. పదేళ్ళుగా వరుస కష్టాలతో గాయపడి ఉన్న జనాన్ని రాజకీయయుద్ధాలతో మరింత వేధించడం సరికాదు. ప్రత్యేకప్రతిపత్తిని పునరుద్ధరించడం అసాధ్యమని కేంద్రం అంటోంది. కానీ, రాష్ట్రహోదా విషయంలో అది న్యాయస్థానంలోనూ, ప్రజాక్షేత్రంలోనూ కూడా హామీ పడింది. ఎన్నికల తరువాత రాష్ట్రహోదా అన్న మాటను ప్రధానిమోదీ, హోంమంత్రి అమిత్ షా వెంటనే నిలబెట్టుకోవాలి. అనేక చట్టసవరణలతో జమ్మూకశ్మీర్‌లో తాము అనుకున్నది చేసుకుపోతున్నవారు, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా, వారు ఎన్నుకున్న ప్రభుత్వానికి అండగా నిలవాలి.