Share News

మన బంగారం మంచిదే...

ABN , Publish Date - Oct 31 , 2024 | 02:32 AM

ధనత్రయోదశి నాడు వందటన్నులకుపైగా బంగారం మనదేశంలోకి అడుగుపెట్టిందట. మనలో చాలామందికి బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవే. వెలుగులీనే దీపావళికి బంగారు వన్నెలద్దాలని రిజర్వ్‌బ్యాంక్‌ కూడా...

మన బంగారం మంచిదే...

ధనత్రయోదశి నాడు వందటన్నులకుపైగా బంగారం మనదేశంలోకి అడుగుపెట్టిందట. మనలో చాలామందికి బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవే. వెలుగులీనే దీపావళికి బంగారు వన్నెలద్దాలని రిజర్వ్‌బ్యాంక్‌ కూడా అనుకొని ఉంటుంది. లండన్‌లోని ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’నుంచి ఈ బంగారం రప్పించి, మనదేశంలో సురక్షితమైన నిల్వకేంద్రాల్లో రిజర్వుబ్యాంక్‌ భద్రపరిచింది. బంగారంతో వెలకట్టలేనంత అనుబంధం ఉన్న సమాజంలో, బంగారానికి సంబంధించిన ఏ వార్త అయినా, మిగతారోజులకంటే ఈ ధనత్రయోదశి, దీపావళి సందర్భాల్లో మరింత మెరిసిపోతుంది. బంగారంలాంటి వార్తలతో, ప్రత్యేక కథనాలతో దంతేరాస్‌కు బాగా ముందునుంచే మీడియా మనలను ముంచెత్తుతోంది. తులం బంగారానికి సైతం సామాన్యుడు తూగలేని పరిస్థితులున్నా, దీపావళి తారాజువ్వల్లాగా నిముషానికోరేటుతో అది అందనంత ఎత్తుకు ఎగిరిపోతున్నా, అందివస్తుందన్న ఆశ, అందుకోవాలన్న తపన ఎన్నటికీ ఉంటాయి.


ఇప్పుడు రిజర్వ్‌బ్యాంక్‌ దగ్గర 855టన్నుల బంగారం నిల్వలున్నాయని, అందులో ఓ ఐదువందల టన్నులు ఇక్కడ, మిగతాది ఇంకా లండన్‌లోని రెండు బ్యాంకుల్లోనూ ఉన్నాయని విన్నప్పుడు చాలామందికి 1990లనాటి పరిస్థితి గుర్తుకువస్తున్నది. ఆ రోజులు తలుచుకుంటే కాస్తంత బాధగా ఉంటుంది కానీ, ఆ కష్టాలన్నీ అధిగమించి ఇప్పుడు ఇంత బంగారాన్ని పోగేసుకున్నందుకు గర్వంగా కూడా ఉంటుంది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థనుంచి అప్పుతెచ్చి దేశాన్ని ఆర్థికసమస్యలనుంచి కాపాడాలని ఆర్థిక నిపుణులు సలహాచెప్పారు. ఆయన సరే అన్నప్పటికీ, విధాన నిర్ణయంలో జాప్యం జరిగిందని, ఇంతలో ఎన్నికలు రావడంతో ఆయన వెనుకడుగువేశారని అంటారు. ఆ తరువాత ప్రధానిగా వచ్చిన వీపీ సింగ్‌ ‘ఖాజానా ఖాళీ’ అని ప్రకటించారు కానీ, ఏడాదిన్నరలోనే దిగిపోవాల్సివచ్చింది. చంద్రశేఖర్‌ ఏలుబడిలో ప్రధానమంత్రికి ఆర్థికసలహాదారుగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌, ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా చొరవచూపడంతో ఐదుబిలియన్‌ డాలర్ల స్వల్పకాలిక రుణం తీర్చడానికి తొలిసారిగా స్మగ్లర్లనుంచి స్వాధీనం చేసుకున్న కొద్దిపాటి బంగారాన్ని స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌లో తాకట్టుపెట్టి, అప్పు ఎగవేతదారుడిగా చెడ్డపేరు రాకుండా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, ఆర్థికసంక్షో‌భం తీవ్రమై, అతి తక్కువ విదేశీమారకనిల్వలతో, నెలరోజులు కూడా దేశాన్ని నడపలేని ఆ గడ్డు పరిస్థితులనుంచి బయటపడటానికి ఆ తరువాత రిజర్వ్‌బ్యాంక్‌ దగ్గరున్న బంగారాన్ని రహస్యంగా దేశం దాటించి రెండు విదేశీబ్యాంకుల్లో తనఖాపెట్టిన సందర్భం ఎన్నటికీ మరిచిపోలేనిది. మనదేశంలో వ్యవసాయ, వ్యాపార కుటుంబాలవారికి బంగారం ఓ అలంకరణగా, హోదాగా కంటే ఆపదలో తమను ఆదుకొనే ఓ ఆపన్నహస్తం. కరగని, తరగని ఆస్తి. ఆర్థికంగా బాగున్నప్పుడు కూడబెట్టుకోవడానికీ, అవసరమైనప్పుడు తాకట్టుపెట్టుకొని, కష్టాల కడలిని ధైర్యంగా ఈది ఆవలి ఒడ్డుకు చేరడానికి సహకరించే ఓ శక్తి. ఆభరణాలను ఇలా వాడుకోవడం మనకు కొత్తేమీ కాదు కానీ, ప్రభుత్వం బంగారాన్ని తనఖాపెట్టడం మాత్రం మనకు అప్పట్లో చాలా అవమానంగా తోచింది. ఆ తరువాత అమెరికా యుద్ధ విమానాలకు చమురుపోసి, అంతర్జాతీయ ద్రవ్యనిధినుంచి భారీగా రుణం పొంది, కష్టాలనుంచి గట్టెక్కిన విషయం తెలిసిందే. ఆ అప్పుతో పాటుగా వచ్చిన ఆంక్షలకు అనుగుణంగా, దేశ ఆర్థికాన్ని పీవీ–మన్మోహన్‌ ద్వయం సంస్కరణలబాట పట్టించడం, ఒకప్పుడు బంగారాన్ని తనఖాపెట్టిన దేశం ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో దానిని భారీగా కొనుగోలుచేయగలస్థాయికి చేరుకోవడం ఒక గొప్ప పరిణామం.


ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు హెచ్చుస్థాయిలో ఉన్నకాలం కనుక, డాలర్‌ బలహీనపడినా, కరెన్సీ విలువలు కాస్తంత కదిలినా బంగారాన్ని మించిన భద్రత మరేమీ ఉండదు. అది దేశమైనా, కుటుంబమైనా కల్లోలాలనుంచి కాపాడేశక్తి ఆ లోహానికే ఉంది. ‍కాకపోతే ఇటీవలికాలంలో ఆభరణాలమీద ప్రేమ తగ్గిందని, దానిని ఇతరత్రారూపాల్లో కొనిదాచుకోవడం మాత్రం అలాగే ఉందని వార్తలు వింటున్నాం. ప్రపంచంలో అత్యధికబంగారం భారతీయుల దగ్గరే ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్ ఎప్పటినుంచో అంటోంది. ఎవరేమనుకున్నప్పటికీ, ప్రాచీనకాలంనుంచి మన దేహాన్ని, సాహిత్యాన్ని, భాషని, ఆలోచనలని మెరిపించి, మురిపిస్తున్న మన బంగారం మంచిదే.

Updated Date - Oct 31 , 2024 | 02:32 AM